ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RK Kothapaluku: కాంగ్రెస్‌నూ కమ్మిన జగన్మాయ

ABN, First Publish Date - 2023-09-03T01:08:07+05:30

అమ్మ జగనా! భారతీయ జనతా పార్టీతో ప్రేమలో మునిగి తేలుతూ... అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీపైకి కూడా వలపు బాణాలు విసిరావా? ఎంత జాణతనం? వారం వారం అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతూ...

అమ్మ జగనా! భారతీయ జనతా పార్టీతో ప్రేమలో మునిగి తేలుతూ... అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీపైకి కూడా వలపు బాణాలు విసిరావా? ఎంత జాణతనం? వారం వారం అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతూ... తనపై ఉన్న కేసులతోపాటు వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా నీరుగార్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి.. తాజాగా ‘నేను మీ వాడినే ఎన్నికల తర్వాత మా ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇస్తారు’ అని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి సందేశం పంపడం మామూలు రాజకీయం కాదుకదా! కాంగ్రెస్‌ పార్టీ ఊసే గిట్టని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయం తెలుసో లేదో తెలియదు. అధికారికంగా పొత్తులు లేకపోయినా జగన్‌ తమకు అత్యంత విశ్వాసపాత్రుడని బీజేపీ అగ్ర నాయకులు విశ్వసిస్తున్నారు. అయితే, తెర వెనుక మాత్రం కాంగ్రెస్‌ పార్టీతో జగన్‌ అవగాహన కుదుర్చుకోగలగడమంటే సాధారణ విషయం కాదు.

ఏకకాలంలో రెండు జాతీయ పార్టీలను బుట్టలో వేసుకోగలగడం జగన్‌కు మాత్రమే సాధ్యమని ఎవరైనా అంగీకరించాల్సిందే. వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్‌ రెడ్డి వల్ల ఎన్నో చేదు అనుభవాలను చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇంత తేలిగ్గా ఆయనను నమ్మేయడం ఆశ్చర్యం కలిగించక మానదు. తెరవెనుక వ్యవహారాలు తెలుస్తున్న కొద్దీ.. వామ్మో ఇవేమి రాజకీయాలు అనిపించక మానవు. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం!

ఇదీ సంగతి...

కాంగ్రెస్‌–జగన్‌ మధ్య అవగాహన కుదిరిందన్న వాస్తవాన్ని నమ్మి తీరాల్సిన పరిణామాలు గడిచిన రెండు మూడు నెలలుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ రాజకీయ వ్యూహంలో వైఎస్‌ షర్మిల పావుగా మారబోతున్నారా? అంటే అవునని చెప్పక తప్పదు. జరిగిందేమిటో తెలిసి తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి చంద్రబాబుది! ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి. తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేసిన షర్మిలతో కాంగ్రెస్‌ పార్టీ కొంతకాలంగా మంతనాలు జరుపుతుండటం తెలిసిందే.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని పునరుజ్జీవింపజేసే బాధ్యత తీసుకోవాల్సిందిగా ఆ పార్టీ అధిష్ఠానం షర్మిలకు ఆఫర్‌ ఇచ్చింది. ఇందుకు ప్రతిగా... కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును ఇవ్వజూపింది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సోదరుడైన జగన్మోహన్‌ రెడ్డితో నేరుగా తలపడటానికి తొలుత అంతగా సుముఖత చూపని షర్మిల చివరకు సన్నిహితుల సలహాలు, ఒత్తిడి మేరకు అంగీకరించారు. ఈ విషయం తెలిసిన జగన్‌ చకచకా పావులు కదిపారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా తన కుటుంబానికి సన్నిహితుడైన డి.కె.శివకుమార్‌ ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి ఆర్థిక సహాయం చేశారట! అప్పట్లో శివకుమార్‌ విజయవాడ వచ్చారు. తన సోదరి షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని చేపడితే వచ్చే ఎన్నికల్లో తనకు నష్టం జరుగుతుందని గుర్తించిన జగన్మోహన్‌ రెడ్డి పావులు కదిపారు. ధన బలంతో కాంగ్రెస్‌లో కీలక నాయకులుగా ఉన్నవారిని మేనేజ్‌ చేశారు.

అంతే... కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరి మారిపోయింది. షర్మిలను జగన్‌పై ప్రయోగించకూడదన్న నిర్ణయానికి వచ్చింది. షర్మిలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించినా... రానున్న ఎన్నికల్లో ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఉండదని, ఆ కారణంగా ఎన్నికల తర్వాత మద్దతు ఇవ్వడానికి జగన్‌ నుంచి వచ్చిన ఆఫర్‌ను అంగీకరించడమే బెటర్‌ అన్న అభిప్రాయానికి కాంగ్రెస్‌ పార్టీ వచ్చేలా... ఆ పార్టీలోని ముఖ్యులు పావులు కదిపారు. ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ఎన్డీయేతో జత కడతారని, తాను మాత్రం కాంగ్రెస్‌కు అండగా ఉంటానని చెబుతున్న జగన్‌ను కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం నమ్మింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి, చంద్రబాబు పోటీ పడి మరీ తమకు మద్దతు ఇస్తున్నందున నిశ్చింతగా ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వానికి ఈ పరిణామం షాక్‌ కలిగించక మానదు. కాంగ్రెస్‌ పార్టీకి, జగన్‌కు మధ్య అవగాహన కుదురుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించలేదు.

ఈ తరహా రాజకీయం ఇంకా ఒంటబట్టించుకోని షర్మిల జరిగిందేమిటో తెలుసుకొని నిర్ఘాంతపోయే పరిస్థితి! మూడు రోజుల క్రితం షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని కలిశారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్‌ వంటి నాయకులను కూడా కలిశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న సంభాషణలను బట్టి తెర వెనుక ఏదో జరిగిందని స్పష్టమవుతోంది. అన్నాచెల్లెళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని సోనియా, రాహుల్‌ ప్రశ్నించగా, అంత బాగా లేవని షర్మిల బదులిచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. ‘మీ అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు పెట్టామన్న అపవాదు రావడం మాకు ఇష్టం లేదు’ అని రాహుల్‌ గాంధీ అనడంతో షర్మిల ఒకింత ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్నతో నేరుగా తలపడటం ఇష్టం లేకపోయినా పార్టీ కోరిక మేరకు అందుకు సిద్ధపడిన తనకు తెలుగు రాష్ర్టాలు మినహా దక్షిణాది రాష్ర్టాలలో ప్రచార బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదనను కూడా షర్మిల జీర్ణించుకోలేక పోయినట్టు తెలిసింది.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయడానికి స్థానిక పీసీసీ నాయకత్వం అంగీకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అవసరం లేదు. తెలంగాణ విషయం ఏం చేద్దామన్నది తర్వాత నిర్ణయిద్దామని కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం ప్రతిపాదించింది. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపి జాతీయ స్థాయిలో పార్టీ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తామని రాహుల్‌ గాంధీ ప్రతిపాదించారు. కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో జరిపిన చర్చలు, కుదుర్చుకున్న అవగాహనకు పూర్తి భిన్నంగా రాహుల్‌ గాంధీ మాట్లాడటం షర్మిలకు సహజంగానే ఆశ్చర్యం కలిగించింది. మొదటిసారిగా ప్రతిపాదన తెచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగి ఉంటుందో ఆరా తీసిన షర్మిల సన్నిహితులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. పుండుమీద కారం చల్లినట్టుగా.. ‘జగన్మోహన్‌ రెడ్డి కూడా మనవాడే. ఎన్నికల తర్వాత తన ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తారని చెప్పారు’ అని కేసీ వేణుగోపాల్‌ నోటివెంట రావడంతో షర్మిల సన్నిహితులు మరింత కంగుతిన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని ధిక్కరించి సొంత పార్టీని పెట్టుకోవడమే కాకుండా రాజశేఖర రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ హస్తం ఉందంటూ ఆమెను విలన్‌గా చిత్రీకరించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ ఇంత గుడ్డిగా నమ్మడమేమిటో తెలియక రాజకీయ విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారం కోల్పోయేలా చేయగలిగితేనే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌ వైభవం వస్తుందని నిన్నటి వరకు షర్మిలతో కూడా చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు ఇంతలో ఇలా వైఖరి మార్చుకోవడం వింతగానే ఉంది. సొంత పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకుండా పరుల బలంపై ఆధారపడాలని అనుకోవడం ఏమిటి? అని ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతీయ జనతా పార్టీది కూడా ఇదే వైఖరి. చంద్రబాబు – జగన్‌లలో ఎవరు గెలిచినా తమకే మద్దతు ఇస్తారన్న ధీమాతో బీజేపీ ఉంది.

గత ఎన్నికల సందర్భంగా తమతో జట్టుకట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి సన్నిహితం కావడానికి ప్రయత్నించడాన్ని ప్రతిపక్ష కూటమి జీర్ణించుకోలేక పోయింది. ఈ కారణంగానే ‘ఇండియా’ కూటమిలో చేరవల సిందిగా చంద్రబాబుకు కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. బీజేపీతో అంటకాగుతున్న జగన్మోహన్‌ రెడ్డికి కూడా కబురు పంపలేదు. ఇప్పుడు ఉన్నపళంగా కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరి మార్చుకుంది. ‘నా మద్దతు మీకే’ అని జగన్‌ నుంచి వచ్చిన రాయబారాన్ని నమ్మేసింది. దాదాపు మూడు నెలలుగా ఈ రాయబారాల తంతు నడుస్తోంది.


మారిన కాంగ్రెస్‌ మనసు...

తెర వెనుక ఏదో జరగడం వల్లనే కాబోలు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ వైఖరి మారిపోయింది. షర్మిలతో తొలి విడత చర్చలు జరిపే వరకు, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో నైతిక మద్దతు ఇవ్వడానికి సిద్ధపడిన కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత డాక్టర్‌ సునీత దంపతుల విజ్ఞప్తులకు స్పందించడం కూడా మానేసింది. ఈ విషయం తెలియని షర్మిల మూడు రోజుల క్రితం సోనియా, రాహుల్‌ గాంధీలను కలిశారు. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి జగన్‌కూ మధ్య అవగాహన కుదర్చడంలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారన్నది మరికొన్ని రోజుల్లో వెల్లడవుతుంది. తెర వెనుక జరిగిన కుట్రలు, కుమ్మక్కులు తెలియక షర్మిల ఒంటరిగా మిగిలిపోయారన్న భావన ఎవరికైనా కలుగుతుంది.

తాను కాంగ్రెస్‌లో చేరడం వల్ల ప్రయోజనం ఏమిటన్న మీమాంసలో ఆమె పడిపోయారు. ఇటు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆంక్షలు పెట్టడంతోపాటు అటు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా తనకు పాత్ర లేకుండా చేయడాన్ని షర్మిల జీర్ణించుకోలేక పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికీ విధేయులుగా ఉన్న నాయకులకు కూడా ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. తమకు అత్యంత విశ్వాసపాత్రుడని భావిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ప్రేమ సందేశం పంపడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్వీకరిస్తారో చూడాలి. జగన్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరిలో వచ్చిన మార్పు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలో కూడా ఆ పార్టీకి కొంత నష్టం చేయవచ్చు.

కేంద్ర ప్రభుత్వం అండ చూసుకొనే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి విధ్వంసకర పాలన చేస్తున్నారన్న అభిప్రాయం ఆంధ్రుల్లో ఉంది. ఈ కారణంగానే వారు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రభావం తెలంగాణలోని సెటిలర్లపై కూడా ఉంది. నిజానికి తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీకి ఆశాజనకంగా ఉన్నాయి. సీమాంధ్రులను కూడా తమవైపు ఆకర్షించడానికి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి వారిని పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్‌రెడ్డితో సయోధ్య కుదుర్చుకోవడం వల్ల సెటిలర్లు కాంగ్రెస్‌ను దూరం పెడతారు. ఈ పరిణామం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే అంతిమంగా ప్రయోజనం చేకూర్చవచ్చు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ‘ఇండియా’ కూటమి సమావేశం సందర్భంగా రాహుల్‌ గాంధీ శుక్రవారం ముంబైలో చెప్పుకొన్నారు.

ఇప్పుడు తెరవెనక బాగోతం తెలిశాక తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కూడా మనసు మార్చుకునే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అంటే సోనియా, రాహుల్‌, ప్రియాంక మాత్రమే. ఈ ముగ్గురికీ రాజకీయం పెద్దగా తెలియదంటారు. అందుకే వారిని పార్టీకి చెందిన ఎంతో మంది తప్పుదోవ పట్టించగలిగారు. అధిష్ఠానం చుట్టూ ఉండే కోటరీలో అవినీతి పెరిగిపోయిందన్న ప్రచారం ఉంది. డబ్బు కట్టలు సమకూర్చితే ఈ కోటరీ ఆయా నివేదికలను తిమ్మిని బమ్మిని చేసి అధిష్ఠానం ముందు ఉంచుతుంది. జగన్మోహన్‌ రెడ్డి విషయంలో కూడా ఇదే విధంగా బురిడీ కొట్టించి ఉంటారన్న అభిప్రాయం ఉంది.


మోదీ ఓడిపోతారనే కాంగ్రెస్‌ వైపు!?

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం బలంగా ఉంది. పది రాష్ర్టాల శాసనసభలకు జరిగే ఎన్నికలను ముందుకూ వెనక్కూ జరిపి డిసెంబరు లేదా వచ్చే జనవరిలో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు సజావుగా జరిగేలోపే ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ ఆలోచనగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమన్న అభిప్రాయానికి రావడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీకి జగన్మోహన్‌ రెడ్డి ప్రేమ సందేశం పంపారని కూడా అంటున్నారు.

గత ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉండేవారు. ఈ కారణంగానే మోదీపై విరుచుకుపడేవారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దూషించవద్దని శ్రేయోభిలాషులు సూచించినా అప్పట్లో ఆయన పెడచెవిన పెట్టారు. ఇప్పుడు జగన్‌రెడ్డి ప్రధానిని దూషించే సాహసం చేయకపోయినా కాంగ్రెస్‌ పార్టీతో యుగళగీతం పాడటానికే సిద్ధపడ్డారు. మరోవైపు తమ నాయకురాలు షర్మిలను ఆటలో అరటిపండులా మార్చడాన్ని ఆమె అనుచరులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యూహం ఎలా ఉండబోతున్నది, ఆమె అడుగులు ఎటు అన్నది సస్పెన్స్‌గానే ఉంది. జగన్మోహన్‌ రెడ్డి రాజకీయంగా బలంగా ఉన్నంత వరకు ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా లభించదని షర్మిలకు తెలుసు.

కాంగ్రెస్‌ పార్టీ తమను మోసం చేసిందన్న భావన షర్మిల అనుచరుల్లో ఉంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి వద్ద సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను వారు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకొని ప్రజల్లో తమ కుటుంబాన్ని విలన్లుగా చిత్రీకరిస్తున్నారని అప్పట్లో సోనియాగాంధీ ఆవేదన చెందడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. జగన్‌ గురించి అన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఆయనతోనే చేతులు కలపడానికి సోనియాగాంధీ సైతం సిద్ధపడటం విచిత్ర పరిణామం. ఇప్పటి రాజకీయాలలో విలువలకు, నైతికతకు స్థానం లేదని అందరికీ తెలిసిన విషయమేగానీ ఉత్తర–దక్షిణ ధ్రువాలు కూడా కలసిపోతాయన్నది ఊహకు కూడా అందనిది! దీన్నిబట్టి రాజకీయ పార్టీల అధినేతలు తమ అధికారం కోసం, స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారని తెలుసుకోవాలి.

ఇది తెలియక ఆయా పార్టీల కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో కొట్టుకుంటారు. ప్రజలు కూడా కులాలవారీగా చీలిపోయి రాజకీయ క్రీడలో పావులవుతున్నారు. అవినీతిపరుడుగా ముద్రపడిన జగన్‌కు ప్రధాని మోదీ అండగా నిలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్నది చూసి కంగు తింటున్నారు. జగన్మోహన్‌ రెడ్డికి అండగా నిలబడటానికి మోదీకి కారణం ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబు తనను వ్యక్తిగతంగా దూషించడాన్ని నరేంద్ర మోదీ జీర్ణించుకోలేక పోవడం వల్లనే జగన్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అది కాదే. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో సోనియా కుటుంబాన్ని విలన్లుగా చిత్రీకరించిన జగన్మోహన్‌ రెడ్డిని ఇప్పుడు నమ్మి ‘మనవాడే’ అని ప్రకటించుకోవడం రాజకీయాల్లో విలువల పతనానికి పరాకాష్ఠ. అయినా రాజకీయాల్లో విలువలు ఉండాలనుకోవడం అమాయకత్వం.

ఇప్పుడు ‘ఇండియా’ కూటమిలో చేరిన వారిలో పలువురు గతంలో కాంగ్రెస్‌ పార్టీని దూషించిన వారే. జగన్‌ విషయంలో కూడా కాంగ్రెస్‌ నాయకత్వం ప్రత్యేకంగా ఆలోచించాలని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అందుకే రాజకీయాల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. పళ్లు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి? అన్న భావనకు జనం వచ్చేస్తున్నారు. ఆ కారణంగానే పార్టీల సిద్ధాంతాలు, నాయకుల గుణగణాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎవరు ఎంత దోచుకున్నా పర్వాలేదు– మాకు ఏమిస్తారు? అని అడిగే స్థితికి ప్రజలు వచ్చారు. అదానీని నిత్యం నిందించే రాహుల్‌ గాంధీ తమ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అదే అదానీకి నాలుగు లక్షల కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఎలా కట్టబెట్టారో చెప్పాలి. అధికారం అంటే ఒకప్పుడు బాధ్యత.

ఇప్పుడు దోచుకొని దాచుకోవడానికి, అయినవాళ్లకు దోచి పెట్టడానికే అన్నట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌ రెడ్డి వంటివారు సేఫ్‌గానే ఉంటారు. ఈ రాజకీయాలు ఒంటబట్టడానికి షర్మిల వంటి వారికి జీవితకాలం సరిపోతుందో లేదో తెలియదు. ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే! కాంగ్రెస్‌ పార్టీతో సయోధ్య కుదుర్చుకున్న జగన్‌ విషయంలో ప్రధాని మోదీ ఏ వైఖరి తీసుకుంటారన్నది! అది కూడా త్వరలో తెలిసిపోతుంది. ఈ సందర్భానికి సరిపోలే మరో తాజా ముచ్చట చూద్దాం. ‘పుష్ప’ చిత్రంలో స్మగ్లర్‌ పాత్రలో నటించిన అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? అని చాలా మంది సోషల్‌ మీడియాలో గింజుకున్నారు. అర్జున్‌ స్మగ్లర్‌ పాత్ర మాత్రమే పోషించారు కానీ నిజ జీవితంలో ఆయన స్మగ్లర్‌ కాదని మరచిపోయారు. సినిమాల విషయంలో ఇలాంటి లాజిక్కులు వెతికేవారు నిజ జీవితంలో నేరగాళ్లకు, అవినీతిపరులకు ఓట్లు ఎలా వేస్తారు అని ఎందుకు ప్రశ్నించరు?

ఆర్కే

Updated Date - 2023-09-03T07:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising