సకల శుభాలనిచ్చే రామయ్య తలంబ్రాలు
ABN, First Publish Date - 2023-03-29T00:03:43+05:30
జానక్యాః కమలాంజలి పుటే యాః పద్మరాగాయితాః అనగా సీతాదేవి చేతుల్లో ఉన్న ముత్యాలు పద్మ రాగమణుల్లా ప్రకాశించాయి....

భద్రాచలం, మార్చి 28: జానక్యాః కమలాంజలి పుటే యాః పద్మరాగాయితాః అనగా సీతాదేవి చేతుల్లో ఉన్న ముత్యాలు పద్మ రాగమణుల్లా ప్రకాశించాయి.... శ్రీరాముని శిరస్సుపై పడ్డ ఆ ముత్యాలు తెల్లని తలపాగా కాంతిలో కలిసి మంచి ముత్యాల్లా ప్రకాశించాయి..... నీలి మేఘఛాయ కలిగిన శ్రీరాముని దేహం నుంచి జారిన తలం బ్రాలు ఇంద్రలీలామణుల్లా ప్రకాశించాయి.... అలాంటి సీతారాముల కల్యాణ తలం బ్రాల ముత్యాలు అందరికి సఖల శుభాలను కలుగజేస్తాయని భక్తులు విశ్వసిస్తుండటంతో వాటిని ఎంతో పరమపవిత్రంగా భావిస్తారు.
నిత్యకల్యాణంలో పసుపురంగు.....శ్రీరామనవమి నాడు ఎర్ర రంగులో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రతి నిత్యం నిర్వహించే నిత్యకల్యాణంలో వినియోగించే తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కాని శ్రీరామనవమి నాడు వినియోగించే తలంబ్రాలు మాత్రం ఎర్రరంగులో ఉండటం విశేషం. ఇది మతసామరస్యంకు ప్రతీకగా ఒక విధానంలో పేర్కొంటుంటారు. ఆనాడు తానీషా గులాల్ తదితర మధుర ద్రవ్యాలను పంపిస్తే స్వామి వారికి వినియోగించే తలంబ్రాలు ఎర్రరంగులో ఉన్నాయని సామాజిక అర్దంలో చెబుతున్నారు. కాగా సూర్యవంశంలో శ్రీరామచంద్రుడు పుట్టినందున సూర్యుడికి ప్రీతికరమైన ఎర్రటి తలంబ్రాలను ఉపయోగిస్తున్నారని ఆధ్యాత్మికవాదులు పేర్కొంటుంటారు.
రామయ్య కల్యాణ తలంబ్రాలు ఎంతో ప్రసిద్ధి
భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. రా ష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి ఈ తలంబ్రాల కోసం లక్షలాది మంది భక్తులు ఆరాట పడుతుంటారు. వివాహాల సమయంలో రామయ్య కల్యాణంలో వినియోగించిన తలంబ్రాలను అధిక శాతం మంది వినియోగిస్తుంటారు. దీని వలన నవదంపతులు సుఖ సంతోషాలతో అనోన్యన్యంగా జీవిస్తారనేది భక్తుల ప్రగాడ విశ్వాసం. అందులో భాగంగానే భద్రాద్రికి వచ్చిన ప్రతి ఒక్కరు రామయ్య తలంబ్రాలను తీసుకెళ్లేందుకు ఆరాటపడుతుంటారు. ఈ నేపధ్యంలో నిత్య కల్యాణంలో వినియోగించినా లేదా శ్రీరామనవమిలో వినియోగించిన తలంబ్రాలైనా వధూవరుల కల్యాణ సమయంలో, అలాగే నవ దంపతులను ఆశీర్వదించే సమయంలో వినియోగిస్తుంటారు. అందుకే సీతారాముల కల్యాణ తలంబ్రాలకు అంతటి ప్రాధాన్యత.
Updated Date - 2023-03-29T00:03:43+05:30 IST