కేసీఆర్ అభివృద్ధి నమూనాతోనే కారు బోల్తా!
ABN, First Publish Date - 2023-12-06T02:10:32+05:30
అభివృద్ధిని కాంప్రహెన్సివ్ అభివృద్ధి, సెలెక్టెడ్ అభివృద్ధి అని రెండు రకాలుగా విభజించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో...
అభివృద్ధిని కాంప్రహెన్సివ్ అభివృద్ధి, సెలెక్టెడ్ అభివృద్ధి అని రెండు రకాలుగా విభజించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారందరి ఉత్పత్తి సామర్థ్యం పెంచి, తద్వారా అందరి జీవన ప్రమాణాలు పెరిగేలా పథకాలు రూపొందించడం ద్వారా సాధించే అభివృద్ధి కాంప్రహెన్సివ్ అభివృద్ధి. స్వప్రయోజనం కోసం సమాజంలో ఎంపిక చేసుకున్న కొన్ని వర్గాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని, వాటి అభ్యున్నతికి మాత్రమే పథకాలు రూపొందించి ఇతర వర్గాలు అరిచి గీ పెడుతున్నా పట్టించుకోకుండా చూపే అభివృద్ధి సెలెక్టెడ్ అభివృద్ధి.
ప్రజాసేవపై నిజమైన చిత్తశుద్ధితో పదికాలాలపాటు అధికారంలో ఉండాలనుకునే నాయకులు ఎవరైనా దాదాపుగా మొదటి రకమైన సమగ్ర జన సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు రచించి అమలు చేస్తారు. జాతీయ (కేంద్ర ప్రభుత్వం), అంతర్జాతీయ (ప్రపంచ సంస్థలు) పథకాలతో తమ పథకాలను అనుసంధానించి రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటూ తాము పాలించే రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనం కలిగేందుకు వ్యవస్థలను, అధికార బృందాన్ని వినియోగించుకుంటారు. సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి కీలకమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భావి తరాలు ఇబ్బందిపడకుండా, ఉన్న వనరులతో అభివృద్ధి సాధించడం కోసం పాలకులు, అధికారులు సమష్టిగా కృషి చేస్తారు.
రెండు దఫాలు తిరుగులేకుండా అధికారం చలాయించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీనికి భిన్నంగా కేవలం ఓటు బ్యాంకు మీద దృష్టితో, తన మీద తనకున్న మితిమీరిన నమ్మకంతో రెండో నమూనా (సెలెక్టెడ్ డెవలప్‌మెంట్)ను గట్టిగా నమ్ముకుని బొక్కబోర్లాపడ్డారు. ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పుట్టి మునగడానికి పెద్ద కారణం– తను పీఎం, కొడుకు సీఎం అయ్యే కలలు కని తనకు తాను రూపొందించుకున్న ఈ దిక్కుమాలిన అభివృద్ధి నమూనా. కొన్నిసార్లు కొడుకు చెప్పినా వినకుండా దూసుకుపోయి అభాసు పాలయ్యారు. ఎంత దురహంకారం కాకపోతే కేబినెట్ లేకుండా అంత కాలం నడుపుతారు? ప్రజాస్వామ్య వ్యవస్థలను, సంప్రదాయాలను తుంగలో తొక్కుతారు? ఎంత కావరం కాకపోతే, ప్రధానమంత్రి మొహం చూడకూడదని ఒట్టేసుకుని అయన ఇటు వస్తే ఈయన అటు పోతారు? కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇక్కడ అమలుచేస్తే క్రెడిట్ బీజేపీకి పోతుందన్న పిచ్చి లెక్కలు ఎంతో నష్టం చేశాయి.
పదేళ్ల దురహంకార ధోరణి వల్ల విద్య, ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్, సర్వనాశనం అయ్యింది. వైద్య సదుపాయాలు సరిగా లేని విపత్కర పరిస్థితిలో విధిలేక ప్రయివేటు ఆసుపత్రులపై ఆధారపడి ప్రజలు గుల్లవుతున్నారు. ఉద్యోగాలు లేక పాతిక లక్షలమందికి పైగా యువకులు నిరాశ నిస్పృహలకు గురయ్యారు. తెలంగాణ వస్తే ఉపాధి దొరుకుతుందని భంగపడిన నిరుద్యోగులను, వారి తల్లిదండ్రులను లెక్కవేసుకున్నా ఏకాయికి 75 లక్షల మంది ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ వ్యవహారాన్ని ప్రభుత్వం డీల్ చేసిన విధానం ఒక్కటి చాలు– కేసీఆర్, కేటీఆర్ బృందానికి ఉన్న తలబిరుసుతనం తెలుసుకోవడానికి.
బంగారు తెలంగాణను తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పం కన్నా నమ్మకమైన ఓటుబ్యాంకు ఏర్పాటు చేసుకోవడమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పాలన అడుగడుగునా సాగింది. నిర్దిష్ట చర్చగానీ, పక్కా ప్రాజెక్టు రిపోర్ట్ గానీ లేకుండా అధినాయకుడి బుర్రకు తట్టినదే తడవుగా పథకాలు పుట్టుకొచ్చాయి. ఆ రోజున నోటికి ఏది వస్తే అది ఒక పథకమైపోయింది. భజన సంఘం, సొంత మీడియా అహో ఓహోల నడుమ అది యావత్ దేశానికి మోడల్ నమూనాగా ప్రచారమయ్యింది. రైతులు, వృద్ధులు, దళితులు తమ పంచన ఉంటే ఎన్నికలపరంగా చాలునన్న అభిప్రాయం కేసీఆర్‌లో కనిపించింది. మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు చచ్చినట్లు పడుంటారన్న అభిప్రాయం కనిపించింది. విడిపోయాక మిగులు ఖజానా ఉన్న రాష్ట్రం తొందరగా అప్పుల కుప్ప కావడానికి కారణం మనీ ట్రాన్స్‌ఫర్ చేసే రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలని ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నా పట్టించుకునేవాడు లేకపోయాడు. రైతుకు ఉచితంగా ఎరువులు కూడా ఇస్తామని చెప్పిన ఆయన నకిలీ విత్తనాలు అరికట్టడానికి, పురుగుమందుల నిరోధానికి, వడ్డీ వ్యాపారాల విజృంభణను అదుపు చేయడానికి, మంచి గిట్టుబాటు ధర ఇవ్వడానికి చేసింది ఏమీలేదు. అట్లానే దళిత బంధును హుజూరాబాద్ ఉప ఎన్నికలప్పుడు ఆదరాబాదరా ప్రకటించి ఊళ్లలో గత్తర లేపారు. అహంకారానికి తోడు మితిమీరిన విశ్వాసం మూలంగా ‘నేషనల్ యాంబిషన్’ పుట్టుకొచ్చి పుట్టిముంచింది.
లిక్కర్, పెట్రోలు, ఇతర పన్నులు తెచ్చే డబ్బు మీద మాత్రమే ఆధారపడుతూ, వచ్చిందంతా తన అభివృద్ధి మోడల్ కోసం కుమ్మరిస్తూ కేసీఆర్ పెద్ద తప్పుచేసారు. అందిన కాడికి అప్పులు చేస్తూ ఎక్కడ కోట్లకు కోట్ల డబ్బు ఉంటుందో అక్కడ మాత్రమే దృష్టిపెట్టి కూడబెట్టడం వల్ల గులాబీ వాడింది. బీఆర్‍ఎస్‌కు ఈ చేదు ఫలితాలు రావడానికి ఉన్న కారణాలు మూడు మాటల్లో చెప్పాలంటే– ‘ఎ’ ఫర్ ఏరొగెన్స్ (అహంకారం), ‘బి’ ఫర్ (బోగస్ అభివృద్ధి), ‘సీ’ ఫర్ కరెప్షన్ (అవినీతి). మేధావులను కావాలని దూరం చేసుకోవడం, అధికారులను దారుణంగా నియంత్రించడం, మీడియాను తొక్కిపెట్టడం అనే మూడు పనులు కేసీఆర్ అభివృద్ధి అజెండాలో భాగమై ఈ ఫలితాలకు కారణమయ్యాయి. తనకు ఉద్యమ సమయంలో మేధోపరమైన మద్దతు అందించిన వారిని ఎందుకు దూరం చేసుకున్నారో ఆయనకే తెలియాలి. ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా గజ్జెకట్టి గళమెత్తిన గద్దర్ లాంటి వారిని అంతగా అవమానించిన ఉసురు తప్పక తగిలింది. నిపుణులైన అధికారులను వారి పని వారు చేసుకోకుండా చేసి, అంత ఖరీదైన కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేసినట్లు ఘనత కొట్టెయ్యాలన్న ఆలోచన కూడా దెబ్బతీసింది. ముందు నుంచీ ఆ క్లెయిమ్స్ చేసుకోకుండా ఉండి ఉంటే, ప్రాజెక్టు మునిగినప్పుడు, కుంగినప్పుడు తప్పు ఇంజినీర్ల మీద తోసి తప్పించుకోవడానికి వీలయ్యేది. ఇట్లా ఏ అంశం తీసుకున్నా, ఇంత అనుభవం ఉన్న మనిషి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నాడే అని సాధారణ జనం అనుకున్నారు. శత్రువులపై అయన వాడిన ఘోరమైన భాష, వైరి పక్షాల అధికార ప్రతినిధులను నిస్సిగ్గుగా తన పార్టీలో కలిపేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు కూడా ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. బాధాకరం ఏమిటంటే, యువ నాయకుడికి కూడా ఈ ధోరణి గత ఏడాదిగా తలకెక్కినట్లు కనిపించింది.
రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని కేసీఆర్ మరొకసారి నిరూపించారు. తెలంగాణను చిత్తడి చేసిన చెత్త పాలన చిత్తు చిత్తు అయ్యిందనేది వాస్తవమే అయినా, తెలంగాణ జాతిపిత చేసిన దారుణ తప్పులు, ఘోరాలు, నేరాల నుంచి పాఠాలు నేర్చుకుని పాలన సాగిస్తే కాంగ్రెస్ పది కాలాలపాటు నిలబడుతుంది. సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ పునర్నిర్మాణం బాధ్యత ఆ పార్టీకి ఒక సవాలు, ఒక మంచి అవకాశం.
డా. ఎస్. రాము
సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం బోధకుడు
Updated Date - 2023-12-06T02:10:34+05:30 IST