కొత్త వ్యాకరణం ఎందుకు రాశాను?
ABN, First Publish Date - 2023-01-09T00:40:07+05:30
తెలుగులో వ్యావహారిక భాష అనే ఊహ ఎక్కడ మొద లయిందోగాని తెలుగు ఎలా రాసినా ఫరవాలేదు అనే అభిప్రాయానికి అది దారి తీసింది...
తెలుగులో వ్యావహారిక భాష అనే ఊహ ఎక్కడ మొద లయిందోగాని తెలుగు ఎలా రాసినా ఫరవాలేదు అనే అభిప్రాయానికి అది దారి తీసింది. గిడుగు రామమూర్తిగారు గట్టి గొంతుకతో గ్రాంథికం ఎవరూ రాయలేరు అని పుంఖానుపుంఖమైన ఉదాహరణలతో ఉపన్యాసాలు చెప్పి వినేవాళ్లను భయపెట్టేసేవాడు. కాని తనే వ్యావహారికం అంటే యేమిటి, ఎలా రాయాలి అని చెప్పే ప్రయత్నం యెప్పుడూ చెయ్యలేదు. దాని ఫలితంగా తెలుగు రాసేవాళ్లు తమకి ఏది తోస్తే అది తమకి ఎలా వీలయితే అలా రాసేవాళ్లే కాని తెలుగు నేర్చుకునేవాళ్లు ఎలా నేర్చుకోవాలి అనే ప్రశ్న ఎవరూ వెయ్యలేదు.
వ్యాకరణం అంటే చిన్నయసూరి రాసినదే! అది ఛందోబద్ధమైన పద్యాలు రాసేవాళ్లకి మాత్రమే ఉపయోగపడుతుంది. పాటలు రాసేవాళ్లు ఆ వ్యాకరణాన్ని అనుసరించలేదు. అంచేత పద్యాలు రాసేవాళ్ల భాషని మినహాయించేస్తే మిగతా రకాల భాషలు (భాషలు అని కావాలనే అంటున్నాను) ఎలా వుండాలి అనే ప్రశ్న ఎవరూ వేసుకోలేదు. తెలుగు భాషా స్వరూపం ఇది అని చూపించే పుస్తకం ఏదీ మనకు లేదు.
ఆధునిక తెలుగు అనేది కేవలం పత్రికలవల్ల క్రమక్రమంగా ఏర్పడింది. గిడుగు ధర్మమా అని మనకు వ్యాకరణం అంటే భయం పోయింది. నేను రాసే ఈ మాట, ఈ వాక్యం వ్యాకరణం ఒప్పుకుంటుందా అని ఆలోచించుకోవలసిన అవసరం పూర్తిగా పోయింది.
తెలుగు భాషకి ప్రమాణంగా వున్నటువంటి భాష ఇంగ్లీషు అవగానే మనకు తెలుగు భాషా స్వభావం అర్థంకాకుండా పోయింది. ఈ భాష వేరే స్వభావం కలదేమో అన్న ఊహ కూడా మనకి రాలేదు. ఇంగ్లీషు నామవాచకం (ూౌఠుఽ) ప్రధానమైన భాష. ప్రతీదీ కూడా నామవాచకంగా మార్చి చెప్పుకోవడం (రాసుకోవడం) మనకు ఇంగ్లీషు వల్ల అబ్బింది. అందుకే మన తెలుగు పత్రికల్లో ఇంగ్లీషు పత్రికల్లో గల శీర్షికల్లాగా ప్రతీదీ నామవాచకంగా మార్చి రాసుకుంటున్నాం. ‘‘దొంగ దొరికాడు’’ అని పత్రికలు శీర్షిక పెట్టడానికి వీల్లేదు. ‘‘దొంగ పట్టివేత’’ అని దాన్ని నామవాచకంగా మార్చి శీర్షిక పెట్టాలి. తెలుగు పత్రికల శీర్షికలన్నీ ఇలాగే వుంటాయి. అందుకని మనం కృతకమైన నామవాచక రూపాలు పత్రికల్లో వాడడం మొదలుపెట్టాం.
ఈ వ్యాకరణంలో నేను చేసిన ప్రధానమైన పని ఏమిటంటే తెలుగు క్రియా ప్రధానమైన భాష అని గుర్తించడం. ఉదాహరణకి సంస్కృత వ్యాకరణ మర్యాద ననుసరించి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్కాలం అనే మాటలు వున్నాయని అనుకుందాం. కాలం అనే మాట ఇంగ్లీషులో టెన్స్ (ఖ్ఛీుఽట్ఛ) అనే దానికి, టైమ్ (ఖీజీఝ్ఛ) అనే దానికి పర్యాయ పదం. రెంటికీ టైమ్ అనే మాటే వాడతాం. లౌకికమైన కాలం మనుషులందరికీ వుంది. కాని వ్యాకరణంలో కాలం అలాగే వుండక్కర్లేదని మనం గుర్తించలేదు. తెలుగులో, టెన్స్ అనే అర్థంలో, రెండే కాలాలు వున్నాయి. అంటే తెలుగులో రెండే టెన్సెస్ వున్నాయి. అయిపోయినటువంటి పనులన్నీ చెప్పడానికి పనికొచ్చే టెన్స్ ఒకటి, ఇంకా మొదలు కాని పనులన్నీ చెప్పడానికి పనికొచ్చే టెన్స్ మరొకటి.
ఏదయినా జరిగిన సంఘటనకి రెండు లక్షణాలు వుంటాయి. 1. అది జరిగింది అన్న లక్షణం. 2. అది కొంతసేపు జరిగింది అనే లక్షణం. ఈ రెండు లక్షణాలకి రెండు రకాల టెన్సెస్ వుండాలి. ఉదాహరణకి రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. కాని ఈ రెండవ ప్రపంచ యుద్ధం చాలా కాలం జరిగింది కదా. ఆ విషయాన్ని చెప్పడానికి వేరే రకమైన కాలం (ఖ్ఛీుఽట్ఛ) కావాలి. ఆ రకంగా చూస్తే ప్రతి విషయాన్ని - చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు - రెండు రకాలుగా చూడాలి. అది జరిగింది అన్నది ఒక విషయం. అది కొంత కాలం పాటు జరిగింది అన్నది రెండవ విషయం. తెలుగులో వీటికి వేర్వేరు టెన్సెస్ లేవు. అంతా భూత కాలమే. టెన్స్‌ని టైమ్‌ని విడదీసి రెండు రకాలుగా చూస్తే టెన్స్ భాషా విషయకం. టైం అనుభవ విషయకం.
నా వ్యాకరణంలో ప్రోగ్రెసివ్ (ఞటౌజట్ఛటటజీఠ్ఛి) అనే కాలం ఒకటుంది. తెలుగులో రెండు టెన్సెస్ వున్నాయి అంటే, దానికి ప్రోగ్రెసివ్ చేరిస్తే నాలుగు టెన్సెస్ అవుతాయి. ప్రోగ్రెసివ్‌ని కూడా టెన్స్ అనకుండా ప్రోగ్రెసివ్ మోడ్ (ఞటౌజట్ఛటటజీఠ్ఛి ఝౌఛ్ఛీ)గా భావిస్తే రెండు టెన్సె్‌సకి రెండు మోడ్స్ చేరతాయి. ఉదాహరణకి ఆయన వెళ్తున్నారు, అనే ప్రోగ్రెసివ్ మోడ్ రెండు టెన్సెస్ లోను వుండటానికి వీలుంది. ఈ కింది వాక్యం చూడండి.
‘‘మీరు నిన్న బయటకి వెళ్తున్నారు. అప్పుడు నేను మీకు కనిపించాను.’’
ఈ ‘‘వెళ్తున్నారు’’ అనే మాట గడిచిన కాలానికి సంబంధించిన ప్రోగ్రెసివ్ మోడ్. అంచేత ప్రోగ్రెసివ్ ఇప్పటి కాలానికి సంబంధించినది కావచ్చు, గడిచిన కాలానికి సంబంధించినదీ కావచ్చు. ఈ తేడా నేను నా వ్యాకరణంలో స్పష్టంగా చూపించాను.
ఇక నా వ్యాకరణంలో ముఖ్యమైన రెండవ విషయం క్రియకి వున్న జీుఽజజీుఽజ్టీజీఠ్ఛి రూపాన్ని విడదీసి చూపించడం. ఆ జీుఽజజీుఽజ్టీజీఠ్ఛి కి రకరకాల ప్రత్యయాలు చేర్చడం మూలంగా ఎన్ని రకాల క్రియలు ఏర్పడతాయో చూపించాను. ఉదా హరణకి ‘‘చెప్పు’’ అనే క్రియ వుందనుకోండి దాని జీుఽజజీుఽజ్టీజీఠ్ఛి ‘‘చెప్ప’’. దానికి చెప్ప-గలను, చెప్ప-కూడదు, చెప్పొచ్చు, చెప్ప-క్కర్లేదు, ఈ రకంగా క్రియా రూపాలు తయారవుతాయని చూపించాను. ఐుఽజజీుఽజ్టీజీఠ్ఛి తెలియకపోతే ఈ రూపాలు ఇలా తయారవుతాయని ఊహించలేం. ఐుఽజజీుఽజ్టీజీఠ్ఛి ద్వారానే నెగెటివ్ (ుఽ్ఛజ్చ్టజీఠ్ఛి) కూడా తయారవుతుంది. చెప్పలేను, చెప్పకూడదు, ఈ రకంగా. అంచేత క్రియతో పాటు ఆ క్రియ యొక్క జీుఽజజీుఽజ్టీజీఠ్ఛి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది నా వ్యాకరణంలో స్పష్టంగా చూపించాను.
నా వ్యాకరణంలో తరవాతి భాగం క్రియా విశేషణాల గురించి. ప్రతి క్రియ నుంచి ఒక విశేషణాన్ని తయారు చేయొచ్చు. విశేషణం కాబట్టి దీని తర్వాత ఒక నామవాచకం వచ్చి తీరాలి. క్రియలోంచి వచ్చిన విశేషణం కాబట్టి క్రియకు వున్న భూత కాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం ఈ విశేషణానికి వుంటాయి. ‘‘చెప్పు’’ అనే క్రియ తీసుకోండి చెప్పిన, చెప్తున్న, చెప్పని అనే మూడు విశేషణాలు ఇందులోనుంచి వస్తాయి. చెప్పిన వాడు, చెప్తున్న వాడు, చెప్పనివాడు, ఈ రకంగా. తెలుగు భాషలో క్రియా విశేషాలు వుండబట్టి హిందీలోను, ఇంగ్లీషులోను, అలాంటి ఇతర భాషల్లో వున్న ఎత్, తత్ అనే వాటితో ఏర్పడిన వాక్యాలు అక్కర్లేదు. ఉదాహరణకి ‘‘మీరు ఏ పుస్తకమైతే నాకిచ్చారో ఆ పుస్తకం’’ అనేదాని బదులు, ‘‘మీరిచ్చిన పుస్తకం’’ అంటే సరిపోతుంది. గ్ఛటఛ్చజూ అఛ్జ్ఛీఛ్టిజీఠ్ఛిట గురించిన ప్రకరణంలో ఈ విషయాలు చాలా వివరంగా చర్చించాను.
ఇంక తరవాత తెలుగులో తికమకపెట్టే విషయం ఒకరు చెప్పిన దాన్ని మనం తిరిగి చెప్పడం. ఇంగ్లీషులో దీన్ని ‘‘రిపోర్టింగ్’’ (ఖ్ఛఞౌట్టజీుఽజ) అంటారు. ఈ పని చెయ్యడానికి తెలుగులో ఏ రకమైన వాక్యాన్ని చెప్తున్నామో ముందు చూసుకోవాలి. తెలుగులో ఆజ్ఞావాక్యాలు, అంటే వెళ్లు, చెప్పు, అడుగు, మాట్లాడు, ఇలాటివి. వీటిని తిరిగి చెప్పడానికి ఏం చెయ్యాలో ప్రత్యేకంగా చూపించాను. ఉదాహరణకి ఒకరు మిమ్మల్ని వాళ్లింటికి ‘‘రా’’ అని పిలిచారనుకోండి మీరు దాన్ని ఎలా చెప్పాలి: ‘‘రా + అన్నాడు’’ రమ్మన్నాడు అవుతుంది. ఆయన మిమ్మల్ని వాళ్లింటికి రమ్మన్నాడు.
తరవాత అభిప్రాయ వాక్యాలు. మూడవది ప్రశ్నార్థక వాక్యాలు. ఈ మూడు వేరువేరుగా గమనిస్తే తప్ప మీరు తిరిగి వీటిని మీ వాక్యాలుగా ఎలా చెప్పాలో బోధపడదు. ఈ విషయం ‘‘రిపోర్టింగ్’’ అనే విభాగంలో వివరంగా చెప్పాను.
తెలుగులో సామూహిక స్వామ్యం వున్న వస్తువులు వున్నాయి లేదా వ్యక్తులు వున్నారు. వీటిని గురించి ప్రత్యేకంగా పరిశీలించాను. నేను మా అమ్మకి ఒక్కణ్ణే కుమారుణ్ణి కావచ్చు. అయినా ‘‘మా అమ్మ’’ అంటాను. అలాగే మీరు మీ అమ్మకి ఒక్కరే కుమారుడు కావచ్చు. అయినా ‘‘మీ అమ్మ’’ అంటాను. ‘‘నీ అమ్మ’’ అంటే తిట్టు. కానీ మా యింట్లో ఒక గది ‘‘నా గది’’ అనవచ్చు. అది నేనొక్కణ్ణే వాడుకునే గది కాబట్టి. ఇలా దేనికి సామూహిక స్వామ్యం వుందో దేనికి వ్యక్తిగత స్వామ్యం వుందో వివరంగా చూపించాను.
ఇంక చివరగా ‘ఇది’, ‘గది’ అనే రకమైన వాక్యాలని గురించి పుస్తకం ప్రారంభంలో చెప్పాను అని గుర్తు చేసి, ఈ వాక్యంలో రెండు భాగాలు ఉత్తమ పురుషలోనే వున్నాయని గమనించమన్నాను. పోతే ‘నేను’, ‘నువ్వు’, ‘మీరు’ కర్తలైతే ఇదే వాక్యం ఎలా రాయాలి? ఏకవచనంలో నేను నారాయణరావుని అని ‘‘ని’’ చేరుస్తాం. బహువచనంలో మేము విద్యార్థులం, తెలుగువాళ్లం అని ‘‘అం’’ చేరుస్తాం. మనం కర్త అయినా ఇంతే. ఈ విశేషాలు ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో వివరించాను.
తెలుగులో ‘‘కి’’ ఉపయోగం జాగ్రత్తగా పరిశీలించాలి. ‘‘నేను ఇంటికి వెళ్లాను’’. ‘‘నేను మీ ఇంటికి వెళ్లాను కాని మీ ఇంట్లోకి వెళ్లలేదు’’. ఈ అర్థంలో గమనానికి ‘‘కి’’ వాడొచ్చు. కాని ‘‘నేను కారుకి వెళ్లాను’’ అనడానికి వీల్లేదు, ‘‘నేను కారు దగ్గిరికి వెళ్లాను’’ అనాలి. అలాగే వస్తువుల విలువ విషయంలో ‘‘అరటి పళ్లు రూపాయికి రెండు’’ అనే అర్థంలో ‘‘కి’’ వాడొచ్చు. ‘‘గోడకి బొమ్మలు వేలాడదీసి వున్నాయి.’’ అంటే గోడమీద అని అర్థం. ‘‘తలకి దెబ్బ తగిలింది.’’ అంటే తలమీద అని అర్థం. ఇలా ‘‘కి’’ ఎన్ని రకాలుగా వాడతామో ఒక అధ్యాయంలో ప్రత్యేకంగా చూపించాను.
ఇది ఆధునిక తెలుగుకి పరిపూర్ణమైన వ్యాకరణం. ఇలాంటి వ్యాకరణం తెలుగుకి ఎవరూ రాయలేదు. అలవాటుగా తెలుగు మాట్లాడేవాళ్లకి ఇవి ఎవరూ చెప్పకుండా వస్తాయి. కాని తెలుగు నేర్చుకోవలనుకునే తెలుగు పిల్లలకి ఈ వ్యాకరణం అవసరం. ఈరోజుల్లో మన ఇళ్లల్లో తెలుగు పిల్లలు కూడా తెలుగు మాట్లాడడం లేదు. ఇక తెలుగు పిల్లలు కాని వాళ్ల సంగతి వేరే చెప్పక్కర్లేదు. వీళ్లందరికీ పనికొచ్చే పుస్తకంగా ఈ వ్యాకరణం రాసాను. ఇది దాదాపు 450 పేజీల పుస్తకం అవడానికి కారణం ఇది.
వెల్చేరు నారాయణరావు
Updated Date - 2023-01-09T00:40:09+05:30 IST