ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరు దశాబ్దాల అలుపెరుగని కలం

ABN, First Publish Date - 2023-10-16T01:51:08+05:30

‘‘పండరి మనస్ఫూర్తిగా బ్రహ్మకపాలంలో కార్యక్రమాన్ని నిర్వర్తిం చాడు. రెండోది మావారి ఆబ్దికాలు కూలి మనిషి చేత పెట్టిస్తున్నాననే బాధకలగకుండా ఉండేందుకు గాను నేను పండరినే దత్తపుత్రుడిగా స్వీకరిదామనుకొంటున్నాను...

‘‘పండరి మనస్ఫూర్తిగా బ్రహ్మకపాలంలో కార్యక్రమాన్ని నిర్వర్తిం చాడు. రెండోది మావారి ఆబ్దికాలు కూలి మనిషి చేత పెట్టిస్తున్నాననే బాధకలగకుండా ఉండేందుకు గాను నేను పండరినే దత్తపుత్రుడిగా స్వీకరిదామనుకొంటున్నాను. అప్పుడు అతడు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే నాకు, పోయిన ఆయనకు కూడ తృప్తిగా ఉంటుంది’’.

పూర్ణానంద శాస్త్రి ఆమె మాటలకు అవాక్కయి ఆమెను చూస్తుండి పోయాడు - చాలాసేపు.

‘‘పండరి మీ దగ్గరే ఉంటాడు. మీతోపాటే తిరుగుతుంటాడు. అతడు చేయ వలసిందల్లా నేను పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడల్లా నాకు తోడుగా రావటం, ప్రస్తుతానికి సంవత్సరానికొకసారి మా వారి ఆబ్దికం పెట్టటం,’’ చెబుతూ తలవంచుకొని చిన్నగా అన్నది, ‘‘తరువాత నాదీను’’.

గుండెలు పిండే ఈ సన్నివేశం పి. ఎస్‌. నారాయణ గారు రాసిన ‘వైతరిణి’ కథ ముగింపున వస్తుంది. ‘‘మంచి కథలలో మానవనైజ పరిశీలనలు, చిత్రణలో తన (రచయిత) వ్యక్తిత్వాన్ని మరచిపోయి, ఊహాజగత్తులో లీనమైపోయి, కళాసృష్టికి అనువైన ఒకస్థాయిని అందుకోవటం జరుగుతుంది. మంచి కథ అంటే పాఠకుడి హృదయ స్పందనను తాకగలిగేది. ఒక్కోసారి కన్నీళ్ళు కూడ తెప్పించగలిగేది. పి.ఎస్‌. నారాయణ గారి కథలు ‘మంచి కథలు’ అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు చెప్పగలను’’ అంటారు ప్రముఖ రచయిత కాకాని చక్రపాణి ‘నిన్నటి వీడ్కోలు’ (2009) కథా సంపుటికి ముందు మాట రాస్తూ. చక్రపాణి విశ్లేషణ కేవలం ఆ కథా సంపుటికే పరిమితం కాదు. వారి వ్యాఖ్యలు నారాయణ గారి మొత్తం 300 పై చిలుకు కథలకు, 50 నవలలకు అంతే స్థాయిలో వర్తిస్తాయి.

జూన్‌ 1, 1938లో జన్మించిన పి.ఎస్‌. నారాయణ 85 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఆరు దశాబ్దాల రచనా కాలంలో ఆయన కలం అవిశ్రాంతంగా సాగింది. తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోగా సోదరి వద్దనే విద్యాభ్యాసం చేశారు. చినకాకాని (గుంటూరు జిల్లా)కు చెందిన నారాయణ తన రచనల్లో గుంటూరుపై అభిమానాన్ని కుప్పలు తెప్పలుగా కుమ్మరించారు. అందుకే ఆయన ‘రాగ స్రవంతి’ కథల సంపుటికి ముందుమాట రాస్తూ, ‘‘ఏకబిగిన ఆయన కథల్ని ఒక పాతిక దాకా చదివితే గాని గుంటూరు ఎన్ని విధాలుగా నారా యణగారి కథా కథనంతో పెనవేసుకుపోతుందో ఊహించలేం’’ అంటారు దత్త ప్రసాద్‌ పరమాత్ముని. ఆ మాటకు వస్తే ఒక్క కాశీనే నారాయణ రెండు నవ లల్లో (‘స్వేద ముత్యం’, ‘నువ్వేనువ్వే’) అద్భుతంగా చిత్రించటమేగాదు, అక్కడ ఏవేమి ధర్మ కార్యక్రమాలు ఎందుకు చేస్తారో వివరిస్తారు. నారాయణ కథల్లో గాని, నవలల్లోగాని కొన్ని ఊర్లు సిన్మాల్లో చూసినంతగా కళ్ళకు గడతాయి.

కుటుంబంలో రచయితలెవ్వరూ లేరు ఆయనకు కథలు, నవలలు, నాటకాలు రాసేందుకు ప్రేరణ కావడానికి. ఆయన గుంటూరు హిందూ కాలేజీలో చదువుతున్న రోజుల్లో మన్నవ గిరిధరరావు ఆంగ్లం బోధించేవారు. ఓ రకంగా దూరపు బంధువు అయినా, వాళ్ళిద్దరి మధ్య ‘గురు శిష్య’ బంధమే ఎక్కువ. మన్నవ వారి ప్రోత్సాహంతో తొలుత ఇంగ్లీషు కథలు కొన్నింటిని తెలుగులోకి అనువదించి వారికి చూపించారు నారాయణ. మన్నవ భుజం తట్టటంతో నేరుగా తెలుగులోనే కథలు రాసి పత్రికలకు పంపటం ఆరంభించారు. తాను రాసిన తొలి నాటికథ 1957లో అచ్చయినా, అదేమంత చెప్పుకోదగ్గ కథగా ఆయన భావించలేదు. 1961లో అచ్చయిన ‘బంగారు గొలుసు’ ఆయన తొలి నాటి కథ రచనకు, శిల్పం, శైలి, ఎత్తుగడకు అద్దం పడుతుంది.

ఇందులో రెండే రెండు పాత్రలు ఉంటాయి. ఒకరు రంగనాథరావు, రెండవ వ్యక్తి ఒక యువకుడు. అదే అతని పాత్ర పేరు. వీళ్ళిద్దరూ ఒక రైలు ప్రయా ణంలో ఒకరికొకరు ఎదురుగా ప్రయాణిస్తారు. ఆనాడు రైళ్ళలో సీటింగ్‌ అరేంజ్‌మెంటు నేటిలా కాకుండా క్లాస్‌ రూంలోలా బల్లలు ఎదురెదురు వేసినట్టుగా ఉండేవని ఈ కథ ద్వారా చెప్పకనే తెలుసుకోవచ్చు. రంగనాథ రావు తన మిత్రుడికి తాను ఏనాడో తీసుకొన్న చేబదులు డబ్బులు అయిదు వందలు తిరిగి ఇవ్వడానికి, అలాగే రెండు రోజులు అక్కడ ఉండి రావడానికి గుంటూరుకు బయల్దేరి రైలు ఎక్కుతాడు. తను తీసుకెళ్తున్న అయిదు వంద నోట్లని బొడ్డులోని ఓ సంచిలో జాగ్రత్తగా పెట్టి, కాసేపటికి కునుకు తీస్తాడు. తీరా గుంటూరు వచ్చాక జనం హాడావుడికి మెలకువ వచ్చిచూస్తే ఎదురుగా ఉండే కుర్రాడు ఆ సరికే దిగి పోతాడు. కాని, అతను కూర్చుని వెళ్ళిపోయిన చోట బెంచి క్రింద ఒక బంగారు గొలుసు పడి ఉండటం గమనించి, ‘‘పాపం ఆ కుర్రాడిది నిద్రలో పడిపోయి ఉంటుంది’’ అని భావించి రైలు దిగి ఫ్లాట్‌ ఫాం మీద కలతిరిగి, చివరికి అతన్ని పట్టుకుంటాడు రంగనాథరావు. అయితే ఆ యువకుడు తాను రంగనాథ రావు వద్ద కొట్టేసిన అయిదు వందల కోసం వెంటపడుతున్నాడని భావించి చాలాసేపు తప్పుకు తిరిగినా, చివరకు తప్పనిసరి పరిస్థితిల్లో ‘‘ఇదిగోనండి మీ అయిదు వందలు, రైల్లో క్రిందపడి పోయినాయి’’ అని రంగనాథరావు గారి చేతిలో కుక్కినట్టు పెట్టి గాభరాగా త్వరత్వరగా స్టేషన్‌ బయటికి వెళ్ళిపోతాడు. అప్పటికిగాని రంగనాథరావు గారికి తన డబ్బులు పోయిన సంగతి తెలియదు. చివరకు ఆ గొలుసు ఆయన రైల్వే పోలీసులకు ఇచ్చి చక్కా స్నేహితుడింటికి వెళ్తాడు. కాని రంగనాథరావు గారికి ఒక చిన్న సందేహం అలానే ఉండిపోతుంది. ‘‘భద్రంగా కాగితాల నడుమపెట్టి మూట కట్టి నడుముకు కట్టుకున్న ఆ అయిదు వందలు, ఆ మూట కదలకుండా వుండగా, క్రింద ఎలా పడ్డాయి?’’ అని. ఈ కథ ద్వారా రంగనాథరావు గారి సత్య కాలం మనస్తత్వానికి, అమాయకత్వానికి, తరాలు మారిన అంతరంలో ఆధునిక యువకులలోని కపటత్వాన్ని, మోసాన్ని గ్రహించే శక్తి లేదని చెప్పకనే చెప్పినట్లుగా ఆవిష్కరిస్తారు పి.ఎస్‌. నారాయణ.

బహుశ ఈ కాలంలోనే ఆయన తన రచనా భాషను ఉపమానాలతో పొదగటం ఆరంభించినట్లు కనిపిస్తుంది. ఉదా: ‘‘ఆకాశం మల్లె పందిరిలాగా అందంగా మెరుస్తోంది’’ (‘బంగారు గొలుసు’) లాంటి వాక్యాలు మరింత లోతుగా, సందర్భోచితంగా కథలోని భావోద్వేగాలను చిక్కగా చేస్తూ కనిపిస్తాయి. 1962నాటి ‘శిక్ష’ కథలో ‘‘వెలుగు చీకటి గుహలోకి జారిపోతున్నది’’, ‘‘దీపాలకు, చీకటికి క్షణ క్షణానికి శత్రుత్వం పెరిగి పోతున్నది’’, ‘‘నీటి జల్లు ప్రశాంత ప్రకృతికి తీయని జోల పాట పాడుతున్నది’’, ‘‘ఊచల్లాంటి రెండు చేతులెత్తి నమస్కారం చేశాడు’’, ‘‘చుట్టూ ఉన్న కొండలు నిద్ర పొమ్మంటున్నాయి’’, ‘‘వార్డు మధ్యలో ఉన్న గోడ గడియారం గుండె కలుక్కుమనేలా ఒంటిగంట కొట్టింది’’, ‘‘బల్ల ప్రక్కగా నిండుగా ఉన్న నీటి కూజా ఆమెను వెక్కిరించింది’’ - వంటి భావుకత నిండిన వాక్యాలు కనిపి స్తాయి. కథకుడు కాకపోయినట్లెతే పి.ఎస్‌. నారాయణ మంచి ‘భావుకత’ ఉన్న ఆధునిక వచన కవి అయి ఉండే వాడనటంలో సందేహం లేదు. తన రెండు నవలల సంకలనం ‘ముగింపు’ను తనను పెంచి పెద్ద జేసి తర్వాత స్వర్గస్తు లయిన సోదరికి, బావగారుకు అంకితమిస్తూ నారాయణ గారు రాసిన కవిత వారి కవితా భావుకత లోతులను మనకు సూచిస్తుంది: ‘‘నువ్వు లేవనే దుఃఖంతో, సంవత్సరాల క్రితం ఉన్నావనే జ్ఞాపకాలతో, యీ రోజున ఉండి ఉంటే, అనే అద్భుత ఆనందంతో కూడా, ఏమీ చేయలేక, మరేమీ చేతకాక భగవంతుడు నాకిచ్చిన ఒకే వరం యీ నాడు ఈ ఊహా చిత్రణ నీకే...’’.

ఆయన భావుకత కొన్ని నవలకు, కథలకు పెట్టిన పేర్లలో కూడ కనిపిస్తుంది. ‘సర్రియలిజం’ (అధివాస్తవికత)కు సంబంధం ఉన్నట్లు ఉండే ఈ పేర్లు కథతో ముడివడే ఉంటాయి. కాని సమాసంగానో, నుడికారంగానో వీటిని వివరించడం సాధ్యపడదు. నవలలపై, కథలపై పరిశోధనలు చేసేవారు పి.ఎస్‌. నారాయణ 300కు పైగా కథలకు పెట్టిన పేర్లను, నవలలకు పెట్టిన పేర్లను విశ్లేషిస్తే, తెలుగు కాల్పనిక సాహిత్యంలో దీనిని ఒక విన్నూత్న ప్రయోగంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ‘గాలి కన్ను’, ‘స్వప్నంరాల్చిన అమృతం’, ‘అమృత తిలకం’, ‘విరగని వీనస్‌’, ‘చిలిపి కిరణం’, ‘స్వేద ముత్యం’, ‘ఎరుపెక్కిన చీకటి’ వంటి పేర్లను ప్రస్తావించవచ్చు.

పి.ఎస్‌. నారాయణ రచనల్లో స్త్రీలు ప్రధాన పాత్రలు పోషిస్తారు. స్త్రీ వాద కథలను స్త్రీ రచయితలు ఎలా చిత్రించగలరో, అంతే గొప్పగా, ఇంకా ఒకింత ఎక్కువగా నారాయణ చిత్రించారు. నారాయణ రాసిన 300 పై చిలుకు కథల్లో 50 నవలలో 90 శాతం వరకు ‘స్త్రీ’ వాదన వైపు మొగ్గు చూపే వృత్తాంతాలే. అసలు ఒక మగ రచయిత ఇన్ని రకాలుగా మానవ జీవితంలో స్త్రీ పాత్రలను వేరు వేరుగా, విభిన్న వాదనలలో, కోణాలలో దర్శించగలడా అనిపించేలా ఉంటాయి నారాయణ కథలు, నవలలు. ముఖ్యంగా స్త్రీ అంతర్గత ఘర్షణలు, అంతరంగిక భావాలు, సిగ్గులు, బిడియాలు, మూతివిరుపులు, స్త్రీల ఆలోచనా స్రవంతీ ఇవన్నీ పాఠకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. భిన్న ప్రవృత్తి గల స్త్రీ పాత్రలు, వారిని వేధిస్తున్నట్లుండే సంభాషణలు, ఆ వేధింపుల సంభాషణల్లో పాత్రలు నలుగుతున్నప్పుడు పాఠకుల్లో కలిగే ఉద్వేగాలు, ఆ సంభాషణలు పాత్రలను వేధిస్తుంటే వాటికి ముగింపు ఎలా, ఎప్పుడు, ఎక్కడా? అన్న ఉత్కంఠ పాఠకుల హృదయాలను పిండుతుంటే, ఆ సాహితీ విన్యాసం, పి.ఎస్‌. నారాయణకు మాత్రమే సాధ్యం!

కొప్పరపు నారాయణమూర్తి

Updated Date - 2023-10-16T01:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising