ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్రమా? మతతంత్రమా?

ABN, First Publish Date - 2023-06-01T01:59:35+05:30

గ్లేడియేటర్ సినిమాలోని ఆ మాటలను పరకాల ప్రభాకర్ ప్రస్తుత భారత పాలకులకు అనువర్తింపజేసి వ్యాఖ్యానిస్తారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అతను వారికి మృత్యువును ప్రసాదిస్తాడు, అందుకు వారు అతనిని ప్రేమిస్తారు’

ప్రజలను రంజింపజేయడానికి నూటాయాభై రోజుల పాటు కొలోజియంలో మృత్యుక్రీడల వేడుకలను ప్రకటించిన రోమన్ చక్రవర్తి గురించి ఇద్దరి సంభాషణలోని భాగం అది.

తొమ్మిది సంవత్సరాల నరేంద్రమోదీ పరిపాలన, ఈ కాలంలో ఉద్రిక్తతలకు, ఉద్యమాలకు కారణమైన సామాజికాంశాలు, ఆర్థిక, విద్యా రంగాల సమీక్షలు, వ్యాఖ్యలు, కొవిడ్ కాల వ్యాఖ్యానాలు, జర్నల్స్ అన్నీ పరకాల ప్రభాకర్‌ తాజా ఆంగ్ల వ్యాస సంకలనం ‘‘ద క్రూక్‌డ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా’’లో చూడవచ్చు. వీటిని చదువుతున్నప్పుడు ఇంతటి కల్లోలకాలాన్ని ఈదుకుంటూ వస్తున్నామా, ఇంతగా మనం ప్రమాదంలో పడ్డామా, దీనినుంచి బయట పడగలమా లేదా? అన్న భయసంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. చిన్న ప్రయత్నమే అన్నారు కానీ, ఇది గణతంత్ర భారత్‌కు సకాలంలో అందిన గొప్ప సహాయం.

నరేంద్రమోదీ, ఆయన పార్టీ, పరివారం నిర్మించతలపెట్టిన నవ భారతదేశం, న్యూ ఇండియా, సవాలక్ష వికారాల వక్రతల సమాహారమని, ఆ కుక్కతోక ఏ గోదారినీ దరిచేర్చదనీ పరకాల ప్రభాకర్ వంటి వారు నిర్భయంగా ప్రకటిస్తున్నప్పుడు, సత్యశిబిరానికి కొత్త కలం, కొత్త బలం సమకూరినట్టు అనిపించింది.

గ్లేడియేటర్ సినిమాలోని ఆ మాటలను పరకాల ప్రభాకర్ ప్రస్తుత భారత పాలకులకు అనువర్తింపజేసి వ్యాఖ్యానిస్తారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ సందర్భంలో, భారత గణతంత్రం పునాది విలువలను నేలమట్టం చేస్తున్న ఏలికలను మనలో చాలామందిమి ప్రేమిస్తున్నాము... క్రమంగా పెరుగుతున్న భీతావహం, విధ్వంసం తెలిసిరాకుండా, నేపథ్యంలో ప్రచారార్భాటపు హోరు. జాతీయోద్యమంలో రూపుదిద్దుకుని, రాజ్యాంగంలో పొందుపర్చుకున్న భారతదేశ భావన భంగపడుతున్నప్పుడు, మన దృష్టి మళ్లించి వినోదింపజేయడానికి ఉత్సవాల మీద ఉత్సవాలు.’’ తాజా పుస్తకం ‘‘ద క్రూక్‌డ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా’’లో పరకాల ప్రభాకర్ చేసిన ఇటువంటి పరిశీలనలు అనేకం వెన్నులో వణుకు తెప్పిస్తాయి. భయం పుట్టిస్తాయి!

మభ్యపెట్టడం, దృష్టి మళ్లించడమే కాదు, భయపెట్టడం కూడా ఉంటుంది. భయం ఒక జాతీయ వ్యాధిగా మారింది అని సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఈ మధ్య ఒక సభలో వ్యాఖ్యానించారు. మామూలు విషయాలు కూడా గుసగుసలుగా తప్ప మాట్లాడుకోలేని నిర్మిత భయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘భయం కళ్లెదుట కనిపిస్తున్న ఒక కఠోర వాస్తవం’’ అని ప్రభాకర్ కూడా అంటున్నారు. బలపడుతూ విస్తరిస్తూ ఉన్న భయం మరింతగా భయపెడుతున్న మాట నిజమే కానీ, దాన్ని అధిగమిస్తూ గొంతు విప్పుతున్నవారు కూడా పెరుగుతున్నారు, కనిపిస్తున్నారు. భారతదేశాన్ని, దాని హృదయంతో సహా కాపాడుకోవడానికి కూడా ఒక మోహరింపు పెరుగుతోంది. నరేంద్రమోదీ, ఆయన పార్టీ, పరివారం నిర్మించతలపెట్టిన నవ భారతదేశం, న్యూ ఇండియా, సవాలక్ష వికారాల వక్రతల సమాహారమని, ఆ కుక్కతోక ఏ గోదారినీ దరిచేర్చదనీ పరకాల ప్రభాకర్ వంటి వారు నిర్భయంగా ప్రకటిస్తున్నప్పుడు, సత్యశిబిరానికి కొత్తకలం, కొత్త బలం సమకూరినట్టు అనిపించింది.

పాత్రికేయానికి ఉండే అనేక అవలక్షణాలలో సంచలనశీలత ఒకటి, అర్ధసత్యానికి వెకిలి వైరల్ వినోదానికి నడుమ సంచారశీలత మరొకటి. కేంద్ర ఆర్థిక మంత్రి జీవన సహచరుడు కేంద్రప్రభుత్వం మీదనే విమర్శలు గుప్పించడం విశేషమే. కానీ, పరకాల ప్రభాకర్ ఉనికి నిర్మలా సీతారామన్ సహచరుడు కావడం ఒక్కటే అన్నట్టుగా, మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన తన బ్లాగు ద్వారా, ప్రసంగాల ద్వారా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను మీడియా వ్యాఖ్యానిస్తూ వస్తున్నది. వ్యతిరేక వ్యాఖ్యలతో నిర్మలను ఇబ్బందిలో పెడుతున్నారన్నట్టు చూడడమే తప్ప, ప్రభాకర్ ప్రయాణంలో ఈ అభిప్రాయాలు ఎటువంటి మలుపో గమనించే ప్రయత్నం జరగలేదు. వంగిపోయి వంకరలు తిరిగిన కలపతో నిటారుగా ఉన్న దేనినీ తయారుచేయలేము. మానవస్వభావం కూడా అసంపూర్ణమైనది, దాని మీద ఏదో అదుపు ఉంటేనే అణగి ఉంటుంది.. అన్న అర్థంలో ఇమ్మాన్యుయేల్‌ కాంట్ ఉటంకింపు ఒకటి (out of the crooked timber of humanity, no straight was ever made) ప్రసిద్ధం. ప్రస్తుతం మోదీ–షా ఆధ్వర్యంలో రూపొందుతున్న నవభారత (న్యూ ఇండియా) సారం వక్రమైనది, అసంపూర్ణమైనది అన్న అర్థంలో ప్రభాకర్ ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టారు. తొమ్మిదేండ్ల భారత రాజకీయార్థిక స్థితి గతులను నిశితంగా విమర్శించిన ఈ పుస్తకంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే పరిణామాల విశ్లేషణ, హెచ్చరికలతో పాటు, కర్తవ్య బోధ కూడా ఉంది. జాతీయోద్యమ, రాజ్యాంగ విలువల భూమిక పైనే చర్చను సాగించిన రచయిత, ఎక్కడా ఇతర ప్రాతిపదికలకు ఆస్కారం ఇవ్వలేదు. ప్రభాకర్ వ్యాసాలలో తారసపడే స్పష్టత, తీవ్రత పాఠకులను ఆశ్చర్యపరుస్తాయి.

ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుకుని, లండన్ స్కూల్‌ ఆఫ్ ఎకనామిక్స్‌లో పరిశోధన చేసి, రాజకీయాలలోకి వచ్చిన ప్రభాకర్‌కు ప్రగతిశీల, ఉదార భావాలతో సహవాసం ఏ నాటి నుంచో ఉండే అవకాశం ఉన్నది కానీ, బిజెపితో సహా ఆయన సంచరించిన రాజకీయ స్థలాలు, శిబిరాలు తన సామాజిక, రాజకీయార్థిక దృక్పథాల వ్యక్తీకరణకు సరైన వేదికలు కాకపోయి ఉండవచ్చు. లేదా, పి.వి. నరసింహారావు అంతేవాసిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన భావాలలో క్రమానుగత పరిణామం జరిగి ఉండవచ్చు. అన్నిటికి మించి, తొమ్మిదేళ్ల పరిణామాల వేగం, ఉధృతి, విధ్వంసశీలత కలసి స్పష్టతను అందించి ఉండవచ్చు.

2018 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్, ఆ మరుసటి సంవత్సరం నుంచి తన స్వతంత్ర వ్యక్తీకరణలను ప్రారంభించినట్టుంది. మోదీ ప్రభుత్వం ఆర్థికరంగంలో విఫలమవుతోందని, పివి–మన్మోహన్ సింగ్ విధానాల నుంచి గ్రహించి అనుసరిస్తే మంచిదని ఆయన ఒక వేదిక మీద చేసిన వ్యాఖ్య కలకలం కలిగించింది. అప్పటి నుంచి అడపాదడపా రాస్తున్నవి, బ్లాగుల ద్వారా వినిపించినవి, తాజా జోడింపులతో, ముందు వెనుక మాటలతో మే నెలలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. తొమ్మిది సంవత్సరాల నరేంద్రమోదీ పరిపాలన, ఈ కాలంలో ఉద్రిక్తతలకు, ఉద్యమాలకు కారణమైన సామాజికాంశాలు, ఆర్థిక, విద్యా రంగాల సమీక్షలు, వ్యాఖ్యలు, కొవిడ్ కాల వ్యాఖ్యానాలు, జర్నల్స్ అన్నీ ఈ ఆంగ్ల వ్యాస సంకలనంలో చూడవచ్చు. వీటిని చదువుతున్నప్పుడు ఇంతటి కల్లోలకాలాన్ని ఈదుకుంటూ వస్తున్నామా, ఇంతగా మనం ప్రమాదంలో పడ్డామా, దీనినుంచి బయట పడగలమా లేదా? అన్న భయసంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. చిన్న ప్రయత్నమే అన్నారు కానీ, ఇది గణతంత్ర భారత్‌కు సకాలంలో అందిన గొప్పసహాయం.

గ్లేడియేటర్ సన్నివేశాన్ని ఉపోద్ఘాతంలో అన్వయించిన తీరులోనే, ఈ పుస్తకంలో అనేక సృజనాత్మక అన్వయాలు కనిపిస్తాయి. ప్రభాకర్ ప్రతిపాదిస్తున్న అంశాలను అర్థం చేసుకోవడానికి అవి ఉపకరిస్తాయి. పుస్తక శీర్షికే ఒక ప్రసిద్ధ వ్యక్తీకరణకు ఆధునిక అన్వయం. ఏకకాలంలో కుందేలుగానూ, బాతుగానూ ఉన్న బొమ్మను ఉదహరిస్తూ ఇందులో ప్రభాకర్ ఒక వ్యాసం రాశారు. ఆ బొమ్మలో ఉన్న రెండు ఆకారాలను ఎవరూ ఒకేసారి చూడలేరు. కొందరు ఒకటి మాత్రమే గుర్తించగలరు. కష్టం మీద మాత్రమే రెండోదాన్ని ఆనవాలు పట్టగలరు. కుందేలును, ఉదార, ప్రగతిశీల, లౌకికవాద భారత్‌కు, బాతును ‘హిందూ హిందూత్వ’ భారతీయ అస్తిత్వానికి ప్రతీకలుగా తీసుకున్నారు. ఇంతకాలం కుందేలును మాత్రమే చూడగలిగిన భారతీయ సమాజంలో అధికులు ఇప్పుడు బాతును మాత్రమే చూస్తున్నారు. వారి దృక్ శక్తి నుంచి కుందేలు గుర్తింపు క్రమంగా అప్రధానమవుతున్నది, ద్వితీయమవుతున్నది, మసకబారిపోతున్నది. ఈ పరిణామం వెనుక బాతు, దానిని కోరుకునేవారి ప్రయత్నం ఉన్నది. మన చూపు శక్తిని ప్రభావితం చేసేవి ప్రాపంచిక అవగాహనలూ వాస్తవికతలే! చైతన్యాన్ని, బాహ్య పరిస్థితులను వాటి శిథిలతనుంచి ఉద్ధరించగలిగినప్పుడు, కుందేలు మాత్రమే ఇష్ట, ప్రధాన దృశ్యంగా మారిపోతుంది.

అట్లాగే, కొన్ని లౌకిక, సాధారణ నినాదాలను ఇంధనంగా ఉపయోగించుకుని, హిందూత్వ వ్యోమనౌక నింగికి ఎగిరి, కక్ష్యలోకి చేరిన తరువాత, ఇంధనాన్ని, వాహక నౌకను విసర్జించింది... అని ప్రభాకర్ ఒక పోలిక చెబుతారు. తాను బలపడడానికి ఉపయోగపడిన వ్యక్తులను, అంశాలను తరువాత కాలంలో బిజెపి వదిలిపెట్టిందని చెప్పే సందర్భం అది. 2014 నాటి మోదీ తరువాత లేడు అని అనేక సందర్భాలలో రచయిత అంటారు. క్రమంగా పాత వాగ్దానాలు, ప్రవచనాలు మారిపోతాయి, కొత్త కథనం 2016 నాటికి ప్రవేశిస్తుంది. 2014 నాటి అచ్ఛేదిన్, సబ్ కా సాథ్ నినాదాలు, గత ప్రభుత్వాల సానుకూల ప్రస్తావనలు కేవలం మభ్యపెట్టడానికే అని నేరుగా ఎక్కడా అనరు. కానీ, ఆ మార్పును, వైరుధ్యాన్ని స్పష్టంగా చూపిస్తారు.

ఫాసిజం అన్న మాట వాడినట్టు లేరు కానీ, దేశంలో నెలకొన్న అణచివేత వాతావరణాన్ని మొత్తంగా ప్రభాకర్ స్పృశించారు. రైతు ఉద్యమకారులపై, విద్యార్థులపై, జర్నలిస్టులపై, బీమాకోరేగావ్ నిందితులపై జరిగిన నిర్బంధాలను చర్చించారు. స్టాన్ స్వామి మరణం మీద రాసిన వ్యాసంలో, ఊపాలో ఎవరి హయాంలో ఏ కొమ్ములు వచ్చాయో నిష్పాక్షికంగా చెబుతారు. ప్రశ్నించడంలో మెతకదనం వద్దు అంటారు ప్రభాకర్. స్టాన్ స్వామి 80 ఏళ్ల వృద్ధుడు కాబట్టి, ఫలానా జబ్బు ఉన్నవాడు కాబట్టి, ఆయన నిర్బంధం, మరణం దుర్మార్గమని అనడం సరికాదు, ఆయన యువకుడై ఉన్నా, ఆరోగ్యవంతుడై ఉన్నా కూడా ఆ అణచివేతలు అన్యాయమైనవే అని ప్రభాకర్ అంటారు. కేంద్రంలో గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, పాలకులను విమర్శించడానికి తన వద్ద ఉన్న సమాచారం, చేయగలిగే విశ్లేషణ చాలునని, ఆమోదనీయత కోసం కొన్ని సానుకూల అంశాలను కూడా ప్రస్తావించి, కృత్రిమంగా సమతూకం పాటించవలసిన అవసరం తనకు లేదని అంటారు. స్వతంత్ర రచయిత కాబట్టి, ఆయనకు సాపేక్షంగా ఆ వెసులుబాటు ఉంటుంది. సమాచార మాధ్యమాలలో చేసే విశ్లేషణలలో ప్రతి అభిప్రాయానికీ ఒక ఆలంబన, ఒక భద్ర అభిప్రాయ స్థలమూ అవసరమవుతాయి.

ఉదాత్త విలువల భారతదేశాన్ని ధ్వంసం చేసే కార్యక్రమంలో బిజెపి, దాని అనుబంధ శక్తులకు తోడ్పడుతున్నవారిలో ప్రజలు ఉన్నారు, ప్రాంతీయపార్టీల వంటి శక్తులూ ఉన్నాయని ప్రభాకర్ అన్నారు. తెలియక చేసేవారు, తాత్కాలిక ప్రయోజనం కోసం చేసేవారు, తెలిసి చేసేవారు.... ఉదాత్త భారతానికి వ్యతిరేకంగా నిలబడుతున్నవారిలో ఉన్నారని ఆయన అన్నారు. తమ సిద్ధాంతాలకు విరుద్ధమైనప్పటికీ, బిజెపితో కలసి నడవాలని ప్రయత్నిస్తున్న, నడుస్తున్న ప్రాంతీయ, సామాజికన్యాయ శక్తులు తమ వైఖరులను ఒకసారి సమీక్షించుకోవాలి. పుచ్చిపోయిన, వంగిపోయిన కలపతో చేసే ఏ వస్తువూ తిన్నగా ఉండదని, పనికిరాదని తెలుసుకోవాలి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజనను నిరోధించడానికి తెలంగాణేతర ప్రాంతాలలో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, పరకాల ప్రభాకర్ విశాలాంధ్ర మహాసభ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు, క్రియాశీలంగా కొన్ని పనులు చేశారు. బాధిత ప్రాంతంగా తెలంగాణ నుంచి నాడు వచ్చిన వాదనల విషయంలో ప్రభాకర్ వైఖరి మారిందో అట్లాగే ఉన్నదో తెలియదు. విభజన హామీలు నెరవేర్చే విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం గురించిన ప్రస్తావనలు మాత్రమే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెంది, అక్కడి అభివృద్ధి సమస్యల గురించిన అవగాహన కలిగి, అదే సమయంలో బిజెపి నిర్వహిస్తున్న ‘న్యూ ఇండియా’ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ, ఆ పార్టీతో భయంతోనో, భక్తితోనో, అవసరంతోనో అంటకాగుతున్న ప్రాంతీయ శక్తులను కూడా విమర్శించగలిగే అతికొద్దిమందిలో ప్రభాకర్ కూడా ఒకరయ్యారు.

Updated Date - 2023-06-01T01:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising