JEE Main Preparationలో పొమొడోరా టెక్నిక్ బెస్ట్
ABN, First Publish Date - 2023-01-11T08:31:26+05:30
జేఈఈ మెయిన్ మొదటి విడత రోజుల వ్యవధికి వచ్చేసింది. జనవరి, ఏప్రిల్ నెలల్లో జరిగే రెండు విడతల నుంచి ఉమ్మడిగా నెగ్గుకు వచ్చిన విద్యార్థుల్లో మొదటి రెండున్నర లక్షల మందికి
ఫైనల్ టిప్స్
జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడత రోజుల వ్యవధికి వచ్చేసింది. జనవరి, ఏప్రిల్ నెలల్లో జరిగే రెండు విడతల నుంచి ఉమ్మడిగా నెగ్గుకు వచ్చిన విద్యార్థుల్లో మొదటి రెండున్నర లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అందులో కేవలం రెండు శాతం మందికి మాత్రమే ఐఐటీల్లో చేరే అవకాశం కలుగుతుంది. ఎన్‌ఐటీలు సహా కేంద్ర ప్రాయోజిత సంస్థల్లో చేరేందుకు జేఈఈ మెయిన్‌లో సాధించిన ర్యాంకే ప్రామాణికం. అలాంటి ప్రాముఖ్యం ఉన్న ఈ పరీక్షకు తుది సన్నద్ధతలో భాగంగా...
స్టడీ మెటీరియల్ (Study material) నాణ్యత, అంకితభావం, అనురక్తి తదితరాలు జేఈఈ మెయిన్ తదుపరి అడ్వాన్స్‌డ్‌లో విజయసాధనకు తోడ్పడతాయి. అయితే ప్రిపరేషన్ అలాగే పరీక్ష హాలులో ఎలా ఉండాలన్న విషయమై దృష్టి కేంద్రీకరణకు కొన్ని టిప్స్‌ను పాటిస్తే మంచిది. పోక్‌స్డగా ఉండేందుకు అదేవిధంగా ఎప్పటికప్పుడు మోటివేట్ అయ్యేందుకు ఇవి చాలావరకు ఉపయోగపడతాయి.
సిలబస్‌పై అవగాహన: సిలబస్ అలాగే పరీక్షించే విధానం(ఎగ్జామ్ ప్యాట్రన్)పై పూర్తి అవగాహన చాలా అవసరం. ఈ రెండూ ఎగ్జామ్‌లో విజయానికి కీలకం అని కూడా చెప్పొచ్చు. ఆ రెంటిపై అవగాహన బాగుంటే, ప్రిపరేషన్‌ను ఫోక్‌స్డగా చేయవచ్చు. ప్రిపరేషన్ బాగుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మోటివేషన్ కొనసాగుతుంది. విజయానికి దగ్గరకావచ్చు.
బేరీజు వద్దు: ఇతరులతో పోల్చుకోవద్దు. ఎవరికి వారు తమపై నమ్మకం ఉంచుకోవాలి. చదువు మధ్యలో ఆగినట్టు(స్టక్ అయిపోవడం) లేదంటే మోటివేషన్ తగ్గింది అన్నప్పుడు మనం ఒంటరి వాళ్లం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లక్షల మంది విద్యార్థులు బహుశా మీ మార్గంలోనే ఉండొచ్చు. కోచింగ్ వెళితే ఇన్‌స్టిట్యూట్ వారు చెప్పిందే వినండి. ఆ మార్గంలో దూసుకువెళ్ళండి.
దారిమళ్ళవద్దు: ఇంటెన్స్‌డ్ ఫోకస్, డెడికేషన్ ప్రిపరేషన్‌కు చాలా అవసరం. అంటే అవరోధం కలిగించే వాటికి దూరంగా ఉండాలి. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, శబ్దాలతో కూడిన వాతావరణం, మ్యూజిక్ వంటివాటన్నింటకీ దూరంగా ఉండాలి. ఐఐటీలో కాలుమోపుతున్నామన్న భావనలోకి వెళ్ళండి. లక్ష్యమే ఇక్కడ మోటివేషన్‌కు దోహదపడాలి.
ప్రశ్నపత్రాల సాధన: ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం అంటే రియల్ ఎగ్జామ్ రాస్తున్న భావన కలుగుతుంది. లోపాలు తెలుస్తాయి. ఏయే ఏరియాల్లో మెరుగు కావాల్సి ఉందో అర్థమవుతుంది. అసలు ఇదే కాన్ఫిడెన్స్‌ను కూడా పెంచుతుంది.
సబ్జెక్టులపై ఆసక్తి: సబ్జెక్టు ఏదైనా సరే, ప్రిపరేషన్‌లో భాగంగా టాపిక్ థియరటికల్‌గా అనిపించినప్పుడు సంబంధిత విషయమై కొద్దిగా ప్రాక్టికల్ వర్క్ చేయాలి. అంటే సబ్జెక్టు అప్లికేషన్‌పై దృష్టిసారించాలి. సైన్స్ విషయంలో రోజువారి విషయాలతో అనుసంధానం చేసుకుంటే సదరు టాపిక్స్‌పై ఆసక్తి దానంతట అదే కలుగుతుంది.
తప్పుల నుంచి తెలుసుకోవాలి: మునుపటి ఆలిండియా ర్యాంకర్లు చెప్పినవి తెలుసుకోండి. వాళ్ళు షేర్ చేసిన టిప్స్ చాలా ఉపయోగపడతాయి. తప్పుల నుంచి ఎలా బైటపడ్డారో చూడండి. నిజానికి ఇలా తెలుసుకోవడం ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది. లేకుంటే కొన్నింటిలో సమయం వృథా అవుతుంది. అదనంగా లేదంటే అనవసరమైన వాటిని వదిలించుకునేందుకు ఈ పద్ధతి తోడ్పడుతుంది.
బ్యాలెన్స్(సమతూకం): ప్రిపరేషన్‌లో ఆరోగ్యకరమైన సమతూకాన్ని పాటించాలి. ఇంటెన్స్ స్టడీ సెషన్స్ మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. ఆరోగ్యం, స్నేహాలు, ఫ్యామిలీ, రిక్రియేషన్ తదితరాలన్నింటికీ చోటివ్వాలి. చదువు అంటూ ఏదీ వదులుకోవాల్సిన అవసరం లేదు. అయితే దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నదే ముఖ్యం. అన్నీ వదులుకోవాలా అనుకుంటూ ఆందోళన, అదే పనిగా రిక్రియేషన్‌తో సమయాన్ని కోల్పోవడం - రెండూ మంచిది కాదు.
ప్రొడక్టివ్ అవర్స్: ఎంత సేపు చదివాం అన్నది విషయమే కాదు. ఏ మేరకు వంటబట్టించుకున్నామన్నదే ముఖ్యం. ఒత్తిడికి లోనుకానంతవరకు ఎంత సేపు చదివినా మంచిదే. కాన్సెప్ట్ తెలుసుకోవడం నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్, మాస్టరీ పూర్తయ్యేవరకు ఆసాంతం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందే. ఫలితంపైనే గురిపెట్టాలి. ఫలితం సాధించని కష్టానికి అర్థం ఉండదు.
స్వల్పకాలిక విరామాలు(షార్ట్ బ్రేక్స్): గంటల కొద్దీ చదవడం కంటే మధ్యలో కొంత సేపు బ్రేక్ తీసుకోవడం మంచిది. దీన్నే పొమొడొరొ టెక్నిక్ అంటారు. అర్ధ గంట నుంచి గంట సేపు చదివిన తరవాత అయిదు నుంచి పది నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఆ సమయంలో ఫీల్ గుడ్‌కు అనుగుణంగా కృషి చేయాలి.
మీకు మీరే రివార్డులు: చిన్న చిన్న అచీవ్‌మంట్స్ అందుకు రివార్డులు పెట్టుకోవాలి. మీకు ఆటలు అంటే ఇష్టం. నిర్దేశిత సమయం లేదంటే ఏదో టాపిక్ పూర్తి చేసిన తరవాత ఆడుకుందాం అనుకుంటే బాగుంటుంది. ఈ పద్ధతిలో ప్రయోజనం ఎక్కువుగా ఉంటుంది. ముఖ్యంగా లక్ష్యం ఒత్తిడిని కలుగజేయదు.
ఫలితంపై దృష్టి వద్దు: మన కష్టం ఎక్కడికీ పోదు, అదే ఫలితాన్ని పువ్వుల్లో పెట్టి ఇస్తుందన్నది పెద్దల మాట. కృషి అంటూ చేస్తే ఐఐటి కాకుంటే దానికి సమానమైన సంస్థలో సీటు లభిస్తుంది. ఈ రోజుల్లో ఐఐటితో పోటీపడుతున్న ఐఐఐటీలు తదితర సంస్థలు కొద్ది సంఖ్యలో అయినా ఉన్నాయి. వాటిలో సీటు వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు.
చివరిగా ఒక మాట, బ్యాలెన్స్, డెడికేషన్ ఏ పనిలో అయినా మంచి ఫలితాన్ని ఇస్తాయని గుర్తుంచుకోవాలి.
Updated Date - 2023-01-11T08:31:28+05:30 IST