ఐన్‌స్టీన్: మనకు తెలియని మరిన్ని లోతులు..!
ABN, First Publish Date - 2023-07-29T01:19:42+05:30
క్రిస్టోఫర్ నోలన్ తీసిన Oppenheimer సినిమాను చూశాను. అణు శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రమది.
క్రిస్టోఫర్ నోలన్ తీసిన Oppenheimer సినిమాను చూశాను. అణు శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రమది. ఈ సినిమాలో పలు మార్లు కన్పించే మహా వైజ్ఞానికుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వలే ఓపెన్ హైమర్ కూడా యూదు మతస్థుడు. అమెరికా ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో చాలాకాలం పని చేశాడు. వివిధ అంశాలపై ఐన్‌స్టీన్‌తో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఆ మహాశాస్త్రవేత్తను ఓపెన్ హైమర్ అమితంగా అభిమానించేవాడు. 1965 డిసెంబర్‌లో పారిస్‌లోని యునెస్కో హౌజ్‌లో ప్రసంగిస్తూ విజ్ఞానశాస్త్ర పురోగతికి ఐన్‌స్టీన్ అందించిన తోడ్పాటును ప్రశంసించడమే కాకుండా ‘ఆయన ఒక గొప్ప మానవతావాది, విశాల హృదయం ఉన్న మనీషి’ అని ఓపెన్ హైమర్ ప్రస్తుతించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: ‘మానవాళి సమస్యలపట్ల ఐన్‌స్టీన్ దృక్పథాన్ని ఒక్కమాటలో వర్ణించాలంటే సంస్కృత పదం ‘అహింస’ను ఎంచుకుంటాను’.
ఇరవయో శతాబ్ది వైజ్ఞానిక, సాంకేతికత విప్లవాల మూలపురుషులలో ఐన్‌స్టీన్ అగ్రగామి. విజ్ఞానశాస్త్రంలోనే కాకుండా ప్రపంచ వ్యవహారాలలో ప్రగాఢ ఆసక్తి ఉన్న శాస్త్రవేత్త ఆయన. శాస్త్రీయ సంగీతంలో ప్రగాఢ అనురక్తి ఉండడమే కాదు, వయలిన్‌పై సరిగమలను పలికించడంలో నిష్ణాతుడు కూడా. తన కాలం జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను ఆయన నిశితంగా గమనించేవారు. వివిధ విషయాలపై ఆయనకు సునిశ్చిత అభిప్రాయాలు ఉండేవి. అవి ఆయన సమకాలికులకే కాదు, నేటికీ స్ఫూర్తిదాయకమైనవే.
శాస్త్రవేత్తగా ఐన్‌స్టీన్ గురించి మాట్లాడగలిగే అర్హతలు నాకు లేవు. అయితే ఒక నైతిక చింతకుడుగా ఐన్‌స్టీన్ గురించి ఈ వ్యాసంలో రాయదలుచుకున్నాను. జర్మన్–అమెరికన్ చరిత్రకారుడు ఫ్రిట్జ్ రిచర్డ్ స్టెర్న్ (1926– 2016) పుస్తకం Einstein's German World అధ్యయనం ఆధారంగా నా ఆలోచనలను చెప్పదలుచుకున్నాను. 1999లో తొలుత ప్రచురితమైన ఈ పుస్తకం ఇరవయో శతాబ్దిలో జర్మనీ చరిత్రను, ముఖ్యంగా ఆ చరిత్రలో యూదుల స్థానాన్ని విస్తృతంగా చర్చించింది. తన తల్లిదండ్రులకు ఐన్‌స్టీన్ స్నేహితుడు కావడం కూడా స్టెర్న్‌ను ఈ పుస్తక రచనకు ప్రేరేపించింది. రాజకీయాలు, నైతిక అంశాలపై ఐన్‌స్టీన్ వ్యాఖ్యలు కొన్నిటిని ఈ వ్యాసంలో సవ్యాఖ్యానంతో ఉటంకిస్తాను.
1901లో యువ ఐన్‌స్టీన్ ఇలా ఉద్ఘాటించారు: ‘అత్యంత ప్రామాణికంగా పరిగణిస్తున్న విషయాన్ని, ఒక వ్యక్తి సాధికారతను గుడ్డిగా విశ్వసించడం సత్యానికి మహా చెడ్డ శత్రువు అవుతుంది’. వైజ్ఞానిక పరిశోధనా వ్యవస్థలను దృష్టిలో ఉంచుకునే ఆయన ప్రధానంగా ఈ వ్యాఖ్య చేశారని భావించవచ్చు. అయితే తరుణ వయస్కులు తమ తల్లిదండ్రుల మాటను అనుసరించడం అన్ని వేళల ప్రయోజనకరంగా ఉండక పోవచ్చు. అలాగే అన్ని కాలాలలోనూ, సమస్త దేశాలలోనూ సకల స్త్రీ పురుషులు తమ రాజకీయ అధినేతలను విశ్వసించడం పరిపాటిగా ఉన్నది. ఇది చాలవరకు అనాలోచితమని మరి చెప్పనవసరం లేదు. తమ పాలకుల మాటను తుచ తప్పకుండా పాటించమనడం వివేకవంతమైన సలహా కాబోదు.
జర్మన్ సామ్రాజ్యంలో జన్మించిన ఐన్‌స్టీన్ తన కౌమార దశలో స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. జూరిఖ్ నగరంలో ఆయన తొలి వైజ్ఞానిక పరిశోధన కృషి జరిగింది. 1913లో మూడు పదుల వయస్సులో ఉండగా శ్రేయోభిలాషులు నచ్చజెప్పిన మీదట జర్మనీ రాజధాని, జర్మన్ వైజ్ఞానిక పరిశోధనలకు కేంద్రమయిన బెర్లిన్ నగరానికి వెళ్లడానికి ఐన్‌స్టీన్ అంగీకరించారు. బెర్లిన్‌లో తన కొత్త వైజ్ఞానిక సహచరులను ఆయన బాగా ఇష్టపడ్డారు. అయితే జర్మన్ ప్రజల ఆచార బద్ధత, పితృభూమిపట్ల అవిమర్శనాత్మక అంకిత భావం ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు. 1914 జనవరిలో ఆయన ఇలా రాశారు: ‘స్వేచ్ఛా చింతన, భావాలను నిస్సంకోచడంగా వ్యక్తీకరించడం జర్మన్ స్వభావానికి విరుద్ధ లక్షణంగా కనిపిస్తుంది’. అదేకాలంలో ఆయన జర్మన్ల స్వాభావిక దాస్య ప్రవృత్తి గురించి కూడా నిష్కర్షగా మాట్లాడారు (ఈ వ్యాఖ్యలు వర్తమాన భారతదేశ పరిస్థితులకు, భారతీయులకూ వర్తిస్తాయి). మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత జర్మన్ సమాజంలో యుద్ధోన్మాదం పెచ్చరిల్లిపోవడం ఐన్‌స్టీన్‌ను కలవరపరిచింది. ‘అధికార దాహం, పేరాశతో పాటు విద్వేషం, కలహశీలత మొదలైనవి అసహ్యకరమైన అవగుణాలుగా పరిగణించాలని జర్మన్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. క్రైస్తవులమని ఘనంగా చాటుకునే జర్మన్ల జీవితాచరణలు క్రైస్తవ ధర్మాలు, విలువలకు విరుద్ధంగా ఉండడాన్ని ఆయన గర్హించారు. ‘కీర్తనలతో కాకుండా కార్యాచరణలతో జీసస్‌ను గౌరవించాలని ఆయన సూచించారు.
యుద్ధంపై మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పాలని 1915లో బెర్లిన్‌లోని కళాకారుల, శాస్త్రవేత్తల వేదిక ‘గ్యోథేబండ్’ కోరగా ఐన్‌స్టీన్ తన సమాధానంలో ఇలా పేర్కొన్నారు: ‘యుద్ధం మానసిక మూలాలు పురుష ప్రాణి దౌర్జన్యకర ప్రవర్తనలో జైవికంగా ఉన్నాయి’. పురుష ప్రవృత్తిలోని హింసాత్మక స్వభావం కేవలం దేశాల మధ్య యుద్ధాలలోనే కాదు, వర్తమాన భారతదేశంలో మతం లేదా రాజకీయాల పేరిట సంభవిస్తున్న హింసాకాండలో యువకులే ముందుండడంలేదూ?
స్విస్–ఫ్రెంచ్ నవలా రచయిత రోమా రోలా (మహాత్మాగాంధీ, గురుదేవ్ రవీంద్రుడికి కూడా ఈయన సన్నిహిత మిత్రుడు)కు 1917 ఆగస్టులో రాసిన ఒక లేఖలో ఐన్‌స్టీన్ ఇలా పేర్కొన్నారు : ‘19వ శతాబ్ది తుది దశాబ్దాలలో జర్మనీ సాధించిన సైనిక విజయాలు జర్మన్ ప్రజలలో అధికారంలో ప్రగాఢ మతాభినివేశంతో కూడిన విశ్వాసాన్ని పాదుకొల్పాయి. విద్యాధికులలో కూడా ఇటువంటి విశ్వాసాలు దృఢంగా ఉన్నాయి. ఈ కారణంగా గోథే–షిల్లర్ కాలం నాటి ఆదర్శాలకు గౌరవాదరాలు పూర్తిగా లుప్తమైపోయాయి’. ఈ విషయంలోనూ వర్తమాన భారతదేశంలో సమాంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార ప్రాభవంతో చెలరేగిపోతున్న హిందూత్వ భావజాలం టాగోర్–గాంధీ యుగ విలువలు, సంప్రదాయాలను సమాజ జీవితం నుంచి చాలవరకు తుడిచిపెట్టింది.
‘జాతీయవాద సంకుచితత్వం ఏ రూపంలో ఉన్నా ఐన్‌స్టీన్ అసహ్యించుకునేవాడు’ అని ఫ్రిట్జ్ స్టెర్న్ వ్యాఖ్యానించాడు. అయితే, ఐరోపాలో అనుక్షణం నానా వేధింపులు, శిక్షల నెదుర్కొంటున్న యూదులు తమకొక సొంత దేశం కోసం ఆరాటపడడం న్యాయసమ్మతమేనని ఆయన విశ్వసించారు. ఆ కారణంగానే పాలస్తీనాకు యూదుల వలసలను ఐన్‌స్టీన్ సమర్థించారు. ‘మన మతస్థులు, పరాయివారుగా పరిగణింపబడని ఒక చిన్న, సొంత ప్రాంతం ఈ భూమిపై ఉండాలి’ అని ఆయన అన్నారు. ఈ దృక్కోణంలో ఐన్‌స్టీన్ ఒక జియోనిస్ట్. మధ్యాసియాలో ఒక యూదు రాజ్యం సృష్టిని ఆయన సంపూర్ణంగా ఆమోదించారు.
అయిత ఆ యూదు రాజ్య పౌరులు జర్మన్లవలే స్వార్థపరులుగాను, సంకుచితపరులుగాను ఉండకూడదని ఆయన ఆశించారు. 1919 అక్టోబర్‌లో ఆయనిలా రాశారు: ‘తన సొంత సామాజిక వర్గ ప్రయోజనాలను ఉపేక్షించకుండానే ఒకరు అంతర్జాతీయ దృక్పథాన్ని కలిగ ఉండవచ్చు’ (ఈ సూత్రీకరణ రవీంద్రుని దృక్పథానికి భిన్నమైనది కాదు. సమ్మిళిత, శ్రుతి మించని జాతీయవాదాన్ని, ప్రపంచం పట్ల దాపరికం లేని స్వభావంతో మిళితం చేసేందుకు గురుదేవ్ టాగోర్ కూడా ప్రయత్నించారు).
ఐన్‌స్టీన్ కాలంలోని పెట్టుబడిదారీ సమాజం (ప్రముఖ రచయిత్రి ఆయాన్ రాండ్ అన్నట్లుగా) స్వార్థపరత్వాన్ని ఒక సుగుణంగా భావించేది. అయితే ఐన్‌స్టీన్, స్వార్థరాహిత్యాన్ని మాత్రమే ఒక సుగుణంగా భావించేవారు. మన సంప్రదాయం చెప్పినట్లు నిష్కామ కర్మ చేసేందుకు ఆయన సదా ప్రయత్నిస్తుండేవారు. జాత్యహంకారాన్ని, మూఢ దేశభక్తిని ఐన్‌స్టీన్ వ్యతిరేకించేవారు. ఆత్మస్తుతి పరాయణత్వం ఆయనలో ఏ మాత్రం ఉండేది కాదు. 1954లో ప్రిన్సిటన్‌లో సహ భౌతిక శాస్త్రవేత్త రుడాల్ప్ లేడెన్ బర్గ్ అంత్యక్రియల సమయంలో ఐన్‌స్టీన్ వెలువరించిన ఉపన్యాసంలో ఆయన జీవన తాత్వికత చక్కగా వ్యక్తమయింది. ‘మానవ అస్తిత్వం క్లుప్తమైది. ఒక కొత్త గృహంలోకి ఇలా వచ్చి అలా పోవడం లాంటిది మానవ జీవితం. నేను అనే కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ఈ నేను, నీవుకు, మనంకు మారినప్పుడు మాత్రమే మన జీవితాలు సార్థకమవుతాయి. అయితే నేను నుంచి నీవుకు తీసుకువెళ్లే వారథి సూక్ష్మమైనది, అనిశ్చితమైనది. ఒక వ్యక్తుల బృందం మనంగా మారినప్పుడే మానవులు చేరగల అత్యున్నత శిఖరాలను చేరగలగడం సాధ్యమవుతుంది’.
ఈ వ్యాసాన్ని ఐన్‌స్టీన్‌తో కాకుండా Einstein's German World రచయిత ఫ్రిట్జ్ రిచర్డ్ స్టెర్న్ మాటలతో ముగించదలిచాను. నాజీ జర్మనీ నుంచి అమెరికాకు వలసపోయిన ఈ చరిత్రకారుడు విద్వేషం, హింసాకాండతో పంకిలమైన తన కాలం చరిత్రను పర్యాలోచన చేస్తూ ఇలా వ్యాఖ్యానించాడు:
‘వివేకశీలుర క్రియారాహిత్యం చేసే హాని నుంచి ఏ దేశమూ, ఏ సమాజమూ తప్పించుకోలేదు. ఇరవయో శతాబ్ది జర్మనీ చరిత్ర మనందరికీ నేర్పిన విలువైన పాఠమది’.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Updated Date - 2023-07-29T01:20:13+05:30 IST