ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Department of Revenue : రెవెన్యూ శాఖపై ఎందుకీ పగ?

ABN, First Publish Date - 2023-08-05T03:22:08+05:30

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీఆర్‍ఏలు, వీఆర్ఓలు గణనీయమైన పాత్రను పోషించారు. ప్రభుత్వ పథకాలను మారుమూల గ్రామాల దాకా చేరవేసే వీరు ఉద్యమ సమయంలో

Department of Revenue

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీఆర్‍ఏలు, వీఆర్ఓలు గణనీయమైన పాత్రను పోషించారు. ప్రభుత్వ పథకాలను మారుమూల గ్రామాల దాకా చేరవేసే వీరు ఉద్యమ సమయంలో నలభై రెండు రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని వ్యవస్థలను స్తంభింపచేశారు. ఇప్పుడు ఈ మాటలను గుర్తు చేస్తే రాష్ట్ర పాలకులు చిరాకుపడుతున్నారు.

కావలికారు, శేర్‌శింది, మస్కూరి, నీరడి, తోటి తలారి వంటి పేర్లతో పిలువబడుతూ, గౌరవ సూచనగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా గుర్తింపు పొందిన వీరు రాష్ట్రం సాధించినప్పుడు ఇరవై మూడు వేల పైచిలుకుగా ఉండేవారు, ఇప్పుడు 20,555మంది ఉన్నారు. మిగతా ఖాళీలన్నీ ఏమైనాయో ఎవరికీ తెలియడం లేదు. జీవో నెం.52 ప్రకారం నియామక ప్రక్రియలో వీరు అదే గ్రామస్థులై ఉండాలి, అక్కడే నివాసం ఉండాలి. ఇలా ఆ గ్రామంపై పూర్తి స్థాయిలో అవగాహన, పట్టు కలిగి ఉన్నవారినే నియమించారు. రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ, అర్థగణాంక, ఆరోగ్య, సర్వే, పోలీసు శాఖల అధికారులు, ఇంకా ఇతర వీఐపీలు ఎవరు గ్రామాలలోకి వచ్చినా వీఆర్‍ఏలు, వీఆర్‌ఓలు వారికి సహరించేవారు. వారి అధికారిక అవసరాలను, వారికి అవసరమైన చిన్నచిన్న పనులను వీరే పూర్తి చేసిపెట్టేవారు. వీరి వల్ల ఏ అధికారికైనా కొంత భరోసా ఉండేది. గ్రామానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం అంతా వీఆర్‌ఏల వద్ద ఉంటుందన్న నమ్మకంతో అధికారులు వచ్చేవారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో వీఆర్‌ఏ ఎందుకూ కొరగానివాడైపోయాడు.


అసలు వీరిని తొలగించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? రెవెన్యూ వ్యవస్థలో వీరిని కూకటివేళ్ళతో సహా పెరికివేయాలనే ఆలోచన ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం వచ్చింది? అత్యంత పేదలకు రేషన్‌ దుకాణంలో బియ్యం వచ్చినయి అని సాటింపు వేయటం మొదలుకొని మధ్యతరగతివారికి, ముఖ్యంగా గ్రామాలలోని దళిత, ఆదివాసీలకు ఏ రకమైన కొత్త ప్రభుత్వ పథకాలు వచ్చినా ఆ సమాచారాన్ని చేరవేస్తూ, అందరికీ అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు ఈ పని ఎవరు చేస్తారు?

ఈ ఉద్యోగంలో ఎక్కువగా వెనుకబడిన తరగతి కులాలకు చెందిన బీసీలు, దళితులు, అక్కడక్కడ మైనారిటీల వారు ఉన్నారు. క్రమంగా ఆధిపత్య కులాలవారూ కొంతమంది వచ్చిచేరారు. ఇందులో కొందరు ముందు జాగ్రత్తగా శాఖాపరమైన పరీక్షలు రాసి పదోన్నతి పొంది అధికారులయ్యారు. మరికొందరు సర్వీసు కమిషన్‌ ద్వారా చేరారు. డిగ్రీ, ఇంటర్‌, పదవ తరగతి చదువుకున్నవారున్నారు, అరకొర చదువులున్న వారున్నారు. వీరంతా పేద కుటుంబాలవారు, వీరి సంఖ్య పదివేల మందిదాకా ఉండవచ్చు. గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించి వ్యవస్థను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులను కూడా తొలగించి వారిని ఇతర శాఖలకు సర్దడంతో గ్రామ రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో నీరు గార్చింది. దీనివలన ప్రభుత్వానికి జరగబోయే నష్టం ఏమిటో ఎవరికీ తెలియడం లేదు.


రెండవసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే రెవెన్యూ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం ఆరంభమైంది. ఆఘమేఘాల మీద వీఆర్‍ఓలను పగలు రేయి అనకుండా వినియోగించి పేర్లు, విస్తీర్ణాలు తప్పుల తడకగా ఉన్న భూమి రికార్డులను చట్టబద్ధత లేని ధరణి పోర్టల్‌లో నింపారు. ఈ పని చేసినందుకు వీఆర్‌ఓలకు అవార్డులు రివార్డులు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఆర్డీఓ, జాయింట్‌ కలెక్టర్ల అధికారాలన్నీ తీసివేసారు. సంబంధిత కోర్టు కేసులన్నీ పెండింగులోనే ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థ పని చేయలేని పరిస్థితికి వచ్చింది. ట్రిబ్యునళ్ళు కూడా పనిచేయకుండా చేసారు. తహశీల్దారులను జాయింట్‌ సబ్‌ రిజిష్ట్రారులంటూ కుర్చీకే పరిమితం చేసారు.

వీఆర్‌ఓలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసేటప్పుడు వీఆర్‌ఏలకు స్కేలు ఇస్తూ రెవెన్యూ శాఖలో రెగ్యులరైజ్ అయ్యేలా చేస్తామని మాట ఇచ్చారు. కొన్ని సర్వీసు రూల్స్‌ తయారు చేస్తామన్నారు. మాట నిలబెట్టుకునే పరిస్థితి కనబడకపోవడంతో వీ‌ఆర్‌ఏలు కూడా ఆందోళనలో భాగమయ్యారు. కొన్ని వాగ్దానాలతో సమ్మె విరమింప చేసారు. రెండేళ్ళ తర్వాత క్రమబద్ధీకరణ పేరుతో పదివేల మందిని నిరక్షరాస్యులుగా గుర్తించారు. ఇప్పుడున్న 20,555 మందిలో దాదాపు సగం మందిని అనర్హులంటూ నీటిపారుదల, వ్యవసాయం, మున్సిపాలిటీ, పంచాయితీరాజ్‌శాఖలోకి మార్చాలనుకుంటున్నారు. మరికొంత మందిని లష్కర్‌లుగా సర్దిపెడతామంటున్నారు. నిరక్షరాస్యులయిన వీఆర్‌ఏలను ఏం చేస్తారనేది ఇప్పటికీ స్పష్టత లేదు.

కొంత మంది వీఆర్‌ఏలకు మున్సిపాలిటీలోని పనులను, గ్రామ పంచాయితీలో పన్ను వసూళ్ళను, మిషన్‌ భగీరథ పనులలాంటి కొన్ని పనులను అప్పగిస్తామంటున్నారు. మరి సొంత ఊరిని కాదని స్థానచలనం చేసి వీరిని ఎలా సర్దుతారో తెలియదు. ఉన్నతాధికారుల దయాదాక్షిణ్యాల మీద వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగ ఇంత కసరత్తు ఎవరి మేలు కోసమో అర్థం కావడం లేదు. వీరికి పోస్టింగ్‌ అయిన మరుసటి రోజు నుంచి గ్రామ, వార్డు స్థాయి నుంచి కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దారులకు ఉన్న మొత్తం చెయిన్ లింక్‌ కట్‌ అవుతుంది. ఈ గ్యాపును ఎలా పూడుస్తారు? ఇప్పుడు వీఆర్‍ఏలు అనబడే వారి పేరు మారిపోతుంది, ఉద్యోగ బాధ్యతలు మారిపోతాయి, ప్రతి తహశీల్దారు కార్యాలయం మానవవనరులు లేని బూత్‌బంగ్లాలుగా మారతాయి. వ్యవస్థను సంస్కరించడం పేరు మీద చేస్తున్న ఈ మార్పులు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి మేలు చేసేవి కాదు.

గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించి వ్యవస్థను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం, గ్రామ రెవెన్యూ సహాయకులను కూడా తొలగించి వారిని ఇతర శాఖలకు సర్దడంతో గ్రామ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది. వ్యవస్థను సంస్కరించడం పేరు మీద చేస్తున్న ఈ మార్పులు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి మేలు చేసేవి కాదు.

వి. బాలరాజ్‌

రిటైర్డు తహశీల్దార్‌

Updated Date - 2023-08-05T03:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising