చలం మనసిచ్చిపుచ్చుకున్న మిత్రులు
ABN, First Publish Date - 2023-09-11T00:25:34+05:30
ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఓ వూపు వూపిన ఘనుడు గుడిపాటి వెంకటచలం. ఈ గడుసు మానిసి చిన్నప్పుడు చెలికాళ్లతో చేసిన చిల్లర మల్లర అల్లర్లు, కాలేజి విద్యార్థి దశలో యువ మిత్రులతో కలిసి చేసిన గడుగ్గాయి ఆగడాలు, ఏండ్లు పూండ్లు గడిచిన..
ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఓ వూపు వూపిన ఘనుడు గుడిపాటి వెంకటచలం. ఈ గడుసు మానిసి చిన్నప్పుడు చెలికాళ్లతో చేసిన చిల్లర మల్లర అల్లర్లు, కాలేజి విద్యార్థి దశలో యువ మిత్రులతో కలిసి చేసిన గడుగ్గాయి ఆగడాలు, ఏండ్లు పూండ్లు గడిచిన తర్వాత నెమరు వేసుకున్న తియ తియ్యని జ్ఞాపకాలు, వద్దన్నా మరవలేని చేదు అనుభవాలు, ఇవన్నీ కలబోస్తే నిండిన అమృత కలశం-
‘చలం మిత్రులు’ పుస్తకం 1977 మార్చిలో వెలువడింది. 1950లో రమణాశ్రమంలో ఆధ్మాత్మిక చింతనలో మునిగి తేల్తూ, ఎంతో కొంత చిత్తశాంతిని అనుభవిస్తూ, ఆబాలవృద్ధ మిత్రులతో గడిపిన బంగారు కాలాన్ని తల్చుకొని ఈ అపురూపమైన పుస్తకం రాశారు గుడిపాటి వెంకటచలం.
ఈ 116 పేజీల పుస్తకంలో చలం 14 మంది మిత్రుల గురించి రాశారు. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన స్వభావం, జీవిత విధానం. వీళ్లల్లో చిన్ననాటి స్నేహితులూ వున్నారు, కిశోరావస్థలోని మిత్రులూ కనిపిస్తారు, మలి దశల్లోని ఆత్మీయులూ తారసపడతారు. విచిత్రమేమంటే పుస్తకంలో చలం స్నేహితురాళ్లే అగపడరు. మొట్టమొదటి మిత్రునిగా ‘సుభ్రమణ్యం’ గురించి రాసిందానిలో మాత్రం హైస్కూలు రోజుల్లోని మిత్రురాలు నీడిల్ సుందరమ్మ క్షణప్రభలా ఒక్క వెలుగు వెలిగి కనుమరుగవుతుంది. చలం గురుదేవులు, కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాల (నేటి పి. ఆర్. కాలేజి) ప్రిన్సిపాలు రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు బెత్తం పట్టుకొని విద్యార్థుల ముందు వివిధ భంగిమల్లో కనువిందు కలుగ చేయడం ఓ అపురూపమైన దృశ్యం. ప్రిన్సిపాల్ నాయుడిగారి క్లాసులకు సుభ్రమణ్యం డుమ్మా కొడుతుంటే, నాయుడిగారి ఆప్తకార్యదర్శి కౌస్తుభంగారు ఎందుకలా చేస్తావని అడిగితే, సుభ్రమణ్యం ‘‘ఆ ముసలమ్మ కబుర్లు వినేదేమిటి లెద్దురూ’’ అని అన్నాడట. అది విని ప్రిన్సిపాలు నాయుడు గారు తెగ నవ్వారట. మొత్తం మీద ఇతను సుభ్రమణ్యం జగడాలమారి. తగాదాలకు కొట్లాటలకు పెట్టినపేరు. చలం చివరి మజిలీ తిరువణ్ణామలైలో కూడా ఓసారి ఆకస్మాత్తుగా చుక్క తెగిపడిన చందంగా నిగమశర్మలా ప్రత్యక్షమయ్యాడీ పెద్దమనిషి. రమణ మహర్షి ముందు మౌనంగా కూర్చున్న చలంను చూసి, విసుక్కుని, వెక్కిరిస్తూ ఇలా అన్నాడు- ‘‘ఏమిట్రా నువ్వు! ఈ విగ్రహాలు, పూజలు యివన్నీ వుత్త నాన్సెన్స్ అంటే అదేదో నిజమని యోచించాం. తర్వాత అసలు మతమే మూర్ఖం, దేవుడు లేడంటే మేమూ అలానే అనుకున్నాం. తర్వాత స్త్రీ తప్ప ఏమీ లేదన్నావు- అదీ నమ్మాము. ఇప్పుడేమో అదీ లేదు, యిదీ లేదు ఈశ్వరుడంటే వప్పుకుంటున్నాం. అక్కడితో ఆగుతావా? ఇంకెక్కడికైనా పోతావా?’’ అల్లరి మనిషిగా తోచే ఈ సుభ్రమణ్యం చలం జీవితాన్ని ఎంచక్కా గమనించాడో కదా!
ఎప్పుడూ చలం పక్కన వుండాలని తపించిన మిత్రుల్లో పట్టాభిరామయ్య ఒకడు. చలం ఇబ్బందులకు గురైనప్పుడు అనుకోకుండా అక్కడ ప్రత్యక్షమై చలంను ఇక్కట్ల నుంచీ తప్పించేవాడు. చలం పట్ల అలవిమాలిన ప్రేమ పట్టాభి రామయ్యకు. అతను బెజవాడలో ఇల్లుకట్టుకుంటే అది చూసి చలం ‘‘సో యు ఆర్ బిల్డింగ్ యువర్ మసోలియం’’ (‘‘అంటే నువు నీ సమాధి కట్టుకుంటున్నావన్న మాట’’) అన్న మాటలకు కూడా బాధ పడలేదా మహాత్ముడు. తిరువణ్ణామలైలో వూపిరి సలపని వాతావరణంలో వీడెలా బతుకుతున్నాడా అని బాధపడి, చలాన్ని తెలుగు రాష్ట్రానికి తిరిగితీసుకెళ్లాలన్న విఫల ప్రయత్నమూ చేశాడీ స్నేహజీవి!
చలం ఏడిపించే మిత్రుల్లో చెప్పుకోదగ్గవారు పాటిబండ రామ్మూర్తి, తల్లాప్రగ్గడ ప్రకాశ రాయుడు. హైస్కూలు చదివే రోజుల్లో రామ్మూర్తి అమాయకత్వం వల్ల నవ్వుల పాలయ్యేవాడు. చలం అతని మీద చెణుకులు విసిరేవాడు. చలం తన్ను ఎంత ఏడిపించినా సరే, ప్రకాశరాయుడు అతన్ని వదిలి పెట్టేవాడు కాదు. పీకినా తెగని అనుబంధం ఆ ఇద్దరిదీ.
చలం ప్రియ మిత్రుల్లో ఆత్మారాం ఒకడు. ఎంతో ప్రీతిపాత్రుడు. తమ సన్నిహిత సంబంధాన్ని తనదైన విలక్షణ శైలిలో ఇలా చెప్పారు చలం: ‘‘అతను దగ్గరిగా వస్తే దూరంగా జరగటం కష్టం. అతని యిష్టాన్ని వదిలించుకోలేం... అతను పెద్దయినాకా అంతే! టీలో చక్కెర నెంత మిస్ అవుతామో ఆత్మారాంని అంత మిస్ అవుతాము.’’ అలాంటి ఆత్మారాం సంసార సాగరాన్ని ఈదలేక డస్సిపోయి, అర్ధాంతరంగా బతుకు చాలించాడు.
చలం స్నేహితుల్లో ఖాజీసాహెబ్ మరపురాని మనిషి. ఆజానుబాహుడు, మంచి రంగు, నల్లని పొడుగాటి గడ్డం. రాళ్లను కరిగించే గాన ప్రావీణ్యం. ఆయన ప్రేమ కవిత్వం పాడుతుంటే శ్రోతలు మైమరచి పొయ్యేవారు. ఇక వీరగీతాలు పాడుతుంటే శ్రోతలు వీరావేశంతో వూగిపొయ్యేవారు. చలం తన మిత్రులైన అక్రమాలి యింట్లో తరుచుగా ఖాజీసాహెబ్ పాటకచ్చేరికి హాజరయ్యేవారు. రాజమండ్రిలో పరిచయమైన ఖాజీసాహెబ్ ఏలూరులో వుంటూ అప్పుడప్పుడు చలంను కలుసుకునేవాడు. అతను జల్సారాయుడు, ఆస్తిపాస్తులు కరిగిపోయిన తర్వాత అప్పుల పాలయ్యాడు. జీవితం మీద విరక్తి కలిగింది. మిలటరీలో పనిచేసే కొడుకు నుంచి ఉత్తరాలు రాకపోతే తల్లడిల్లిపొయ్యే వాడు ఖాజీ సాహెబ్.
తెలుగు భావకవులకు మంచి మిత్రుడైన హరీన్- హరీంద్ర నాథచటోపాధ్యాయ- కవయిత్రి సరోజినీ నాయుడి తమ్ముడు. చలంను బాగా ఇష్టపడేవాడు. అందరికీ అందుబాటులో వుంటూ, క్షణార్ధంలో స్నేహితుడయ్యే భావజీవి హరీన్. ఆచంట జానకిరాం బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ (నేటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైస్స్)లో పని చేసే రోజుల్లో హరీన్‌ను చలంకు పరిచయం చేశారు. హరీన్ దేశదిమ్మరి. బెజవాడలో ముద్దుకృష్ణను వెంటబెట్టుకొని నాటకాలు, సంగీత కచ్చేరీలు, కవితాగానాలు వగైరా చేస్తూ, ఎంతో కొంత డబ్బు పోగు చేసుకుంటూ, దాన్ని అప్పటికప్పుడే ఖర్చు పెడ్తూ కులాసాగా కాలం గడిపేవాడు హరీన్. చలం హరీన్‌ను ‘నిలువునా కళారూపి’ అంటారు.
ఆధునికాంధ్ర కవితా సంకలనం ‘వైతాళికులు’ సంపాదకుడు ముద్దుకృష్ణ గురించి మనకు లభించే రచనల్లో చలం గారి ఈ రచన లాంటి లోచూపు గలది మరొకటి లేదు. ‘‘అతను ఉద్యోగం చెయ్యలేదు కాని జీవిత మంతా జీతం లేని ఉద్యోగం దేంట్లోనో ఓదాంట్లో వుంటూ వుండేవాడు. పైపైన చూస్తే అంత దురదృష్టవంతుడు లేడు. దురదృష్ట వంతులకు పట్టిన దుఖ్ఖం అతనికి ఒక్కరోజునా పట్టలేదు. అతనికి పెళ్ళి, సంసారం, బంధువులు ఎవరూ, ఏమీ లేరు. కాని అతను జీవిత మంతా ఎవరో ఒకరి కేర్ ఆఫ్‌లో వుండేవాడు.’’ ముద్దుకృష్ణ ‘జ్వాల’ పత్రికా సంపాదకుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. చలం కూడా ఆ సంపాదక ద్వయంలో ఒక్కరని ఎంత మందికి తెలుసు. ముద్దుకృష్ణను అదృష్ణ దేవత కటాక్షించలేదు. అతనితో పాటు సినిమా రంగంలో పని చేసిన నటీమణులు, కవులు లక్ష్మీ ప్రసన్నులైనారు. కాని అతని పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా వుండిపోయింది. ‘‘ఇన్ని గోల్డెన్ ఆపర్చ్యునిటీస్ లోంచి అతను బైటపడ్డా ఒక్కనాడు తన జీవితం ఇట్లా అయిపోయిందని రిగ్రెట్ కాలేదు. తన మిత్రులను చూసి అసూయ పడలేదు,’’ అంటారు చలం.
చలం మిత్రుల్లో ఫిడేలు విద్వాంసుడైన జంగం సుభ్రమణ్య దేవర ఒకడు. చలం బందరులో వుండేటప్పుడు మొదట్లో సుభ్రమణ్యం శిష్యుడై సంగీతం నేర్చుకుంటూ, అనతికాలంలోనే అతనికి ప్రియస్నేహితుడయ్యాడు. వాయులీన వాద్యంలో ప్రావీణ్యం సంపాదించిన సుభ్రమణ్య దేవర గ్రహచారం కొద్దీ మద్రాసులో మిర్జాపురం రాజావారి సినిమా కంపెనీ వాద్య బృందంలో ఒకడిగా పని చేశాడు. కొంతకాలం తర్వాత ఆయన బెజవాడ రైల్వేస్టేషన్ బయట బిచ్చగాడై, ముందు ఓ చింకిగుడ్డ పరిచి దీనంగా ఆడుక్కుంటున్నాడు. చలం అతని కోరికపై ఇంటి నుంచి వెళ్లీ అతన్ని ఈ విధంగా చూసి చలించిపోయారు. అతన్ని, పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి కడుపునిండా భోజనం పెట్టి, చేతిలో కాసింత డబ్బు వుంచి, కన్నీళ్లతో సాగనంపారు. సరస్వతీ పుత్రుడైన సుభ్రమణ్య దేవర ప్రతిభాశాలి అయి వుండీ అభిమాన ధనుడై నందువల్ల కీర్తి ప్రతిష్టలకు నోచుకోలేక దుర్భర దారిద్య్రంలో చితికి చితికి కళ్లు మూసుకొన్నారు.
చలం మిత్రుల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రముఖులు. కాకినాడ నివాసిగా ఆయన రఘుపతి వెంకటరత్నం నాయుడికి దగ్గరై బ్రహ్మసమాజానికి కవిగా ఎనలేని సేవ చేశారు. ‘‘కృష్ణశాస్త్రి భార్య చచ్చిపోయింది. తక్కిన తెలుగు కవుల మల్లేనే వున్నన్నాళ్ళూ భార్య నేడిపించుకు తిన్నాడు కృష్ణశాస్త్రి. ఆమె చచ్చిపోగానే గొప్ప మరణ గీతాలు రాశాడు.’’ చలం ఈ వాక్యాలు ‘ఊర్వశి’ ప్రియుడి అంతరంగాన్ని బహిరంగం చేశాయి. ప్రిన్సిపాలు నాయుడు గారికి దూరమై చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన్ను ఆశ్రయించి పి. ఆర్. కాలేజీలో ట్యూటరుగా కుదురుకున్నారు కృష్ణశాస్త్రి. బ్రహ్మ సమాజానికి ఆస్థాన కవి అయి నలుమూలలా తన గీతాల ద్వారా కీర్తి పొందారాయన. ‘‘ఒక్క బ్రహ్మసమాజాని కేమిటి? ఆంధ్ర సాహిత్యానికే గొప్ప అలంకారమైన గీతాలవి. మిస్టిక్ పొయెట్రీలో ఒక్కొక్క నిమిషాన అవి టాగోర్ గారి గీతాల కన్నా గొప్పగా వుంటాయి,’’ అంటాడు చలం. చలానికి కృష్ణశాస్త్రి బ్రాహ్మగీతాల మీద, భావ గీతాల మీద గొప్ప ప్రేమ వుండేది. కాని అతను ధనాశతో సినీకవిగా మారడం చలానికి రుచించలేదు. ‘‘అతను కవిగా బతికిన రోజుల్లో అతను నా మిత్రుడని రాసుకోవటానికి గర్వపడుతున్నాను. వుద్యోగాల్ని ఆశ్రయించకుండా కృష్ణశాస్త్రి కవిగానే వుండిపోతే, ఈమని శంకరశాస్త్రి గారు సంగీత గురువుగానే వుండిపోతే తెలుగు సారస్వతము, గానకళ వెలుగుతూ వుండేవేమోనని కలలుగంటూ ఉంటాను. ఎంతమంది తెలుగు యువకుల హృదయాలు యీ మురికి నుంచి విముక్తి పొంది, విశాలత్వానికీ, వెలుగుకి తెరుచుకునేనో!’’
చలం స్వభావం విచిత్రమైనది. ఆయన తొలి చూపులోనే చాలా మందికి అర్థమైన వాడిగా తోస్తారు కాని అంతు చిక్కరు. సన్నిహిత పరిచయ మున్నవాళ్లకు కూడా ఆయన చిక్కినట్లు చిక్కి అట్టే జారిపోతారు. ‘చలం మిత్రులు’ పుస్తకాన్ని ఆయన ఓ మిత్రునికి అంకితమిస్తూ ఇలా అంటారు, ‘‘సుబ్బారావుగారూ! మీరు ఎట్లా వచ్చారో, ఎట్లా దూరమైనారో చెప్పుకోలేను. అట్లా దూరమై పోయారు ఎంతో మంది నాకు ముఖ్యమైనవాళ్లు. మిమ్మల్ని అందర్నీ జ్ఞాపకంలో దాచుకున్నాను.’’ చలంకు ప్రియమైన మిత్రులు నూర్ల కొద్దీ వుంటారు. కాని అంత మందిలో ఈ పుస్తకంలో చిత్రింపబడ్డ వాళ్లు 14 మంది మాత్రమే! మామూలు మనుషుల్లోనూ ప్రత్యేకమైన, అభిమానించదగ్గ, ఆరాధించదగ్గ సుగుణాల్ని దర్శించిన ద్రష్ట చలం.
ఘట్టమరాజు
99640 82076
Updated Date - 2023-09-11T00:25:34+05:30 IST