శకునాలు బాగున్నాయి, మరి శక్తిసామర్థ్యాలు?
ABN, First Publish Date - 2023-11-09T02:23:12+05:30
ఇంకో ఇరవై రోజుల్లో పోలింగ్. గాలి మాత్రం బిగదీసుకుని ఉంది. జనం మొహం మీద అనేక ప్రశ్నార్థకాలు, సంశయాలు వేలాడుతున్నాయి, ఒక నిశ్చయం ఏదీ కనిపించడం లేదు...
ఇంకో ఇరవై రోజుల్లో పోలింగ్. గాలి మాత్రం బిగదీసుకుని ఉంది. జనం మొహం మీద అనేక ప్రశ్నార్థకాలు, సంశయాలు వేలాడుతున్నాయి, ఒక నిశ్చయం ఏదీ కనిపించడం లేదు.
‘‘కాంగ్రెస్ జోరు మీద ఉంది నిజమే, కానీ, కేసీయార్ తక్కువ వాడు కాదు కదా?’’
‘‘ఏదో మంత్రం వేసి గండం గట్టెక్కుతాడు! వాళ్లల్లో సగం అతని మనుషులే కదా, రెబెల్స్ అందరికీ ఫైనాన్సింగ్ ఎక్కడిది మరి?’’
‘‘వూళ్లల్లోకి వెళ్లి అడిగితే సిక్ట్సీ ఫార్టీ అంటున్నారు లేదా టగ్ ఆఫ్ వార్ అంటున్నారు, నిజమే, కానీ..?’’
‘‘కాంగ్రెస్ గెలవగలదా? వాళ్లకు అంత శక్తి లేదండీ!’’
ఇట్లా వినిపిస్తున్న జనవాక్యాల నుంచి రేపటి నిర్ణయాన్ని అర్థం చేసుకోగలమా? ఈ అపనమ్మకాలు, అసమాపక వాక్యాలు ఏ గమ్యాన్ని చేరతాయి?
అదృష్టవంతుడిని ఎవరూ చెడగొట్టలేరు, దురదృష్టవంతుణ్ణి బాగుచేయలేరు అంటుంటారు నమ్మకాలున్నవాళ్లు. అదృష‌్టం అంటే గాలిలో దీపం కాదని వాళ్లే అంటారు మళ్లీ. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. అవకాశం ఒక తెల్లవారుజామున తలుపుతట్టినప్పుడు, మనం అప్పుడు మేలుకుని ఉండి, తలుపుతీయాలి, ఆ మాత్రం శ్రమ అన్నా పడాలి. అన్నీ సమకూర్చి పెట్టినా, నిలబెట్టుకోలేని అసమర్థతకు, పనికిమాలినతనానికి లోకంలో లోటు లేదు. ఎవరికి వారే సర్దార్లము అనుకునే మందను ఒక్క తాటి మీదికి తేవడం కానీ, ఒకరి కాలు మరొకరు లాగకుండా చూడడం కానీ చిన్న పనికాదు. విజయలాభం కంటె మిత్రభేదమే మెరుగనుకునేవారి సమర్థతలు ప్రత్యర్థులకే ఉపయోగపడతాయి!
పదేళ్ల నుంచి దేశంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ స్వయంకృతమైన దుర్దశలో నడుస్తూ, ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటోంది. కర్ణాటకలో గెలుపు తరువాత, తెలంగాణలో విజయావకాశాలపై ఆశ కలిగింది. అందుకు తగ్గ సమీకరణా జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు వద్దన్న కొద్దీ సానుకూలతలు తోడవుతున్నాయి. వాటికి తమ శ్రమని కూడా కొంత జోడిస్తే, గాలి తిరగడం ఖాయం. భారత రాష్ట్ర సమితి ఆశలు ఇప్పుడు తమ ఘనకార్యాల మీద, భావి వాగ్దానాల మీద కాక, ప్రత్యర్థి గత చరిత్రమీద, ప్రస్తుత బలహీనతల మీద మాత్రమే ఉన్నాయి. ప్రచారాంశాల సారాంశాన్ని చూడండి. వ్యూహాల మెళకువలను చూడండి. కాంగ్రెస్ మైనస్‌లే బీఆర్ఎస్‌కు ప్లస్.
మరి బీఆర్ఎస్ మైనస్‌లు కాంగ్రెస్‌కు ప్లస్ కావడం లేదా? అయ్యాయి, అవుతున్నాయి. ఆ ప్రతికూలత పరోక్షమైనది. సత్పరిపాలనలో బీఆర్ఎస్ వైఫల్యం ప్రజలలో విముఖతను పెంచింది. రెండుసార్లు ఎన్నుకున్నాం కదా, మళ్లీ ఎందుకు అన్న ప్రశ్న ఓటర్లలో వచ్చింది. ఆ ప్రభుత్వ వ్యతిరేక జనాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ కనీస ప్రయత్నమే చేయలేకపోయింది. చేసినంత మాత్రాన, ఆ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా పరిణమించగలిగేదా అన్నది వేరే ప్రశ్న. హంగు తెచ్చి, కింగ్ మేకర్ కావాలన్న వ్యూహంలో చిక్కుకుని, ఆదిలోనే ప్రధాన ప్రత్యర్థిత్వాన్ని బీజేపీ వదులుకున్నది. ఇక ప్రభుత్వ వ్యతిరేక జనాభిప్రాయానికి ఏకైక లబ్ధిదారుగా కాంగ్రెస్ మిగిలింది. బీఆర్ఎస్‌కు ఈ సారి ఓటుచేయకూడదన్న అభిప్రాయం ఒక్కసారిగా, అధికసంఖ్యాక ఓటర్లలో ఏర్పడింది కాదు. అది క్రమంగా రూపుదిద్దుకుంటున్న అభిప్రాయం. విస్తరిస్తున్న అభిప్రాయం. ఒక ధోరణిగా బలపడుతున్న అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ అనుకూలతగా పరివర్తన చెందడానికి కాంగ్రెస్ అధినేతలు చేస్తున్న ప్రచారం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న విమర్శలు అన్నీ తోడ్పడుతున్నాయి. కానీ, అవి మాత్రమే కీలకమయిన గెలుపురేఖను దాటడానికి సరిపోవు. కాంగ్రెస్ టికెట్ల పంపిణీ తీరుతెన్నులు, అభ్యర్థుల గుణగణాలు, గత చరిత్రలు, రాష్ట్రపార్టీ నాయకత్వంలోని ఐకమత్యం లేదా చీలికలు, వీటన్నిటినీ జనం పరిశీలిస్తూ ఉంటారు. తమ ఘనమైన మద్దతును నిర్వహించడానికి తగిన స్థైర్యం, వ్యక్తిత్వం పార్టీకి ఉన్నాయా లేదా అని మదింపు వేస్తూ ఉంటారు.
ఎన్నికల ప్రకటనకు కొద్ది నెలల ముందు నుంచి తెలంగాణ వాతావరణంలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగార్థులు, నిరుద్యోగులు ఆశాభంగంలో పడిపోయారు. పోటీపరీక్షల రద్దులు, వాయిదాలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు రాష్ట్రంలోని 30 లక్షల మంది ఉద్యోగార్థులలో, వారి కుటుంబాలలో ఒక విసుగును, విముఖతను కలిగించాయి. వివిధ సంక్షేమ పథకాల పాక్షికమయిన అందుబాటు కారణంగా, లబ్ధిదారులు కాలేకపోయిన వారిలో నిస్పృహ పెరిగిపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారంటీలతో ఒక మెరుగైన సంక్షేమ ప్యాకేజిని, అవగాహనను ప్రతిపాదించింది. ఎన్నికలు సమీపించిన దశలో కాళేశ్వరం వివాదం అధికారపక్షానికి పెద్ద కుంగుబాటు కలిగించింది. కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పుకునే నీళ్లు, నియామకాలు రెండూ పెద్ద వైఫల్యాలుగా మిగిలిపోవడం, ప్రధాన ప్రత్యర్థి పార్టీకి రాజకీయ అవకాశాలను అనుకోని రీతిలో పెంచాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి, బీఆర్ఎస్‌కు పరోక్షంగా మేలుచేయడమే ఉద్దేశంగా వ్యవహరిస్తోందని అనుకుంటున్న బీజేపీ కూడా కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలను, నివేదికలను గురిపెట్టి కాంగ్రెస్‌కు మేలు చేసింది.
కొంత కాలంగా బీజేపీ, బీఆర్ఎస్ కలసికట్టుగా ఒక అవగాహనతో వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతూ వచ్చింది. మొదట్లో దాన్ని ఆ రెండు పక్షాలూ పనిగట్టుకుని ఖండించేవి కానీ, ఇప్పుడు వారు ఆ ప్రయత్నం విరమించుకున్నారు. వాస్తవం ఏమైనా కావచ్చును కానీ, ప్రజల మనస్సుల్లో మాత్రం ఆ రెండూ ఒక్కటే అన్నది నాటుకున్నది. మరో పక్కన అంత బలంగా కాకపోవచ్చును కానీ, తగినంత మేరకు మజ్లిస్ బీజేపీకి మేలు జరిగే విధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం తెలంగాణ ముస్లిములలో, ముఖ్యంగా హైదరాబాదేతర ముస్లిములలో వ్యాపించింది. బీజేపీ వ్యతిరేక శిబిరానికే ఓటు చేయాలని ముస్లిములలో కలుగుతున్న సంకల్పం, మజ్లిస్, బీఆర్ఎస్ జంటను కాదని కాంగ్రెస్‌ను ఎంచుకోవడానికి కారణమవుతున్నది. తాజాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీచేయకూడదని తీసుకున్న నిర్ణయం వల్ల లబ్ధి పొందేదెవరన్న చర్చ మొదలయింది. తెలంగాణలోని సంప్రదాయ తెలుగుదేశం ఓటర్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ పరిణామాల రీత్యా, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు పూర్తి విరుద్ధమైన ప్రయోజనం సాధించడానికే బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిందని చెబుతున్నవారున్నారు. సెటిలర్లలో కాంగ్రెస్‌కు పడే ఓట్లను చీల్చడానికి బీజేపీ, జనసేన పొత్తు ఉపయోగిస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్‌కు వివిధ మార్గాల నుంచి మద్దతు అప్రయత్నంగా సమకూరుతున్నది. దానిని దెబ్బతీసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు సానుకూలత ఇంకా బలపడినట్లయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడమే పనిగా పెట్టుకున్న వారి ప్రయత్నాలు బలహీనపడవచ్చు.
తనను ఎన్నుకుంటే కలిగే కొత్త ప్రయోజనాలేమీ చెప్పలేకపోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కలిగే నష్టాలను పదే పదే ప్రస్తావిస్తున్నది. ఆ ప్రస్తావన హెచ్చరిక వలె, భయపెట్టడం వలె ధ్వనిస్తున్నది. ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండదు, ధరణి పోతే భూములకు రక్షణ ఉండదు, ఢిల్లీ దొరల చేతిలో నిర్ణయాలుంటాయి, వాళ్లలో వాళ్లు కలహించుకుంటారు, రాష్ట్రాన్ని అమ్మేసుకుంటారు వంటి విమర్శలతో కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ ఎండగడుతున్నది. నిజానికి, రాష్ట్రాన్ని ఇప్పుడున్న స్థితి నుంచి వెనకకు తీసుకువెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ మాత్రం అభివృద్ధి, ఈ మాత్రం అప్రజాస్వామికత, ఈ మాత్రం ఆర్భాటం కాంగ్రెస్ వస్తే మాత్రం ఉండవా ఏమిటి? అయినా, పోయిన దశాబ్ది కాలంలో తెలంగాణలో అభివృద్ధి వేగంగా, బాగా జరిగిందని తెలంగాణలో ఏకాభిప్రాయమేమీ లేదు. కాబట్టి, అభివృద్ధికి సంబంధించిన భయాందోళనలు ప్రజల మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కాంగ్రెస్‌లోని కలహాలు, ఢిల్లీ పెద్దల చేతిలో పెత్తనాలు వంటివి ఆ పార్టీ నిరాకరించలేని ప్రమాదాలు. కాకపోతే, ఒకనాటి కాంగ్రెస్ అధిష్ఠానంలాగా చెలాయించడం ఇప్పుడు కుదరదు, కుదరడం లేదు కూడా. రాజశేఖరరెడ్డి కాలంలోనే దాదాపు ప్రాంతీయ పార్టీ వలె వ్యవహారం సాగింది.
అయినా, పదేళ్ల కేసీఆర్ పాలన తరువాత ప్రజలు ఇటువంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. కేసీఆర్‌ను కాదని ఓటు వేసేటప్పుడు, ఆ ఓటు పొందే అర్హత, ఆ అవకాశాన్ని నిభాయించుకునే స్థైర్యం ప్రత్యర్థికి ఉన్నాయా అన్నది ఓటర్ల ఎంపికలో ఒక ముఖ్యమైన అంశం. తమ వ్యతిరేక ఓటు విఫలం కాగూడదు కదా? అందుకు కావలసిన సమష్టితనం, సంస్థాగత దృఢత్వం ప్రదర్శిస్తేనే, ఓటర్ల మనసులోని వ్యతిరేకత గట్టిపడి, ఒక నిశ్చయంగా వ్యక్తమవుతుంది.
రాహుల్ గాంధీ చొరవ తీసుకుని, శ్రమపడి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక కూడా ఉధృతంగా పాల్గొనవచ్చు. ఒకటో రెండో సభల్లో సోనియాగాంధీ కూడా మాట్లాడవచ్చు. కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రచారం ఒక ఉధృతిని, సంకల్పాన్ని ప్రదర్శించేవిధంగా సాగడం లేదు. ఒకరిద్దరు అగ్రనేతల పర్యటనలు తప్ప, ఒక ఉమ్మడి ప్రయత్నం కనిపించడం లేదు. ఎవరికి వారే జిల్లా స్థాయిల్లో, నియోజకవర్గాల స్థాయిలో తమ తమ విడి విడి పోరాటాలు చేస్తున్నారు. ఎన్నికల తరువాత భవిష్యత్తు గురించి కూడా విడివిడి ప్రయత్నాలు చేసుకునే ధోరణికి ఇది దారితీస్తుంది. కర్ణాటకలో కూడా బహునాయకత్వం ఉన్నప్పటికీ, వారిమధ్య తాత్కాలిక సయోధ్య అయినా ఎన్నికలకు ముందే కుదిరింది, ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్నదో ప్రజలకు ఒక అంచనా ఉన్నది. తెలంగాణలో అటువంటి సయోధ్యకు ప్రయత్నమే జరిగినట్టు లేదు. పైగా, అక్కడి సిద్ధరామయ్య, శివకుమార్, ఖర్గే స్థాయి నాయకులు తెలంగాణలో ఉన్నారా అన్నది ప్రశ్న. అగ్రస్థాయి కలిగిన వారు మినహా తక్కిన కాంగ్రెస్ శ్రేణుల విషయంలో ప్రజలలో ఒక తక్కువ అభిప్రాయం ఉంటుంది. అటువంటి అంచనా ఎందుకు ఉంటుందో, అందుకు గత చరిత్రలు ఎంత వరకు కారణమో తెలియదు కానీ, కాంగ్రెస్ వారు తమ ప్రతిష్ఠను పెంచుకోవడానికి అదనంగా ప్రయత్నంచేయాలి. ఉదాత్తమైన, గంభీరమైన ప్రవర్తన ద్వారా మాత్రమే అటువంటి ప్రతిష్ఠ సమకూరుతుంది. ఈ ఎన్నికల యుద్ధంలోకి దిగే కాంగ్రెస్ నేతలందరూ, మర్యాదల పరిధులకు లోబడి వ్యవహరిస్తే, కలహాలను బహిరంగపరచుకోకుండా కలసికట్టుగా కనిపిస్తే, ఓటర్లలోని ఊగిసలాటకు ఒక పరిష్కారం లభిస్తుంది.
గెలవలేకపోవడం ఓకె. అర్థం చేసుకోవచ్చు. గెలుపును వదులుకోగూడదు!
కె. శ్రీనివాస్
Updated Date - 2023-11-09T02:23:14+05:30 IST