కళింగోర
ABN, First Publish Date - 2023-08-07T03:11:15+05:30
మా కళావతక్క నీలితీరాన తూగే అలల కోకటుయ్యాల ముడిసిన మెట్టమీది మొగలి గబ్బ సైకం కొండ పల్లాన ఇరగ్గాసిన జీడిగుత్తల సోకు చేను... చెలకల్లో సెర్రాడే...
మా కళావతక్క
నీలితీరాన తూగే అలల కోకటుయ్యాల
ముడిసిన మెట్టమీది మొగలి గబ్బ సైకం
కొండ పల్లాన ఇరగ్గాసిన జీడిగుత్తల సోకు
చేను... చెలకల్లో సెర్రాడే మట్టిపాదాల మువ్వల పట్టా
బీల పొలాలపై తిరపీలాడిన యానగాలి
కొబ్బరాకుల గుబురు సందు దిమ్మరించిన వెన్నెల గంధం
ఏ కాసులోడి కన్ను పడిందో
కలిమినిచ్చిన నేల కందుబారిన గోవయ్యింది
ఊరు మెరకబారి ఉసురు పోయింది
పకాలితోనైనా తీరని కడుపు కుతి
సంపద చుట్టూ ఉన్నా పూటకు లేని గతి
మట్టిబంధం పేగు వదిలింది
పుట్టెడంత కుటుంబం చెట్టుకొక పిట్టైంది
మా కళావతక్క
ఇప్పుడు పట్టణాన పరిగ సేట
బతుకు దిగుడు బావి, మడుగున
తెరువును సేదుకుంటున్న చిల్లు సేద
పాసిపోయిన పరాయి వాకిట్లో
ఎమకలపొద్దు చెమట కళ్ళాపి
రక్కూరగడల్లో రోసిపోతున్న పెనుగులాట
పోతం కళ్ళుతో ఎగబడ్డ ఎనుబోతుల మధ్య
కుతకుతలాడిన కూడి కుండ
చీకూచింతల్లో కునుకుదీరని చీకటి పొద్దు
కళావతక్కా
నేకరిగా నీ మడకన చేరి
నేరుపుగా నీ పాదును కదిపి
నిర్దయగా నీ పాదాలకు నాడాలు దించి
ఊరెల్లగట్టిన ఉరుముల్లేని పిడుగులెవరు
నడుస్తున్న చరిత్రలో...
కళయింకిన కళ్ళతో... కుంకని పొద్దుల్ని మోసుకుని
కళ్యాణ మంటపాల్లో కాకాహోటల్లలో
చావు కార్యాల్లో చాట్ బడ్డీలలో
ఎంగిల్నీలలో నానుతున్న కళింగాంధ్ర కళింగోరవు నువ్వు
కళావతక్కా!
ఒక యుగాన్ని పగులగొట్టిన ఖారవేలుని పౌరుషం నీది
ఒళ్ళుబలిసిన రాచరికాన్ని తరిమికొట్టిన
వీర గున్నమ్మ వారసత్వం నీది
రక్తాన్ని ధారపోసి ఉద్యమపోరులో
పెనిమిటి పిల్లల్ని ఫణమొడ్డిన
పంచాది నిర్మల త్యాగాల తోవ నీ నేల
పురిటి కందుల్ని పొత్తికడుపుల్లో చుట్టి
రైతు రక్షణ యాత్రలో చెన్నపట్నానికి ఎగబాకిన
పోరు కెరటం నీ తీరం
దోపిడి తీరు మారలేదు... పోరూ పాతబడలేదు
గుండారు బిగించి కన్నెర్రగించవే
కళావతక్కా... తల్లీ... మా కళింగోర...!
కలమట దాసుబాబు
80967 03363
Updated Date - 2023-08-07T03:11:15+05:30 IST