జనం లెక్కిస్తూనే ఉంటారు, జాగ్రత్త!
ABN, Publish Date - Dec 14 , 2023 | 05:25 AM
పరమ మొరటుగా, దూషణభూషణ తిరస్కారాలతో వర్ధిల్లే మన రాజకీయరంగంలో ఉన్నట్టుండి కొన్ని సుభాషితాలు కూడా వినిపిస్తాయి. దళసరి చర్మధారులైపోయిన వారు కూడా...
పరమ మొరటుగా, దూషణభూషణ తిరస్కారాలతో వర్ధిల్లే మన రాజకీయరంగంలో ఉన్నట్టుండి కొన్ని సుభాషితాలు కూడా వినిపిస్తాయి. దళసరి చర్మధారులైపోయిన వారు కూడా సున్నితత్వం గురించి చెబుతారు. దుమ్ముకొట్టుకుపోయిన వాతావరణంలోకి సంస్కారం, మన్నన, మర్యాద, మనోభావాలు, ఒకటనేమిటి అనేక మృదుమధుర పదాలు సీతాకోకచిలుకల్లా ఎగిరివస్తాయి.
ఎన్నికలైపోయాక ‘దేశం దగాపడిన ఆడకూతురులా’ ఉంటుందని పతంజలి తీవ్రాతితీవ్రంగా రాశారు. పోలింగ్ ముగిసేనాటికి ఓటరు చెవులూ కళ్లూ మనసూ పచ్చిపుండు అవుతాయి. హీలింగ్ టచ్ ఎవరికన్నా అవసరమంటే ప్రజలకే. కానీ, ఓడిపోయిన నాయకులకు ఓదార్పు ఇవ్వడమూ, గెలిచినవారికి కాసింత సమయమూ సహనమూ ఇవ్వడమూ జనం బాధ్యతే అవుతోంది.
ఓడిపోయారు కదా, ఇక వారి గతనేరాల గురించి తవ్వుకోవద్దులే, గెలిచింది ఇప్పుడే కదా, వారిని అప్పుడే తప్పెందుకు పట్టాలి? ఈ ప్రశ్నలు వర్తమాన రాజకీయ సంభాషణల్లో తరచు తారసపడుతున్నాయి. ఇవి, అధికార పోటీలో ఉన్న పక్షాల మధ్య ఉండవలసిన జమీందారీ మర్యాదలు మాత్రమేనా? ప్రజలు కూడా ఈ సున్నితాలను పట్టించుకోవాలా?
ఎందుకు పట్టించుకోవాలి? ప్రభుత్వం అనేది విరామం లేకుండా ఎప్పుడూ ఎట్లా కొనసాగుతూ ఉంటుందో, ప్రజల దగ్గర ఉండే సున్నితపు త్రాసు కూడా నిరంతరం తూకం వేస్తూనే ఉంటుంది. డిజటల్ సాధనాలలో గడియారం లాగా, అవధానంలో గంటల లెక్క లాగా ఒక నేపథ్య గణనం జరుగుతూనే ఉంటుంది. తెరవెనుక ఒక మీటర్ తిరుగుతూనే ఉంటుంది. తీవ్రస్పందనలు, ఆవేశకావేశాలు ఎప్పుడు వ్యక్తం కావాలో అప్పుడు అవుతాయి. ఎంచుకున్న కొత్త అధికారపార్టీ మీద జనం ఆశలు కొంతకాలం కొనసాగుతూ ఉంటాయి. ఇంతకాలం, ఎవరి వెంట మనసు నడిచిందో, వారిని వెంటనే వదిలివేయలేరు కదా? తోసిపుచ్చిన పాత ఏలికల మీద తిరస్కారభావం కూడా కొంతకాలం కొనసాగుతుంది. సానుకూలత క్షీణించడం కానీ, ప్రతికూలత సమసిపోవడం కానీ కాలక్రమేణా జరుగుతాయి, వారి వారి వ్యవహారసరళిని బట్టి, దిద్దుబాట్లను బట్టి. తప్పుల లెక్క మాత్రం ఏ గ్రేస్ పీరియడ్ లేకుండా జరుగుతూనే ఉంటుంది. పార్టీల పరస్పర సంబంధాలలో మర్యాదలు, విలువల చర్చతో మీడియాకూ విశ్లేషకులకూ మేత తప్ప మరో ప్రయోజనం లేదు.
మన ఎన్నికలలో ఒకరి విజయం, మరొకరి అపజయం అంటే, ఒక సమీకరణలోని బృందం సాధికారతను పొంది, మరొక సమీకృత బృందం అధికారాన్ని కోల్పోవడం. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో రాజకీయ యుద్ధం ముగిసిపోదు. ప్రజల సమ్మతిని కోల్పోయిన పాలనను తిరగదోడడం, ప్రజలు కోరుకున్న విధంగా సరిదిద్దడం, విధానాలకు చర్యలకు బాధ్యులను గుర్తించడం కొత్త ప్రభుత్వం తొలిమాసాలలో జరుగుతాయి. ఈ ప్రక్రియ సాగుతున్నంత కాలం కొత్త ప్రభుత్వానికి ప్రజలలో ఆకర్షణ కొనసాగుతూ ఉంటుంది. పాత పాలకపార్టీ ప్రతిష్ఠమరింతగా దిగజారిపోతుంది. అదే సమయంలో, కొత్త ప్రభుత్వం కూడా తప్పులు చేయడం మొదలుపెడుతుంది. ప్రతిపక్షం వాటిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ కొత్త సంవాదం పుంజుకునే క్రమంలో పాత- కొత్తలు తెరవెనుకకు పోయి, ప్రస్తుత అధికార, ప్రతిపక్షాల చట్రం స్థిరపడుతుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతప్రభుత్వం విధానాలను, చర్యలను సమీక్షించడం మొదలుపెట్టింది. ప్రజలు ఆ పని జరగాలని కోరుకుంటారు. అదే సమయంలో, కొత్త వాగ్దానాల, విధానాల అమలు వేగంగా జరగకపోతే, కేవల కక్ష సాధింపు ధోరణిగా భావిస్తారు. రెంటికీ సమతూకం పాటించవలసి ఉంటుంది.
భారత రాష్ట్రసమితి తెలంగాణ ఎన్నికలలో ఓటమిని ఊహించలేదు. చివరినిమిషం దాకా తన గెలుపు అనివార్యమైన, సహజమైన ఫలితమని అనుకుంటూ వచ్చింది. కాంగ్రెస్‌కు అధికారం దక్కడాన్ని జీర్ణించుకున్న తరువాత, త్వరత్వరగా అధికారపక్షం ప్రజల విశ్వసనీయత కోల్పోవాలని ఆత్రుత పడసాగింది. ఆరునెలల పాటు విమర్శావిరామం పాటిస్తామన్నవాళ్లు, ప్రభుత్వం పడిపోవడం గురించి, వాగ్దానాలను నెరవేర్చకపోవడం గురించి అతి త్వరలోనే మాట్లాడడం మొదలుపెట్టారు. అటూ ఇటూ తొలినాటి మర్యాదలు తొలగిపోయి, వేగంగా రణరంగం రూపొందుతున్నది.
కేసీఆర్ శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరడం, సన్నివేశాన్ని కొంత ప్రభావితం చేసింది. విజేత పార్టీ దూకుడును నిగ్రహించింది. ఆ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి రేవంత్‌రెడ్డి కేసీఆర్ సందర్శన ప్రయత్నించింది. ఆ తరువాత స్పీకర్ ఏకగ్రీవానికి సహకరిస్తామని చెప్పడం బీఆర్ఎస్ వైపు నుంచి మరొక మర్యాద. ఈ రాజకీయయుద్ధంలో కొన్ని సున్నితాలు కూడా ఉన్నాయని తెలిసింది కానీ, కేవలం మర్యాదలే పాటిస్తే, గత ప్రభుత్వం మీద చేసిన విమర్శలకు న్యాయం చేయడం సాధ్యం కాదు. అందుకని, క్రమంగా, వేగంగా, తాను అనుకున్న పద్ధతిలో రేవంత్ రెడ్డి పనులు మొదలుపెట్టారు.
రాజకీయ విమర్శలను, సమర్థనలను రూపొందించే వాటిలో కేవలం పార్టీలు మాత్రమే ఉండవు. ప్రజాక్షేత్రంలో ఉండే అనేక సంస్థలు ఉంటాయి, బృందాలు, వ్యక్తులు ఉంటారు. పరాజయం వల్ల కలిగిన బాధతో బీఆర్ఎస్ బృందాలు తన విమర్శకులను దెప్పడం, హేళన చేయడం మొదలుపెట్టాయి. రేవంత్ రెడ్డి పాలన చేపట్టాక జరిగిన తప్పుల గురించి మాట్లాడరేం? అని ప్రశ్నించసాగాయి. నిజానికి, ఈ ధోరణి ఆహ్వానించదగ్గదే! వివిధ శ్రేణులు ఒకరిమీద మరొకరు విమర్శ పెట్టడం సమాజం సరైన దారిలో నడవడానికి ఉపయోగపడుతుంది. పాలకులకు విమర్శ అందిస్తూ, ప్రతిపక్ష పాత్రలో ఉత్సాహంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్‌ను అభినందించాలి. ప్రశ్నించడం నేర్చుకుంటే, తాము తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు అది ప్రశ్నలను సహించగలిగే గుణంగా పరిణమించగలదు.
విమర్శ నుంచి లబ్ధి పొందగలిగినవారే వివేకులు. ప్రజలతో వ్యవహరించేవారు ప్రజల నుంచే మంచిచెడ్డల సమీక్షలను పొందాలి. ప్రియమైన అసత్యాలను చెప్పేవారిని చుట్టూ పేర్చుకున్న నాయకులు విమర్శ నుంచి లబ్ధిని పొందలేరు. నిజానికి వారు తమ ఆభిజాత్యం వల్ల ఎంతో కోల్పోతున్నారు. మంచిచెడూ చెప్పగలిగే చనువు సహచరులకు ఇస్తేనే నాయకులకు క్షేమం.
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం రోజున జై తెలంగాణ నినాదాలు వినిపించకపోవడం, భారత రాష్ట్రసమితికే కాదు, సాధారణ ప్రజలకు కూడా లోటుగా కనిపించింది. ఆ సందడిలో మరచిపోయారేమో అనుకుంటే, శాసనసభ్యుల ప్రమాణస్వీకారానికి ముందు కూడా అధికారపక్షం నుంచి కొందరు మాత్రమే గన్‌పార్క్ సందర్శన చేశారు. నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ప్రస్తావనలు అనేక పర్యాయాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజులలోనే దేవరకొండ సమీపంలో చింతపల్లి దగ్గర జరిగిన లాకప్ డెత్ కొత్త ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా రేవంత్ రెడ్డి మానవహక్కుల గురించి తరచు మాట్లాడుతున్నారు. సివిల్ వ్యవహారాలలో తలదూర్చవద్దని, ప్రజలతో వ్యవహరించేటప్పుడు దౌర్జన్య పద్ధతులు అనుసరించవద్దని ఆయన పోలీసు యంత్రాంగానికి ఒక సూచన చేసి ఉంటే బాగుండేది. సచివాలయం ప్రాంగణంలో ఒక పాత్రికేయుడి మీద అధికారపార్టీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని వచ్చిన వార్తలు ప్రభుత్వానికి కీర్తి తెచ్చేవి కావు. వెంటనే ఆ ఎమ్మెల్యేను మందలించి, కేసు నమోదు చేయించి ఉంటే ‘మార్పు’ ప్రస్ఫుటంగా కనిపించి ఉండేది. ఇవన్నీ తొలిరోజులలో ప్రజలు సీరియస్‌గా తీసుకోకపోవచ్చును. కానీ, ముందే చెప్పినట్టు, పనితీరు మీద మీటర్ ఒకటి జనం మనసుల్లో తిరుగుతూనే ఉంటుంది!
కొత్త ప్రభుత్వం తన ప్రాధాన్యాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, పాత ప్రాజెక్టులను విరమించుకోవడం చేయవచ్చు. తప్పేమీ లేదు. కానీ, తగినంత మేధోమథనం జరిగిన తరువాతే నిర్ణయాలను, ప్రతిపాదనలను వెల్లడిస్తే, గందరగోళానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. లేకపోతే, పాత ప్రభుత్వంలోని జాడ్యాలే పునరావృతమవుతున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతుంది! కూల్చివేతలు, పునర్నిర్మాణాలు వంటి వార్తలు వింటున్నప్పుడు ఏదో అనౌచిత్యం ధ్వనిస్తోంది!
వెనువెంటనే విమర్శల వర్షం కురిపిస్తే, పెద్ద అపచారమేమీ కాదు, ఆయా నిర్దిష్ట నిర్ణయాలకు, ఘటనలకు సంబంధించి విమర్శ చేయవలసిందే. కానీ, విధానాలే ఇంకా రూపొందనప్పుడు, ప్రభుత్వమే ఇంకా కుదురుకోనప్పుడు మొత్తాన్నే విమర్శించే పనిని ప్రజలు పెద్దగా హర్షించరు. డిసెంబర్ 3 తరువాత ఎవరి ఒత్తిడులు వారికి ఏర్పడ్డాయి. ప్రభుత్వంలోకి వచ్చినవారికి కూడా నల్లేరు నడక లేదు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికే పెద్ద ప్రయాస కావాలి. వాగ్దానాలు భారీవి, కర్తవ్యాలు పెద్దవి. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు కూడా గమనం కష్టతరమైనదే. తన ఉనికిని నిలబెట్టుకోవాలి. త్వరలో రానున్న ఎన్నికల నాటికి తనను తాను మెరుగుపరచుకోవాలి. తన పొరపాట్లను సమీక్షించుకుంటేనే కొత్త ప్రభుత్వాన్ని విమర్శించగలిగే నైతికత సమకూరుతుంది.
కె. శ్రీనివాస్
Updated Date - Dec 14 , 2023 | 05:25 AM