ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సుపరిపాలనతోనే వికసిత్ భారత్

ABN, Publish Date - Dec 24 , 2023 | 02:28 AM

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గారు నా మార్గదర్శకులు. డిసెంబర్ 25న అటల్జీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నప్పుడు ఆయన సుపరిపాలనకు...

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గారు నా మార్గదర్శకులు. డిసెంబర్ 25న అటల్జీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నప్పుడు ఆయన సుపరిపాలనకు ఎంత కీలక ప్రాధాన్యత ఇచ్చేవారో నా జ్ఞాపకాల్లో మెదలుతుంది. అదే సమయంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర భాయి మోదీ ఈ సుపరిపాలన ప్రాధాన్యతను మరెంతో ముందుకు తీసుకువెళుతున్న తీరు కూడా గుర్తుకు వస్తుంది.

గత పదేళ్లలో దేశ అభివృద్ధి చిత్రపటం ఎంతో మారిపోయింది. ఎన్నడూ లేనంతగా పరిపాలనకు అరుదైన ప్రాతినిధ్యం లభించింది. అప్పటికీ ఇప్పటికీ సందర్భం కూడా అనూహ్యంగా మారిపోయింది. 2023 డిసెంబర్ 11న ప్రధాని మోదీ ‘వికసిత్ భారత సంకల్ప యాత్ర’ను ప్రారంభించారు. 2047నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతున్న దృష్ట్యా ఆనాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే నిబద్ధతను మోదీ ప్రభుత్వం ఏర్పర్చుకున్నది. అందువల్ల ప్రస్తుత సమయం భారత చరిత్రాత్మక ప్రయాణంలో ఒక నిర్ణాయక ఘట్టం. ఇది 75 సంవత్సరాల పాటు జరిగిన నిరంతర శ్రమ పునాదిపై ఏర్పర్చుకున్న కృషి, అంకిత భావం. అంతేకాదు, గత పదేళ్ల కాలంలో పట్టుదలతో సమకూర్చుకున్న సామర్థ్యం, నవనవోన్మేషంగా చిగురించిన విశ్వాసం.

ఇవాళ మనది గొప్ప కలలు కంటున్న దేశం. 1.4 బిలియన్ స్వప్నాల దేశం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఆకాంక్షిస్తున్న దేశం. అత్యంత అధునాతన మౌలిక సదుపాయాలు, పౌరులకు అత్యధిక నాణ్యత గల విద్య, ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాలకు సమాన అందుబాటును కోరుకుంటున్న దేశం. జీవనోపాధి అవకాశాలు పెరగాలని, యువకులు, మహిళలకు ఆదాయ కల్పనా కార్యక్రమాలు విస్తరించాలని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా సంపద, ఉపాధి కల్పన పెంచేందుకు పారిశ్రామికవేత్తలకు, మదుపరులకు అధిక అవకాశాలు ఏర్పడాలని ఆశిస్తున్న దేశం. తన ప్రగతిలోనూ, అభివృద్ధి ప్రయాణంలోనూ, ఎవర్నీ విస్మరించకుండా అందర్నీ భాగస్వాములను చేసుకోవాలనే అభీష్టంతో మన దేశం ఉవ్విళ్లూరుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తన ప్రజల అపారమైన సామర్థ్యంపై అసాధారణ విశ్వాసాన్ని ఏర్పర్చుకుంది. ప్రజల భాగస్వామ్యం ఉన్నందువల్లే ఆయన ప్రారంభించిన అనేక కార్యక్రమాలు ఎంతో విజయవంతమయ్యాయి. స్వచ్ఛత లేదా శుభ్రతను ఒక ప్రజా ఉద్యమంగా భావించే ప్రభుత్వం మనది. కార్యక్రమాల అమలులో ‘జన భాగీదారీ’ లేదా ప్రజల భాగస్వామ్యం కీలకపాత్ర పోషిస్తుంది. తమ జీవితాలను మెరుగైన విధంగా మార్చుకునేందుకు అవసరమైన సమాచారం, పరిజ్ఞానం పొందే సాధికారత పెరగడంతో ప్రజలే ఇవాళ దేశంలో మార్పుకు దోహదకారులవుతున్నారు.

ప్రజలను కేంద్రంగా భావించి రూపొందించుకున్న అభివృద్ధి నమూనాలో సుశాసనం, లేదా సుపరిపాలన అనేది సామాజిక పరివర్తనకు తోడ్పడే అత్యంత ఆశాజనకమైన మార్గం. స్వరాజ్యను సురాజ్యంగా అంటే మనం సాధించిన స్వాతంత్ర్యాన్ని సత్పరిపాలనతో కూడిన రాజ్యంగా మార్చేందుకు ఇది దోహదం చేస్తుంది. ప్రధానమంత్రి ఈ పరివర్తన యాత్రకు సారథ్యం వహించి నిలకడగా, పట్టుదలతో దేశాన్ని ముందుకు నడిపించారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ (అందరికీ అండగా నిలిచి, అందరి ప్రగతిని సాధిస్తూ, అందరి విశ్వాసాన్ని సాధించడం) అనే తన అసమానమైన శైలిలో ఆయన అందరి భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి రూపురేఖల్ని వ్యక్తీకరించారు. దీనికి ‘సబ్ కా ప్రయాస్’ (అందరి కృషితో) జోడించి ప్రజల బాధ్యత, తోడ్పాటు కూడా అవసరమనే భావాన్ని ఆయన వెల్లడించారు.

దేశంలో ఉన్నతాధికారులకోసం సివిల్ సర్వీస్‌ను మలిచి ఒక ప్రజా కేంద్రిత సుపరిపాలనకు సర్దార్ పటేల్ పునాది వేసిన తీరు ఆయన దూరదృష్టికి నిదర్శనం. ‘మీ పూర్వ అధికారులు సామాన్య ప్రజలకు దూరంగా ఉండే సంప్రదాయాలను అవలంబించారు. సామాన్యులను స్వజనులుగా భావించడం మీ విద్యుక్త ధర్మం’ అని సర్దార్ పటేల్ 1947లో ఐఏఎస్ అధికారులకు సలహా ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా ప్రజలను తన పాలనలో కేంద్రంగా మార్చి సుపరిపాలన పరిభాషను, వ్యాకరణాన్నే మార్చారు. ‘సంస్కరించు, పనితీరు ప్రదర్శించు, పరివర్తనం చేయి’ అని అందుకే ఆయన అన్నారు. ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (డీబీటీ) ద్వారా టెక్నాలజీని అణగారిన ప్రజల వద్దకు సమర్థంగా చేరుకునేలా చేసి, అవినీతి, వ్యయాన్ని తగ్గించడం ఇందుకు ఒక ఉదాహరణ.

2023 డిసెంబర్ 21న ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి మన దేశం సమున్నత స్థాయికి ఎదిగే దశలో ఉన్నదని చెప్పారు. వివిధ రంగాల్లో దేశం వేగంగా సాధిస్తున్న చెప్పుకోదగిన అభివృద్ధి ఈ స్థాయికి చేరుకునే శక్తిని మనకు సమకూర్చింది. పేదరికాన్ని నిర్మూలించడం నుంచి మహమ్మారిని ఎదుర్కోవడం వరకు, అక్షరాస్యతకు బలమైన పునాది ఏర్పర్చుకోవాలనే జాతీయ లక్ష్యం నుంచి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పర్చుకోవడం వరకు, విస్తృతంగా ఆర్థిక భాగస్వామ్యం కల్పించే కార్యక్రమం నుంచి ప్రభావశీలమైన ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడం వరకు, అధునాతన రైలు, విమానయాన రంగాలను క్రమక్రమంగా విస్తరించడం నుంచి అత్యద్భుతమైన అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టడం వరకు, టెక్నాలజీ, ఔషధ రంగాల్లో కనీవినీ ఎరుగని పురోగతి సాధించడం నుంచి క్రీడల్లో ప్రతిభను ప్రోత్సహించడం వరకు సాధిస్తున్న ఎన్నో విజయాలు నిజంగా అచ్చెరువు కలిగించేవి. ఈ సుదీర్ఘమైన విజయాల జాబితా మన దేశం ఒక వేగవంతమైన, సానుకూలమైన అభివృద్ధి పథంలో ఉన్నత దశలో ఉన్నామనే విశ్వాసాన్ని మనలో కలిగించడానికి దోహదం చేస్తుంది.

మన ముందున్న మార్గం నిస్సందేహంగా సవాలుతో కూడుకున్నదే. ఈ మార్గంలో తడబాటులేకుండా జాగ్రత్త వహించవలిసి ఉంటుంది. మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. మధ్యే మార్గంలో దిద్దుబాటు అవసరమైన కొన్నివ్యూహాలను, మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన విధానాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిపాలనా వ్యవస్థలను పునఃపరిశీలించి, వాటిని మరింత సమర్థంగా, మరింత ప్రభావితంగా చేయడానికి వాటిని క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఉన్న చట్టాలు, నియమ నిబంధనలు, విధానాలను విమర్శనాత్మకంగా సమీక్షించడం ద్వారా మాత్రమే మనం ఆశిస్తున్న పరివర్తన సాధ్యమవుతుంది. వాటిని వీలైనంత వరకు ప్రజలకు అనుకూలమైనవిగా, సాధ్యమైనంత పారదర్శకంగా, అయోమయం లేకుండా మార్చాలి. ప్రజలకు అర్థమయ్యే భాషలో, అనుకూల రూపంలో వెల్లడించాలి. ఈ సంస్కరణల ప్రక్రియ మన దేశ చైతన్యవంతమైన నాయకత్వం వ్యక్తిగత దృష్టిని ఆకర్షించినందుకు, అనేక కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసినందుకు, కొన్ని చట్టాలు సరళీకృతం చేసినందుకు, కొన్ని కొత్త చట్టాలు చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది.

యథాలాప ధోరణి ద్వారా ఎన్నడూ అభివృద్ధిని వేగవంతం చేయలేం. పాలన ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. పంపిణీ అనేది అత్యంత కీలకం. చివరి మైలు వరకు చేరుకోవడం కష్టమే కాని అది మన వ్యవస్థాగత బలానికి అంతిమ పరీక్ష. క్రింద వాలిన కొమ్మకున్న పళ్లను అందుకోవడం సులభం. కాని తొలి విజయాలతోనే మనం సంతృప్తి చెందకూడదు. ఎవర్నీ వదిలిపెట్టకుండా సమానత్వంతో వృద్ధిని సాధించేలా చేసుకోవడం సామాజిక సామరస్యానికి, స్థిరమైన, శాంతియుత అభివృద్ధికి కీలకం.

మరో నెల రోజుల్లోపే అయోధ్యలో శ్రీరాముడి భవ్య మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. సుపరిపాలన, సత్యం, ధర్మం, ప్రజల స్వరానికి గౌరవం, సవాళ్లతో కూడిన కార్యాలను కూడా సమిష్టి దృక్పథంతో చేపట్టడం వంటి విలువలను ప్రతిఫలించడం ద్వారా శ్రీ రామచంద్రుడు మన సామూహిక చేతనలో స్థిరంగా, శాశ్వతంగా ప్రతిష్ఠాపితమయ్యారు. ఆకలి దప్పులు లేని, అవినీతికి, అత్యాచారాలకు, ఆలస్యానికి, వివక్షతకు తావులేని ఆదర్శ పాలనే రామరాజ్యం.

భారతదేశ సుదీర్ఘ చరిత్రలో ప్రాచీన కాలం నుండి సుపరిపాలనకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ ఉదాహరణలనుంచి మనం ప్రేరణను పొంది కొత్తపాలనా వ్యవస్థల్ని నిర్వచించుకోవాలి. మన లోపాల్ని అంగీకరించడమే కాదు, వాటిని సవరించుకోవడానికి ధైర్యాన్నిచ్చే వ్యవస్థలు కావాలి. వాటి ద్వారా మన నేలపై మన నిర్ణయాలు, కార్యాచరణల ప్రభావాన్ని, మన జీవన నాణ్యతను, తోటి మానవుల జీవన నాణ్యతను నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోగలగాలి. సుశాసనంతో కూడిన భారతం ద్వారా 2047 నాటికి వికసిత భారత్‌ను సాధించేందుకు మనందరం కృషి చేద్దాం.

ముప్పవరపు వెంకయ్యనాయుడు

పూర్వ ఉప రాష్ట్రపతి

Updated Date - Dec 24 , 2023 | 02:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising