ఆర్వెల్ జోస్యం నిజమైతే, ఎంత విషాదం!
ABN, First Publish Date - 2023-08-07T03:13:42+05:30
సాహిత్య పునర్మూల్యాంకనం పేరుతో మూలాన్ని సరిదిద్దటం, చరిత్రను తిరగరాయటం గురించి జార్జ్ ఆర్వెల్ భావనలను పేర్కొటూ నాగిని కందాళ రాసిన వ్యాసంలో (‘ఆర్వెల్ జోస్యం నిజమవుతోంది!’...
సాహిత్య పునర్మూల్యాంకనం పేరుతో మూలాన్ని సరిదిద్దటం, చరిత్రను తిరగరాయటం గురించి జార్జ్ ఆర్వెల్ భావనలను పేర్కొటూ నాగిని కందాళ రాసిన వ్యాసంలో (‘ఆర్వెల్ జోస్యం నిజమవుతోంది!’ - 17.07.2023) ఆమె వ్యక్తం చేసిన ఆందోళనను ఇప్పటి సందర్భంలో అర్థం చేసుకో వాల్సింది చాలా ఉంది. నేడు పసితనం చదువుల నుంచే చరిత్ర వక్రీకరణను చూస్తున్నాం. సంస్కృతి పేరున శాస్త్రీయ దృక్పథం స్థానే మతవాద, మితవాద ధోరణులుని వ్యాప్తి చేస్తున్నారు. దీనికి తోడు సాహిత్యంలో కూడా మూలంతో సంబంధం లేని మార్పులు చోటు చేసుకుంటే జరిగే నష్టం అపారం. మైథాలజీల నుంచి వర్తమాన సాహిత్యం దాకా చోటుచేసుకునే ఈ ‘ప్రక్షిప్తాల’ వల్ల మూలం ఏదో తెలియకపోయే ప్రమాదం ఉంది. ఒక రచనను మూల రచయిత అనుమతి లేకుండా సవరించడం అన్యాయం. రచయిత మరణానంతరం ఈ జోక్యం అనైతికం. ఏ రచననైనా అంగీకరించడం లేదా తిరస్కరించడం అన్నది అప్పటి సమాజం వివేకం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని ఈ ‘పోస్టుమార్టం’ సత్యాన్ని తలకిందులుచేసే కుట్ర మాత్రమే.
అసలు ‘1984’ నవలని ఆర్వెల్ ఎందుకు రాసాడు? కేవలం 46ఏళ్ళు జీవించిన ఆర్వెల్‌కు ఎదురైన చేదు అనుభవాలు ఏమిటి? ఈ నవలని ‘డిస్టోపియన్’ సాహి త్యంగా ఎందుకు పేర్కొన్నారు? ‘ఆర్వేలియన్’ అన్న మాటకు అర్థం ఏమిటి? ఆర్వేలియన్ అంటే ఒక విధంగా ప్రచారం ద్వారా పాలక వర్గం తాము కోరుకునే సమ్మతిని సాధించడం, నిఘా సంస్థల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేయడం, సత్యాన్ని అణగ దొక్కటం, చరిత్ర పునర్మూల్యాంకనం పేరిట తమ వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా తిరగరాయటం. దీన్ని వివరించేదే డిస్టోపియన్ సాహిత్యం. ఆర్వెల్ నవల ‘1984’ని దాని సారాంశాన్ని బట్టి డిస్టోపియన్ సాహిత్యం అన్నారు. 1984 నవల రాయడానికి ముందు ఆర్వెల్ 12ఏళ్ళ పాటు నిరంతర ప్రభుత్వ నిఘాలో ఉన్నాడు. దాంతో ఆయనలోని సోషలిస్టు భావాల పునాదులు కదిలిపోయాయి. రాసే, ఆలోచించే, మాట్లాడే, తిరుగాడే స్వేచ్ఛలేని బతుకు ఎంత దుర్భరమో ఆర్వెల్‌కి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అలానే నిరంకుశ పాలనలో భాష నిర్వహించే పాత్ర, దానిపట్ల పాలకవర్గాల సెన్సార్ విధానాలు ఎలా ఉంటాయో ఆర్వెల్‌కి అనుభవమయ్యాయి. ఇవాళ సోషలిస్టు ప్రభుత్వాలుగా చెప్పుకునే చోట్ల కూడా ఈ నియంత్రణల అమలును మనం చూస్తున్నాం. పోరాటకాలంలో వ్యక్తమయ్యే చైతన్యం, ఆ తదనంతర కాలంలో ఎందుకు గిడసబారి పోతుందో సమాజం ఆలోచించాలి.
వర్తమానంలో ప్రజాస్వామిక సంస్థలు కోరే స్వేచ్ఛపై కూడా ఎన్నో ఆంక్షలు, నియంత్రణలు పెడుతున్నారు. దీనికితోడు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తమ రచనలకి, ఆచరణకు పొంతనలేని జీవితాలను కూడా చూస్తున్నాం. వాటిమధ్య వైరుధ్యం లేని రచయితలూ, కళాకారులూ, కార్యకర్తలూ అజ్ఞాతంగానో లేదా కటకటాల వెనుకో ముగిసిపోతున్నారు. ‘1984’ లాంటి ఏ రచననైనా అంగీకరిం చచ్చు లేదా తిరస్కరించచ్చు (2084కి ఐనా ఈ పరిస్థితులు మెరుగుపడతాయా అన్నది వేరే చర్చ). కానీ ఆ రచనలని వాటి సారాంశంతో సంబంధం లేకుండా మెచ్చుకోవడంతోనే మన పాత్ర ముగిసిపోవడం నిజంగానే ఎంత విషాదం?
ఆర్‌కె (పర్‌స్పెక్టివ్స్)
Updated Date - 2023-08-07T03:13:42+05:30 IST