అదానీ జోలికొస్తే ఇంతే!
ABN, First Publish Date - 2023-09-02T01:19:07+05:30
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి మూడువారాలు కూడా కాలేదు. నవంబరులో ఎటూ శీతాకాల సమావేశాలు ఉండగా, ఈ లోపలే దేశప్రయోజనాల రీత్యా తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలు కూడా లేవు....
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి మూడువారాలు కూడా కాలేదు. నవంబరులో ఎటూ శీతాకాల సమావేశాలు ఉండగా, ఈ లోపలే దేశప్రయోజనాల రీత్యా తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలు కూడా లేవు. కానీ, ప్రభుత్వం హఠాత్తుగా ఈ నెలలో ప్రత్యేక సమావేశాలు ప్రకటించింది. అది కూడా, ఒక ట్వీట్ ద్వారా. అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల వేదిక ‘ఓపీసీఆర్‌పీ’ ఆధ్వర్యంలో అదానీ అక్రమనిధుల ప్రవాహం వెలుగులోకి వచ్చిన వెంటనే పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి చేసిన ఈ ట్వీట్‌లో ప్రత్యేక సమావేశాల తేదీలు తప్ప, ఎందుకు ఏమిటన్న వివరాలు లేవు. సరిహద్దులకు ఆవలే కాదు, లోపల కూడా ఈ తరహా సర్జికల్ దాడి చేయడం నరేంద్రమోదీకి తెలిసిన విద్య. పెద్దనోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ వంటి కీలకమైన నిర్ణయాలను కూడా ఆయన టెలివిజన్ తెరలమీద ప్రత్యక్షమై ప్రకటించారు తప్ప, దేశాన్ని ఆర్థికంగా కుదిపేసే, జనజీవితంమీద దీర్ఘకాలిక ప్రభావం వేసే ఏ నిర్ణయాల్లోనూ ఆయన పార్లమెంటును పరిగణనలోకి తీసుకోలేదు. అటువంటివారు ఇప్పుడు వేళాపాళా లేకుండా ప్రత్యేక సమావేశాలు పెట్టారంటే కచ్చితంగా అనుమానించాల్సిందే.
పార్లమెంటులో విధిగా చర్చించాల్సిన, లేదా ఏకపక్షంగా సభామోదం సాధించాల్సిన అంశాలు అయివుంటాయి కనుకనే, వీటిని ఏర్పాటు చేసివుంటారని ఎవరి ఊహాశక్తి మేరకు వారు విశ్లేషణలు చేస్తున్నారు. యూసీసీ, మహిళారిజర్వేషన్ కూడా పాలకుల మనసులో ఉందని అంటున్నారు. ప్రధానంగా, జమిలి ఎన్నికల మీద పాలకులకు ఉన్న ప్రేమ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదినుంచే ఈ విడివిడి ఎన్నికల వల్ల దేశం ఎంతగా దెబ్బతినిపోతున్నదో వారు చెబుతూనే ఉన్నారు. ఈ ప్రత్యేక సమావేశాల ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం కూడా ఈ వాదనకు ఊతాన్నిచ్చింది. ఇప్పుడా కమిటీ కొత్తగా జమిలిలో మంచిచెడ్డలు అంచనావేయబోదనీ, ఇప్పటికే నివేదిక సిద్ధంగా ఉండివుంటుందని కొందరు చేస్తున్న కువిమర్శలు నిజమేనని అనుకున్నా, సదరు కమిటీ నివేదిక సమర్పణకు కనీసం పక్షంరోజులైనా తీసుకోకపోతే బాగుండదు. అయినప్పటికీ, ఈ జమిలి వ్యవహారం పలు రాజ్యాంగ సవరణలతోనూ, ప్రజాప్రాతినిధ్యచట్టంలో మార్పుచేర్పులతోనూ, మూడింట రెండువంతుల రాష్ట్రాల ఆమోదంతోనూ ముడివడిన సుదీర్ఘ ప్రక్రియ కనుక పదేళ్ళుగా అనుకుంటున్నదానిని ఇలా చివరిదశలో మోదీ ప్రభుత్వం ఎందుకు ముందుకు తెస్తుందన్న అనుమానాలూ లేకపోలేదు. సైనికబలగాల మోహరింపుల సమస్య అటుంచినా, ఇప్పుడున్న ఈవీఎంల లెక్కన చూసినా ఆచరణలో జమిలి వెంటనే సాధ్యపడేది కాదు. ఒకేదేశం–ఒకే ఎన్నిక నినాదం వెనుక లక్ష్యం ఒకేనాయకుడు కనుక, ఈ సమావేశంలో ఒకవేళ జమిలి బిల్లును ప్రవేశపెట్టినా, మనసులో ఉన్నది ముందస్తే కావచ్చు. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలన్నింటినీ సాధారణ ఎన్నికలతో కలిపి ముందుకు తెస్తే మోదీ ఆశయం కొంతమేరకు నెరవేరుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటోల కార్యక్రమం కూడా తెరమీదకు రావడంతో ఈ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రస్తుత పార్లమెంట్ రద్దుచేసి, ముందస్తుకు పోవచ్చునన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఒకవేళ అదే ఆలోచన ఉన్నా, మంత్రివర్గ నిర్ణయంతో పోయేదానికి ఈ ప్రత్యేక సమావేశాలైతే అక్కరలేదు. కానీ, తాము ఘనంగా కట్టిన కొత్త పార్లమెంటు భవనాన్ని దేశానికి పరిచయం చేసి, గత పదేళ్ళుగా సాధించిన విజయాలన్నీ ఏకరువుపెడుతూ, చంద్రయాన్ నుంచి సూర్యయాన్ వరకూ, జీ20అధ్యక్షగౌరవం నుంచి అమృతకాలం ఆశయాలవరకూ సర్వమూ చెప్పుకొని, ఎన్నికలకు పోవడానికి ఈ సమావేశం కచ్చితంగా ఉపకరిస్తుంది.
మొత్తానికి కొంతకాలం పాటు ఈ ప్రత్యేక సమావేశం చుట్టూ పత్రికల్లోనూ, చానళ్ళలోనూ చర్చోపచర్చలు జరుగుతూ, గతంలో కంటే అత్యంతతీవ్రమైన, దేశ శ్రేయస్సుకు ప్రమాదకరమైన అదానీ కొత్త కుట్ర తెరమీదకు రాకుండా ప్రభుత్వం చేయగలిగింది. విదేశాల్లో పోగుబడిన నల్లధనం తెస్తానని, ప్రజలకు పంచుతానని హామీ ఇచ్చిన నరేంద్రమోదీ ఏలుబడిలో, విదేశీ డొల్లకంపెనీల ద్వారా అదానీ సంస్థల్లోకి నల్లధనం తరలిందన్న విషయం వెనక్కుపోయేట్టు చేసింది. అదానీ అక్రమలావాదేవీలపై సెబీ నోరువిప్పకపోవడం, సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికలు ఇవ్వడం వంటివి చర్చలోకి రాకుండా చూసుకున్నారు. అదానీ జోలికొస్తే ఇటువంటి సర్జికల్ దాడులు తప్పవు మరి.
Updated Date - 2023-09-02T01:19:07+05:30 IST