జ్యోతి సరే, స్ఫూర్తి ఉన్నదా?
ABN, First Publish Date - 2023-06-29T04:40:57+05:30
వాషింగ్టన్ డీసీలో కెనడీ సెంటర్. కళాసాంస్కృతిక కేంద్రం అన్నమాట. దాన్ని మాకు చూపించవలసిన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, గైడ్ అవీ ఇవీ విశేషాలు చెబుతున్నాడు.
వాషింగ్టన్ డీసీలో కెనడీ సెంటర్. కళాసాంస్కృతిక కేంద్రం అన్నమాట. దాన్ని మాకు చూపించవలసిన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, గైడ్ అవీ ఇవీ విశేషాలు చెబుతున్నాడు. టంగ్ ఇన్ చీక్ వ్యాఖ్యలూ చేస్తున్నాడు. కెనడీకీ కళలకూ ఏమి సంబంధం అన్నాడు, మార్లిన్ మన్రోను ఇష్టపడితే కళలు తెలిసినట్టేనా అని విచారపడ్డాడు. పొడువూ వెడల్పూ ఎత్తూ తప్ప మరేమీ లేని ఆ భవనం డిజైన్ చేసినవాడిని కాల్చిపారేయాలన్నాడు. హిట్లర్ ఫాసిస్టు కళాపోషణా, అమెరికా వాడి కేపిటలిస్టు కళారాధన పోలికలూ తేడాలూ వివరించి చెప్పాడు. కానీ, బయటి నుంచి ఏ వంపూ లేని నాలుగు కుడ్యాల దీర్ఘచతురస్రకట్టడమే అయినప్పటికీ, లోపల విషయం బాగుంది. ఒక ఆడిటోరియం, ఒక గ్యాలరీ, పుస్తకాల షాపులూ, అన్నిటికి మించి వెనకనే ఉన్న పొటెమాక్ నది వెంట పానభోజనాదుల అమరికలు, అక్కడికి వెడితే, సృజనాత్మక ప్రపంచంలో కాసేపు మునకలేయవచ్చు. వైవిధ్యానికి, స్వేచ్ఛకి కొదవ లేదు. నిజానికి, ఆ కేంద్రాన్ని జాన్ ఎఫ్ కెనడీ స్మారకంగా కట్టలేదు. ప్రాజెక్టు మధ్యలో ఉన్నప్పుడు కెనడీ చనిపోయాడు కాబట్టి, ఆయన స్మృతిచిహ్నం చేశారు. ఈ రకం స్మారకాన్ని ‘లివింగ్ మెమోరియల్’ అంటే సజీవ స్మారకం అంటారు. స్మారకచిహ్నాలలో అనేకం మౌనంగా, ప్రశాంతంగా, పవిత్ర భావాలను కలిగిస్తూ ఉంటాయి. అట్లా కాక, సందడి సందడిగా జీవకళతో ఉండే స్మారకం అన్నమాట ఇది.
ప్రపంచమంతా పెత్తనాలు చేస్తుంది కాబట్టి, అమెరికాకు విదేశాలలో చనిపోయిన అమరులు కూడా ఉంటారు, ఇప్పుడు తన గడ్డ మీద కూడా అమరులు ఏర్పడుతున్నారు. ప్రపంచయుద్ధాలలో మృతులకు, కొరియా, వియత్నాం యుద్ధమృతులకు, ఓక్లోహామా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి చోట్ల జరిగిన టెర్రరిస్టు దాడుల బాధితులకు స్మారకాలు నిర్మించారు. కొన్ని యుద్ధాలలో అమెరికా వైఖరితో ఏకీభవించనివారికి కూడా ఆ స్మారకాలన్నీ ఒక గౌరవభావాన్ని, కనీసం విచారభావాన్ని కలిగిస్తాయి. సంపద ఉంది కదా అని ఆడంబరంగానో అట్టహాసంగానో ఉండవు ఆ స్మారకాలు. వియత్నాం మృతసైనికుల స్మారకంలో పెద్ద పెద్ద గ్రానైట్ గోడల మీద వరుసగా పేర్లు చెక్కారు అంతే. సాధారణ అమెరికన్లు ఆ పేర్లను తడుముకుని కన్నీళ్ల పర్యంతం అవుతారు. స్మారకచిహ్నాన్ని సౌందర్యభరితం చేసేది మానవ ఉద్వేగమే. డిజైనింగ్ బాగా లేకపోయినా, స్ఫూర్తి మిగిలితే స్మారకాలు రాణిస్తాయి. అతి సాధారణంగా, నిరాడంబరంగా కనిపించే స్మారకాలు కూడా నిత్యస్ఫూర్తిదాయకంగా కొనసాగుతాయి. ఇండియాగేట్ దగ్గర అమర్ జవాన్ జ్యోతి ఎంత వినయంగా ఉంటుంది? జలియన్ వాలాబాగ్ స్మారకంలో స్థల చారిత్రకత పక్కనబెడితే, నిర్మించిన మెమోరియల్ ఎంతటిది?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరవీరుల కోసం హైదరాబాద్ నడిబొడ్డున, నూతన సచివాలయానికి, ట్యాంక్ బండ్‌కీ మధ్యన వారం కిందట ప్రారంభించిన స్మారకం, అమరజ్యోతి, వంటిది ప్రపంచంలో మరెక్కడా లేకపోయి ఉండవచ్చు. దాని నమూనా తీరు, నిర్మించిన సామగ్రి అన్నీ అత్యాధునిక సాంకేతికతతో కూడినవి కావచ్చు. ఒక లక్ష్యం కోసం ఆత్మబలిదానం చేసుకున్న వందలాదిమంది స్మృతి చిహ్నం కలిగించవలసినంత భావావేశాన్ని కలిగిస్తుందా అన్నది సందేహం. తెలంగాణ రాష్ట్రం, తన అవతరణ జరిగిన తొమ్మిదేళ్లలో, లక్ష్యపరిపూర్తి చేసుకున్నదని, ధగధగల్లో, మెరుపుల్లో, ఎత్తైన, విశాలమైన, విలాసమైన నిర్మాణాలలో దాని విజయాన్ని చూడవచ్చునని ప్రభుత్వం భావిస్తుండవచ్చు. కానీ, అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ ఎదురుగా ఉన్న స్మృతి చిహ్నం, సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరి స్మారకం కలిగించగలిగినంత స్ఫూర్తిని ఈ జ్యోతి ఇవ్వగలుగుతుందా?
ఇది డిజైనింగ్ చర్చ కాదు. అందులో సమస్యేమీ లేదు. అమరులను ఒక అఖండజ్యోతిలో చూసుకోవడంలో తప్పేమీ లేదు. అమరుల స్మారకాన్ని లివింగ్ మెమోరియల్‌గా నిర్మించాలనుకోవడంలో, ప్రదర్శన వసతులను గర్భితం చేసుకున్న స్మారకరూపాన్ని డిజైన్ చేయడంలోనూ సమస్యేమీ లేదు. ఈ అట్టహాసం, ఆడంబరం, భారీతనం ఇవి కళాకారులు, ఇంజనీర్లు నిర్ణయించే అంశాలు కావు. ఇంతటి ‘గొప్ప’ స్మారకంలోకి, ఆ దివ్వెలోకి అమరుల జ్ఞాపకాలు ఆవాహన కాగలవా? ఆ దివ్వె భవిష్యత్ ప్రజా ఉద్యమాలను కూడా వెలిగించగలదా? ఇవి రాజకీయ ప్రశ్నలు.
అమరవీరుల పేర్లు లేకుండా స్మారకమేమిటని, ప్రారంభోత్సవానికి ముందే మీడియాలో కథనాలు రావడంతో, పేర్లు చేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఏడాది తక్కువ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున అమరజ్యోతి ఆవిష్కరణ జరిగింది. ఆ సందర్భంలో కెసిఆర్ చేసిన ప్రసంగం అనేక ఆశ్చర్యాలను అందించింది. బిఆర్ఎస్ అవతరణ తరువాత కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని, అస్తిత్వాన్ని స్పృశిస్తూ మాట్లాడడం తగ్గిపోయింది. అమరజ్యోతి సభలో మాత్రం ఆయన ఉద్యమజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ సభలో పాల్గొన్నవారు సందర్భం వచ్చినప్పుడల్లా కెసిఆర్‌ను కీర్తించే నినాదాలిచ్చారు కానీ, కెసిఆర్ జయశంకర్‌ను స్మరించినప్పుడు మౌనంగానే ఉండిపోయారు. చప్పట్లు కొట్టమని కెసిఆరే ప్రోత్సహించవలసి వచ్చింది. జయశంకర్ కూడా అమరజ్యోతిలో వెలిగే అమరుడే కదా? తెలంగాణ ఉద్యమచరిత్ర అధికారపార్టీ శ్రేణులలో మసకబారిపోయిందని అనిపించింది. అమరవీరులను కొందరినైనా పేర్లు తీసుకుని కెసిఆర్ ప్రస్తావించలేదు, సభలోనూ ఆ స్మరణ లేదు. ఆత్మబలిదానాల ఘట్టం దురదృష్టకరమైనదని ప్రస్తావిస్తూ కెసిఆర్ గొంతైనా కొంత గంభీర విషాదాన్ని ధ్వనించిందేమో కానీ, సభా వాతావరణం అందుకు భిన్నంగానే ఉన్నది.
అమరజ్యోతి భవంతిని పరిచయం చేస్తూ వెలువడిన ఒక టూర్ వీడియోలో ప్రజెంటర్ తెలిసో తెలియకో ఒక వ్యాఖ్య చేశారు. ఇందులో ఈ ఎస్కలేటర్‌లు, అత్యాధునిక నిర్మాణ శైలి చూస్తుంటే, ఒక ప్రభుత్వ భవనంలోకి వచ్చినట్టు లేదని, పెద్ద మాల్‌లోకి ప్రవేశించినట్టు ఉన్నదని ఆమె అన్నారు. అటువంటి భావన ఎవరికి కలిగినా, మొత్తం వాతావరణంలోనే ఏదో పొరపాటు ఉన్నట్టు. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, ఎస్కలేటర్లు, కన్నులు చెదిరే రంగుల కుడ్యాలంకరణ, రెస్టారెంట్లు, సభా భవనం, వీడియో స్క్రీనింగ్ మినీ హాల్, అన్నీ ఉండవలసినవే. బీదగా ఉండనక్కరలేదు, కానీ, ఆత్మ ఉండాలి. ఈ హంగూ ఆర్భాటమూ కలిసిన, స్టెయిన్‌లెస్ స్టీల్ చట్రంలోని బంగారు రంగు దివ్వె అత్యంత సాహసోపేతమైన, త్యాగభరితమైన, విషాదకరమైన బలిదానాలనో, అవి సాధించిన విలువైన విజయాన్నో ఆవిష్కరిస్తున్నాయా? మట్టి ప్రమిద పెట్టమనడం లేదు కానీ, ప్రాకారానికో బయటకు కనిపించే గోడలకో తెలంగాణ సాంస్కృతికతను ప్రతిబింబించే కళారచన చేసి ఉండవచ్చును కదా అనిపిస్తుంది.
ప్రారంభం నాటికే అక్కడి గోడల మీదనో, నేల మీద పరచిన రాతిపలకల మీదనో ఒక్కొక్క అమరుని పేరు కనిపించి ఉండాలి. గడువులోపల పని జరగకపోవడం కాదు కారణం, అమరవీరులెవరో లెక్క తేల్చలేదు. అందుకు కావలసిన పరిశోధనే జరగలేదు. వారి కథనాలు సంకలితం కాలేదు. రాష్ట్ర అవతరణ తరువాత, ఉద్యమచరిత్రను, రాష్ట్ర ప్రత్యేక చరిత్రను నిర్మించే పని జరగలేదు. అందుకు కారణాలు ఏమై ఉంటాయో ఎవరి దృక్పథానికి తగ్గట్టు వారు ఊహించుకోవచ్చు. 1952 తరువాత, 1956 తరువాత హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్య చరిత్ర, ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య చరిత్ర ప్రత్యేకంగా చరిత్రరచనా సంఘం ద్వారా పరిశోధింపజేసి, ఆర్కైవ్స్ వారు ప్రచురించారు. 2014 తరువాత ఆ ప్రయత్నమే జరగలేదు. ఈ స్మారకంలో అమరుల పేర్లు కానీ, లోపల మ్యూజియంలో ఉద్యమచరిత్రను కానీ ప్రదర్శించాలంటే, అందుకు చరిత్రరచనా ప్రయత్నం జరగాలి. గన్‌పార్క్ స్మారకంలో నిర్దిష్టమైన పేర్లు లేకపోవడానికి కారణం, ఉద్యమం అప్పుడు ఓడిపోయింది, అనంతర ప్రభుత్వాలు ఆ జ్ఞాపకానికి పెద్ద విలువ ఇవ్వలేదు. ఇప్పుడు ఉద్యమం గెలిచి ప్రభుత్వం అయింది కదా?
చిన్నస్థలంలో ఉన్నా, గన్ పార్క్ అమరవీరుల స్థూపం మలిదశ ఉద్యమానికంతటికీ యాత్రాస్థలంగా మారింది. ప్రతి ఉద్యమదశా, ప్రతి చిన్న కార్యాచరణా గన్‌పార్క్ నుంచి ఆరంభమయ్యాయి. అన్ని పాయల ఉద్యమకారులకూ అది ఉమ్మడి పవిత్రస్థలం. మరి అమరజ్యోతి అందరికీ అందుబాటులో ఉంటుందా? ప్రతి ఉద్యమసంఘమూ అక్కడ నివాళి అర్పించి తమ ఆందోళనో, ఊరేగింపో, నిరాహారదీక్షో ఆరంభించడానికి అనుమతి ఉంటుందా? మరి, తెలంగాణ రాష్ట్ర అవతరణలో ముఖ్యపాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ కానీ, ఉద్యమంలో పాల్గొన్న బిజెపి కానీ, అమరుల ఆత్మబలిదానాల సమయంలో ఉద్యమరంగస్థలంలో ప్రధానపాత్ర వహించిన కోదండరామ్ కానీ ఎందుకు ప్రారంభోత్సవంలో కనిపించలేదు? తెలంగాణ ఉద్యమసమాజానికి సంబంధించిన ఉమ్మడి సంబరంగా ఎందుకు ఆ కార్యక్రమం జరగలేదు? ఇది సకలజనుల దివ్వె కాదా? అమరజ్యోతిలో ప్రదర్శితం కాబోయే చరిత్ర కూడా ఇంతే అసమగ్రంగా ఉండబోతున్నదా?
‘‘జోహారులూ, జోహారులూ ..అమరులకూ జోహార్’’ అన్న పాట పాడడంతో పాటు, దేశపతి శ్రీనివాస్ శివసాగర్ కవితను కూడా తెలంగాణకు అన్వయించి చదివారు. ‘‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’’ ఆ కవితలో ఒక పంక్తి. చనిపోయిన విత్తనం ఎవరు, దక్కిన పంట ఎవరికి అన్న దురదృష్టకరమైన ప్రశ్నలు ఆ సమయంలో స్ఫురిస్తే, అమరుల స్మరణలో ఏదో ఒక వెలితి స్ఫురించక మానదు.
అమరజ్యోతిలో భాగమైన ఆడిటోరియంలో అన్ని రకాల సభలకూ అనుమతి ఉంటుందా? ఉద్యమలక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి అని మేధావులు చర్చలు చేయడానికి వీలు కుదురుతుందా? రెండంతస్థుల భూగర్భ పార్కింగ్ ఉన్న సదుపాయంలో ఎటువంటి వినోదకార్యక్రమాలు జరగబోతాయి? సెల్ఫీలకు తప్ప ఓపెన్ రూఫ్ టాప్ మరెందుకైనా ఉపయోగపడుతుందా? అమరజ్యోతి సముదాయం అంతటా సన్నగా తెలంగాణ ఉద్యమసంగీతం వినిపిస్తుందా?
రూపశిల్పులు, నిపుణులు చేయవలసింది చేశారు. ఒక స్మారకాన్ని నిర్మించారు. కెసిఆర్ చేయవలసిందే మిగిలింది. ఆ దీపంలోకి కొంచెం ప్రజాస్వామ్యాన్ని కూడా వొంపగలిగితే సరే, లేకపోతే, బంగారు, రత్నాల తెలంగాణ వాదులు మినహా తక్కినవారందరికీ గన్‌పార్క్ మాత్రమే దిక్కవుతుంది.
కె. శ్రీనివాస్
Updated Date - 2023-06-29T04:40:57+05:30 IST