‘గద్య కవిత’ను విడిగా గుర్తించామా?
ABN, First Publish Date - 2023-08-07T03:17:39+05:30
కవిత్వాన్ని పద్యం గానూ, గద్యం గానూ విడగొట్టి చూడాలి. పద్యం, గద్యం రెండూ ఒకటి కాదు. పద్యాన్ని మళ్ళీ అనిబద్ధ పద్యం (దీన్నే మనం వచన కవిత అని అంటున్నాం), ఛందోబద్ధ పద్యంగా విభజించాలి. పద్య కవితకి, గద్య కవితకి కవిత్వపరంగా...
కవిత్వాన్ని పద్యం గానూ, గద్యం గానూ విడగొట్టి చూడాలి. పద్యం, గద్యం రెండూ ఒకటి కాదు. పద్యాన్ని మళ్ళీ అనిబద్ధ పద్యం (దీన్నే మనం వచన కవిత అని అంటున్నాం), ఛందోబద్ధ పద్యంగా విభజించాలి. పద్య కవితకి, గద్య కవితకి కవిత్వపరంగా ఎలాంటి తేడా లేదు. కవిత్వం ఉందా, లేదా? అంతే! రూపపరంగా రెండూ ఒకే నాణానికి భిన్న పార్శ్వాలు. పంక్తులుగా పేర్చి, పాద విభజన చేస్తూ రాస్తే అది పద్య కవిత. అలా కాకుండా ఒక వరసలో రాసుకుంటూ పోతూ, పేరాగ్రాఫ్‌లుగా విడగొడితే అది గద్య కవిత (prose poem).
కానీ, మనం ఛందోబద్ధ పద్యాన్ని మటుకే పద్యంగానూ, అనిబద్ధ పద్యాన్ని ‘వచన కవిత’గాను పేర్కొంటున్నాం కానీ, రెండూ పద్య కవితలే! ప్రాచీన పంథాలో రాసినా, ఆధునిక రీతుల్లో రాసినా మన కవులు రాస్తున్న కవిత్వంలో సింహ భాగం పద్య కవితలే! అందులో ఏ అనుమానం లేదు.
పై సూత్రీకరణ ప్రకారం చూస్తే, మన తెలుగులో సాంకేతికంగా గద్య కవితలు సకృత్తు. ఎవర్రాసేరు? గద్య కవితల్ని చక్కని డిక్షన్‌తో సౌందర్య స్ఫోరకంగా రాశాడు శేషేంద్ర! గద్య కవితలు రాయాలంటే, సామర్థ్యంతో పాటు భాష మీద పట్టు కూడా ఉండాలి. పఠనశీలురు కాకపో వటమూ, ప్రాచీన సాహిత్యంతో కనీస పరిచయం కూడా లేకపోవటంతో ఆధునిక కవులు అవిచ్ఛిన్నంగా గద్య కవితల్ని రాయలేకపోతున్నారు. మంచి చదువరి మంచి కవి ఔతాడనేందుకు దేవిప్రియ ఒక ఉదాహరణ! ఇనా ్షఅల్లాహ్ అంటూ కంద పద్యాల శతకం కూడా రాసిన అత్యాధునిక తెలుగు కవి అతడు.
కథకులు కొందరు కవిత్వంతో కథల్ని మలిచారు. చలం, రావిశాస్త్రి, త్రిపుర, వి. చంద్రశేఖరరావు లాంటివాళ్ళు! వీళ్ళ చాలా కథల్లో అడుగడుగునా కవిత్వం తొణికిసలాడుతుం టుంది. చలం కథల్లోని పంక్తుల్ని ఒక క్రమంలో పేర్చి ఆ కవితల సంపుటిని ‘కవిగా చలం’ పేరిట వజీర్ రెహ్మాన్ ప్రకటించాడు కూడా. ఈ తరం కథకుల్లో వి. చంద్రశేఖర రావు భాష కవిత్వపు భాషై కొత్త పుంతలు తొక్కింది. బండి నారాయణ స్వామి తొలికథ ‘చమ్కీ దండ’ని పూర్తి స్థాయి కవిత్వంగా చెప్పుకోవాలి. ఒకానొక తాత్విక భావనని సింగిల్ లైన్‌గా తీసుకొని (1980 ప్రాంతాల్లో) కథగా మలిచాడు కానీ, నిజాని కది ఒక దీర్ఘ కవిత మాత్రమే! ఈ కథలోని కవిత్వపు శైలికి ఆ రోజుల్లో స్మైల్ లాంటి కవీ, కథకుడూ మెస్మరైజ్ అయ్యాడు. ఇలా తెలుగు కథకులే చక్కటి వచనాన్ని, గద్య కవిత్వాన్ని రాసినట్టు భావించటంలో అనౌచిత్యం ఏమీ లేదు.
ఈ మధ్య శ్రీకాంత్ గద్య కవితల్ని తరచూ రాస్తున్నాడు. విస్తృతంగా రాస్తున్నాడు. ఉదాహరణకి: ‘‘ఒక శ్మశాన వాటిక లాగా లేదా సమాధిలాగా. చెదలు పట్టి, చిలుం పట్టిన వాటి లాగా. ఉదయపు ఒంటరి వెలుతురులో, మొక్కలు తలలూపే సాయంత్రపు గాలిలో, రాత్రిలో నక్షత్రాల కాంతిలో ఖాళీ అయిన ఊరిలో మిగిలిన ఒక ఒంటరి చేనులాగా, ఎవరో వ్రాద్దామని మొదలుపెట్టి సగంలో వదిలి వెళ్లిన ప్రేమలేఖ లాగా, నిన్ను హత్తుకుని ‘మళ్ళీ వస్తా’ అని చెప్పి తిరిగి రాకుండా మరి వెళ్ళిపో యిన ఒక మనిషిలాగా మిగిలిన ఆ ఇంటికి తిరిగి నువ్వు ఎప్పుడు వెడతావో నీకు తెలియదు.’’ (‘మూసిన తలుపుల వెనుకగా’)
ఇంకొన్ని గద్య కవితలు:
‘‘ఎండ వెచ్చగా ఉంది. పచ్చిక పచ్చగా ఉంది. ఇక్కడింత హాయిగా ఉంటే, బతకటానికేమైంది నీకు!’’ (‘ఎందుకు బత కాలి?’ ఇస్మాయిల్)
‘‘ప్రపంచ భూములు తొక్కుకొంటూ తిరుగాడే దేశ ద్రిమ్మరి విప్లవం మన వీధిక్కూడా వస్తుంది. పసిపిల్లలు నిద్రలో కూడా బాంబుల కోసం కలలు కంటున్నారు. వేదాంతం వైపు పిలు స్తోంటే విప్లవంవైపు పరుగెత్తుతున్నారు. చంద్రుడ్ని చూపిం చినా చూడటం లేదు. తల్లులు, తండ్రులు మూటలు విప్పి దుఃఖాన్ని చూచుకొంటున్నారు. వాళ్ళ కళ్ళకు నక్షత్రాలు పోసిన ఆకాశం స్ఫోటకంలా కనిపిస్తోంది. మామిడి కొమ్మల మీద కూర్చునే కోకిలలు మరతుపాకుల మీద కూర్చుని పాడుతున్నాయి’’. (‘ఆధునిక మహా భారతము’ శేషేంద్ర)
‘‘ఒక అమ్మ మాత్రమే మిగిలింది ఇక్కడ. నలభై ఏళ్లుగా నా అన్నవాళ్ళు లేకుండా!... చూపు తప్ప భాష లేని అంతర్ధానపు సంధ్య! కడుపునిండా బిడ్డల్ని కని- ఊరూరా పంటపొలం పచ్చగా నిండా నూరేళ్లు - జన్యువుల్ జెండాలై మానవజాతి తొలి వికాసపు ఆఖరి జాడలు లోకమంతా జల్లులాడే ముహూర్తం ఆగమిస్తుందని ఎదురు చూసి చూసి అశువులు బాసింది. ఆమె పేరు బో! అమ్మ నీకు దండమే!’’ (‘దోడ తిత్తివా’ అరుణ్ సాగర్)
గద్య కవితకి పద్య కవితకి రూపంతోపాటు సారంలోనూ తేడా ఉంది. ఒక భావనని తీసుకొని దాని లోతుల్లోకి కవిత్వాన్ని విస్తరించుకుంటూ పోతాడు కవి. పద్య కవితలో ‘గూఢత’, ‘క్లుప్తత’, ‘ఆప్తత’ ప్రధాన లక్షణాలైతే, గద్య కవితలో ‘ప్రగాఢత’, ‘సుందరత’, ‘విపులత’ ముఖ్య గుణాలు!
పద్య కవిత ఆధునిక రూప, గుణ సమన్విత లక్షణాలకు ఒక ఉదాహరణ:
‘‘తనని బాధిస్తున్న
లోకం ముల్లుని
పీకి పారేసి-
ఈ పిల్ల ఎటో నడిచిపోయింది’’
(‘ఆత్మహత్య’ ఇస్మాయిల్)
- చూట్టానికి పై కెంతో సరళంగా ఉన్న ఈ కవితలో లోతైన గూడార్థం ఉంది. ఎంతైనా విశ్లేషించవచ్చు. ఇటు వంటి సౌలభ్యం గద్య కవితకి సాధ్యపడే వీలే లేదు. గద్య కవి వాక్యానికి వాక్యం జోడిస్తూ, తన భావనా ప్రపంచం లోకి మనల్ని తీసుకు వెళ్ళి ఒక ప్రగాఢమైన అనుభూతిని మనకి ‘అనుభవం’ చేస్తాడు.
మో ‘బతికిన క్షణాలు’ అతడి ఆత్మకథాగానం! ఈ పుస్తకం కూడా గద్య కవిత్వమే! ఇటీవలి కాలంలో ‘గద్య కవిత్వం’ టెక్నిక్‌ని ఆకళించుకొని రాస్తున్నారు మన కవులు. ఇంగ్లీష్, ఇతర భాషల్లో వస్తున్నట్టుగా తెలుగులోనూ ఇటువంటి గద్య కవితలు విరివిగా రావాల్సిన అవసరం ఉంది.
రవూఫ్
98491 93657
Updated Date - 2023-08-07T03:17:39+05:30 IST