లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎందుకు నిర్మించరు?
ABN, First Publish Date - 2023-05-20T02:02:09+05:30
జూరాల ఆధారంగా షాద్‌నగర్ ఎత్తిపోతల పథకం కోసం ఆలోచనలు జరిగిన కాలంలో టీఆర్‌ఎస్ అనే పార్టీ లేనేలేదు. అప్పటికే 1995లో ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మహబూబ్‌నగర్ సాగునీటి సమస్యపై సమీక్ష చేసి ఎటూతేల్చకుండా వదిలేశారు....
తొమ్మిదేండ్ల తెలంగాణ పాలన ముగియబోతుండగా కృష్ణానది నీటి పంపిణీకి సంబంధించి మహబూబ్‌నగర్ రంగారెడ్డి జిల్లాలకు జరిగిన అన్యాయాన్ని చర్చలోకి తీసుకుంటే ఈ జిల్లాల స్థితికి బాధ కలుగుతున్నది. బాధ ఎందుకంటే ఈ రెండు జిల్లాల ప్రజలు ఎప్పటిలాగానే అధికారంలోకి రాగల పార్టీ వాళ్ళనే ఎన్నుకున్నారు. ఆ ప్రతినిధులు మాత్రం ప్రజలవైపు నిలవకుండా పార్టీ వ్రతంలో తలమునకలవుతున్నారు.
జూరాల ఆధారంగా షాద్‌నగర్ ఎత్తిపోతల పథకం కోసం ఆలోచనలు జరిగిన కాలంలో టీఆర్‌ఎస్ అనే పార్టీ లేనేలేదు. అప్పటికే 1995లో ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మహబూబ్‌నగర్ సాగునీటి సమస్యపై సమీక్ష చేసి ఎటూతేల్చకుండా వదిలేశారు. ఈ స్థితిలో జలసాధన సమితి, కరువు వ్యతిరేక పోరాట కమిటి తదితర సంఘాలన్నీ కలిసి జలసాధన సమన్వయ సమితిగా ఏర్పడి ‘మాకు మా వాటా నీరివ్వకపోతే మలిదశ తెలంగాణ పోరాటం ప్రారంభిస్తా’మని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి పోరాటాలు నిర్వహించారు. ఆనాటికీ టీఆర్‌ఎస్ పార్టీ ఊసులోనే లేదు. ఈనాడు అధికార అందలాలలో ఉన్నవారు చాలామందికి ఆ పోరాటాలు కేవలం వార్తలు మాత్రమే. వారు వాటిల్లో భాగస్వాములు కారు. 2000 సంవత్సరంలో జూరాల ప్రాజెక్టు మీద నిలబడి జయశంకర్, కె.బాలగోపాల్ ‘నీళ్ళు తీసుకుంటే కాదు కూడదు అనేవాళ్ళను జూరాలతోనే కట్టడి చేయవచ్చును’ అని ప్రకటించిననాడు కూడా టీఆర్‍ఎస్ వాళ్ళు ఎవ్వరూ లేరు. 2001లో, 2002లో కృష్ణానదీ జలాల పునః పంపిణీ కృషి జరిగినపుడు, గద్వాలలో ఒక సదస్సులో ప్రొ. కె.జయశంకర్, నీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు కీలక ఉపన్యాసాలు చేసిన తరువాత కె.బాలగోపాల్, ప్రొ. జి.హరగోపాల్ కన్వీనర్లుగా కృష్ణానదీ జలాల పునః పంపిణీ ఉద్యమం ఏర్పడినప్పుడు కూడా ఆ సన్నివేశాలు టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలకు కేవలం వార్తాంశమే.
కృష్ణానదీ జలాల పునఃపంపిణీ ఉద్యమం తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అనే కార్యక్రమాలను చేపట్టింది. అప్పటికి నిర్మాణమైన ప్రాజెక్టులను, సాగునీటి పథకాలను సందర్శించింది. విస్తృతమైన చర్చ తరువాత నీటి పంపిణీలో ప్రాంతాల మధ్య అసమానతల నివారణ కోసం పునః పంపిణీ అవసరమని, ఆంధ్రకు, ప్రత్యేకంగా కృష్ణా డెల్టాకు మూడు పంటలకు కాకుండా అందరికీ అన్ని ఎకరాలకు ఒక పంటకైనా నీరిచ్చిన తరువాతనే ఎవరికైనా మరో పంటకు నీరివ్వాలని చర్చించింది. వర్షపాతం, భూగర్భజలమట్టం, భూమిలో తేమశాతం, జనాభా, వెనుకబాటుతనం వంటి అనేక ప్రాతిపదికలను పరిగణనకు తీసుకుని నీరు పంచాలని సూచించింది. వ్యయం లెక్కలతో రైతాంగాన్ని ఆత్మహత్యలవైపు, భూమిని ఎడారీకరణవైపు నెట్టకూడదని హెచ్చరించింది. ఈ ప్రతిపాదనలతో అధికార ప్రతిపక్ష పార్టీలకు లేఖలు అందించింది. అధికారపక్షం మౌనం వహించగా, నాటి ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి కృష్ణానది నీటి పునఃపంపిణీ క్లోజ్డ్ క్వశ్చన్ అన్నాడు. ఈ సమాధానం విన్న తరువాత హరగోపాల్ కూడా ‘ఇక మాకు తెలంగాణ ఉద్యమమే మార్గం’ అని తన స్వరం పెంచారు. ఈ కాలంలోనే షాద్‌నగర్ ఎత్తిపోతల పథకం రూపుదాల్చి ప్రజలలో ప్రచారం పొందింది. జూరాల నుంచి వరదనీరు ఎత్తి క్రమంగా లక్ష్మిదేవిపల్లికి అంటే తెలంగాణలోనే అత్యంత ఎత్తులో (675 మీటర్లు) ఉన్న ప్రదేశానికి నీరు తరలించి ఎగువ ప్రాంత బీడు భూములు తడపటం రైతుకి నీటిగోస తప్పించటం ఈ పథకం ప్రణాళిక. ఇదే తరువాత రోజుల్లో పాలమూరు రంగరెడ్డి పథకంగా ప్రసిద్ధమైంది. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను కూర్చోబెట్టి సమీక్ష చేసి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఊసులేకుండా ఉదండాపూర్ నుండే కాలువలు ప్రతిపాదించి ఆ పథకపు తల తొలగించినపుడు ఈ చరిత్రంతా మదిలో మెదిలింది. తెలంగాణ అనే ప్రాణవాయువుతో నడిచిన ఉద్యమంతో ప్రయోజనం పొంది తెలంగాణ అనే పేరునే తమ పార్టీ పేరు నుంచి తొలగించుకున్న వాళ్ళకి మహబూబునగర్ జీవనరేఖగా ప్రసిద్ధమైన పథకంలో తల తొలగించటం ఏం కష్టం అనిపించింది.
తొమ్మిదేండ్ల తెలంగాణ పాలన ముగియబోతుండగా కృష్ణానది నీటి పంపిణీకి సంబంధించి మహబూబ్‌నగర్ రంగారెడ్డి జిల్లాలకు జరిగిన అన్యాయాన్ని చర్చలోకి తీసుకుంటే ఈ జిల్లాల స్థితికి బాధ కలుగుతున్నది. బాధ ఎందుకంటే ఈ రెండు జిల్లాల ప్రజలు ఎప్పటిలాగానే అధికారంలోకి రాగల పార్టీ వాళ్ళనే ఎన్నుకున్నారు. ఆ ప్రతినిధులు ప్రజలవైపు నిలవకుండా పార్టీ వ్రతంలో తలమునకలవుతున్నారు. అక్కడితో ఆగకుండా ప్రజలకు, పర్యావరణానికి నష్టం చేసే కాలుష్య కారక ఇథనాల్ వంటి కంపెనీలకు కృష్ణనీరు, సాగునీటి పథకాల నీరు తరలించుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇదే అభివృద్ధి అంటున్నారు!
ఉమ్మడి రాష్ట్రంలో ధర్మాగ్రహ వ్యక్తీకరణగా అనేక పోరాటాలు చేస్తున్నపుడు ఆ పోరాట వేదికల మీద టీఆర్‌ఎస్ పార్టీ వాళ్ళు, ఇంజనీర్లు అనేక ప్రసంగాలు చేశారు. తెలంగాణ వచ్చుడే అలస్యం ఆర్డీఎస్ పూర్తిగా పునర్నిర్మాణం చేస్తామన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలకు నికరజలాలు సాధిస్తామన్నారు. అమలులో ఉన్న చిన్న చిన్న పథకాల కన్నా 72జీఓతో 70 టీఎంసీలు జూరాల నీటిని తరలించి తొలి వరదనీటితో రైతు కన్నీటిని తుడుస్తామన్నారు. ఈ ప్రసంగాలన్నీ అధిక ప్రసంగాలుగా తేలిపోతాయని అనుకోలేదు. రీడిజైన్ పేరిట ప్రాణహిత చేవెళ్ళ పథకం నీటిని చేవెళ్ళ దాకా రానీయరని అనుకోలేదు. పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని, వరదకాలపు నీరు తీసుకునే పథకాన్ని అంతరాష్ట్ర, వివాదాస్పద శ్రీశైలం ప్రాజెక్టువైపు మార్చి నీటిలభ్యత పేరున దబాయిస్తారని అనుకోలేదు. అచ్చంపేట, అమ్రాబాదు నెపం చూపి ఆ పథకాన్ని మరిన్ని వివాదాలకు, అధిక భూములు ముంచే చర్యలకు, డిండి పేరున కొత్తమోసాలకు తెరతీస్తారని అనుకోలేదు. మహబూబ్‌నగర్, చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గాల సాగునీటి కోసం పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని రెండు భాగాలుగా చేపట్టమని ఎవరు విన్నవించినా పట్టనితనం బాధించినా, మూడేండ్లలో పూర్తిచేయగల పథకాన్ని ఎనిమిదేండ్లు దాటినా పూర్తి చేయకుండా నానబెడతారని అనుకోలేదు. జిల్లాల విభజన పేరిట మొత్తం షాద్‌నగర్ నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపినప్పుడు రంగారెడ్డి జిల్లాకు సాగునీరందించకూడదనే పట్టుదల ఏదో ప్రభుత్వంలో ఉన్నదని అనుకోలేదు. అందుకే ప్రాణహిత– చేవెళ్ళలో రంగారెడ్డి జిల్లాను తొలగించారా? అందుకే పాలమూరు –రంగారెడ్డిలో ఇప్పుడు కీలకమైన లక్ష్మీదేవిపల్లిని తొలగించారా?
తెలంగాణ ఉద్యమ కాలమంతా మహబూబ్‌నగర్ దుఃఖమే తెలంగాణ నీటి కథగా ప్రచారమైంది. ఇప్పటికీ మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల దుస్థితి మారలేదని నీతి అయోగ్ నివేదిక చెప్పింది. అయినా ప్రభుత్వానికి సోయి లేదు. రోజుకు మూడు టీఎంసీలు అని చెప్పి రెండు నించి ఒకటిన్నర టీఎంసీకి తగ్గించి రెండు పంపులు పని చేయిస్తే అవి ఎన్ని టీఎంసీలు లాగుతాయి? వరదకాలం దాటితే పదిరోజుల్లో ఆంద్రప్రభుత్వం శ్రీశైలం ఖాళీ చేస్తుంది. అప్పడు ఎక్కడి నీళ్ళతో పాలమూరు రంగారెడ్డి జిల్లాల భూములు తడుపుతారు? ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరునే తీసేసి 570 మీటర్ల ఎత్తుపైన ఉన్న భూములకు నీరెట్లా ఇస్తారు?
షాద్‌నగర్ ఎమ్మెల్యే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నా మానస పుత్రిక అంటాడు. గత రెండు ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాలు ఆ ప్రజల చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. వారు వివిధ ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి పథకం జీఓను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఆ పథకం దెబ్బతినిపోతుంటే మీరేమి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీని కూడా షాద్‌నగర్ ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలకు మోసాలున్నాయని తెలుసు. అలివికాని హామీల అమలు సాధ్యం కాదనీ తెలుసు. చాలా సులభంగా చేయగల పనిని ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీస్తారని వెనుకబడిన ప్రజలు, అందునా రైతులు అస్సలు అనుకోరు. అనుకున్నపుడు వారి ఆగ్రహం ఎలా ఉంటుందో, అనేక అనుభవాలున్నాయి. అది సొంత ప్రభుత్వం మీద తప్పని ధర్మాగ్రహం.
_ ఎం రాఘవాచారి
పాలమూరు అధ్యయనవేదిక
Updated Date - 2023-05-20T02:02:09+05:30 IST