ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒక చందమామ... వంద అమ్మలు

ABN, First Publish Date - 2023-09-11T00:19:51+05:30

పొగాకు తోటలో కలుపు తీస్తున్న చెల్లి గోపెమ్మ పెద్దిని అడిగాను మా అమ్మ ఎలా వుండేది అని. ఏపుగా పెరిగిన ఓ పొగాకు మొక్క దగ్గరకు తీసుకెళ్ళి పండిన వెడల్పాటి ఒక పొగాకు ఆకును కోసి నా చేతుల్లో పెట్టి మీ అమ్మ ఇలా బంగారు ఛాయలో...

పొగాకు తోటలో కలుపు తీస్తున్న చెల్లి గోపెమ్మ పెద్దిని అడిగాను మా అమ్మ ఎలా వుండేది అని. ఏపుగా పెరిగిన ఓ పొగాకు మొక్క దగ్గరకు తీసుకెళ్ళి పండిన వెడల్పాటి ఒక పొగాకు ఆకును కోసి నా చేతుల్లో పెట్టి మీ అమ్మ ఇలా బంగారు ఛాయలో వుండేది అన్నది. నా కళ్ళు మిలమిలా మెరిశాయి.

ఒక పున్నమి రోజు రాత్రి వాకిట్లో వెన్నెలను కొబ్బరాకు చాపగా అల్లి పిల్లల్నందర్నీ చుట్టూ కూకోబెట్టుకుని కాశీ మజిలీ కథ చెబుతున్న బిట్ర గొంతెమ్మ పెద్దిని అడిగాను మా అమ్మ ఎలా వుండేదని. చెబుతున్న కథనాపి కొంగ మెడలాంటి పొడుగాటి మెడను ఆకాశానికెత్తి అదుగో ఆ చందమామలా అందమైన మోము మీ అమ్మది, ఎక్కడ దాగునిపోయిందో అన్నది- నా కళ్ళు జలజలా వర్షించాయి-

తొలి పొద్దు కల్లంలో కుంకుమను ఆరబోసినట్టు, మిరపకాయలను ఆరబోస్తున్న నల్లటి కుదుమట్టపు దొండపాటి శాంతమ్మత్తను అడిగాను మా అమ్మ ఎలా వుండేది అని. చూపుడు వేలుతో తూర్పు వేపు పొడుస్తున్న సూర్యబింబాన్ని చూపిస్తూ మీ అమ్మ మొగం అలా వెలిగిపోయేదిరా అన్నది - నా రెండు కళ్ళూ రెండు ప్రమిదలయి వెలిగేయి.

ఎండాకాలం గోదారొడ్డున లంక భూముల్లో వేరుశెనగ తీత తీస్తున్న రేవు మీరమ్మ చిన్నమ్మను అడిగాను. మా అమ్మ ఎలా వుండేది అని. చేతిలోని చేటడు కాయలున్న వేరుశెనగ గుత్తిని నా చేతిలో పెట్టి, ఇదుగో ఈ గుత్తిలా మీ అమ్మ కలివిడి మనిషి, చుట్టూ పదిమంది మనుషులుండాల అంది - నా కళ్ళు నందివర్ధనాలై వికసించాయి.

ఓ వర్షాకాలపు చిరుజల్లుల పొద్దుటి పూట పొడవాటి గెడకర్ర డొంకినతో పెరట్లో మునక్కాయలు కోస్తున్న జిల్లెళ్ళ సావిత్రమ్మ బాప్పను అడిగాను, మా అమ్మ ఎలా వుండేది అని. తలూపుతున్న మునగ చెట్టు చిటారు కొమ్మని చూపిస్తూ, ఈ చెట్టులా మీ అమ్మ చెయ్యెత్తు మనిషిరా, మేం తలలు పైకెత్తి చూసేవాళ్ళం అంది - నా కళ్ళు నల్లని నేరేడుపళ్ళలా మిలమిల లాడేయి.

ఓ ఎండాకాలపు మిట్టమధ్యాహ్నపు వేళ గొంతాలమ్మ గుడి మండపం అరుగు మీద కూచుని దబ్బకాయలను కోస్తున్న పరమట జానకమ్మ బాప్పను అడిగాను, మా అమ్మ ఎలా వుండేది అని. కోస్తున్న కాయల్లోంచి మంచి నదురైన దబ్బకాయను ఎంచి నా చేతుల్లో వుంచి మీ అమ్మ దబ్బపండు ఛాయరా అంది. నా కళ్ళు పసుపుపచ్చని సింహాచలం సంపెంగ పూలయ్యాయి.

తెల్లారుతుండగానే కోళ్ళ గూడు తలుపు చెక్క పైకెత్తి, కోళ్ళను పెరట్లోకి తోలి, రోజూ నా కోసం రెండు కోడిగుడ్లను తెచ్చే పెట్టా సీతమ్మను అడిగాను, మా అమ్మ ఎలా వుండేది అని. మీ అమ్మ, గెద్దల మీదకు దూసుకెళ్ళే, రెక్కల కింద పిల్లలను దాచుకున్న పిల్లల కోడిలా వుండేది అంది. ఆ క్షణంలో నా చేతులకు రెక్కలు మెలిచాయి.

అక్క పెళ్ళిలో పేరంటం పనులు చేస్తూన్న మొలగజ్జెల సత్తమ్మ అమ్మను అడిగా, మా అమ్మ ఎలా వుండేది అని. అరగదీస్తున్న గంధాన్ని నా చెంపలకు రాసి, మీ అమ్మ గంధపు సానరాయిలా వుండేదిరా అన్నది - లోపల ఎక్కణ్ణుంచో కస్తూరి పరిమళం పొద్దు పోయాక పొలం పని నుండి వచ్చి దొడ్లో కర్రావు ఈనడానికి నొప్పులు పడుతుంటే చూడలేక ఇంట్లోకి వెళ్ళి చీర కొంగులో మొహం పెట్టుకుని ఏడుస్తున్న కోరూటి అక్కమ్మక్కను అడిగాను - మా అమ్మ ఎలా వుండేది అని. మీ అమ్మకేం గోవు మాలచ్చిమి, చందమామలాంటి నిన్ను కని మా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది అని. అపుడు నేననుకున్నాను కదా నాకేం ఎంచక్కా ఒక చందమామ వంద అమ్మలు కదా అని!

(‘‘చిన్నప్పుడు మీ అమ్మ నిన్ను బాగా చూసుకునేదా’’ అని అమాయకంగా అడిగిన చిరంజీవి శ్రీవర్ధన్‌కి)

శిఖామణి

98482 02526

Updated Date - 2023-09-11T00:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising