విస్థాపనలోని విషాదానందాలు
ABN, First Publish Date - 2023-09-18T00:28:13+05:30
ఏ ఇండియన్ అమెరికన్ రచనలోనైనా ఏముంటుంది. సమాంతర జీవనం ఉంటుంది. ద్వైదీభావం ఉంటుంది. అక్కడ ఉండి ఇక్కడ కూడా ఉండడం ఉంటుంది. అక్కడ ఉండడాన్ని ప్రేమిస్తూనే ఇక్కడ లేకపోవడం...
ఏ ఇండియన్ అమెరికన్ రచనలోనైనా ఏముంటుంది. సమాంతర జీవనం ఉంటుంది. ద్వైదీభావం ఉంటుంది. అక్కడ ఉండి ఇక్కడ కూడా ఉండడం ఉంటుంది. అక్కడ ఉండడాన్ని ప్రేమిస్తూనే ఇక్కడ లేకపోవడం గురించి కలగనడం ఉంటుంది. ఇల్లు ఉండడం, ఆ ఇంటికి తిరిగి వెళ్లడాన్ని లేదా వెళ్లలేకపోవడాన్ని ప్రశ్నించడం ఉంటుంది. తిరిగి వెళ్లిన క్రమంలో నిన్ను యథాతథంగా అంగీకరించి స్వీకరిస్తారా అనే సందేహాలుంటాయి. లేదులే అనే నిర్ధారణలూ ఉంటాయి. తను ఉంటున్న నేలకూ ఉండాలనుకుంటున్న నేలకూ మధ్య ఘర్షణ ఉంటుంది.
నిషాంత్ ఇంజం కూడా ఇండియన్ అమెరికన్ రచయితే. అతని ‘ది బెస్ట్ పాజిబుల్ ఎక్స్‌పీరియన్స్’ ఆంగ్ల కథా సంపుటి కూడా ఇండియన్ అమెరికన్ రచనే. కానీ ఇవి మాత్రమే కాక నిషాంత్ కథల్లో ఇంకా చాలా ఉన్నాయి. బహుజన అణచివేత ప్రస్తావనలున్నాయి. నలుపు తెలుపుల విభేదాల వేదనలున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ మీద విసుర్లున్నాయి. ఐడెంటికల్ జీవితాలున్నాయి, పారలల్ జీవన విధానాలున్నాయి.
నిషాంత్ ఇంజం భారతీయుడు. తెలంగాణవాడు. ఖమ్మంవాడు. ఇక్కడే చదువుకుని ఇక్కడే ఎదిగి అమెరికా వెళ్లి ఓ పదకొండు కథలు రాసి ఓ పుస్తకంగా మన ముందుంచాడు. హార్పర్ అండ్ కోలిన్స్ వారు ఈ పుస్త కాన్ని అచ్చేసారు. ఇది చిన్న విషయం కాదు. ఆ పుస్తకం అనేకమంది ప్రముఖుల ప్రశంసలు అందుకోవడం, అనేక బెస్ట్‌సెల్లర్స్ జాబితాలలో ప్రధానంగా చోటు దక్కించుకోవడం నిజంగానే చిన్న విషయం కానే కాదు.
పేరుకే పదకొండు కథలు కానీ ఇవన్నీఒకే భావోద్వేగం లోని వెలుగు చీకట్ల అనేక పొరలు. వెలుగులోపలి చీకటిని చీకటిలోపలి వెలుగునూ వేదికనెక్కించే బతుకు తునకలు. పేరుకే వేర్వేరు కథలు గానీ కలిపి చదివితే ఒకే నవలగా ప్రవహించే వివిధ పాయలు. తెలుగు రాష్ట్రాలలో ఇంటికొకరు చొప్పున అది విస్థాపనో, వలసో, బతకుతెరువో, విలాసమో అర్థంకాని నిర్లిప్త ఉత్సవోత్సాహంతో విదేశాలలోనే ఉద్యోగాలు చేసుకుంటున్న వేళ ఆ ప్రతి కుటుంబానికీ అనుభవంలోకి వచ్చిన కథలివి. ఎంత ఈసడించుకున్నట్టు నటించినా ఆ మోజు వదలక అమెరికానో కెనెడానో ఆస్ట్రేలియానో కలగంటున్న యువతీ యువకులకు అనుభవంలోకి రాబోయే కథలివి.
ఈ కథా సంపుటి మొదటి పేజీలో ఓ కొటేషన్ ఉంది. ‘ముందుకు సాగిపోయే క్రమంలో గతం కూడా మారిపోతుంది’ అని. చాలా కథల్లో ఈ భావం అంతర్లీనంగా వ్యాపిస్తూ ఉంటుంది. వర్తమానాన్ని భవిష్యత్తును మార్చగలమేమో కానీ గతం మారదు అనే ఒక బలమైన నిర్ధారణలో మనం ఉంటాం. కానీ గతం కూడా ఒకానొక స్థితిలో మారుతుంది అని రుజువు చేసే కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. మేఘా మజుందార్ ఈ కథా సంపుటికి రాసిన బ్లర్బ్ లో నిషాంత్ కథలను చదవగానే నాకు అన్నీ పక్కకు నెట్టేసి ఇంటికి వెళ్లి పోవాల నిపించింది అని రాసారు కానీ నేనామెతో ఏకీభవించను. నిజమే ఇవి ఆగమనాలు, నిష్క్రమణల గురించిన కథలే. నిజమే ఇవి ద్వంద్వాన్ని ద్వేషించని సకారాత్మక విస్థాపనలే. కానీ నిషాంత్ ఇంటికి వెళ్లిపోవడం అనే భావోద్వేగాన్ని రెచ్చగొట్టే కథలో, మాతృనేల నోస్టాల్జియా గురించో, వలస దుఃఖం గురించో, ఎగ్జయిల్ గ్రీఫ్ గురించో మాత్రమే ఎక్కడా రాయలేదు. మంచి భవిష్యత్తు కోసం విదేశీ ఆర్థిక అండదండల అర్రులు చాచడం గురించి గానీ కోల్పోయిన నేల స్పర్శను గురుతులలో భద్రపరుచుకోవడం గురించి గానీ ఎక్కడా నిషాంత్ జడ్జిమెంటల్‌గా లేడు. భావోద్వేగాలను ప్రకటిస్తూనే సందర్భానికి దూరంగా ఉండి మాట్లాడాడు. నిర్ణయాన్ని పాఠకుడికే వదిలేస్తాడు. చదువుకోవడానికి అమెరికా వెళ్లి మొదటి సెమిస్టర్ దాటలేని కుర్రాడి యాతన, అక్కడే ఉండిపోవడానికి అమెరికా అమ్మాయిని దొడ్డి దారిన పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించే కుర్రాడి బాధ, ఇంటికి తిరిగివచ్చి తనను పెంచిన తాత స్థితిని జీర్ణం చేసుకోలేక దుఃఖితమయ్యే స్త్రీ వేదన, అన్నీ విస్థాపిత గాథలే.
పదకొండు కథల్లోని ఏడు కథలను కలిపే ఒకానొక నైరూప్య సారూప్యత కారణంగా ఈ కథలను నవలా ప్రవాహ పాయలు అంటాను. ఒక కథలో వదిలిన ఉద్వేగపు మిగుళ్లను మరో కథలో మన గుండె దోసిళ్లలో నింపుతాడు నిషాంత్. ఒక కథ అర్ధాంతర ముగింపును మరో కథలోని వివరణాత్మక ఆరంభంలో ప్రవేశపెడతాడు. జీవన యానం ఒక దశలోంచి ఇంకో దశలోకి మారే పరిణామాలను మన ముందుంచి పాత్రలను అభావాలు చేసి మరో మలుపులోకి కథను తిప్పేస్తాడు. నిషాంత్ నిర్మాణ పరంగా కథను జాగ్రత్తగా పేర్చుకుంటూ పోతాడు. ఎత్తుగడ, నడక, ముగింపు అన్నీ వ్యూహాత్మకంగా ఉంటాయి. ప్రత్యేకంగా నిషాంత్ ముగింపుల గురించి మాట్లాడుకోవాలి. ఏ కథనీ సవివరంగా ముగించని ఓ రూప రహస్యమేదో నిషాంత్ రచనల్లో ఉంది. కథ చివరి వాక్యాన్ని చదివాక పాఠకుడికి రచయిత చెప్పదలచుకున్నదేదో అర్దమయాక కూడా ఇంకా అనేక సందేహాలను మిగిల్చి శుభం అంటాడు నిషాంత్.
బహుశా నిషాంత్‌కు తెలుగు సాహిత్యంతో పరిచయం చాలా తక్కువ. తెలుగులో సృజనాత్మక రచనలు చేసిన దాఖలాలు లేవు. అయినా ఇతివృత్తాల ఎంపికలో, కథనంలో, నిర్మాణంలో చేయితిరిగిన రచయిత కుండే మెళకువలన్నీ తనకున్నాయని కథలలో నిరూపించాడు బలంగా.
ఇంత రాసిన నిషాంత్ ఇంజంలో నాకు లోపంగా అనిపించిన ఒకే ఒక అంశం సంభాషణలతో కథను నడిపించలేకపోవడం. తను కథను ఫస్ట్ పర్సన్ నెరేటివ్ లోగానీ థర్డ్ పర్సన్ నెరేటివ్ లోగానీ మాత్రమే చెప్పుకుంటూ వెళ్లిపోతాడు. ఇబ్బందేమీ లేదు. కానీ పాత్రల మధ్య సంభాషణలు చాలా తక్కువ ఉంటాయి. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసాడో లేక తన వల్ల కాదని వదిలేసాడో తెలీదు.
ఇక్కడ ఒకసారి చరిత్ర చూస్తే, తెలుగులో రచనలు చేస్తూ ఇంగ్లీషులో రచనలు చేసేవారు చాలా తక్కువ. తెలుగులో రచనలు చేయకుండా ఇంగ్లీషులో రచనలు చేసిన వారు దాదాపుగా లేరు. గతంలోకి వెళితే బుచ్చిబాబు ఇంగ్లీషులోనూ రాసారు. పాలగుమ్మి పద్మరాజు ఇంగ్లీషులో చాలా చాలా రాసారు. కొకు కూడా ఇంగ్లీషులో రాసారు. మైథవోలు వెంకట సత్యనారాయణ, మంథన దామోదరాచార్య, కోడూరి ప్రభాకరరెడ్డి, పరుచూరు గోపీచంద్, వేల్చేరు నారాయణ రావు, మోదుగు రవికృష్ణ, అఫ్సర్ ఇంకా నాకు తెలియని, లేదూ సమయానికి గురుతురాని, చాలామంది మంచి ఇంగ్లీషులో రాసినవారు, రాయగలిగిన వారు. కేవలం ఆంగ్లంలో సృజనాత్మక రచనలు చేసిన వారు తెలుగులో లేరనే చెప్పాలి. మనం ఎన్ని పేర్లు చెప్పుకున్నా అవన్నీ ఆంగ్లానువాద కారుల పేర్లే. ఇప్పుడు అనువాదాలు కమ్ ఆంగ్ల రచనలు చేస్తున్న వారిలో లంకాశివరామప్రసాద్ పేరు కచ్చితంగా మొదటివరుసలో నిలుస్తుంది. ఇటువంటి వాతావరణంలో తెలంగాణ నేల నుంచి పరిమళించిన ఓ రాత గురించి మాట్లాడడం గర్వంగా ఉండడం ఖాయం. నిషాంత్ ఇంజం తెలంగాణియన్ అమెరికన్ రైటర్. బహుశా తొలి కూడా కావచ్చు.
ఐదారేళ్ల క్రితం నిషాంత్ రాసిన మొదటి కథ స్ర్కిప్ట్‌గా చదివి నిర్మా ణంలో కొంత అస్పష్టత ఉంది, కథా సంవిధానంలో కొంత దూకుడుంది, ఎంచుకున్న ఇతివృత్తాన్ని నడపడంలో ప్లేయింగ్ టు ది గాలరీ ఉంది అనుకున్నాన్నేను. అదే మాట ఆ రోజు తన కొడుకు కథలు రాయడాన్ని చూసి మౌనంగా మురిసిపోయే ఐ.వి. రమణా రావుకు కూడా చెప్పాను. దాంతో పాటు ‘హి విల్ హిట్ బుల్స్ ఐ’ అని కూడా చెప్పాను. నేను దోషాలనుకున్నవన్నీ పరిహరించుకుని ఇవాళ నిటారుగా నిలబడ్డాడు నిషాంత్. బుల్స్ ఐ కొట్టాడు కూడా. ఈ కథలు చదవడం నిజంగానే బెస్ట్ పాజిబుల్ ఎక్స్‌పీరియన్స్!
ప్రసేన్
Updated Date - 2023-09-18T00:28:13+05:30 IST