ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నస్ర్‌ : నవీన పర్షియన్ భావయోధుడు

ABN, First Publish Date - 2023-11-18T02:42:13+05:30

పర్యావరణ సంక్షోభం విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయమై అనేక పుస్తకాలు వెలువడుతున్నాయి.

పర్యావరణ సంక్షోభం విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయమై అనేక పుస్తకాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కాలమ్‌లో నేను యాభై ఏళ్ల క్రితం ప్రచురితమైన ఒక పుస్తకం గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఇందులోని అంశాలు, ఆ పుస్తకం ప్రచురితమైన కాలానికి ఎంత ఉపయుక్తమైనవో, ఇప్పుడూ అంతే ప్రాసంగికతను కలిగివున్నాయి. పురాతన పర్షియన్ సంస్కృతీ విభవానికి వారసుడు అయిన సయ్యద్ హుస్సేన్ నస్ర్‌ (జననం 1933) రాసిన పుస్తకమది. ‘మ్యాన్ అండ్ నేచర్: ది స్పిరిచ్యుయల్ క్రైసిస్ ఆఫ్ మోడ్రన్ మ్యాన్’ అనేది ఆ పుస్తకం శీర్షిక. ఈ సుప్రసిద్ధ పుస్తకం రచనాకాలంలో నస్ర్‌, టెహ్రాన్ విశ్వ విద్యాలయంలో తత్వ శాస్త్ర ఆచార్యుడుగా ఉన్నారు. 90 ఏళ్ల నస్ర్‌ చాలా ఆసక్తిదాయకమైన, మేధో సంపన్న జీవితాన్ని గడిపారు. ఇరాన్‌లో ఒక పండిత కుటుంబంలో జన్మించిన నస్ర్ అమెరికాలోని మెస్సాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1958లో స్వదేశానికి తిరిగి వెళ్లారు. అమెరికా విశ్వవిద్యాలయాలలో ఆచార్యత్వం వహించడానికి వచ్చిన అవకాశాలను నిరాకరించి స్వదేశంలో బోధనకు ఆయన ప్రాధాన్యమిచ్చారు. తన ఆచార్యత్వంలో ఎంతో మంది యువ మేధావులకు మార్గదర్శకత్వం వహించారు.

‘మ్యాన్ అండ్ నేచర్’లో నస్ర్‌ ఇలా పేర్కొన్నారు: ‘ పర్యావరణ విధ్వంసం పట్ల పాశ్చాత్య ప్రజల అవగాహన పెరుగుతోంది. అయితే ఇదే ప్రజలు మరింత ‘అభివృద్ధి’ని సాధించాల్సిన ఆవశ్యకత గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రకృతిపై ఎటువంటి మినహాయింపులు లేని ఆధిపత్యాన్ని సాధించడం ద్వారా, మనిషి– ప్రకృతి మధ్య సమతౌల్యత విధ్వంసంతో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించుకోవాలని అంటున్నారు! సమస్య మూలాలను కొద్దిమంది మాత్రమే తరచి చూస్తున్నారు’.

1966 వేసవిలో షికాగో విశ్వవిద్యాలయంలో నస్ర్‌ వెలువరించిన ఉపన్యాసాల సంపుటే ‘మ్యాన్ అండ్ నేచర్’. పాశ్చాత్య, ముఖ్యంగా అమెరికా ప్రజలను దృష్టిలో పెట్టుకుని వెలువరించిన ఉపన్యాసాలవి. అయితే పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనాలను మనమూ అత్యుత్సాహంతో అనుసరిస్తున్నందున నస్ర్ హెచ్చరికలు మనకూ వర్తిస్తాయి. పర్యావరణ సంక్షోభ మూలాలు ఆధునిక మానవు‍ని భావ ప్రపంచంలో ఉన్నాయని ఈ ఇరానియన్ విజ్ఞుడు అభిప్రాయపడ్డారు. ప్రకృతిపై సాధించిన విజయాలు మనిషిని అహంకార పూరితుడిని చేశాయని, ప్రకృతి తనకు మనుగడ ప్రసాదించిందనే సత్యాన్ని విస్మరించాడని నస్ర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రకృతిపై ఆధిపత్యమే’ మితిమీరిన జనాభా పెరుగుదలకు, నగరాల నరకానికి, సమస్త సహజ వనరుల దోపిడీకి, ప్రాకృతిక శోభను చిదిమివేయడానికి కారణమయిందని నస్ర్‌ విపులీకరించారు.

మానవుడి శక్తి సామర్థ్యాలు అపరిమితమైనవని, అతడికి అసాధ్యమైనవి ఏవీ లేదనే తప్పుడు భావనకు ఆర్థిక శాస్త్రమే కారణమని నస్ర్‌ తప్పుపట్టారు. మనిషిని కేవలం అతడి భౌతిక అవససరాల పరంగా మాత్రమే పరిగణించడం వల్లే ఆర్థిక శాస్త్రం ఆ తప్పుడు భావనను సృష్టించిందని ఆయన అన్నారు. నైతిక, ఆధ్యాత్మిక సంయమన భావన నుంచి మనిషిని విడదీయడంలో ఆధునిక విజ్ఞానశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అన్నిటి కంటే ముందున్నాయని ఆయన అన్నారు. మన భౌతిక అవసరాలను తీర్చుకోవడానికే ప్రకృతి ఉన్నదని, దాని శ్రేయస్సు పట్ల ఎటువంటి బాధ్యత లేకుండా లబ్ధి పొందేందుకు మానవ సమాజాలను అవి ప్రోత్సహించాయని ఆయన అన్నారు. ప్రస్తుత పర్యావరణ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రకృతితో సహజీవనం నెరపడాన్ని మనం సరికొత్తగా నేర్చుకోవాలని ఆయన ఉద్భోదించారు. ప్రకృతికొక పవిత్రత ఉన్నదని, దానిని గుర్తించి గౌరవించి తీరాలని నస్ర్‌ స్పష్టం చేశారు.

‘మ్యాన్ అండ్ నేచర్’ తొలుత 1968లో ప్రచురితమయింది. నస్ర్‌ అప్పటికి ఇంకా టెహ్రాన్‌లోనే నివశిస్తున్నారు పదేళ్ల అనంతరం ఇస్లామిక్ మత ఛాందసవాదుల అఘాయిత్యాల కారణంగా ప్రవాసంలోకి వెళ్లడం ఆయనకి అనివార్యమైపోయింది. అమెరికాలో నస్ర్‌ తన జీవితాన్ని పునర్నిర్మించుకున్నారు. వివిధ విషయాలపై పలు పుస్తకాలు వెలువరించిన అనంతరం మళ్లీ ‘మాన్ అండ్ నేచర్’లోని అంశాలపై శ్రద్ధ చూపడం ప్రారంభించారు. ఆ క్రమంలో ఆయన 1996లో ‘రెలిజియన్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ నేచర్’ అన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆధునిక పాశ్చాత్య ప్రపంచంలో మత ప్రమేయం లేని మానవతావాద ప్రాదుర్భావం, ప్రాపంచిక మానవుని సర్వాధిపత్యం మానవాళి పురోగమనం, ప్రాకృతిక జగత్తు రెండిటికీ సంక్లిష్ట, సమస్యాత్మక పర్యవసానాలను సృష్టించిందనే సునిశ్చిత అభిప్రాయాన్ని ఈ పుస్తకంలో నస్ర్‌ వ్యక్తం చేశారు. ఎందుకీ పరిస్థితి ఏర్పడిందో కూడా ఆయన వివరించారు. ప్రకృతి, ప్రాకృతికశక్తులపై మానవుడు సాధించిన నియంత్రణకు మతపరమైన సంయమనం ఇంకెంత మాత్రం లేకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతిని ఒక పవిత్ర అస్తిత్వంగా పరిగణించే దృక్పథాన్ని నవీన మానవుడు విడనాడడంతో ప్రకృతి నుంచి ఆధునిక సమాజాలు పరాయీకరణ పొందాయని ఆయన పేర్కొన్నారు. జీవ చైతన్యానికి మూలాధారంగా కాక, కేవలం భౌతిక అవసరాలకు ఉపయోగించుకొనే ఒక ప్రాణరహిత పదార్థంగా మాత్రమే ప్రకృతిని మనిషి పరిగణించసాగాడని, పర్యవసానంగానే ఇప్పుడు మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడని నస్ర్‌ విశ్లేషించారు.

ప్రస్తుత పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించేందుకు విభిన్న మతాలు చేయగల సహాయాన్ని ‘రెలిజియన్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ నేచర్’లో నస్ర్‌ నిశితంగా సమీక్షించారు. ‘ప్రకృతి పవిత్రతను గౌరవించే ఉమ్మడి దృష్టికోణం ప్రాతిపదికన విచక్షణారహిత విధ్వంస హేల నుంచి ధరిత్రిని సంరక్షించేందుకు సకల మతాలు సంయుక్తంగా పూనుకోవడం ద్వారా తమను తాము పరస్పరం సమున్నతపరచుకునే శుభ పరిస్థితి ప్రభవించగలదనే’ ఆశాభావాన్ని నస్ర్‌ ఆ పుస్తకంలో వ్యక్తం చేశారు. ఈ దృక్కోణం, అధునాతన సాంకేతికతా ప్రావీణ్యుల ఆశావహ దృక్పథానికి విరుద్ధమైనది. సౌర శక్తి, పవన విద్యుత్తు, హైడ్రోజన్ మొదలైన సరికొత్త ఇంధన వనరుల అభివృద్ధి, శిలాజ ఇంధనాలతో కాకుండా విద్యుత్ బ్యాటరీలతో నడిచే ఆటోమోబైల్స్‌ను ఉపయోగించుకోవడం, కార్బన్ ఉద్గారాల నియంత్రణ, జియో–ఇంజనీరింగ్ మొదలైన వినూత్న వైజ్ఞానిక, సాంకేతిక ప్రక్రియలతో పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించవచ్చని ఈ నవీనులు విశ్వసిస్తున్నారు ‘ప్రపంచ ప్రాబల్య ఆర్థిక వ్యవస్థ (పెట్టుబడిదారీ విధానం అని చదువుకోండి) వాతావరణ మార్పు వైపరీత్యాలను నివారించి, మానవ ప్రగతి రథం అప్రతిహతంగా సాగిపోయేందుకు తప్పక దోహదం చేస్తుందనే’ నిండు విశ్వాసాన్ని ఇటీవల ప్రచురితమైన ‘క్లైమేట్ కేపిటలిజం’ అనే పుస్తకంలో ప్రపంచ అగ్రగామి టెక్ కుబేరులు వ్యక్తం చేశారు. ఇందుకు భిన్నంగా హానికర సాంకేతికతలు కాకుండా చెడ్డ భావాలు, పనికిమాలిన ఆలోచనలే పర్యావరణ సంక్షోభానికి మూల కారణమని ప్రొఫెసర్ నస్ర్‌ అభిప్రాయపడ్డారు. ‘మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంకట పరిస్థితులు చెడ్డ ఇంజినీరింగ్ వల్ల ఉత్పన్నమైనవి కానేకాదని, ప్రాకృతిక జగత్తుపట్ల వివేకశీల దృక్పథం కొరవడడమే అందుకు అసలు కారణమని’ ఆయన పేర్కొన్నారు. ఈ రెండు దృక్కోణాలు పాక్షికమైనవే అయినా వాటిని నేను కొంతవరకు సమర్థిస్తాను. పునరుద్ధరణీయ ఇంధన రంగంలో నవ కల్పనలను స్వాగతించాల్సి ఉన్నది. అలాగే ప్రకృతి పట్ల మరింత శ్రద్ధాపూర్వక దృక్పథాన్ని అవలంభించడం కూడా చాలా ముఖ్యం.

సహజ వనరులను అపారంగా హరిస్తున్న తమ విలాస జీవనశైలిని విడనాడకుండా వాతావరణ మార్పు విషమ పర్యవసానాలను అరికట్టగలమని ప్రపంచ కోటీశ్వరులు భావిస్తున్నారు. వర్తమాన ప్రపంచంలో మతం మానవుల మధ్య మైత్రీ భావానికి కాకుండా అనైక్యతలకు కారణమవుతున్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఈ ధరిత్రిపై నడయాడిన నిర్దిష్ట వ్యక్తులు తమ ధార్మిక విశ్వాసాల ప్రేరణతోనే హింస, యుద్ధాన్ని నివారించి సమష్టి శ్రేయస్సుకు తోడ్పడ్డారు. బుద్ధుడు, సెయింట్ ఫ్రాన్సిస్, మహాత్మా గాంధీ తమ మత ధర్మాల ఆలంబనతో పర్యావరణ హితకరమైన నైతిక జీవన సూత్రాలను సుప్రతిష్ఠితం చేశారు. అదే సమయంలో వ్యక్తుల మధ్య, సమాజాల మధ్య సహానుభూతిని పెంపొందించారు. నస్ర్‌ సైతం సాంకేతిక ప్రజ్ఞాపాటవాలు మరింత సమున్నత సంతోషప్రద జీవనశైలిని సమకూర్చగలవనేది తప్పుడు విశ్వాసం మాత్రమేనని అన్నారు. మనలో ఆధ్యాత్మిక మార్పు రావాలని సూచించారు. ప్రకృతిని గౌరవించడం, ప్రాకృతిక వనరులను వినియోగించుకోవడంలో సంయమనం పాటించడం, చిత్తశుద్ధితో మత ధర్మాలను అనుష్ఠించడం ద్వారానే మనలో ఆధ్యాత్మిక పరివర్తన వస్తుందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించేందుకు పరిపూర్ణ సంస్థాగత మార్పులు కూడా చాలా ముఖ్యమనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. మరింత వికేంద్రీకృత,

పారదర్శక, సరైన ప్రజాస్వామిక ప్రాతినిధ్య వ్యవస్థలు, పరిపాలనా విధానాలను అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరమున్నది.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-11-18T02:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising