ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిపిఐ : తల ఎత్తుకుని నడుస్తుందా?

ABN, First Publish Date - 2023-04-15T01:36:00+05:30

భారత కమ్యూనిస్టు పార్టీ తన జాతీయ హోదాని కోల్పోయింది. నిజానికి ఇప్పుడు ఇదొక వార్త కాదు. చాలాకాలంగా సిపిఐ అనే పార్టీయే వార్త కాకుండా పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భారత కమ్యూనిస్టు పార్టీ తన జాతీయ హోదాని కోల్పోయింది. నిజానికి ఇప్పుడు ఇదొక వార్త కాదు. చాలాకాలంగా సిపిఐ అనే పార్టీయే వార్త కాకుండా పోయింది. ఇందులో వార్తా పత్రికలని తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఆ పార్టీ ఆకాశం నుంచి పాతాళం దిశగా పడిపోతున్న దృశ్యం కనిపిస్తూనే ఉంది. మరో రెండు సంవత్సరాల్లో శత జయంతి ఉత్సవాలను జరుపుకోవాల్సిన పార్టీ అది.

మార్క్స్‌ తన డాక్టరేట్‌ థీసిస్‌లో చేసిన ఓ ప్రస్తావన ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది. గ్రీకు తత్వశాస్త్రం అరిస్టాటిల్‌ తర్వాత హఠాత్తుగా అంతమైపోయిందనే భావాన్ని ఆనాడు ఎక్కువమంది చారిత్రికులు వ్యక్తం చేశారు. దానికి ప్రతిగా మార్క్సు ఒక ప్రశ్న వేశాడు. గ్రీకు తత్వశాస్త్రాన్ని ఆయన ఒక హీరోగా పోల్చాడు. జీవులన్నింటిలాగే, హీరోకి కూడా పుట్టడం, వికసించడం, గిట్టడం ఉంటాయి. నిజమే. కాని హీరో అస్తమయం సూర్యాస్తమయం లాగా ఉండాలి తప్ప పొట్ట ఉబ్బిన కప్ప చావులా ఉంటుందా అన్నది ఆయన ప్రశ్న.

సిపిఐ కూడా హీరోగానే పుట్టింది. హీరోగానే బతికింది. బతుకులో చాలాకాలం ఎదురీతే. అయినా అది ఆనాడు తల ఎత్తుకునే నడిచింది. తొలి దశల్లోనే బ్రిటిషు దొరలకి వ్యతిరేకంగా లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. ఇండియాలో బ్రిటిష్‌ రాజ్యం మిగతా ఏ పార్టీ మీద కంటే ఎక్కువగా కుట్ర కేసులు మోపింది సిపిఐ పైనే. చిటగాంగ్‌ పోరాటం తర్వాత కాలంలో చిటగాంగ్‌ వీరులు, సూర్యసేన్‌ వారసులూ చేరిన పార్టీ సిపిఐ. భగత్‌ సింగ్‌ సహచరులూ, వారసులూ ఎంచుకొన్న పార్టీ కూడా సిపిఐనే. తొలి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం సిపిఐ.

గతంలో బ్రిటిషు ఇండియాలోనూ స్వతంత్ర భారతంలోనూ కూడా ఆ పార్టీ చేసినన్ని త్యాగాలు మరే పార్టీ చేయలేదు. రావి నారాయణ రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు లాంటి నాయకులు చేసిన త్యాగాలు మాత్రమే కాదు. సాధారణ సభ్యుల్లో, కార్యకర్తల్లో తమకున్న ఆస్తిపాస్తులన్నిటినీ పార్టీ కోసం ఇచ్చేసిన వారు మీకు గతంలో ఆ పార్టీలో కొల్లలుగా కనిపించేవారు. ఈ దృశ్యం దేశంలో మీకు మరే పార్టీలోనూ కానరాదు. తొలి నుంచి మతోన్మాదాన్ని నిక్కచ్చిగా ఎదుర్కొన్న పార్టీ సిపిఐ. బాబ్రీ మసీదుపై మతోన్మాదుల తొలి దాడులను తమ శ్రామిక శ్రేణులతో ఒంటరిగా ప్రతిఘటించిన పార్టీ సిపిఐ. ఈ సంగతిని దాదాపు అందరూ మర్చిపోయారు.

దేశంలో అనేకానేక రైతాంగ పోరాటాలను నడిపిన పార్టీ సిపిఐ. దేశంలోనే అతిపెద్దదైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన పార్టీ సిపిఐ. రాజరిక, జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో రైతాంగాన్నీ వ్యవసాయ కార్మికుల్నీ కూడగట్టి నడిపిన పార్టీ సిపిఐ. ఆంధ్ర, బిహారులాంటి రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మికులు భూమి కోసం వీరోచితంగా చేసిన భూ పోరాటాల్లో అగ్రశ్రేణిలో అండగా నిలబడిన పార్టీ సిపిఐ.

ఇక, పోరాట పటిమకీ నిబద్ధతకీ మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ మారుపేరుగా సిపిఐ కాక మరెవరున్నారు? దీనికి ఉదాహరణలు ఎన్నైనా చెప్పొచ్చు. కొన్ని సందర్భాలు చూద్దాం. పంజాబులో ఖలిస్తాన్‌ వేర్పాటు ఉన్మాదం చాలా ఉధృతంగా సాగుతున్నప్పుడు దాన్ని రెండు మూడు పక్షాలు ఎదుర్కొన్న మాట నిజమే. కాని ప్రభుత్వాన్ని పక్కనబెడితే, బతుకు మైదానంలో ఖలిస్తాన్‌వాదులతో నిక్కచ్చిగా తలపడిందీ, ఎదురు నిలిచి పోరాడిందీ సిపిఐ మాత్రమే. ఖలిస్తాన్‌వాదుల మారణకాండలో అత్యధికంగా బలైంది, సిపిఐ కార్యకర్తలే. ట్రేడ్‌ యూనియన్ల పైన ఖలిస్తాన్‌వాదులు ఆయుధాలతో దాడిచేసి కార్మికుల్లో సిక్కులూ సిక్కులు కానివాళ్లూ వేర్వేరుగా నిలబడమని ఆర్డర్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సిపిఐకి బలమున్న చోట ఎక్కడా ఖలిస్తాన్‌వాదుల ఆదేశాలను కార్మికులు ఖాతరు చేయలేదు. సరిగ్గా అలాగే, 1969లో తెలంగాణాలోనూ, 1972–73లలో ఆంధ్రలోనూ, జై తెలంగాణ, జై ఆంధ్ర వేర్పాటు ఉద్యమాలకి వ్యతిరేకంగా అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీని మినహాయిస్తే, మైదానంలో స్థిరంగా నిలబడిన పార్టీ సిపిఐ మాత్రమే. ఆ వేళ ప్రజల్లో అనేకమంది వేర్పాటువాదానికి అనుకూలంగా ఉన్న మాట నిజం. అయినా తాను నమ్మిన సూత్రానికి కట్టుబడి ఒంటరిగానే పోరాడిన పార్టీ సిపిఐ.

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే, ఎక్కువ మంది ప్రజలకు రుచించని ఆ పోరాటాల తర్వాత సిపిఐ కుంచించుకుపోలేదు, పైగా మరింత సంఘటితపడింది. కాబట్టి పార్టీ ఎదురీదినప్పుడు గాని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు గాని పార్టీ పతనం కాలేదు.

మరి, క్రమంగా ఆ పార్టీ నిర్వీర్యంగా మారిపోయింది. ఎందుచేత? ఒక హీరోగా పుట్టి, హీరోగా బతికి, ఇప్పుడు ఇంత అర్థరహితంగా, ఇంత పేలవంగా బతుకీడ్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రోజులు గడుస్తున్న కొద్దీ జవసత్వాలు ఉడిగిపోయి, కుంగిపోయి అనామకంగా కాలగర్భంలో అది కలిసిపోతుందా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతి పార్టీ జీవితంలోనూ తప్పులూ ఒప్పులూ జరుగుతాయి. సిపిఐ జీవితంలోనూ అనేక పొరబాట్లు జరిగాయి. అంతమాత్రాన పార్టీ అంతమైపోనక్కర్లేదు. తప్పులు సరిదిద్దుకొని నడక సాగించవచ్చు. అయితే, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ఒక రకం తప్పులు ఎప్పటికీ చెయ్యకూడదు.

మిగతా పార్టీలకూ కమ్యూనిస్టు పార్టీకీ ఒక విషయంలో మౌలికమైన తేడా ఉంది. మిగతా పార్టీల లక్ష్యం అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించి, తాను అధికారం సంపాదించడం. కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం కూడా అధికారాన్ని సంపాదించడమే. కాని దానికి అంతకంటే పెద్ద లక్ష్యం కూడా ఉంది. ఇప్పుడున్న సామాజిక వ్యవస్థను మార్చి, మరో మెరుగైన వ్యవస్థను స్థాపించాలి. నిజానికి అసలు లక్ష్యం అదే.

ఇతరులతో గల ఈ తేడా వల్ల పార్టీ కార్యక్రమం వేరుగా ఉండాలి. దాని కార్యాచరణ భిన్నంగా ఉండాలి. దాని పునాది వర్గాలు వేరుగా ఉంటాయి. దాని సిద్ధాంతం, దాని సూత్రాలూ, దాని నైతికత, దాని వ్యక్తిత్వం– ఇవన్నీ భిన్నంగానూ ఉన్నతంగానూ ఉండాలి. ఎన్నికల్లో బూర్జువా పార్టీలతో జట్టు కట్టరాదు. ఎందుకంటే, ఈ వ్యవస్థని మార్చే పని ఆ పార్టీలతో కలిసి సాధించడం అసాధ్యం కదా! పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను తక్షణ ప్రయోజనాల కోసం బలిపెట్టకూడదు. నాయకుల ప్రయోజనాల కోసం పార్టీని బలి పెట్టరాదు. జనాన్ని ఎన్నడూ గందరగోళంలో పెట్టరాదు. పార్టీపై జనానికున్న నమ్మకాన్ని ప్రాణం పోయినా పోగొట్టుకోకూడదు. ఈ చెయ్యగూడని పనులన్నీ సిపిఐ చేసింది. అందుకే దాని ఇతర సద్గుణాలన్నీ మట్టిగొట్టుకుపోయాయి. ఆ పార్టీ జనాన్ని గందరగోళపర్చింది. ఒకప్పుడు అభిమానించిన వారే దాన్ని వదిలేశారు.

ఇప్పుడు దాని ముందున్న మార్గాలు రెండు– 1. అది తన శక్తిని కూడదీసుకొని మళ్లీ కొత్త ఊపిరితో లేచి నిలబడి సొంత వ్యక్తిత్వంతో, సొంత కార్యక్రమంతో, స్వతంత్ర ఆచరణతో ముందుకు సాగడం. 2. సొంత వ్యక్తిత్వాన్ని గాలికి వదిలేసి ఎవరో ఒకరి పంచన సాగిలపడుతూ అర్థంపర్ధంలేని ఆ బతుకుని నిస్సారంగా ముగించుకోవడం. ఎంచుకొనే హక్కు సిపిఐదే.

ఎ. గాంధి

సంపాదకుడు, పీకాక్‌ క్లాసిక్స్‌

Updated Date - 2023-04-15T01:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising