తెలంగాణ మనల్ని దాటుకుపోతోంది!
ABN, First Publish Date - 2023-06-01T02:11:13+05:30
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ అనేక విధాల లాభపడుతోంది. రాజకీయ, పరిపాలన, ఆర్థిక కారణాలు ఏవైనా కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది. అభివృద్ధి, విదేశీ పెట్టుడులు, పారిశ్రామిక రంగం, సాఫ్ట్‌వేర్ రంగాలలో తెలంగాణ దూసుకుపోతోంది....
ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ. సముద్ర తీరం ఉంది. ఏపీలోని ఇతర ప్రాంతాలతోపాటు ఈ తీరం వెంట భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. రాష్ట్రంలో నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయినా, పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు రాష్ట్రానికి ఎందుకు రావడంలేదు? ఉన్న పరిశ్రమలు ఎందుకు మూతపడుతున్నాయి? ఎందుకు తరలిపోతున్నాయి ఆదాయంలో ఎందుకు ఇంత వెనుకబడిపోతున్నామో ఆలోచించవలసిన అవసరం అందరికీ ఉంది.
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ అనేక విధాల లాభపడుతోంది. రాజకీయ, పరిపాలన, ఆర్థిక కారణాలు ఏవైనా కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది. అభివృద్ధి, విదేశీ పెట్టుడులు, పారిశ్రామిక రంగం, సాఫ్ట్‌వేర్ రంగాలలో తెలంగాణ దూసుకుపోతోంది. ఏపీ మాత్రం రోజురోజుకు దిగజారిపోతోంది. ఓ పక్క తెలంగాణలో అనేక కొత్త పరిశ్రమలు వస్తుంటే, ఏపీలో మాత్రం కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోవడం లేదా మూతవేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థల్లో అనేక మార్పులు వచ్చాయి. వనరులు, జనాభా, నైపుణ్యం కలిగిన మానవ వనరుల విషయంలో ఆంధ్రప్రదేశ్ పై చేయిగా ఉంది. విభజన తర్వాత మొదటిసారిగా ఆదాయంలో తెలంగాణ ఏపీని అధిగమించింది. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఏపీ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా ఉంది. తెలంగాణతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఏపీలో అవి బాగా తగ్గాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ కంటే తెలంగాణ ఆదాయం రూ.1077 కోట్లు పెరిగింది.
ఏడాదికేడాది ఆదాయ గణాంకాలలో రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు, ఆదాయంలో తెలంగాణ దూసుకుపోతూ ఏపీని అధిగమించిన తీరును గమనిద్దాం. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలుకొని 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు ఆంధ్ర ప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణ ఆదాయం తక్కువే ఉన్నది. 2014–15లో ఏపీ ఆదాయం రూ.65,695 కోట్లు, తెలంగాణ ఆదాయం రూ.51,042 కోట్లు (ఏపీతో పోలిస్తే రూ.14,653 కోట్లు తక్కువ); 2015–16లో ఏపీ ఆదాయం రూ.88,648 కోట్లు, తెలంగాణ ఆదాయం రూ.76,134 కోట్లు (రూ.12,514 కోట్లు తక్కువ); 2016–17లో ఏపీ ఆదాయం రూ.98,994కోట్లు, తెలంగాణ ఆదాయం రూ.82,818 కోట్లు (రూ.16,176 కోట్లు తక్కువ); 2017–18లో ఏపీ ఆదాయం రూ.1,05,060 కోట్లు, తెలంగాణ ఆదాయం రూ.88,824 కోట్లు (రూ.16,236 కోట్లు తక్కువ); 2018–19లో ఏపీ ఆదాయం రూ.1,14,684 కోట్లు, తెలంగాణ ఆదాయం రూ.1,01,420కోట్లు (రూ.13,264 కోట్లు తక్కువ); 2019–20లో ఏపీ ఆదాయం రూ.1,11,034 కోట్లు, తెలంగాణ ఆదాయం రూ.1,02,544 కోట్లు (రూ.8,490కోట్లు తక్కువ); 2020–21లో ఏపీ ఆదాయం రూ.1,17,136 కోట్లు, తెలంగాణ ఆదాయం రూ.99,903 కోట్లు (రూ.17,233 కోట్లు తక్కువ); 2021–22లో ఏపీ ఆదాయం రూ.1,50,552కోట్లు, తెలంగాణ ఆదాయం రూ.1,27,468 కోట్లు (రూ.23,084 కోట్లు తక్కువ); 2022–23లో మాత్రం ఈ పరిస్థితి మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఆదాయం రూ.1,58,282 కోట్లు కాగా, తెలంగాణ ఆదాయం రూ.1,59,349 కోట్లుగా ఉంది (అంటే తెలంగాణ ఆదాయం ఏపీతో పోలిస్తే రూ.1,077 కోట్లు పెరిగింది). 2021–22తో పోల్చితే 2022–23లో తెలంగాణ ఆదాయం రూ.31,881కోట్లు పెరగగా, ఏపీ ఆదాయం రూ.5,730 కోట్లు మాత్రమే పెరగటమే దీనికి కారణం.
నిజానికి 2022–23లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రూ.36,048కోట్లు గ్రాంట్లు అందగా, తెలంగాణకు రూ.13,179 కోట్లు గ్రాంట్లు మాత్రమే వచ్చాయి. అంటే, తెలంగాణ కంటే ఏపీకి రూ.22,869 కోట్లు ఎక్కువే గ్రాంట్ వచ్చింది. అయినప్పటికీ ఆదాయంలో తెలంగాణ మొదటిసారిగా ఏపీని అధిగమించింది. అనేక కారణాల వల్ల ఏపీలో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ వంటి రాబడులు తగ్గాయి. 2021–22లో జీఎస్టీ రూపంలో తెలంగాణకు రూ.34,489కోట్లు రాగా, ఏపీకి రూ.34,262 కోట్లు వచ్చాయి. 2022–23లో తెలంగాణ జీఎస్టీ ఆదాయం రూ.41,888 కోట్లకు పెరిగింది. ఏపీ జీఎస్టీ ఆదాయం మాత్రం రూ.38,840 కోట్లకు మించలేదు. సేల్స్ ట్యాక్స్ రాబడిలో కూడా ఏపీ వెనుకబడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై విక్రయ పన్ను ద్వారా తెలంగాణకు రూ.29,604 కోట్లు రాగా, ఏపీకి రూ.18,004 కోట్లు మాత్రమే వచ్చాయి. 2021–22లో ఏపీకి వచ్చిన సేల్స్ ట్యాక్స్ కంటే ఇది రూ.2,900కోట్లు తక్కువ. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ రూ.18,470 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఏపీ రూ.14,798కోట్లు మాత్రమే ఆర్జించింది. తెలంగాణతో పోలిస్తే స్టాంపుల రిజిస్ట్రేషన్ల ఆదాయంలో కూడా ఏపీ వెనుకబడిపోయింది. 2022–23లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఏపీకి రూ.8,022 కోట్లు రాగా, తెలంగాణకు రూ.14,228 కోట్లు వచ్చాయి. 2021–22తో పోలిస్తే తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2 వేల కోట్లు పెరగ్గా, ఏపీ ఆదాయం రూ.400 కోట్లు మాత్రమే పెరిగింది. ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా 2022–23లో తెలంగాణకు రూ.19,553 కోట్ల పన్నుయేతర ఆదాయం వచ్చింది. ప్రభుత్వ భూములు అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం భావించి 2021లో ‘మిషన్ ఏపీ బిల్డ్’ను ప్రారంభించింది. అయితే, హైకోర్టు అడ్డు చెప్పడంతో ఏపీ ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అధిక వడ్డీకి వేల కోట్లు అప్పులు తీసుకుంది. 2022–23లో ఏపీకి రూ.6,031 కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వచ్చింది. చెత్త పన్ను, ఆస్తిపన్ను, ఇంటిపన్ను, పెట్రోల్, డీజిల్‌పై సెస్, రోడ్ డెవలప్‌మెంట్ సెస్‌ల ద్వారా తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం బాగానే ఉంది. 2022–23లో ఏపీకి రూ.9,109 కోట్లు రాగా, తెలంగాణకు రూ.8,430 కోట్లు మాత్రమే వచ్చాయి.
విదేశీ పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్టుమెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నివేదిక ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2022 డిసెంబర్ వరకు తెలంగాణ 7వ స్థానంలో ఉంటే, ఏపీ 14వ స్థానంలో ఉంది. మిగిలిన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక 2వ స్థానంలో, తమిళనాడు 5వ స్థానంలో ఉన్నాయి. తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఈ స్థితిలో ఉండటం బాధాకరం. ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ. సముద్ర తీరం ఉంది. ఏపీలోని ఇతర ప్రాంతాలతోపాటు ఈ తీరం వెంట భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. రాష్ట్రంలో నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయినా, పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు రాష్ట్రానికి ఎందుకు రావడంలేదు? ఉన్న పరిశ్రమలు ఎందుకు మూతపడుతున్నాయి? ఎందుకు తరలిపోతున్నాయి? ఆదాయంలో ఎందుకు ఇంత వెనుకబడిపోతున్నామో ఆలోచించవలసిన అవసరం అందరికీ ఉంది.
l శిరందాసు నాగార్జున
సీనియర్ జర్నలిస్టు
Updated Date - 2023-06-01T02:11:13+05:30 IST