Job Special: తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల వివరాలు ఇలా..
ABN, First Publish Date - 2023-01-24T17:50:12+05:30
గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే రెండో భారీ నీటి పారుదల ప్రాజెక్టు ఇది. గతంలో ఉన్న రాజీవ్ సాగర్ (దుమ్ముగూడెం), ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాన్ని
తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు
కృష్ణానదికి గోదావరి జలాలు!
తెలంగాణ జాగ్రఫీ
టీఎస్‌పీఎస్సీ / పోలీసు పరీక్షల ప్రత్యేకం
సీతారామ ఎత్తిపోతల పథకం
గోదావరి జలాల (Godavari waters)ను కృష్ణానదికి మళ్లించే రెండో భారీ నీటి రుదల ప్రాజెక్టు ఇది. గతంలో ఉన్న రాజీవ్ సాగర్ (దుమ్ముగూడెం), ఇందిరా సాగర్ (Indira Sagar) ఎత్తిపోతల పథకాన్ని రీ-డిజైనింగ్ చేసి సీతారామ ఎత్తిపోతల పథకంగా మార్చారు. గోదావరినదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట పైభాగం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు దీనిని ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద ఈ బ్యారేజీని నిర్మించేందుకు ప్రతిపాదించారు. నాలుగు దశల్లో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి 119 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ టేల్‌పాండ్‌కు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గోదావరి జలాలు ఈ ప్రాజెక్టు నుంచి సాగర్ టేల్‌పాండ్ వరకు 291 కి.మీ. దూరం వెళతాయి. దీని లింకు కాల్వల్లో కిన్నెరసాని, ముర్రేపాడువాగు, మున్నేరు, పాలేరు, మూసీ నదులు కలుస్తాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రోళ్లపాడు, జగన్నాథపురం, బయ్యారంలలో జలాశయాలు నిర్మించనున్నారు.
ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్టు
సర్ ఆర్థర్ కాటన్ (Sir Arthur Cotton) గోదావరిపై ఎల్లంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి 100 ఏళ్ల కిందటే ప్రతిపాదన చేశారు. కాని ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2004 జూలై 28న శంకుస్థాపన చేశారు. నక్సల్స్ చేతిలో హత్యకు గురైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును దీనికి పెట్టారు. గోదావరి నదిపై పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ఎల్లంపల్లి సమీపంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు వలన పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, మెదక్, వరంగల్ జిల్లాల్లోని సుమారు అయిదు లక్షల ఎకరాల విస్తీర్ణానికి సాగునీరు అందుతుంది. దీంతోపాటు రామగుండం ఎన్టీపీసీకి అవసరమైన 6.5 టీఎంసీల నీటిని అందించవచ్చు.
రాజోలిబండ డైవర్షన్ స్కీం
గద్వాల జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో రాజోలిబండ డైవర్షన్ స్కీం ఒకటి. దీన్ని సంక్షిప్తంగా ఆర్‌డీఎస్ అంటారు. ఈ ప్రాజెక్టును కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా తుంగభద్ర నదిపై కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో నిర్మించాయి. ఈ ప్రాజెక్టు కాలువ(143 కి.మీ.)ద్వారా గద్వాల జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ ప్రాంతాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని నాలుగు గ్రామాలకు, కర్ణాటకలోని 17 గ్రామాలకు సాగునీరు అందిస్తున్నారు.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు
దీనిని శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్టు(ఎ్‌సఎల్‌బీసీ) అని కూడా అంటారు. నల్లగొండ జిల్లాకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టును 1983లో నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ ప్రారంభించారు. 2,70,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేది దీని ప్రధాన లక్ష్యం. ఎలిమినేటి మాధవరెడ్డి కాలువను 2006 సెప్టెంబరు 26న జాతికి అంకితం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో లబ్దిపొందే జిల్లాలు : నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు
గోదావరి ఉపనది అయిన ప్రాణహితపై ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీ. దీన్ని ‘డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సుజల స్రవంతి’గా వ్యవహరిస్తున్నారు. ప్రాణహిత నది నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు 20 టీఎంసీల సాగునీటిని మళ్లిస్తారు.
ఇతర ప్రాజెక్టులు
ఇచ్చంపల్లి ప్రాజెక్టు: గోదావరి ఉపనది అయిన ఇంద్రావతి... గోదావరితో కలిసిన తరవాత 12 కి.మీ. దూరంలో భూపాలపల్లి జిల్లా, మహదేవ్‌పూర్ మండలంలోని ‘ముకునూరు’ గ్రామం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించాలని స్వాతంత్ర్యానికి ముందే నిర్ణయించారు. కాని నేటికీ కార్యరూపం దాల్చలేదు. 1975లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు.
వట్టివాగు ప్రాజెక్టు: ఇది ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగుపై నిర్మించిన మధ్య తరహా ప్రాజెక్టు. దీని ద్వారా ఆసిఫాబాద్ జిల్లాలో 9918 హెక్టార్లకు సాగునీరు అందిస్తున్నారు.
బొగ్గులవాగు ప్రాజెక్టు: భూపాలపల్లి జిల్లాలోని రుద్రారం వద్ద బొగ్గులవాగుపై నిర్మించిన మధ్యతరహా ప్రాజెక్టు. దీన్ని 1976-77లో ప్రారంభించి 1987లో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 8 గ్రామాల్లో 5,150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
సాత్నాలవాగు ప్రాజెక్టు: ఇది ఆదిలాబాద్ జిల్లాలోని కప్నా గ్రామంలో రాళ్లవాగుపై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టు. దాదాపుగా 24,000 ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పిస్తోంది.
స్వర్ణ ప్రాజెక్టు: నిర్మల్ జిల్లాలోని ‘జాలి’ గ్రామం వద్ద గోదావరి ఉపనది అయిన స్వర్ణనదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇది సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది.
సింగూర్ డ్యామ్: సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణానికి సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన బహుళార్థక మధ్య తరహా ప్రాజెక్టు ఇది. దీనికి 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించడంతోపాటు విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రంగానూ ఉంది.
డిండి ప్రాజెక్టు: నల్లగొండ జిల్లాలోని డిండి పట్టణ సమీపంలో కృష్ణానది ఉపనది అయిన డిండిపై 1943లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ రిజర్వాయర్ కింద నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సుమారు 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఆసిఫ్ నహర్ ప్రాజెక్టు: భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం నెమలి కాల్వ గ్రామం వద్ద మూసీనదిపై దీన్ని నిర్మించారు. సుమారు 15,246 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 1905లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. కాని 20 ఏళ్లుగా ఇది 10,000 ఎకరాలకు మాత్రమే నీటిని అందించగలుగుతోంది.
కడెం ప్రాజెక్టు: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు గ్రామం వద్ద గోదావరి ఉపనది అయిన కడెం నదిపై ఈ ప్రాజెక్టును 1949లో ప్రారంభించి 1958లో పూర్తి చేశారు. దీని సామర్థ్యం 13.243 టీఎంసీలు. నిర్మల్ జిల్లాకు అత్యధికంగా ఈ ప్రాజెక్టు ద్వారానే సాగునీరు అందుతోంది.
లెండి ప్రాజెక్టు: ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌పై ఆధారపడి మహారాష్ట్రలోని ముఖెడ్ తాలూకాలో ‘గోజిగాన్’ గ్రామంలో దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కామారెడ్డి జిల్లాలోని 31 గ్రామాల్లో 22,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ, మహారాష్ట్ర 38: 62 నిష్పత్తిలో పంచుకున్నాయి. నీటిని కూడా ఇదే నిష్పత్తిలో వాడుకుంటున్నాయి.
-వి.వెంకట్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ
Updated Date - 2023-01-24T17:50:38+05:30 IST