అనువాద సమస్యలపై ఆర్వియార్
ABN, First Publish Date - 2023-10-02T01:14:31+05:30
ఆర్వియార్ (రాళ్ళబండి వెంకటేశ్వరరావు) 1981-1991 సంవత్సరాల మధ్య కాలంలో మాస్కోలో రాదుగ ప్రచురణాలయంలో అనువాదకుడిగా, తర్వాత పూర్తి కాలం అనువాదకుడిగా పనిచేశారు. ఈ అనుభవాల ఆధారంగా ‘అనువాదాలు (ఆవిష్కరణలు - అవస్థలు)’ అనే పుస్తకాన్ని...
ఆర్వియార్ (రాళ్ళబండి వెంకటేశ్వరరావు) 1981-1991 సంవత్సరాల మధ్య కాలంలో మాస్కోలో రాదుగ ప్రచురణాలయంలో అనువాదకుడిగా, తర్వాత పూర్తి కాలం అనువాదకుడిగా పనిచేశారు. ఈ అనుభవాల ఆధారంగా ‘అనువాదాలు (ఆవిష్కరణలు - అవస్థలు)’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది వీరి 150వ పుస్తకం. ఇందులో భాష - లిపి పుట్టుకలు, రకరకాల భాషలు - సాహిత్యాలు, విదేశీ - స్వదేశీ భాషల సాహిత్యం తెలుగులోకి వచ్చిన తీరును వివరించారు. ఇంకా అనువాద సిద్ధాంతాలను, సూత్రీకరణలు చర్చించారు. కొన్ని ప్రసిద్ధ రచనలు అనువాదాలా? అనుసృజనాలా? అన్నది పరిశీలించారు. అనువాదాల్లో అపశృతులు, అనువాదంలో అవస్థలు, అనువాదాల రమ్యత, అనువాదాల ఆవశ్యకత గురించి విపులంగా చర్చించారు. తెలుగులో అనువాదాలపై అరడజన్ పుస్తకాలు వచ్చినప్పటికీ, ఈ పుస్తకం ఇచ్చే సమాచారం, దీని గొప్పదనమే వేరు. పుస్తకంలో ఉన్న విశేషాల ఆధారంగానే ఈ వ్యాసం కూర్చటం జరిగింది.
అనువాదాలు ఒక సంస్కృతిని, ఒక జాతి ఆలోచన సరళిని విశ్వవ్యాప్తంగా ప్రసరింప చేయడానికి ఎంతగానో దోహదపడతాయి. అసలు అనువాద సాహిత్యం వల్లనే మూలకృతి, అనువాద నిపుణులు సాహిత్య చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకోగలిగారు. సాహిత్య కృతులనే కాదు. మత ధర్మశాస్త్రాలు, నీతి బోధలు, శాస్త్ర గ్రంథాలు - ఒకటనే ఏమిటి, అన్ని శాఖల జ్ఞాన క్షేత్రాల సంపద అనువాదాల రూపంలో సుదూర తీరాలకు చేరుకున్నది. అక్కడి సంస్కృతిని సుసంపన్నం చేసింది. అనువాదాల ప్రాముఖ్యం ఎంతటిదంటే, కొన్ని సందర్భాల్లో మూల గ్రంథం అలభ్యంగా నష్టపోయినప్పుడు, అనువాద ప్రతి నుంచి దాన్ని రూపొందించడం జరిగింది. ఉదాహరణకు మన దేశంలో బౌద్ధ గ్రంథాలు నాశనం కాగా టిబెట్, చైనాలో వాటి అనువాదాలు చూసి మరల రూపొందించుకున్నారు.
అనువాదాల్లో ఆవిష్కరణలు, ఆధిపత్యాలు లాంటి అంశాలకు ఉన్న కారణాలు చారిత్రకమైనవి. ఆ ఫలానా చారిత్రిక నేపథ్యంలో సంభవించిన పరిణామాలు ఏమిటో గుర్తించాలి. అప్పుడే ఆయా అనువాదాల గురించి తులనాత్మక విశ్లేషణ చేయడానికి వీలు పడుతుంది. ఈ కోణంలోంచి చూస్తే ‘అనువాదం’ అనే మాటకు ఈనాడు ఉన్న అర్థం రావడమే చారిత్రిక పరిణామం. అందుకనే నన్నయ్య తిక్కనాదుల కృతుల్ని ఈనాటి అర్థంలో అనువాదం అనలేం అని చెబుతారు ఆర్వియార్. మూలవిధే యానువాదం, పదానువాదం, భావానువాదం, స్వేచ్ఛాను వాదం అన్న మాటలు పుట్టుకు రావడానికి ఇదే హేతువు.
ఇంగ్లీషు నుంచి అనువాదం చేసుకునేటప్పుడు వాక్య నిర్మాణాల పట్ల జాగ్రత్త వహించాలంటారు ఆర్వియార్. ఇంగ్లీషు నుంచి అదే తీరు వాక్య నిర్మాణాన్ని తెలుగులోకి దించితే భాష చెడుతుంది. అనుబంధమూ చెడుతుంది. ఇదే కాకుండా పదాల అర్థాలకి సంబంధించి, నుడికారానికి సంబంధించి, జాతీయాలకు సంబంధించి, లక్ష్యార్థ ప్రయోగాలకి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో నిఘంటువుల మీదనే ఆధారపడటం కంటే అనౌచిత్యం మరొకటి ఉండదు. ఎందుకంటే నిఘంటువులు అంత దోహదపడే సాధనాలు కావు. వాటిని వాడటంలో ఎంతో మెలకువ ఉండాలి. అవి నూటికి 99 శాతం సరిగ్గా నప్పే పదాన్ని అర్థస్ఫోరకంగా అందించవు. నిఘంటువులో పదానికి పదం సూటిగా లుప్తం కావడం ఒక ఎత్తు అయితే, అనేకార్థక పదాలలో దేన్నీ ఎలా ఎంపిక చేసుకోవాలో అయోమయంలో పడిపోవడం మరో ఎత్తు. జాతీయాలు, ప్రత్యేకార్థ ద్యోతక పదాలు కూడా అనువాదంలో అవస్థలు తెచ్చి పెడుతుంటాయి.
గోర్కీ ‘అమ్మ’ నవల మూలంలో పోవేల్ పాత్రని పాష అని కూడా పిలుస్తారు. ఇలాంటి ఇబ్బందులు ఎందుకని ఒక్కలాగే నవల అంతా ఆ పేరు ఉండేటట్టు చూశారట ఆర్వియార్. రష్యన్ సంపాదకులు తెలుగు పాఠకుల సౌకర్యార్థం తమ సంప్రదాయాన్ని పక్కన పెట్టేందుకు ఒప్పుకోవడం సుకృతం. ఇలా పేర్ల తకరారే కాకుండా వర్ణక్రమ వ్యత్యాసం వల్ల ఉచ్చారణ భిన్నంగా ఉండడం కనిపిస్తుంది. ప్రఖ్యాత రచయిత ‘టాల్‌స్టాయ్’ను రష్యన్‌లో ‘తోల్ స్తోయ్’ అని అంటారు. ‘డాస్టవిస్కీ’ కాదు, ‘దాస్తయేవస్కీ’ అంటారు. ఇప్పుడు వీటిని యథాతథంగా రాయడం కంటే రూఢిలో ఉన్న పదాలని వాడటం వల్ల అనవసర గందరగోళం తప్పుతుంది. రష్యన్‌లో ఉన్న వర్ణ క్రమానికి తెలుగులో సూటిగా వ్యవహరించే వీలు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రఖ్యాత కథారచయిత ‘చెహావ్’ - ‘చెఖోవ్’ అని రెండు వర్ణక్రమాలలోనూ కనిపించడం ఈ కారణం వల్లనే. రష్యన్ అక్షరానికి ‘ఖ’, ‘హ’ రెండు ధ్వనులూ ఉంటాయి. అలా అని నిర్దిష్టంగా ఫలానాదే అని లేదు.
ఇక బంధుత్వ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఆయా సమాజాలను బట్టి విశిష్టంగా ఉంటూ ఉంటాయి. ఈ సంబంధాల్ని సూచించే పదాలు ఆ భాషల సాంఘిక నేపథ్యాన్ని తెలియజేస్తాయి. అలాగే మర్యాద మన్ననలు సూచించే తీరు భిన్న భాషలకి భిన్నంగా ఉంటూ ఉంటుంది. సంబోధనలో అంతరం ఉంటూ ఉంటుంది. వేష భాషలు ఇంత భిన్నంగా ఉంటే వాతావరణ పరిస్థితులు తక్కువ తినలేదన్నట్టు ముందుకు వస్తాయి. ఇక సాంఘిక జీవిత నేపథ్యం తెచ్చిపెట్టే చిక్కులు ఉన్నాయి ఉదాహరణకి తుర్గెనెవ ‘ద్వోరాన్‌ష్కాయె గ్నెజ్దా’ నవల ఇంగ్లీషు అనువాదంలో ‘A Nest of the Gentry’ అని ఉంది. ‘ద్వోరాన్‌ష్కాయె’కి gentry ఇంగ్లీషులో సమానార్థక పదం. రష్యన్-తెలుగు నిఘంటువులో ‘కులీన వర్గం’ అనే అర్థం దీనికి తగ్గట్టుగా ఇచ్చారు. అలాగని గ్రంథనామంగా ‘కులీనుల గూడు’ అని పెడితే బాగుంటుందా? బాగా ఆలోచించి తెలుగులో ఈ నవలకి ‘గొప్ప వారి గూడు’ అని పేరు పెట్టారు ఆర్వియార్. భారత దేశంలో లక్ష్మీ కటాక్షం అందరూ కోరుకుంటారు. కానీ పాశ్చాత్య సంప్రదాయంలో బంగారాన్ని ‘The Yellow Devil’ అని వాళ్ళు ఆధ్యాత్మిక దృష్టితో తూష్ణీభావంగా చూస్తారు. అతి కష్టంగా దీన్ని ‘స్వర్ణపిశాచం’ అని అనువాదం చేశారు ఆర్వియార్. మన దేశంలో కళ్ళకద్దుకునే బంగారం పిశాచం ఎలా అవుతుంది?
భాషా సంప్రదాయాలు భిన్నంగా ఉన్నా సాంఘిక, నాగరిక, సాంస్కృతిక నేపథ్యం సరితూగుతూ ఉన్నచోట- అనువాదం అంత క్లిష్టంగా కనిపించకపోవచ్చునంటారు ఆర్వియార్. ఈ నేపథ్యంతో పాటు భాషా సంప్రదాయాలు భిన్నంగా ఉన్నచోట అనువాదంలో అవస్థలు మరింతగా ఉంటాయి. అనువాదం బాగా లేకపోవడం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు మూలాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అన్న జవాబిస్తారు ఆర్వియార్. భాష మీద పట్టు లేకపోవడం దీనికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
అనువాదకుడిగా ప్రసిద్ధి చెందిన ఆర్వియార్ ఈ పుస్తకం రాసేనాటికి ఆంగ్లం నుంచి తెలుగులోకి 122 గ్రంథాలు, తెలుగు నుంచి ఆంగ్లానికి ఎనిమిది గ్రంథాలు అనువాదం చేశారు. ఇది 2009 నాటి మాట. అప్పటి నుంచి మరణించే వరకు మరో 12 గ్రంథాలను వెలువరించారు. అత్యంత ఎక్కువ అనువాదాలు చేసిన వీరిని ఎంతోమంది సాహితీ మిత్రులు ‘అనువాద చక్రవర్తి’ అని ప్రశంసిస్తుంటారు. ఆంగ్ల ఉపన్యాసకునిగా పనిచేసిన ఆర్వియార్‌కు ఆంగ్లభాషపై ఉన్న పట్టుకు నిదర్శనంగా వారు రాసిన, అత్యంత ప్రజాధరణ పొందిన ‘ఈజీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సు’, ‘ఆర్వియార్ ఇంగ్లీషు గ్రామర్’, ‘విశాలాంధ్ర ఇంగ్లీషు - తెలుగు పాకెట్ డిక్షనరీ’లు నిలిచిపోతాయి.
కె.పి. అశోక్ కుమార్
97000 00948
Updated Date - 2023-10-02T01:14:31+05:30 IST