నాట్యకళా ప్రపూర్ణుడు
ABN, First Publish Date - 2023-03-11T01:54:46+05:30
గంగ యమునా సరస్వతీ మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం మీరు నాట్యకళా త్రివేణి ఆంధ్రనాట్యం, పేరిణి, నవ జనార్దనం మూడు నర్తనాంశాల సంగమం అమ్మానాన్నలు, అన్నదమ్ములు అనే కుటుంబ బంధాలకన్నా..
గంగ యమునా సరస్వతీ
మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం
మీరు నాట్యకళా త్రివేణి
ఆంధ్రనాట్యం, పేరిణి, నవ జనార్దనం
మూడు నర్తనాంశాల సంగమం
అమ్మానాన్నలు, అన్నదమ్ములు అనే
కుటుంబ బంధాలకన్నా
నాట్యకళతో మీ బంధం
మరింత బలీయమైనది
నాట్యకళ సేవ కోసం
గృహస్థ జీవనాన్ని కూడా త్యాగం చేసిన
త్యాగశీలి మీరు
మీనాక్షీ సుందరం పిళ్ళై
వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి
నాయుడుపేట రాజమ్మ
ఈ ముగ్గురే కదా!
మీ త్రిమూర్తులు
ఈ గురుత్రయం వర్షించిన ఆశీస్సులే కదా!
నాట్యకళా ప్రపూర్ణమై
మీలో పూచిన ఉషస్సులు
దేవదాసి నృత్య సంప్రదాయాన్ని
పదిలపరచి ముందు తరానికి చేర్చిన
మీ కృషిని నాట్య జగతి ఏనాటికీ మరువదు
తెలంగాణ నాట్యకళకు మాగాణమని
మీరు చేసిన పేరిణి నృత్యావిష్కరణం
సాక్ష్యం చెబుతుంది
మీ నాట్యశిక్షణాలయం
ఒక అచ్చమైన గురుకులం
నాట్యకళా తపోధనులై
మీరు నిర్మించిన నర్తన ఆశ్రమం
చరిత్ర విస్మరించిన తారామతి, ప్రేమావతి
నాట్యకళాకారిణుల చరితను
పునరుజ్జీవింపచేసిన ఘనతమీది
మీరు చెక్కిన నర్తన శిల్పాలే కాదు
అక్షర శిల్పాలు కూడా
నాట్యకళా జగతి సౌందర్యాన్ని
ద్విగుణీకృతం చేశాయి
అర్థ శతానికి దాటిన గ్రంథాలు
నాట్యకళామతల్లికి గంధాలు పూస్తున్నాయి
సాంఘిక దురాచారాలకు ఆహుతైన
కళాకారిణుల జీవితాల ముందు
మీరు నిలబెట్టిన నిలువుటద్దం రుద్రగణిక
నాట్యం మీ జీవితంలో ఒక భాగం కాదు
మీ జీవితమే నాట్యకళకు అంకితం
నటరాజ నామధేయం
మీ శిరస్సుపై వెలిగే కీర్తికిరీటం
– మద్దాళి రఘురామ్
(పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ
శతజయంతి సందర్భంగా)
Updated Date - 2023-03-11T01:54:46+05:30 IST