‘జాతీయ’ ప్రయాణంలో బీఆర్‌ఎస్‌కు జ్ఞానోదయం?
ABN, First Publish Date - 2023-02-23T08:06:33+05:30
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే, అది తెలంగాణలో తనకు ప్రతికూల పరిణామాలకు కారణమవుతుందని మొదట భయపడిన బీఆర్‌ఎస్ అధినేత, ఇప్పుడు అందుకు సిద్ధపడిపోయారు....
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే, అది తెలంగాణలో తనకు ప్రతికూల పరిణామాలకు కారణమవుతుందని మొదట భయపడిన బీఆర్‌ఎస్ అధినేత, ఇప్పుడు అందుకు సిద్ధపడిపోయారు. ముందే అసెంబ్లీని రద్దు చేస్తే, రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ముందరి కాళ్లకు బంధం వేసింది. కాంగ్రెస్‌తో అనంతర సఖ్యతకు సిద్ధపడి అందుకు తగిన సూచనలు ఇస్తున్నారు.
మొత్తానికి పెద్దాయన ఏదో ఒక సమాధానం చెప్పారు. తనని ఉద్యమనేతను చేసి, ముఖ్యమంత్రిని చేసిన ‘తెలంగాణ’ ను వదులుకుని ‘భారత్’ ను ఎందుకు ఆశ్రయించారో, అప్పటిదాకా ఆయన ఒక్కరికి తెలిస్తే తెలుసునేమో కానీ, నెంబర్ టూ, త్రీ, ఫోర్ దగ్గర నుంచి నమోదైన సభ్యులలో చిట్టచివరి పేరు దాకా ఎవరికీ తెలియదు. వ్యూహాలలో ఆరితేరిన చాణక్యుడు కదా, ఏదో అంతరార్థం ఉంటుంది లెమ్మని అందరూ సమాధానపడ్డవారే. ఇక ఈ ఉత్కంఠను కొనసాగించడం ఎందుకనుకున్నారో ఏమో, ఆయనే అసెంబ్లీలో గుట్టు విప్పేశారు! ‘‘దేశం ఇట్లా ఉండేసరికి చూడలేకపోతున్నాను, అందుకే, ఈ రిటైరయ్యే వయస్సులో బీఆర్‌ఎస్‌ను ఎత్తుకున్నాను’’ అన్నారాయన. చిదంబర రహస్యం! వడ్లగింజలో బియ్యపు గింజ! అయినా సరే, ఒక అధికారిక కారణం అయితే తెలిసింది! నిజమైన ప్రజానాయకుడు, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంటే సహించలేడు మరి!
ప్రాంతీయపార్టీల యుగం ముగిసిందని కేసీఆర్ అనుకుని ఉండరు కానీ, జాతీయ బలశాలి పార్టీని ఎదుర్కొనాలంటే, జాతీయ రంగస్థలాన్నే ఎంచుకోవాలని ఆయనకు అనిపించి ఉంటుంది. ‘విశ్వగురువులు కాదు, దేశగురువులు కావాలి’ అన్న ఆయన నినాదస్థాయి ప్రకటన, కేవలం నరేంద్రమోదీ మీద విమర్శనే కాదు, దేశగురువు కావాలన్న తన సొంత లక్ష్యాన్ని కూడా సూచిస్తోంది. తన జాతీయ ప్రస్థానానికి ప్రేరణ ఏమిటో ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు కానీ, బిజెపి మీద పోరాటంలో విశ్వసనీయత పాలు పెరిగింది. పొరుగురాష్ట్రాల పార్టీలకు, ప్రతిపక్షపార్టీలకు ఉదారంగా ధనసహాయం ఇవ్వచూపుతున్నారని చెప్పుకుంటున్న మాటలు కొన్ని అనుమానాలను ఇంకా మిగుల్చుతున్నా... పరిస్థితుల సాక్ష్యం చూస్తే, కెసిఆర్ ప్రయాణం జాతీయస్థాయి సమీకరణలకు లోబడే నడుస్తున్నదని అనిపిస్తున్నది.
ఈమధ్య బాగా వినిపిస్తున్న మాట, బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఏదో జరుగుతోందని. అవగాహన కుదిరిపోవడమో, కుదిరే అవకాశం ఉండడమో అసాధ్యమేమీ కాదన్న వాతావరణం ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయాలలో వ్యాపించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటై ఎన్నికలకు వెడితే, అది బిజెపికి లాభిస్తుందన్న ఒక అభిప్రాయం ఉన్నది. ఫలితాల అనంతరం జట్టు కట్టే అవకాశం సైద్ధాంతిక స్థాయిలో కొత్తదేమీ కాదు కానీ, ప్రస్తుత స్థితిలో అటువంటి సూచన కూడా రాష్ట్ర ప్రధాన రాజకీయ శక్తులను రెండు ముఖాముఖి శిబిరాలుగా మార్చివేస్తుంది. మరి, ఈ అభిప్రాయాలు, సూచనలు వ్యాప్తి కావడానికి కారణం బీఆర్‌ఎస్ వ్యతిరేకులు కాదు. స్వయంగా కెసియారే ద్రవ్యవినియోగ బిల్లు ప్రసంగంలో, మోదీతో పోల్చి మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించారు. తాము కొంతకాలం భాగస్వామిగా ఉన్నందువల్ల కాబోలు యుపిఏ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు. చేసింది చెప్పుకోవడం కూడా చేతకాదని కాంగ్రెస్ ను ముద్దుముద్దుగా మందలించారు కానీ, గతంలో వలె తీవ్రభాషను ఆశ్రయించలేదు. కేసీఆర్ మాటల తరువాతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వచ్చాయి.
ఏదో సర్వేను సాకుగా చెబుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎవరికీ సొంతంగా మెజారిటీరాని సన్నివేశాన్ని కోమటిరెడ్డి ప్రతిపాదించారు. నలభై యాభై సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని, ప్రభుత్వ స్థాపనకు బీఆర్‌ఎస్ తో కలవవలసి వస్తుందని, జట్టు కట్టడం తప్ప రెండు పార్టీలకు వేరే గత్యంతరం ఉండదని ఆయన అంటున్నారు. ఇటువంటి లెక్కల నుంచి అనధికారికంగా ఊరట పొందడం కాంగ్రెస్ కు ఇప్పుడున్న స్థితిలో సహజమే కావచ్చును కానీ, బీఆర్‌ఎస్ కూడా ఆ సంభావ్యతను సానుకూలంగా చూస్తున్నదా? తాను సొంతంగా నెగ్గలేకపోయినా, ప్లాన్ బి ఒకటి ఉందని ధీమా పడుతోందా?
భారతీయ జనతాపార్టీ తెలంగాణలో ఈ స్థాయిలో బలం పుంజుకోవడం వెనుక, ఆ పార్టీ ప్రయత్నంతో పాటు, పేరుమార్చుకోని కాలంలోని టిఆర్‌ఎస్ చేసిన దోహదం, ఇప్పటికీ కుమ్ములాటలతో తమను తామే బలహీనపరుచుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ అందిస్తున్న సహకారం సామాన్యమైనవి కావు. ఇప్పుడు కనీసం బీఆర్‌ఎస్ లో కొంత వాస్తవ స్పృహ పెరుగుతోంది. నెలా రెండు నెలల నుంచి బిజెపి వేడి చల్లారుతున్నట్టు కనిపిస్తున్నా, ఎప్పుడంటే అప్పుడు తిరిగి రాజుకోగల శక్తి ఆ పార్టీకి ఉన్నదని దానికి తెలుసు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే, అది తెలంగాణలో తనకు ప్రతికూల పరిణామాలకు కారణమవుతుందని మొదట భయపడిన బీఆర్‌ఎస్ అధినేత, ఇప్పుడు అందుకు సిద్ధపడిపోయారు. ముందే అసెంబ్లీని రద్దు చేస్తే, రాష్ట్రపతిపాలన వచ్చే అవకాశం ముందరి కాళ్లకు బంధం వేసింది. కాంగ్రెస్ తో అనంతర సఖ్యతకు సిద్ధపడి అందుకు తగిన సూచనలు ఇస్తున్నారు.
రాష్ట్రంలో పెద్ద మార్పు లేదు కానీ, జాతీయస్థాయిలో మాత్రం కాంగ్రెస్ లో కొంత దిద్దుబాటు మొదలయింది. ప్రతిపక్షాల సమీకరణ బాధ్యత తమ మీద ఉన్నదన్న గుర్తింపు, ఒక సమైక్య స్వరాన్ని రూపొందించవలసిన అవసరాన్ని ఆ పార్టీ గుర్తిస్తున్నది. జోడో యాత్రకు ముందు, కాంగ్రెస్ ఇంకా బేలగానే ఉన్నప్పుడు, కెసిఆర్ ఎన్నో అనుమానాస్పద జాతీయ ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ తో స్నేహంలో ఉన్న పార్టీలతో ఏవో ప్రతిపాదనలు చేయడానికి ప్రయత్నించారు. కానీ, డిఎంకె ఒక్కటే కాంగ్రెస్ కు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న స్థితి నుంచి, ఉద్ధవ్ శివసేన, యునైటెడ్ జనతాదళ్ లు కూడా దీర్ఘకాలిక స్నేహితులుగా నిలబడిన దశకు కాంగ్రెస్ క్రమంగా చేరుకుంది. బీఆర్‌ఎస్ ప్రయత్నాలకు శాశ్వత అతిథిగా కనిపించిన జనతాదళ్ (ఎస్) కూడా కాంగ్రెస్ తో స్నేహానికే మొగ్గుచూపుతున్నది. తృణమూల్ కాంగ్రెస్, ఆప్ కూడా తమకు ఉన్న ప్రత్యేకమైన ఆశలను వాస్తవిక స్థాయికి కుదించుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అంతెందుకు, బీఆర్‌ఎస్ కూడా మొన్నటి బడ్జెట్ సమావేశాలలో సొంత నిరసనలు చెప్పడంతో పాటు, కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ తో గొంతుకలపవలసి వచ్చింది. మునుపు బిజెపితో కలసి నడిచిన ప్రాంతీయ పక్షాలు, ఇప్పుడు పిలిచినా వెళ్లడానికి సుముఖంగా లేవని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ సూచనప్రాయమైనవే కావచ్చు, స్వల్పమైనవే కావచ్చు, కానీ, జాతీయచిత్రపటంలో మార్పు కనిపిస్తున్న మాట సత్యం.
నాందేడ్ వంటి పొరుగు రాష్ట్ర పట్టణాల్లో సభలు పెట్టుకోవడం, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయడం వంటి చిన్న చిన్న పనులు కొనసాగించవచ్చునేమో కానీ, బీఆర్‌ఎస్ తాను సొంతంగా నిర్వహించగలిగే జాతీయ రాజకీయ కర్తవ్యాలు ఏమైనా ఉంటాయా అన్నది ఒక సందేహం. దేశపరిస్థితిని చూసి బీఆర్‌ఎస్ ను స్థాపించానని చెప్పినప్పుడు, ఆ ప్రకటనకు తగిన స్థాయిలో ఆచరణ, విస్తరణ, విజృంభణ ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కాంగ్రెస్ క్రియాశీలంగా మారని సన్నివేశంలో, బీఆర్‌ఎస్ ఏదో ఒక పాత్రను నిర్వహించగలిగి ఉండేదేమో కానీ, రాయపూర్ ప్లీనరీ తరువాత జాతీయరాజకీయాలలో చలనశీలత పెరుగుతుందన్న ఆశాగానాలు నిజమైతే, అందుకు ఆస్కారం తక్కువ.
బీఆర్‌ఎస్ ను జాతీయ దృష్టితోనే ప్రారంభించానని కెసిఆర్ చెబుతున్నా, దానికి 2023 అసెంబ్లీ ఎన్నికలే ప్రధానమని పరిశీలకులు అంటున్నారు. 2023, 24 రెండూ ముఖ్యమేనని అనుకుంటే కూడా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సొంతంగా మెజారిటీ సంపాదించుకుంటేనే, అది 2024 సాధారణ ఎన్నికలలో ఎక్కువ ఎంపీ స్థానాలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ కు కొద్దిపాటి అధికారం దక్కకపోతే, తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖాతాలో జమచేసుకోవచ్చు. ఇక కేంద్రంలో తగిన భాగస్వామ్యం పొంది, బిజెపికి కానీ, బిజెపీయేతర కూటమికి కానీ, చేయూతను ఇచ్చే అవకాశమూ ఉంటుంది. ఇంత జరిగాక, బిజెపితో జట్టు కడుతుందా అన్న సందేహం కలగడం సహజమే. కానీ, రాజకీయాలలో ఏది అసహజం? కానీ, ఈ అవకాశాలు పొందడానికి జాతీయ పార్టీ కావలసిన అవసరమేమీ లేదు. జాతీయ రంగంలో తనను మహా నాయకుడిగా అంగీకరించగల బలమైన మిత్రులు, మిత్రపక్షాలు ఎవరూ లేరని కెసిఆర్ కు ఈ పాటికి అర్థమయి ఉండాలి.
కేంద్రప్రభుత్వం తడాఖా ఏమిటో నెమ్మదిగా అనుభవంలోకి వస్తున్న కెసిఆర్, నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకుంటే, తనకున్న శక్తినైపుణ్యాల ఆధారంగా జాతీయ ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో గట్టి భాగస్వామి కాగలరు. డబ్బుతో మద్దతును, మిత్రులను సంపాదించుకోవచ్చుననే భ్రమను వీడితే, నిజమైన స్నేహాలు ఆయనకు సమకూరతాయి. ఏ కారణంతో చేసినా బిజెపి ప్రభుత్వం మీద ఆయన తీసుకున్న వైఖరి జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. పొందవలసినది విశ్వసనీయత మాత్రమే. ఆయనే గతంలో చెప్పినట్టు, ప్రత్యామ్నాయ కూటములు కాదు, ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. విధానాలలో సూత్రబద్ధమైన తేడా లేకపోతే, వ్యతిరేకతలు నామమాత్రం అవుతాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను, నిరసనకారులను ఏ తీరుగా బాధిస్తున్నదో, తాను కూడా రాష్ట్రంలోని ఇతరులను అట్లా వేధించకూడదన్న తెలివిడి తెచ్చుకోవడం కూడా బీఆర్‌ఎస్ నేతకు అవసరం.
కేంద్రప్రభుత్వం తడాఖా ఏమిటో నెమ్మదిగా అనుభవంలోకి వస్తున్న కెసిఆర్, నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకుంటే, తనకున్న శక్తినైపుణ్యాల ఆధారంగా జాతీయ ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో గట్టి భాగస్వామి కాగలరు. డబ్బుతో మద్దతును, మిత్రులను సంపాదించుకోవచ్చుననే భ్రమను వీడితే, నిజమైన స్నేహాలు ఆయనకు సమకూరతాయి. ఏ కారణంతో చేసినా బిజెపి ప్రభుత్వం మీద ఆయన తీసుకున్న వైఖరి జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. పొందవలసినది విశ్వసనీయత మాత్రమే. ఆయనే గతంలో చెప్పినట్టు, ప్రత్యామ్నాయ కూటములు కాదు, ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. విధానాలలో సూత్రబద్ధమైన తేడా లేకపోతే, వ్యతిరేకతలు నామమాత్రం అవుతాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను, నిరసనకారులను ఏ తీరుగా బాధిస్తున్నదో, తాను కూడా రాష్ట్రంలోని ఇతరులను అట్లా వేధించకూడదన్న తెలివిడి తెచ్చుకోవడం కూడా బీఆర్‌ఎస్ నేతకు అవసరం.
Updated Date - 2023-03-06T09:13:18+05:30 IST