ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహింసా ప్రవక్త ఆకుపచ్చని ఆలోచనలు

ABN, First Publish Date - 2023-06-03T02:15:57+05:30

మన మహాత్ముడు అహింసా ధర్మ ప్రవక్త మాత్రమే కాదు, హరిత ద్రష్ట కూడా. ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం గాంధీజీ రచనల సంకలనం ‘ఇండస్ట్రియలైజ్ – అండ్ పెరిష్’ చదువుతుండగా అందులోని కొన్ని వ్యాఖ్యలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన మహాత్ముడు అహింసా ధర్మ ప్రవక్త మాత్రమే కాదు, హరిత ద్రష్ట కూడా. ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం గాంధీజీ రచనల సంకలనం ‘ఇండస్ట్రియలైజ్ – అండ్ పెరిష్’ చదువుతుండగా అందులోని కొన్ని వ్యాఖ్యలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ‘పాశ్చాత్య ప్రపంచం వలే పారిశ్రామికీకరణకు భారత్ పూనుకోవడాన్ని భగవంతుడు అడ్డుకోవాలి. ఒక చిన్న ద్వీప రాజ్య (ఇంగ్లాండ్) ఆర్థిక సామ్రాజ్యవాదం శృంఖలాలలో ప్రపంచం నేడు నలిగిపోతోంది. ముప్పై కోట్ల మందికి పైగా జనాభా ఉన్న ఒక దేశం ఇంగ్లాండ్ తరహా ఆర్థిక దోపిడీకి పూనుకుంటే అది ప్రపంచంపై మిడతల దండు దాడే అవుతుంది’ (ఈ వ్యాఖ్యలు తొలుత 20, డిసెంబర్, 1928 ‘యంగ్ ఇండియా’ సంచికలో ప్రచురితమయ్యాయి). పర్యావరణ ఉద్యమాల వెలుగులో ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే అవి మరింతగా అర్థమవుతాయి. సహజవనరుల సాంద్ర, ఇంధన సాంద్ర పారిశ్రామికాభివృద్ధి విపరీత పోకడలకు వ్యతిరేకంగా గాంధీ చేసిన హెచ్చరికే ఆ వ్యాఖ్యల సారాంశం.

మనుషుల దురాశా తత్వ విమర్శకుడుగా, వికేంద్రీకృత, గ్రామ–కేంద్రిత (తత్కారణంగా తక్కువ విధ్వంసకరమైన) ఆర్థిక వ్యవస్థ ప్రతిపాదకుడుగా, హానికరమైన, వినాశకరమైన ప్రభుత్వ విధానాలపై అహింసాయుత పద్ధతులలో పోరాట పథనిర్ణేతగా గాంధీ తమకు స్ఫూర్తిప్రదాత అని పర్యావరణ ఉద్యమాలు నొక్కి చెప్పుతున్నాయి. మన దేశ ప్రజలలో పర్యావరణ చైతన్యాన్ని రగిలించి, పెంపొందించిన చిప్కో, నర్మదా బచావో ఉద్యమాలను నిర్వహించిన వ్యక్తులు గాంధేయవాదులే. ఆలోచనలోనూ, కార్యాచరణలోనూ తాము గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తున్నామని వారు స్వయంగా చెప్పుకున్నారు. పాశ్చాత్య పర్యావరణ వేత్తలు మహాత్ముడిని తమ మార్గదర్శిగా అంగీకరించారు. ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ అని ఘోషించిన ఆర్థికవేత్త ఇ.ఎఫ్ షూమాకర్ (1911–77) జర్మన్ గ్రీన్ పార్టీ సైద్ధాంతికవేత్తలు గాంధీ హరిత వివేచన ప్రభావితులే. కాలానికి ముందే ప్రభవించిన పర్యావరణవేత్తగా గాంధీజీ విశిష్టతను ధ్రువీకరించి, దృఢపరచడమే నా యీ వ్యాస లక్ష్యం. ఇందులో భాగంగా, మన ప్రస్తుత ఆందోళనలను ఎంతో ముందుగానే ఊహించిన ఆయన ఆలోచనలలోని కొన్ని ఇతర అంశాలను ప్రస్తావించదలుచుకున్నాను. మరీ ముఖ్యంగా వృక్షజాలం ప్రాముఖ్యత, ధరిత్రికి ఆకుపచ్చ ఆచ్ఛాదనం ఆవశ్యకత గురించి ఆయన చేసిన (ఎవరికీ పెద్దగా తెలియని) కొన్ని వ్యాఖ్యలను విపులంగా ప్రస్తావిస్తాను.

1925 డిసెంబర్‌లో గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి గాంధీ వెళ్లారు. అదొక ఎడారి సీమ. ఆయన ఆతిథేయి జయకృష్ణ ఇంద్రాజీ (‘గుజరాత్ రత్నం’గా ఇంద్రాజీని గాంధీ అభివర్ణించారు). 1849లో జన్మించిన జయకృష్ణ స్వీయ శిక్షణతో రూపొందిన వృక్ష శాస్త్రవేత్త. పోర్‌బందర్ సంస్థాన ఉద్యోగి (ఇదే సంస్థానాధిపతులకు గాంధీ పూర్వీకులు కూడా తమ సేవలందించారు). ధరిత్రికి అద్భుత శోభను సమకూర్చే వృక్ష సంపదపై భారతీయులలో ఆసక్తి కొరవడడం గాంధీజీ మిత్రునికి ఆశ్చర్యం గొలిపింది. ఆయన ఇలా వ్యాఖ్యానించారు: ‘ఈ దేశంలోని అపార, వైవిధ్య పూరితమైన వృక్ష జగత్తు గురించి యూరోపియన్లు విపులంగా రాశారు. మరి నా దేశస్తులకేమో తమ గృహావరణంలోని మొక్కల గురించి గానీ తమ కాళ్లకింద నలిగిపోతున్న గడ్డి మొక్కల గురించి తెలిసింది దాదాపుగా పూజ్యం’.

జయకృష్ణ ఆతిథ్యంలో గడిపిన అనంతరం గాంధీ ఇలా రాశారు: ‘బర్డా కొండ ప్రాంతాల్లోని ప్రతీ చెట్టు గురించీ, ప్రతీ ఆకు గురించి జయకృష్ణకు బాగా తెలుసు. మొక్కల పెంపకంలో ఆయనకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఆ కార్యక్రమానికి ఆయన అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మొక్కలను నాటి పెంచడం ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆయన విశ్వసిస్తున్నారు ఈ విషయంలో ఆయన ఉత్సాహం, నమ్మకం అపూర్వమైనవి. ఆయన సహచర్యంలో అవి నాకూ సంక్రమించాయి’.

జయకృష్ణ ఒక అందమైన ప్రదేశంలో గాంధీ చేత ఒక మొక్కను నాటించారు. ‘ఇదే కచ్‌లో నేను నిర్వహించిన ఆనందదాయకమైన, ప్రయోజనకరమైన పని’ అని మహాత్ముడు రాశారు. జయకృష్ణ చేస్తున్న కృషి గాంధీకి దక్షిణాఫ్రికా పట్టణం ఒక దానిలో తాను స్వయంగా చూసిన మార్పులను జ్ఞప్తికి తెచ్చింది. మహాత్ముడు ఇలా రాశారు: ‘జోహాన్నెస్‌బర్గ్ కూడా ఇటువంటి ప్రాంతమే. అక్కడ ఒకప్పుడు గడ్డి మినహా ఏమీ పెరిగేది కాదు. అక్కడ ఒక భవనం కూడా ఉండేది కాదు. నలభై ఏళ్ల వ్యవధిలో అదొక స్వర్ణనగరంగా అభివృద్ధి చెందింది. అంతకు ముందు ఒక బకెట్ నీటి కోసం పన్నెండు అణాలు చెల్లించేవారు. కొన్ని సందర్భాలలో సోడా –నీటినీ కొనుక్కునేవారు. సోడా నీటితోనే తమ ముఖాలు, చేతులు కడుక్కునే సందర్భాలు కూడా ఉండేవి. ఇప్పుడు అక్కడ నీరు ఉన్నది, చెట్లు ఉన్నాయి. బంగారు గనుల యజమానులు మొదటి నుంచీ ఆ ప్రాంతాన్ని హరిత ప్రదేశంగా అభివృద్ధిపరిచేందుకు ప్రాధాన్యమిచ్చారు. దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి నాటి, పెంచిన మొక్కలతో అక్కడ వర్షపాతం కూడా పెరిగింది. అడవులను నరికివేసిన చోట వర్షపాతం తగ్గడమూ, అడవులను అభివృద్ధిపరిచిన చోట వర్షపాతం పెరగడమూ సహజ ఉదంతాలు కదా’.

కొన్ని సంవత్సరాల అనంతరం సబర్మతీ ఆశ్రమంలో ఒక రోజు రాత్రి గాంధీ కోరికపై తుమ్మ చెట్టు కొమ్మలను తీసుకువచ్చారు. ‘వాటి చిన్ని ఆకులు అన్నీ నిద్రపోతున్నాయి’ అని మహాత్ముని శిష్యురాలు మీరా బెన్ వ్యాఖ్యానించారు. దానిపై గాంధీ ఇలా ప్రతిస్పందించారు: ‘చెట్లు కూడా మనలాంటి ప్రాణులే. మన మాదిరిగానే అవీ ఊపిరి పీలుస్తాయి, ఆహారం తింటాయి, నీళ్లు తాగుతాయి. మన మాదిరిగానే వాటికి కూడా నిద్ర పోవలసిన అవసరం ఉన్నది. రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటున్న చెట్టు కొమ్మలు నరికి వేసి వాటి ఆకులు తెంచుకోవడం చాలా క్రూరమైన పని’. అలా రాత్రిపూట విశ్రమిస్తున్న చెట్టు కొమ్మలను తీసుకురావడం గాంధీకి చాలా బాధ కలిగించిందని మీరా బెన్ రాశారు. ఇంకా ఈ విషయమై ఇంగ్లీష్, గుజరాతీ భాషలలో ఏక కాలంలో ప్రచురితమైన ఒక వ్యాసంలో గాంధీ ఇలా రాశారు: ‘కసాయివాడు కూడా కొంత మేరకు మానవీయ దృష్టితో వ్యవహరిస్తాడు. గొర్రె మాంసం తినడానికి ఇష్టపడే వ్యక్తి రాత్రిపూట నిద్రపోతున్న గొర్రెల మందను సంహరించడు. జంతువులు గానీ, మొక్కలు గానీ సృష్టిలోని ప్రాణులు అన్నిటి పట్ల మనం సమదృష్టితో వ్యవహరించాలి. కేవలం తన ఆనందానికే ప్రాధాన్యమిచ్చి, ఇతర ప్రాణుల శ్రేయస్సును పట్టించుకోనివాడు మనిషి కాడు. ఆలోచనారహితుడు’.

సహజ వనరుల వినియోగంలో సంయమనం అవసరమని స్పష్టం చేసిన తరువాత భారతీయ సంస్కృతిలో చెట్టూ చేమకు గల సమున్నత స్థానాన్ని గాంధీ ప్రశంసించారు. ఆయన ఇలా రాశారు: ‘వృక్షాలు, ఇతర చైతన్యశీల జీవులను పరిపూర్ణంగా గౌరవించే తత్వాన్ని భారతీయులు అలవరచుకున్నారు. అడవిలోని ప్రతీ చెట్టు వద్దకు వెళ్లి దమయంతి తన బాధను చెప్పుకున్న తీరును కవి వర్ణించాడు. శకుంతలకు పూల మొక్కలు, ఫల వృక్షాలే కాదు పక్షులు, జంతువులు కూడా ఆత్మీయ నేస్తాలే. అత్తవారింటికి వెళ్లే సందర్భంలో వాటినుంచి దూరమవుతున్నందుకు ఆమె ఎంతగా పరితపించిందో కాళిదాస మహాకవి హృద్యంగా అభివర్ణించాడు’. ఈ సందర్భంగా, చెట్ల ప్రాధాన్యాన్ని వివరిస్తూ నవీన పర్యావరణవేత్త ఒకరు అన్న మాటలను పేర్కొనడం సముచితంగా ఉంటుంది. ‘వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువును వేరుచేసే సామర్థ్యం వృక్షాలకు స్వతస్సిద్ధమైనది. అలా వేరుచేసిన ఆ వాయువును అవి తమ దారువుల్లో దాచిపెడతాయి. వాతావరణ విపత్తు నెదుర్కొనే సులభ, సుసాధ్య మార్గం వృక్షాలే’ అని ఆ పర్యావరణవేత్త అనడం గమనార్హం. మానవాళి విచక్షణారహిత కార్యకలాపాల వల్లే భూమి అంతకంతకూ వేడెక్కిపోతోందని, వాతావరణంలో విపత్కర మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు కనుగొనడానికి దశాబ్దాలకు పూర్వమే పర్యావరణ పరిరక్షణ విషయమై మహాత్మాగాంధీ మన సమాజాన్ని జాగృతం చేశారు. మొక్కలు విరివిగా నాటి, మన భూమికి పచ్చని ఆచ్ఛాదనం కల్పించాలని ఆయన నొక్కి చెప్పారు. ‘మనం నాటిన మొక్కలు మహా మానులై మనకు నీడ, ఆశ్రయాన్ని ఇస్తాయి. భూమిని సారవంతంగా ఉంచేందుకు, జలవనరుల సంరక్షణకు తోడ్పడతాయి. అంతకంటే ముఖ్యంగా మానవేతర ప్రాణుల శ్రేయస్సు పట్ల మన శ్రద్ధాసక్తులకు అవి తార్కాణాలుగా ఉంటాయని’ మహాత్ముడు రాశారు. పర్యావరణ సంక్షోభంతో సతమతమవుతున్న మనకు, గాంధీ ఆనాడే విన్పించిన హరిత వాణి ఆశ్చర్యం గొల్పడమేకాదు, ధరిత్రీరక్షణకై కార్యాచరణకు మనలను పురిగొల్పుతుంది.

మరి రెండు రోజుల్లో (జూన్ 5న) ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ను మనం జరుపుకోనున్నాం. ఆ రోజునే కాదు, ఏడాది పొడుగునా ప్రతీ రోజు గాంధీజీ జ్ఞానదాయక మాటలు, మేలుకొలిపే హెచ్చరికలను మనం తప్పక మననం చేసుకోవాలి. రాజకీయ వివాదాలను పరిష్కరించడంలో అహింసా పథాన్ని అనుసరించిన ఉదాత్తుడుగా, మత సామరస్యానికి మనసా, వాచా, కర్మణా నిబద్ధుడైన మహాత్ముడుగా, అంటరానితనం నిర్మూలనకు పోరాడిన ధార్మికుడుగా విఖ్యాతుడైన గాంధీజీ వారసత్వం నేడు మానవాళిని కలవరపరుస్తోన్న వాతావరణ విపత్తులను అరికట్టడంలో కూడా అనేక విధాలుగా తోడ్పడగలదనడంలో సందేహం లేదు.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-06-03T02:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising