హమాస్ ఏం సాధించింది?
ABN, First Publish Date - 2023-10-17T01:39:26+05:30
ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలోనూ, దరిమిలా గాజాపై ఇజ్రాయిల్ ప్రతీకార దాడిలోనూ వందల మంది చనిపోయారు, ఇంకా చనిపోతున్నారు. పాలస్తీనియన్లు, ఇజ్రాయిలీల మధ్య ఈ ఎడతెగని పోరును చరిత్ర...
ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలోనూ, దరిమిలా గాజాపై ఇజ్రాయిల్ ప్రతీకార దాడిలోనూ వందల మంది చనిపోయారు, ఇంకా చనిపోతున్నారు. పాలస్తీనియన్లు, ఇజ్రాయిలీల మధ్య ఈ ఎడతెగని పోరును చరిత్ర, సమకాలీన అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చూస్తేనే కానీ ఆ సమస్య సంక్లిష్టత అర్థం కాదు.
యూదు, క్రైస్తవ మతాలకు జన్మస్థలం జెరూసలెం. అయితే క్రైస్తవులు, యూదులు ఐరోపా ఖండానికి వెళ్లిపోవడంతో వెయ్యి ఏళ్ళనుంచి ఆ ప్రాంతం అరబ్బుల కింద, ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగానూ ఉన్నది. ఐరోపాలో క్రైస్తవులు వెయ్యి ఏళ్ళు యూదులను చావగొట్టి చెవులు మూసారు. జీసస్‌ను శిలువ ఎక్కించింది యూదులే అన్నది క్రైస్తవుల కోపం. చివరికి యూదులు అందరూ తమ జన్మభూమి అయిన జెరూసలేంకి వెళ్లడమే అంతిమ పరిష్కారం అని 1896లో థియోడర్ హెర్జెల్ అనే యూరోపియన్ యూదుడు తన ‘యూదు రాజ్యం’ అనే పుస్తకంలో ప్రతిపాదించాడు. ఈ ఆలోచన యూదుల్లో మెల్లగా ఊపందుకొన్నది. 1917లో అప్పటి బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు ఆర్థర్ బాల్ఫౌర్ తాము టర్కీ (నేటి తుర్కీయే) నుంచి స్వాధీనం చేసుకున్న పాలస్తీనాను యూదులకే ఇచ్చేస్తామని ప్రకటించాడు. నిజానికి ఇలా చేసేందుకు బ్రిటన్‌కు ఏ అధికారం లేదు. యూదులు వచ్చినా పాలస్తీనియన్లు వారిని పొమ్మనలేదు, కలిసే ఉందామన్నారు. అయితే క్రమేణా వేల సంఖ్యలో వచ్చి చేరుతున్న యూదులను, భూకబ్జాలను నిరసించసాగారు. వారి సెటిల్మెంట్స్ మీద చాలా దాడులు చేశారు. లెబనాన్, సిరియా, జోర్డాన్‌లను మాత్రమే గుర్తించి, పాలస్తీనా గురించి ఏమీ తేల్చకుండానే బ్రిటిష్ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధానంతరం పాలస్తీనా నుంచి నిష్క్రమించారు. పాలస్తీనా వారితో మైనారిటీలుగా ఆ దేశాన్ని పంచుకోవడం ఇష్టం లేని యూదులు, బ్రిటన్, అమెరికాల కుటిల సహకారంతో ఇజ్రాయిల్ నేర్పాటు చేసుకున్నారు. 1949లో ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు సాధించుకున్నారు. పాలస్తీనియన్లకు అన్యాయం చేసారు. యూరోపియన్ యూదులను ఇజ్రాయిల్‌కి రమ్మని ఆహ్వానం పంపారు. పాలస్తీనాను గుర్తించాలని భారత్‌తో సహా పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఐదు అరబ్బు దేశాలు 1967లోనూ, 1973లోనూ యుద్ధం చేసి పాలస్తీనాకు న్యాయం చేద్దామని ప్రయత్నించాయి. అయితే అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ ఆ ప్రయత్నాన్ని విఫలం చేసింది. సోవియెట్ యూనియన్ కొంత మేరకు పాలస్తీనియన్లకు మద్దతుగా నిలిచింది. 1991లో అది విచ్ఛిన్నమైన తరువాత ఇజ్రాయిల్ ఇంకా రెచ్చిపోయి పాలస్తీనాను గుర్తించే ద్విదేశ ప్రతిపాదనకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది. ఈ నాటికీ పాలస్తీనియన్లు తమ సొంత దేశంలో పరాయివారుగా బతుకుతున్నారు. 90 శాతం భూమిని యూదులు ఆక్రమించుకున్నారు. పాలస్తీనాలో ఉన్న 80 లక్షల మంది పాలస్తీనియన్లలో 40 లక్షల మంది ఈజిప్ట్, లిబియా, జోర్డాన్, లెబనాన్ దేశాలకు కాందిశీకులుగా వెళ్లారు. వారికి, మళ్లీ స్వదేశానికి వచ్చే హక్కును ఇజ్రాయిల్ రద్దు చేసింది. మిగతా 40 లక్షల మందిని గాజా, వెస్ట్ బ్యాంకు అని రెండు ప్రదేశాలకి పరిమితం చేసారు. గాజా అనేది నిజానికి ఈజిప్ట్‌ను ఆనుకుని ఉన్న చిన్న పొడుగాటి ముక్క. అందులో 23 లక్షల మందిని ఎక్కడికీ వెళ్లకుండా చేసి ఒక ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చేశారు. వారికి చెయ్యడానికి పని లేదు, మరో దేశం పోలేరు. శరణార్థి భృత్యంతో జీవనం గడుపుతారు. ఇప్పడు వెస్ట్ బ్యాంక్ నుంచి కూడా పాలస్తీనియన్లను తరిమేయడానికి ఇజ్రాయిలీలు ప్రయత్నిస్తున్నారు.
ఇజ్రాయిల్ పాలకులు 1996 దాకా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని చెప్పేవారు 1994లో నార్వే మధ్యవర్తిత్వంలో పాలస్తీనా వారితో ఇజ్రాయిల్ ఒక ఒడంబడిక కుదుర్చుకున్నది. ఇది ఒస్లో ఒడంబడికగా సుప్రసిద్ధమైనది. అయితే 1997లో అధికారంలోకి వచ్చిన లికుడ్ అనే అతివాద పార్టీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని గౌరవించలేదు. పోరుబాట విడిచి శాంతిమార్గం అవలంబించిన పాలస్తీనా ఫతాహ్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎక్కడికైనా పొండి, లేకపోతే చావండి అనే విధానాన్ని రెండు దశాబ్దాలుగా పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయిల్ సాగిస్తోంది. పాలస్తీనా వారిని కొన్ని వీధులకి కట్టిపడేసి, సొంత గడ్డమీద పరాయివాళ్లుగా మార్చింది. దరిమిలా, ఇజ్రాయిల్‌తో బేరాలు కాదు, సాయుధ పోరాటమే శరణ్యం అని పిలుపునిచ్చిన హమాస్, ప్రజల్లో పాపులర్ అయి గాజాలో అధికారం సాధించింది. 2014 నుంచి రహస్యంగా ఈజిప్ట్‌లోకి కొన్ని వందల సొరంగాలు తవ్వి, ఇరాన్ నుంచి రాకెట్లు, ఏకే47లు సమకూర్చుకుని, వేలాది మిలిటెంట్స్‌ని తయారుచేసుకుంది. ఇందుకు, ఈజిప్టులోని ముస్లిం బ్రదర్ హుడ్, లెబనాన్‌లోని హిజ్బుల్లా, ఇంకా ఇరాన్ సహకారం ఉంది. కొన్ని వందల రాకెట్లతో 2014 నుంచి ప్రతి సంవత్సరం ఇజ్రాయిల్ నగరాల మీద దాడి చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ప్రతీకారంగా ఇజ్రాయిల్ తన హెలికాప్టర్లతో విరుచుకుపడి 5 వేలమంది పాలస్తీనియన్లను హతమార్చింది. ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని, హమాస్‌తో చర్చలు చేయడానికి మాత్రం ససేమిరా అంటోంది.
ఈలోగా ప్రపంచంలో కొన్ని రాజకీయ మార్పులు జరిగాయి. అవి: (1) రష్యా చమురు, గ్యాస్ అమ్మకాలతో కోలుకుని, ఒక రాజకీయ శక్తిగా ఎదిగి, పాశ్చాత్య దేశాలకు మళ్లీ సవాలుగా మారడం. ఉక్రెయిన్ యుద్ధం అందులో భాగమే. (2) చైనా, అమెరికాని తోసిరాజని, గ్లోబలైజెషన్ సాయంతో కొత్త అంతర్జాతీయ ఆర్థిక–సైనిక శక్తిగా చైనా ప్రభవించడం. ఈ పరిణామాలతో ఒక బహుధ్రువ ప్రపంచం ఏర్పడుతోంది. ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాలు అమెరికాకు భయపడడం మానేశాయి. ఆర్థిక ఆంక్షలు విధించినా ప్రయోజనం దక్కట్లేదు. (3) ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఏకఛత్రాధిపత్యం కోల్పోవడమే కాక, ఆర్థికంగా కూడా బలహీనపడడం. డాలరు ఆధిపత్యం క్రమేణా క్షీణిస్తోంది. యూరప్ మొదలుకొని సౌదీ అరేబియా దాకా అన్ని దేశాలు పక్క చూపులు చూస్తున్నాయి. (4) అన్ని ఖండాలను రోడ్డు మార్గంలో కలిపే బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ రోడ్ ప్రాజెక్ట్‌ను చైనా చురుగ్గా అమలుపరుస్తోంది. అందులో భాగంగా చైనా, ఇరాన్ యూరపులను కలుపుతూ గ్యాస్ పైప్‌లైన్ ప్రతిపాదిస్తోంది. దీనివల్ల ఇరాన్, చైనా, రష్యా ఇంకా బలపడే ఆస్కారం ఉందని అమెరికా భయం.
వీటన్నింటికీ పరిష్కారం కోసం అమెరికా తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా, యూరపును రష్యామీద గ్యాస్ కోసం ఆధారపడకుండా చేసేందుకు సౌదీ, కతార్, బెహ్రెయిన్, ఇజ్రాయిల్ మధ్యనుండి ఒక గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ప్రతిఫలంగా, ఇరాన్ నెదుర్కోడానికి సౌదీ అరేబియా అమెరికాను అణుబాంబులు అడిగింది. అమెరికా అంగీకరించింది. ఇందుకు బదులుగా సౌదీ అరేబియా ఇజ్రాయిల్‌ను ఒక సార్వభౌమిక దేశంగా గుర్తించడానికి అంగీకరించింది! ఇదంతా పాలస్తీనాకు వ్యతిరేకమన్న వాస్తవాన్ని గ్రహించిన హమాస్ ఇజ్రాయిల్ మీద మెరుపు దాడి చేసింది. ఎలాగూ ఇంకా సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాలు కూడా మాట్లాడడం మానేస్తే ఇక పాలస్తీనియన్ల గురించి పట్టించుకునేవారే ఉండరు. దాడికి ప్రతీకారంగా ఇప్పుడు గాజా మీద ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున బాంబింగ్ చేస్తే లక్షల్లో ప్రజలు చనిపోతారు. అప్పుడు ఇస్లామిక్ దేశాల్లో ప్రభుత్వాలు తమ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఆ కారణంగానైనా పాలస్తీనా విషయం ప్రపంచంలో మళ్ళీ చర్చనీయాంశమవుతుంది. ఇక అమెరికా–సౌదీ–ఇజ్రాయిల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం వెనక్కువెళ్లడం ఇరాన్‌కి కూడా అవసరం.
ఇజ్రాయిల్ కూడా ఒక అంతర్గత సంక్షోభంలో ఉంది. రాజ్యాంగం లేని ఇజ్రాయిల్‌లో కోర్టులు, న్యాయమూర్తులే పెద్ద పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాని నెతన్యాహు అక్రమార్జన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తనని తాను రక్షించుకోవడానికి న్యాయమూర్తుల అధికార పరిధిని తగ్గించే న్యాయ సంస్కరణలు ప్రతిపాదించాడు. వాటికి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు హమాస్ దాడితో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వస్తోంది. పాలస్తీనా సమస్యని శాశ్వతంగా పరిష్కరించేశానన్న నెతన్యాహు ప్రచారం తుస్సుమంది. అంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఇజ్రాయిల్, హమాస్ చేతిలో భారీగా భంగపడింది, భవిష్యత్తులో ఇలాటి దాడులు జరగకుండా చేయడం అనుమానమే. యూదులకు మాత్రమే ఇజ్రాయిల్ అనే వాదన పర్యవసానమే ఈ పరిస్థితి. ఏ ప్రజలనైనా వలస వాదంతో ఎన్నిసార్లు అణచివేస్తే అన్నిసార్లు లేస్తారు అన్నది చారిత్రక వాస్తవం. దీన్ని ఇజ్రాయిల్ తెలుసుకోవడం మంచిది. ఇప్పటికైనా కూర్చుని మాట్లాడుకుని రెండు–దేశాలు ఉండేలా పరిష్కారం వెదకడమే అంతిమ మార్గం. గాజాలో ఊచకోత సమ్మతం కాదని సౌదీ అరేబియా ఇప్పుడు స్పష్టం చేసింది. చాలా దేశాలు ఇప్పటికే యుద్ధం సరికాదు అని ఇజ్రాయిల్‌కి చెపుతున్నాయి. హమాస్‌ని మాత్రమే అంతం చేస్తామని ఇజ్రాయిల్ అంటోంది. వందలాది ట్యాంకులను, లక్షలాది సైన్యాన్ని మోహరించింది. గాజా అతలాకుతలం అవుతోంది. ఏదిఏమైనా, హమాస్ తన దాడితో పాలస్తీనా అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చింది అనడంలో సందేహం లేదు.
ప్రొ. ఆర్.వి. రమణమూర్తి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
Updated Date - 2023-10-17T10:24:48+05:30 IST