ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tspsc special: పేదరికం - ఐరాస లక్ష్యాలు

ABN, First Publish Date - 2023-01-25T15:32:03+05:30

2015లో ఐక్యరాజ్యసమితి (United Nations) ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. 2030 నాటికి ప్రపంచం సాధించాల్సిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు/ ధ్యేయాల(రోల్స్‌)ను ప్రకటించింది

గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రత్యేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రత్యేకం..

ఇండియన్‌ ఎకానమీ

పేదరికం

2015లో ఐక్యరాజ్యసమితి (United Nations) ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. 2030 నాటికి ప్రపంచం సాధించాల్సిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు/ ధ్యేయాల(రోల్స్‌)ను ప్రకటించింది. అందులో మొదటిది పేదరికం లేని ప్రపంచం(నో పావర్టీ) కాగా, రెండోది ఆకలి లేని ప్రపంచం లేదా ఆకలితో అలమటించని ప్రపంచం(నో హంగర్‌). ఈ రెండు లక్ష్యాలను ముందు వరుసలో పెట్టడం ద్వారా 21వ శతాబ్ది మానవ ప్రపంచం ఎదుర్కొంటున్న ఆకలి, పేదరికం తీవ్రతను ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.

‘1990, 2015 సంవత్సరాల మధ్యకాలంలో తీవ్రమైన పేదరికంలో ఉన్న ప్రజల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. కానీ, మానవ సమాజం ఎదుర్కొంటున్న పేదరికం వివిధ రూపాలను పూర్తిగా రూపుమాపడం మాత్రం ఆధునిక ప్రపంచం ముందు అతి పెద్ద సవాలుగానే ఉండిపోయింది’ అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 2015లో దాదాపు 73.6 కోట్లమంది ప్రజలు రోజుకు 1.90 యుఎస్‌ డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగి, తగినంత ఆహారం, సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యలేమితో బాధపడుతున్నారు. తీవ్రమైన పేదరికంలో ఉన్న ప్రజల్లో 80 శాతం సబ్‌-సహ్రన్‌ ఆఫ్రికా, దక్షిణాసియాలోనే ఉండటం గమనార్హం. ప్రపంచ ప్రజల్లో ఇంకా పది శాతం ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు(1990లో వీరు 36 శాతం). పేదరికంలో ఉన్న జనాభాలో 50 శాతం 18 సంవత్సరాల లోపు వయసువారు ఉండటం బాల, బాలికల్లో పేదరికం తీవ్రతను తెలుపుతున్నది.

అంతేకాకుండా ప్రపంచంలో 150 కోట్లమంది ప్రజలు బహుముఖ పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్యసమితి పేదరికం లేని ప్రపంచం కోసం కింది లక్ష్యాలను నిర్దేశించింది.

1. 2030 నాటికి రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువగా ఆదాయం ఉన్న తీవ్రమైన పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి.

2. 2030 నాటికి ప్రతి దేశం తాను ఇచ్చిన నిర్వచనం ప్రకారం పేదరికంలో ఉన్న అన్ని వయసులకు సంబంధించిన పురుషులు, మహిళలు, పిల్లల సంఖ్యను కనీసం సగానికి తగ్గించాలి.

3. పేదరికంలో, ప్రమాదంలో ఉన్న ప్రజల సామాజిక భద్రతకు అవసరమైన పథకాలు రూపొందించి అమలుపరచాలి.

4. 2030 నాటికి అందరు పురుషులు, స్త్రీలకు ఆర్థిక వనరులపై, మౌలిక సేవలపై, భూమి, ఇతర సంపదల యాజమాన్యంపై, వారసత్వం, సహజ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, ద్రవ్య సేవలపై(సూక్ష్మ పరపతి సహా) సమాన హక్కును కల్పించాలి.

5. 2030 నాటికి వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పులు, ఆర్థిక, సామాజిక, పర్యావరణ పరంగా వచ్చే ఉపద్రవాలు, వైపరీత్యాల నుంచి పేద ప్రజలను రక్షించే వ్యవస్థలను నిర్మించాలి.

1(ఎ). పేదరిక నిర్మూలన కోసం అభివృద్ధిలో వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల దగ్గర తగినన్ని నిధులు ఉండేలా వనరుల సమీకరణ జరగాలి.

1(బి). పేదరిక నిర్మూలన కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా పేదలకు అనుకూలమైన, లింగ వివక్షత లేని వ్యూహాలతో కూడిన విధానాల రూపకల్పన జరగాలి.

ఇక ఆకలితో లేని ప్రపంచ సృష్టికి ఐక్యరాజ్యసమితి కింది లక్ష్యాలను నిర్దేశించింది.

1) 2030 నాటికి ప్రజలందరికీ ప్రత్యేకించి పేదలకు, ప్రమాదంలో ఉన్న ప్రజలకు, పిల్లలకు సురక్షితమైన పోషకాహారం అందుబాటులో ఉంచి ఆకలిని నిర్మూలించాలి.

2) 2030 నాటికి పౌష్టికాహార కొరత లేకుండా చేయాలి. 2025 నాటికి పౌష్టికాహార కొరత వల్ల అయిదు సంవత్సరాల లోపు పిల్లల్లో ఎదుగుదుల కొరత, బలహీనత లేకుండా చూడటంతోపాటు ప్రౌఢ వయసు గల బాలికలు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులకు పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉంచాలి.

3) 2030 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను రెండింతలు చేయడంతోపాటు చిన్న, సన్నకారు రైతుల, మహిళలు, ఆదివాసీలు, కుటుంబ రైతులు, మత్సకారులు, పశువుల పెంపకందారుల ఆదాయం రెండింతలయ్యేలా చూడాలి. వారి భూమి ఇతర ఉత్పాదకాలపై హక్కు కల్పించాలి. ఉత్పత్తి పరిజ్ఞానం, ద్రవ్య వనరులు, మార్కెట్లను అందుబాటులో ఉంచాలి. వ్యవసాయేతర ఉపాధిని కల్పిస్తూ, అదనపు ఆదాయ సృష్టికి అవకాశాలు కల్పించాలి.

4) అలాగే 2030 నాటికి సుస్థిర వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థలను నిర్మించాలి. భూసారం పెరిగేవిధంగా, వాతావరణ మార్పు, కరువు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనే సామర్థ్యాన్ని పెంచేవిధంగా, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండే వ్యవసాయ ఉత్పత్తి విధానాల రూపకల్పన జరగాలి.

5) విత్తనాల్లో, సాగుచేసిన వృక్షాల్లో, వ్యవసాయ, గృహ వినియోగ, జంతువులు, వాటి సంబంధిత జీవుల్లో గల విభిన్న జాతుల భిన్నత్వాన్ని సంరక్షించాలి. అందుకు జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుళ విత్తనాలు, మొక్కల నిధుల(బ్యాంకు) నిర్వహణ జరగాలి. అంతర్జాతీయ సమాజం అంగీకరించినవిధంగా బహుళ జీవజాతుల సంరక్షణ, సంబంధిత సంప్రదాయ పరిజ్ఞానం ద్వారా ప్రజలందరూ ప్రయోజనం పొందేలా చూడాలి.

ఐక్యరాజ్యసమితి రూపొందించిన 17 అభివృద్ధి ధ్యేయాల్లో రెండోది అయిన ఆకలి నిర్మూలనకు కింది అనుబంధ లక్ష్యాలను కూడా నిర్దేశించారు.

2(ఎ). అంతర్జాతీయ సహకారంతో అభివృద్ధి చెందుతున్న, ప్రత్యేకించి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి గ్రామీణ అవస్థాపన సౌకర్యాలు, వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ విస్తరణ సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, మొక్కలు, జీవ సంపదల నిల్వ, బ్యాంకుల్లో పెట్టుబడుల పెరుగుదల జరగాలి.

2(బి) దోహ అభివృద్ధి సమావేశం నిర్దేశాల ప్రకారం వాణిజ్య నిరోధకాలైన ఎగుమతి సబ్సిడీలు, సంబంధిత నియంత్రణలు ఎత్తివేసి స్వేచ్ఛాపూరిత అంతర్జాతీయ వ్యవసాయ మార్కెట్లకు అవకాశం కల్పించాలి.

ఐక్యరాజ్యసమితి రూపొందించిన ఆకలి, పేదరికం నిర్మూలన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పేదరికం, సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరిం, దారిద్య్రరేఖ, మానవ పేదరిక సూచి, బహుళత్వ పేదరిక సూచి, భారతదేశంలో పేదరికం అంచనాలు, పేదరికం కారణాలు, పేదరిక నిర్మూలన చర్యలు, నీతి ఆయోగ్‌ నిర్మించిన భారతీయ బహుళత్వ పేదరిక సూచి, బహుళత్వ పేదరిక సూచిలో వివిధ రాష్ట్రాల స్థితిగతులు మొదలైన వాటిని మనం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

పేదరికం: వ్యక్తులు తమ కనీస అవసరాలను తీర్చుకొనే స్థితిలో లేకపోవడాన్ని పేదరికం అంటారు. అయితే కనీస అవసరాలు అనేది వ్యక్తుల జీవితంపై మనం కలిగి ఉన్న దృక్పథాన్ని బట్టి ఉంటుంది.

  • వ్యక్తులు జీవించడానికి అవసరమైన కనీస పౌష్టికాహారం లభిస్తే వారు పేదలు కాదని చెప్పే నిర్వచనాలు కూడా ఉన్నాయి. దేశంలో చాలాకాలం పాటు అంగీకరించిన దారిద్య్రరేఖ భావన ఇలాంటిదే. తిండి, వస్త్రాలు, గూడును కనీస అవసరాలుగా కూడా భావించవచ్చు. అలాగే తిండి, వస్త్రాలు, గూడు, కనీస విద్య, వైద్యాన్ని కూడా కనీస అవసరాలుగానే గుర్తించవచ్చు.

  • పౌష్టికాహారం, పరిశుభ్రమైన/ సురక్షితమైన తాగునీరు, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలు, అందుబాటులో శౌచాలయాలు కూడా ‘కనీస అవసరాలు’లో ఉండవచ్చు. ఈవిధంగా కనీస అవసరాలను నిర్ణయించిన తరవాత పేదరికాన్ని నిర్వచించాల్సి ఉంటుంది.

నిరపేక్ష పేదరికం - సాపేక్ష పేదరికం: పైన తెలిపిన విధంగా కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. ధనికులతో పోలిస్తే తక్కువ ఆదాయం గల ప్రజలు ఉండటాన్ని సాపేక్ష పేదరికం అంటారు. అంటే వారి కనీస అవసరాలు వీరు తీర్చుకొనే స్థితిలో ఉంటారు. అయితే వీరి జీవన ప్రమాణం, ధనికుల జీవన ప్రమాణంతో పోలిస్తే తక్కువస్థాయిలో ఉంటుంది.

  • అభివృద్ధి తక్కువస్థాయిలో ఉన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండేది నిరపేక్ష పేదరికం కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండేది సాపేక్ష పేదరికం.

పేదరికం రేఖ - దారిద్య్ర రేఖ: భారతదేశంలో దారిద్య్రరేఖ భావన ద్వారా చాలాకాలంపాటు పేదరికం స్థాయిని అంచనా వేశారు. ఒక వ్యక్తి బతకడానికి తీసుకోవాల్సిన ఆహారం కూడా కొనగలిగే శక్తిలేని వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారనీ, పేదరికంలో ఉన్నవారనీ పేర్కొన్నారు. అంటే కనీస శక్తినిచ్చే ఆహారాన్ని కొనగలిగే ఆదాయం దారిద్య్రరేఖ అన్నమాట. అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ దారిద్య్రరేఖకు దిగువన అంటే పేదరికంలో ఉన్నవారు అని అర్థం.

  • ఈ కనీస కేలరీలు అనేది గ్రామాల్లో భౌతికశ్రమ చేసేవారికి ఎక్కువగా, పట్టణాల్లో ఉండి తక్కువ భౌతికశ్రమ చేసేవారికి కొంచెం తక్కువగా నిర్ణయించేవారు. ఈ కనీస కేలరీలనిచ్చే ఆహారాన్ని కొనడానికి అవసరమైన ఆదాయం/ఖర్చును అంచనా వేసేవారు. కాలక్రమంలో ధరలు మారుతూ ఉంటాయి కనుక ఈ కనీస ఆదాయాన్ని అంచనా వేయడానికి నిపుణుల కమిటీలను నియమించేవారు. ఈ నిపుణుల కమిటీ పెరిగిన / మారిన ధరల కనుగుణంగా దారిద్య్రరేఖ ఆదాయాన్ని మార్చేది. జాతీయ శాంపిల్‌ సర్వేలో వ్యక్తులు చేసిన ఖర్చు ఆధారంగా పేదరికంలో ఉన్న ప్రజలను ప్రణాళిక సంఘం నిపుణుల కమిటీ సహాయంతో అంచనా వేసింది. ప్రస్తుత నీతి ఆయోగ్‌ జాతీయ బహుళత్వ పేదరిక సూచిక నిర్మించింది. బహుళత్వ పేదరిక సూచిలో వివిధ రాష్ట్రాల స్థితి ఎలా ఉందో విశ్లేషణ చేసింది.

-డా.ఎం.ఏ.మాలిక్‌,

అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్‌పల్లి, హైదరాబాద్‌.

Updated Date - 2023-01-25T15:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising