ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘సహకార’ స్ఫూర్తికి ఆర్బీఐ తూట్లు!

ABN, First Publish Date - 2023-09-02T01:31:15+05:30

ఇటీవల ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, మితిమీరిన జోక్యం సహకార బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి....

ఇటీవల ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, మితిమీరిన జోక్యం సహకార బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. సహకార బ్యాంకులను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం ఆర్బీఐని ఆయుధంగా వాడుకుంటోంది.

సహకార వ్యవస్థ (కోపరేటివ్‌ మూమెంట్‌) ఆదర్శాలతో బ్యాంకింగ్‌ రంగంలో పనిచేస్తున్న సంస్థలే సహకార బ్యాంకులు. బ్రిటీష్‌ కాలంలో కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ చట్టం–1904, 1912 నాటి సహకార సంఘాల చట్టాల కారణంగా భారత్‌లో ఈ సహకార బ్యాంకుల ఏర్పాటు జరిగింది. 1950ల నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇవి తమ సేవలను ప్రారంభించాయి. నేడు దేశంలో పనిచేస్తున్న వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా ఇవి చిన్న స్థాయి ఆర్థిక సంస్థలే.

ఈ బ్యాంకులకు సభ్యులే యజమానులు. స్టేట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌, సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో– ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఆధ్వర్యంలో ఆయా చట్టాల పరిధిలో, డైరక్టర్ల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది. బ్యాంకు సభ్యుల నుంచే డైరెక్టర్లు, బోర్డు సభ్యులు ఎన్నికల ద్వారా పాలకవర్గంగా ఏర్పడి కార్యకలాపాలను నిర్వహిస్తారు. అయితే బ్యాంకింగ్‌ రెగ్యులేషన్స్‌ యాక్ట్‌–1949కి 1965లో చేసిన సవరణల ప్రకారం ద్వంద్వ నియంత్రణ అమలులోకి వచ్చి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు మాత్రం ఆర్బీఐ నియంత్రణ కింద జరుగుతున్నాయి. ఈ బ్యాంకులు ‘నో లాస్‌ – నో ప్రాఫిట్‌’ అనే నినాదంతో పని చేస్తాయి. తమ కార్యకలాపాల ద్వారా సాధిస్తున్న మిగులులో నుంచి 25 శాతం నిధులను రిజర్వు ఫండ్‌గా, 10 శాతం నిధులను విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వినియోగించడం కోసం, ఒక శాతం సహకార విద్యానిధికి కేటాయించి, తక్కిన నిధులను సభ్యులకు డివిడెండ్ల రూపంలోను, ఉద్యోగులకు బోనస్‌ రూపంలోను కేటాయింపులు చేస్తాయి.

ఈ బ్యాంకులు ప్రభుత్వం నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలను, సహకారాన్ని ఆశించకుండా ప్రజల మద్దతుతో ప్రజల కోసమే పని చేస్తున్నాయి. సమాజంలోని పేద, మధ్యతరగతి సహా వివిధ రంగాలకు చేయూతనిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తున్న అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు వాటి పరిధిలో ప్రజలల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంలో ముందున్నాయి.

అయితే ఇటీవల ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, మితిమీరిన జోక్యం సహకార బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. సహకార బ్యాంకులకు సంబంధించిన బ్యాంకింగ్‌ కార్యకలాపాల విషయంలోనే కాకుండా తమకు ఏ మాత్రం సంబంధంలేని పాలకవర్గాల విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ఆర్బీఐ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతున్నది. తన పరిధిలోకి రాకున్నా సహకార బ్యాంకుల పాలకవర్గాలపై నిర్బంధాలకు పాల్పడుతున్నది. బహుళ రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న అర్బన్‌ బ్యాంకుల పాలకవర్గం విషయంలో అది చూపిన అత్యుత్సాహమే ఇందుకు ఉదాహరణ. పాలకవర్గం విషయంలో రిజర్వు బ్యాంకుకు ఎటువంటి హక్కులు లేవు. బ్యాంకింగు కార్యకలాపాల వరకే వారికి నియంత్రణ ఉంటుంది. అయితే దేశంలోని కొన్ని అర్బన్‌ బ్యాంకులు తమ పాలకవర్గంలో డైరెక్టర్లుగా ఎన్నిక కాని వ్యక్తులకు ఎమిరిటస్‌ చైర్మన్‌, గ్రూప్‌ చైర్మన్‌ తదితర పేర్లతో ప్రత్యేక హోదాలు ఇస్తున్నాయని, ఆ పదవులను తొలగించాలని ఆదేశిస్తూ ఆర్బీఐ ఏప్రిల్‌ 21, 2022న సర్క్యులర్‌ను జారీ చేసింది.

రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం దేశంలో 1,514 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు పని చేస్తున్నాయి. ఇందులో 52 బ్యాంకులకే షెడ్యూల్డ్‌ హోదా ఉంది. మిగతా అర్బన్‌ బ్యాంకులకు షెడ్యూల్డ్‌ హోదా ఇవ్వకుండా ఆర్బీఐ నియంత్రణ పెట్టింది. ఎన్నిసార్లు కోరినా షెడ్యూల్డ్‌ హోదా ఇవ్వకుండా నిరాకరించడం, సహకార బ్యాంకుల కన్నా చిన్నస్థాయిలో ఉన్న ప్రైవేటు బ్యాంకులకు మాత్రం షెడ్యూల్డ్‌ హోదా కట్టబెట్టడం సహకార రంగంపై ఆర్బీఐకి ఉన్న వివక్షకు తార్కాణం.

సహకార బ్యాంకులను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం ఆర్బీఐని ఆయుధంగా వాడుకుంటోందనే చర్చ నడుస్తున్నది. ఇందుకోసం సహకార బ్యాంకులే లక్ష్యంగా కరోనా క్లిష్ట సమయాన్ని వినియోగించుకున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో పార్లమెంటులో ఎటువంటి చర్చలకు అవకాశం లేకుండా బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం–1949కి అనేక సవరణలు చేశారు. ఈ సవరణలన్నీ సహకార అర్బన్‌ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికే. సహకార సిద్ధాంతానికి, సూత్రాలకు విరుద్ధంగా చేసిన ఈ సవరణలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. బ్యాంకు సీఈవో, ఎండీల నియామకాల విషయంలో ఆర్బీఐ జారీ చేసిన ఉత్తర్వులపై వివిధ హైకోర్టులు స్టే విధించినా పాలకవర్గంలోని వ్యక్తుల అర్హతలు, పదవీ కాలం, సంస్థ నుంచి సభ్యులు వైదొలగడం, షేరు ధనం వెనక్కు తీసుకోవడం, ఎన్నికలు... ఇలా తమకు సంబంధంలేని ప్రతీ విషయంలోనూ ఆర్బీఐ దుందుడుకు చర్యలకు దిగుతున్నది.

ఆర్బీఐ అంతర్గత కార్యనిర్వహణ గ్రూప్‌ 2020 నవంబర్‌ 20న సమర్పించిన నివేదికలో కార్పొరేట్లకు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. ఈ నివేదికలో 1949 బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి కొన్ని సవరణలు చేసి బ్యాంకింగ్‌ రంగంలోకి బడా కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలను అనుమతించాలని సూచించడమే ఇందుకు కారణం. దీంతో పాటు రూ.50వేల కోట్ల ఆస్తులు ఉండి, బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వాలనే మరో కీలకమైన సిఫారసు చేసింది. ఈ సిఫారసులు అమలైతే బడా కార్పొరేట్లను దొడ్డిదారిన బ్యాంకింగ్‌ రంగంలోకి అనుమతించినట్లే. సాధారణంగా ఇటువంటి నివేదికలు సమర్పించడానికి కనీసం రెండేళ్ళ సమయం పడుతుంది. కానీ సదరు గ్రూప్‌ కేవలం నాలుగు నెలల్లోనే తమ సిఫార్సులను ఆర్బీఐకి సమర్పించడం వెనుక కార్పొరేట్ల ఒత్తిడి ఉందనేది ఆర్థిక రంగ నిపుణుల విమర్శ. ఈ విషయంలో కార్పొరేట్‌ సంస్థల ఒత్తిడికి లొంగిపోతే ఇప్పటికే పెరిగిపోయిన మొండి బాకీల భారం నుంచి బ్యాంకింగ్‌ రంగాన్ని బయటపడవేసే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ తరహా విధానాలతో ఏర్పాటయ్యే బ్యాంకులేవీ సామాజిక బాధ్యతను నిర్వర్తించవు. కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కరువు కాటకాల కాలంలో సామాన్యులకు అప్పులివ్వటానికి నిరాకరిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఆర్బీఐ ఏ కార్పొరేట్‌ సంస్థకూ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతివ్వలేదు. ఇటువంటి ప్రతివాదనల నేపథ్యంలో కార్పొరేట్ల ఒత్తిడికి తలొగ్గకుండా భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తుందా అనేది ప్రశ్నార్థకమే.

సి.ఎన్‌ క్షేత్రపాల్‌ రెడ్డి

Updated Date - 2023-09-02T01:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising