స్టాండప్ కామెడీ
ABN, First Publish Date - 2023-09-11T00:15:49+05:30
ఒంటినిండా నవ్వు మచ్చలు ఎంత వద్దనుకున్నా కాళ్లకు చుట్టుకున్న అపహాస్యం పుట్టుమచ్చై మిగిలిపోయింది టెన్ టూ సిక్స్ పని శరీరమిది నల్లరంగంత బరువు మోయలేనంత...
ఒంటినిండా నవ్వు మచ్చలు
ఎంత వద్దనుకున్నా
కాళ్లకు చుట్టుకున్న అపహాస్యం
పుట్టుమచ్చై మిగిలిపోయింది
టెన్ టూ సిక్స్ పని శరీరమిది
నల్లరంగంత బరువు
మోయలేనంత సొంత నేపథ్యం
అంటుకోలేనంత దూరం
కారణం ఏదైనా
అనేక ముఖాల్లో
నరాలన్నీ
చిక్కువిడిపోయి మరీ వికసిస్తాయి
నవ్వు ఎప్పటికీ పాతబడని
ప్రాచీన నాగరికత
పళ్ళనిండా గారపట్టిన వాళ్ళు
ఎదుటివాళ్ళ జీవితాలని నమిలి
ఊసేసిన వాళ్ళూ
ఇంకా నెమరేస్తున్న వాళ్ళూ
జట్లు జట్లుగా నిలబడి
హాస్యాన్ని ఎదుటివాళ్ల మీద
సాధన చేస్తుంటారు
ఆకలేస్తుంది
‘‘నవ్వు’’
భాషరాదు
‘‘నవ్వు’’
ప్రేమ కావాలి
‘‘నవ్వు’’
అప్పు కావాలి
‘‘నవ్వు’’
నువ్వు నేను సమానం
‘‘నవ్వు’’
కలలు కనడం మానలేను
ఏ వెక్కిరింతా వెనక్కి లాగలేదు
తలుపుల్లేని ఇంటిముందు నిలబడి ఉన్నా
ఎవరైనా మిగిలిపోతే రండి
సంకుచిత ముఖ కవళికల్ని
విసిరేసి పోండి
ఆఖర్లో నేను నవ్వుతాను
అది పసిపాపలాంటి నవ్వైనా
నీ అవహేళనల్ని
నా ముందు నుంచి
తరిమికొడుతుంది
అనిల్ డ్యాని
97033 36688
Updated Date - 2023-09-11T00:15:49+05:30 IST