అధికార అతిశయంలో నరేంద్ర మోదీ
ABN, First Publish Date - 2023-03-11T02:25:57+05:30
అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్ –శ్రీలంక మధ్య 2009 నవంబర్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది.
అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్ –శ్రీలంక మధ్య 2009 నవంబర్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దశాబ్దాలను అప్పుడే పూర్తి చేసుకున్న రోజులవి. అప్పటికి రెండు నెలల క్రితమే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. సచిన్‌ను సత్కరించాలని జీసీఏ నిర్ణయించింది. మోదీ స్వయంగా ఆయన్ని సన్మానించారు. నాటి టెస్ట్ మ్యాచ్‌ను, సచిన్ అభినందన కార్యక్రమాన్ని నేను టీవీలో చూశాను. ఆ క్రికెట్ యోధుడికి ముఖ్యమంత్రి ఒక జ్ఞాపిక బహూకరించారు.
2009లో మోదీ కంటే సచిన్ చాలా ప్రఖ్యాతుడు. ఆ సేతు శీతాచలం ఇంటింటా ఆయన సుపరిచితుడు. మరింత ప్రచారం కోసం సచిన్‌తో ఏదో ఒక విధంగా సంబంధం కలిగివుండటానికి పలువురు ఆరాటపడేవారు. నాలుగు సంవత్సరాలు ముందుకు సాగుదాం. ప్రధానమంత్రి అయ్యేందుకు అక్టోబర్ 2013లో మోదీ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందుకు ఆయన, క్రికెట్ దిగ్గజంతో కాకుండా కీర్తిశేషుడయిన ఒక మహా రాజనీతిజ్ఞుడితో అనుబంధాన్ని నిర్మించుకోసాగారు. అందులో భాగంగానే నర్మదా నదీ తీరాన సర్దార్ పటేల్ బృహత్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మోదీ సంకల్పించారు. 2014 సార్వత్రక ఎన్నిల ప్రచారంలో పటేల్ విగ్రహ ప్రతిష్ఠాపన గురించి పదే పదే ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పండిట్ నెహ్రూకు బదులుగా సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయివుంటే దేశ పరిస్థితులు మరింత మెరుగ్గా ఉండేవని ఆ ఎన్నికల ప్రచారంలో మోదీ పదే పదే చెప్పారు.
2009లో సచిన్ టెండూల్కర్‌తో సంబంధం కలిగివుండడం నరేంద్ర మోదీకి అవసరమయింది. 2013–14లో సర్దార్ పటేల్‌ను ఆవాహన చేసుకోవల్సిన అవసరం మోదీకి ఏర్పడింది. అక్కడ నుంచి ఏడు సంవత్సరాలు ముందుకు వెళదాం. మార్చి 2021. అప్పటికి నరేంద్ర మోదీ మన దేశానికి ఏడేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. 2014–21 సంవత్సరాల మధ్య రెండు సార్వత్రక ఎన్నికలలోను, మరెన్నో శాసనసభ ఎన్నికలలోను భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన విజయాలను మోదీ సాధించారు. దరిమిలా మోదీ అజేయుడుగా ప్రజల మనస్సుల్లో ముద్రపడ్డారు.
సచిన్ టెండూల్కర్‌కు నరేంద్ర మోదీ ఒక జ్ఞాపికను బహూకరించడాన్ని వీక్షించిన పదకొండున్నర సంవత్సరాల అనంతరం సర్దార్ పటేల్ స్డేడియంలోనే మరో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవడాన్ని చూశాను. ఆ స్టేడియం ఇంకెంత మాత్రం సర్దార్ పటేల్ స్టేడియం కానేకాదు. ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియా ఆడిన ఆ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవడానికి ముందు మన గౌరవనీయ రాష్ట్ర్పతి ఆ స్టేడియంలో ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు మోదీ ఆరాధిస్తుండే మహా నాయకుడి పేరున ఉన్న ఆ స్టేడియంకు పునః నామకరణం చేసిన సందర్భంగా ఆ ఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆ స్డేడియంకు నరేంద్ర మోదీ పేరుతో పునః నామకరణం చేస్తున్నట్టు ఆ ఫలకంపై ఉన్నది!
ఒక క్రీడాంగణం (స్పోర్ట్స్ స్టేడియం)కు అధికారంలో ఉండగానే తన పేరుతో పునః నామకరణం చేయించడం ద్వారా స్టాలిన్ హిట్లర్, ముస్సోలిని, సద్దాం హుస్సేన్, గడాఫీల సరసన మోదీ స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రి అభిలషించాల్సిన నాయకత్వ ప్రశస్తి అది కాదని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. మోదీ మాత్రం తనకు లభించిన గౌరవానికి ఎటువంటి ఇబ్బంది పడలేదు. గురువారం నాడు ఆయన అదే స్టేడియంలో మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించారు. తన పేరిట ఉన్న ఆ స్టేడియంలో, మన దేశంలో పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బన్సెతో కలిసి మోదీ ఒక టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించారు. టూరిన్ నగరంలో తన పేరిట నిర్మించిన స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముస్సోలినీ వీక్షించాడో లేదో నాకు తెలియదు. మాస్కోలో తన పేరు మీద ఉన్న స్టేడియంలో ఆటల పోటీలను స్టాలిన్ వీక్షించివుంటాడా? ఒక భారతీయ ప్రజాస్వామ్య వాదిగా మోదీ రాజకీయ ఎదుగుదలను అత్యంత ఆందోళనతో గమనిస్తూ వస్తున్నాను. గురువారం నాడు ఆయన వ్యవహరించిన తీరు క్రికెట్ అభిమానిగా నాకు ఎంతో మనస్తాపాన్ని కలిగించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధానమంత్రికి ఆయన అభిమానులు, ఆరాధకులు స్వాగతం చెప్పేందుకు వీలుగా జీసీఏ, మొదటి రోజు మ్యాచ్‌కు టిక్కెట్ల బహిరంగ అమ్మకాన్ని నిలిపివేసింది. రాజకీయ వర్గాల ద్వారా వాటిని పంపిణీ చేసే ఉద్దేశంతోనే జీసీఏ అలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నది.
ఒక స్నేహితుడు ఈ విషయమై నన్ను అప్రమత్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వెళ్లదలచుకున్నాడు. అయితే ప్రజలకు రెండో రోజు నుంచి మాత్రమే టిక్కెట్లు విక్రయిస్తారన్న విషయం తెలిసి ఆయన దిగ్భ్రాంతి చెందాడు. మొదటి రోజు మ్యాచ్‌కు టిక్కెట్లు లభ్యంకావని టిక్కెట్ల వెబ్‌సైట్‌లు స్పష్టంగా తెలిపాయి. అయితే ‘భక్త్ కోటా’లో తన పరిచయస్థుడు ఒకరికి టిక్కెట్ లభించినట్టు నా స్నేహితుడికి తెలిసింది. మొదటి రోజు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అభిమానులకు సైతం టిక్కెట్లు లభించలేదు. ‘దీంతో బోర్డర్– గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్‌ను చూసేందుకు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అనేక మందికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారని’ ఆస్ట్రేలియన్ విలేఖరి పీటర్ లలొర్ తమ ‘ది ఆస్ట్రేలియన్’ దినపత్రికలో రాశాడు. టిక్కెట్ల విషయమై ఆస్ట్రేలియా దౌత్యవేత్తలు బీసీసీఐతో సంప్రదింపులు జరపడంతో ఆ దేశం నుంచి వచ్చే వారికి వాటిని విక్రయించేందుకు ఒక ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. మరి దేశీయ క్రికెట్ అభిమానుల విషయమేమిటి? టిక్కెట్లు లభించక నిరాశకు లోనైన వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారి తరఫున లాబీ చేసేవారెవరూ లేరు.
భారతీయ క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాలలో తీవ్ర నిరసన తెలిపారు. దీంతో కొన్ని ఇతర టిక్కెట్లను హడావుడిగా విక్రయానికి పెట్టారు. అయితే చాలా పెద్ద సంఖ్యలో టిక్కెట్లను అనిర్ణీత వ్యక్తుల కోసం ‘రిజర్వ్’ చేశారు. జీసీఏ, బీసీసీఐ వ్యవహరించిన తీరుతెన్నులలో పిఎమ్– కేర్స్ వ్యవహారాలలో వలే గోప్యత ఎక్కువ. మొదటి రోజున మోదీ అభిమానగణానికి ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నది ఎవరు? ఎన్ని టిక్కెట్లను ప్రైవేట్‌గా పంపిణీ చేశారు? ఇత్యాది విషయాలపై ఎలాంటి సమాచారం తెలియడం లేదు. ఎందుకీ గోప్యత?
అహ్మదాబాద్‌లోని స్టేడియంలో 1,30,000 సీట్లు ఉన్నాయి. మన దేశంలో టెస్ట్ మ్యాచ్‌లకు హాజరయ్యేవారు మహా అయితే నలభై వేలకు మించరు. మొదటిరోజున మోదీ భక్త గణంతో స్టేడియం నిండిపోవాలని కోరుకోవడం మాత్రమే కాకుండా, ఒక టెస్ట్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్యలో ‘ప్రపంచ రికార్డు’ నెలకొల్పాలని కూడా నిర్వాహకులు ఆశించారని వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంలో ఇప్పటికి అతి పెద్ద ప్రపంచరికార్డు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు ఉన్నది. మన ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకునే కొన్ని ఇతర ‘ప్రపంచ రికార్డుల’ వలే ఈ ‘ప్రపంచ రికార్డు’ను కూడా తప్పుదోవలో నెలకొల్పేందుకు ప్రయత్నించారు. బీసీసీఐ వలే, క్రికెట్ ఆస్ట్రేలియా పాలకపక్ష రాజకీయవేత్తలకు అనుకూలంగా వ్యవహరించదు. ఎమ్‌సిజిలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రతీ ఒక్కరూ నిజమైన క్రికెట్ అభిమాని అయివుంటాడు. ఒక రాజకీయ ర్యాలీకి హాజరయ్యేందుకు అక్కడకు ఎవరూ రారు (అహ్మదాబాద్ స్టేడియం నుంచి మోదీ నిష్క్రమించిన వెంటనే అక్కడి జన సందోహం బాగా పలుచబడింది).
మోదీ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవడానికి చాలా రోజుల ముందే ప్రధానమంత్రి పోస్టర్లను ఏర్పాటు చేశారు. మ్యాచ్ ప్రారంభమవడానికి కొంచెం ముందు నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బన్సె ఒక చిన్న వాహనంలో ప్రేక్షకులకు అభివాదం తెలుపుతూ మైదానం అంతా కలయదిరిగారు. ప్రధానమంత్రికి, ఆయన అత్యంత సన్నిహిత రాజకీయ సహచరుడి కుమారుడు ఒక కానుక సమర్పించారు. అది నరేంద్ర మోదీ చిత్రం! నరేంద్ర మోదీ స్టేడియంలో నరేంద్ర మోదీ చిత్రాన్ని నరేంద్ర మోదీకి బహూకరించారు! మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రుల బొమ్మలు ఉన్న ఒక బోర్డును ప్రదర్శించడం జరిగింది. అందులో భారత ప్రధాని చాలా పొడుగ్గా ఉన్నట్టు కనిపించింది. నిజానికి ఆంథోనీ అల్బెన్సె కంటే మోదీ మూడు అంగుళాలు కురచగా ఉంటారు. ఈ మహా ఆడంబర పూర్వక స్వానురాగ ప్రదర్శనలో తాను ఒక అదనపు వ్యక్తిగా ఉండడంపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సంతోషిస్తున్నారా? మోదీ వ్యవహారశైలిపై ఆయన తన మనసులో ఏమనుకుంటున్నారనేది నాకు ఆశ్చర్యం గొలుపుతోంది.
నిజానికి ఈ టెస్ట్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు సరైన కారణం లేదు. క్రికెట్ విషయంలో కోల్‌కతా కంటే అహ్మదాబాద్ చాలా వెనుకబడిన నగరంగా చెప్పితీరాలి. గత మూడేళ్లుగా కోల్‌కతాలో ఒక్క టెస్ట్ మ్యాచ్‌నూ నిర్వహించలేదు. ఇండియా వెర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్‌లోని పైనల్ టెస్ట్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో కంటే ముంబై, చెన్నై, బెంగలూరు నగరాలలో ఏదో ఒక దానిలో నిర్వహించడమే సబబుగా ఉండేది. టిఎమ్‌సి పాలనలో ఉన్న కోల్‌కతాలో కానీ, డిఎమ్‌కె పాలనలో ఉన్న చెన్నైలో కానీ ఆ ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించి ఉంటే నరేంద్ర మోదీకి అహ్మదాబాద్‌లో లభించిన ఘనస్వాగతం లభించి ఉండేదికాదు. బీజేపీ పాలనలో ఉన్న ముంబై, బెంగలూరులో నిర్వహించినా మోదీ భక్త గణానికి అనుకూలంగా నిక్కమైన క్రికెట్ అభిమానులను వదిలివేయడం సాధ్యమయి ఉండేదికాదు. గుజరాత్‌లో మాత్రమే వ్యక్తి పూజ డిమాండ్లు సంతృప్తికరంగా నెరవేరడం సాధ్యమయింది. ఒకనాటి గొప్ప ఆట, ఇప్పుడు అవినీతితో నిండిపోయిన క్రికెట్ ద్వారా ఆ వ్యక్తిపూజ జరగడం ఎంత శోచనీయం!
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Updated Date - 2023-03-11T02:25:57+05:30 IST