Group-1 special: ఆయన ఆలోచనతోనే రాష్ట్రాల ఏర్పాటు
ABN, First Publish Date - 2023-01-02T11:49:45+05:30
బ్రిటిష్ పరిపాలన కాలం (British rule)లో భాష, సంస్కృతి, భౌగోళిక ప్రాతిపదికన గాక, రెవెన్యూ వసూళ్ల ఆధారంగా రాష్ట్రాల (Telangana)ను ఏర్పాటు చేశారు. ఫలితంగా భాష-సంస్కృతి, భౌగోళిక ఏక రూపత ఉన్న ప్రాంతాల్లో, పరిపాలన ప్రాతిపదికకు
గ్రూప్-1 మెయిన్స్ ప్రత్యేకం
తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం
రాష్ట్రాల ఏర్పాటు అంబేడ్కర్ ఆలోచనలు
బ్రిటిష్ పరిపాలన కాలం (British rule)లో భాష, సంస్కృతి, భౌగోళిక ప్రాతిపదికన గాక, రెవెన్యూ వసూళ్ల ఆధారంగా రాష్ట్రాల (Telangana)ను ఏర్పాటు చేశారు. ఫలితంగా భాష-సంస్కృతి, భౌగోళిక ఏక రూపత ఉన్న ప్రాంతాల్లో, పరిపాలన ప్రాతిపదికకు అవసరమైన ఏకత్వం కొరవడింది. స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీలలో అగ్రభాగాన ఉన్న కాంగ్రెస్ (Congress)... స్వాతంత్య్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.
అయితే స్వాతంత్య్రం అనంతరం దేశ విభజన, కాందీశీకుల సమస్య, నూతన పాలన వ్యవస్థ ఏర్పాటు, రాజ్యాంగ రచనల కార్యక్రమం మొదలైన అంశాలపై కేంద్రీకరించారు. అలాగే మత ప్రాతిపదికన దేశం విడిపోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఆలోచనతో రాష్ట్రాల పునర్విభజన విషయంలో ఆచితూచి వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో నూతన రాష్ట్రాల ఏర్పాటుపై డిమాండ్ చేస్తున్న ప్రజలకు ఈ తాత్సారం ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రధానంగా మద్రాస్(Madras) నుంచి ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవాలన్న ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వ(Central Government) వైఖరి నిరాశకు గురిచేసింది.
రాష్ట్రాల పునర్విభజన కమిషన్ - ఆవిర్భావానికి కారణాలు
బ్రిటిష్ పరిపాలన కాలంలో రాష్ట్రాల ఏర్పాటు ప్రణాళికా బద్దంగా జరగలేదు. స్వాతంత్య్రం అనంతరం రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌పై ఉద్యమాలు జరిగాయి. 1921, 1927లో జాతీయ కాంగ్రెస్ పార్టీ(National Congress Party) భాషా ప్రాతిపదికపై తన శాఖలను ఏర్పాటు చేసింది. 1947లో స్వాతంత్య్రం అనంతరం పరిస్థితుల రీత్యా జాతీయ సమగ్రతను దృష్టిలోపెట్టుకుని భాషా ప్రయుక్త రాష్ట్రాలు వాంచనీయం కావని, పాత తీర్మానాలను రద్దు చేసింది.
భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని అధ్యయనం చేసేందుకు ఎస్.కె.థార్ నాయకత్వంలో 1948 జూన్ 17న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1948 డిసెంబరు 10న రిపోర్టును అందించింది. ఈ రిపోర్టులో జాతీయ సమగ్రతకు భంగం కలిగే అవకాశాలు ఉన్నందువల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సరైంది కాదని పేర్కొంది.
మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఎస్.కె.థార్ రిపోర్టును వీరు వ్యతిరేకించారు. దాంతో 1948 డిసెంబరులో జేవీపీ కమిటీని నియమించారు. 1949 ఏప్రిల్‌లో ఈ కమిటీ తన రిపోర్టును అందజేసింది. ఈ రిపోర్టు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం కొంత సానుకూలతను, సమయాన్ని కేంద్రం కోరింది.
కాలయాపనకు వ్యతిరేకంగా పొట్టి శ్రీరాములు(potti sriramulu) 1952 అక్టోబరు 19న నిరాహారదీక్షను ఆరంభించి, 1952 డిసెంబరు 17న మరణించారు. దాంతో 1953 అక్టోబరు 1న కర్నూల్(Kurnool) రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
- ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుతో దేశవ్యాప్తంగా నూతన రాష్ట్రాల డిమాండ్ పెరిగింది. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం 1953 డిసెంబరు 22న మొదటి ఎస్‌ఆర్‌సిని ఏర్పాటు చేసింది.
ఎస్‌ఆర్‌సి ఏర్పాటు
ఎస్‌ఆర్‌సి చైర్మన్‌గా జస్టిస్ ఫజల్ అలీ(ఒరిస్సా గవర్నర్)వ్యవహరించారు. కె.ఎమ్.ఫణిక్కర్(చరిత్రకారుడు), హృదయ్‌నాథ్ కుంజ్రు(న్యాయవాది) సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన రిపోర్టును 1955 సెప్టెంబరు 30న సమర్పించింది. రిపోర్టును పార్లమెంట్ ఆమోదించింది. ఈ రిపోర్టు ప్రకారమే తరవాతి కాలంలో 14 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ట్రావెన్‌కోర్, కొచ్చిన్, మలబార్ ప్రాంతాలతో కేరళ, హైదరాబాద్ రాష్ట్రంలోని మరట్వాడ జిల్లాలు, కచ్ సౌరాష్ట్రాలతో కలిపి బాంబే రాష్ట్రం; మైసూర్ ప్రాంతం, బాంబే రాష్ట్రంలోని కన్నడ ప్రాంతం, హైదరాబాద్ రాష్ట్రంలోని కన్నడ ప్రాంతంతో కర్ణాటక రాష్ట్రాలు ఏర్పాడ్డాయి. అదేవిధంగా పంజాబి మాట్లాడేవారితో పంజాబ్, హిందీ మాట్లాడే వారితో హర్యానా, పహాడీ భాషతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు 1966లో ఏర్పడ్డాయి.
తరవాతి కాలంలో మరాఠి, గుజరాతీల మధ్య ప్రాంతీయ సంఘర్షణలు తలెత్తాయి. ఈ రెంటిని వేర్వేరు రాష్ట్రాలుగా విభజించారు. బొంబాయి నగరాన్ని మొదట కేంద్ర పాలిత రాష్ట్రంగా చేసి 1960లో దాన్ని మహారాష్ట్రకు రాజధానిగా మార్చారు.
ఎస్‌ఆర్‌సి నివేదిక: రాష్ట్రాల ఏర్పాటు పరిపాలన సౌలభ్యం కోసం జరగాలని సూచించింది. భాష అతి ముఖ్య అంశమే అయినప్పటికీ ఈ ఒక్క సూత్రమే రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదిక కాకూడదు అని పేర్కొంది. రాష్ట్రాల ఏర్పాటు వల్ల జాతీయ సమగ్రతకు భంగం కలగరాదని పేర్కొంది.
ఎస్‌ఆర్‌సి నివేదిక- తెలంగాణ: ఎస్‌ఆర్‌సి నివేదిక సమర్పించేనాటికి తెలంగాణ రాష్ట్రం కొంతమేర ఆర్థిక పురిపుష్టిని సాధించింది. అభివృద్ధి కోసం, ప్రాజెక్టుల కోసం నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఆంధ్రరాష్ట్రం మాత్రం కష్టాల్లో మునిగి ఉంది. శాశ్వత కట్టడాలు లేక రాజధాని సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌సి హైదరాబాద్(Hyderabad) రాష్ట్రాన్ని కొనసాగించాలని పేర్కొంది. హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఎస్‌ఆర్‌సి సూచనలు...
1. బీదర్‌తో కలిపి 10 జిల్లాల తెలంగాణను హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగించాలి.
2. హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠి మాట్లాడే 5 జిల్లాలను బొంబాయి రాష్ట్రంలో, కన్నడ మాట్లాడే జిల్లాలను కర్నాటకలో కలపాలి.
3. హైదరాబాద్ రాష్ట్రం, రాష్ట్రంగా కొనసాగడానికి అవసరమైన వనరులు ఉన్నాయి. అందువల్ల దీన్ని రాష్ట్రంగా కొనసాగించాలి. ఒకవేళ భాషా సమైక్యత పేరుతో ఆంధ్రరాష్ట్రంలో కలపాలని భావిస్తే 1961 సాధారణ ఎన్నికల వరకు నిరీక్షించాలి. నూతన శాసనసభలో 2/3వ వంతు సభ్యులు కోరుకుంటే అప్పుడు విలీన ప్రక్రియను ఆరంభించాలి అని తెలియజేసింది.
వివరణ:
తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగించాలనే వాదన న్యాయమైనది, అర్థవంతమైనది
తెలంగాణకు ఐదు కోట్ల రూపాయల మిగులు ఉన్నందున ఈ మిగులు ద్వారా రాష్ట్ర అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నందికొండ వద్ద, గోదావరి నదిపై కిష్టాపురం వద్ద(పోచంపాడు) నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఆంధ్రతో కలవడం ఈ నిర్మాణాలకు ఆటంకం కలుగుతుంది.
కోస్తా ప్రాంతం బ్రిటిషు వారి ప్రభావం వల్ల వ్యాపార దృక్పథానికి అలవాటుపడింది. ఆంధ్రప్రాంతంలో కలవడం వల్ల వారితో పోటీ పడలేక తెలంగాణ రాష్ట్రం నష్టానికి గురయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక పరిపాలన సహజీవనము, మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి ఇది రాష్ట్రంగా కొనసాగాలి.
అభివృద్ధి చెందే లక్షణాలున్న రాష్ట్రంగా తెలంగాణను 1952 ఏప్రిల్‌లో నియమించిన ఆర్థిక సంఘం గుర్తించింది.
ఈ లక్షణాలు/కారణాల దృష్ట్యా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇదే విధంగా కొనసాగించడం అవసరం.
భారతదేశం- చిన్న రాష్ట్రాలు- నూతన రాష్ట్రాలు- ఎస్‌ఆర్‌సిపై అంబేడ్కర్ అభిప్రాయం
‘స్టేట్స్ అండ్ మైనార్టీస్- వాట్ ఆర్ దేర్ రైట్స్, హౌ టు సెక్యూర్ ధెమ్ ఇన్ ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా-1947’, ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్స్ స్టేట్స్-1955’, ‘వన్ స్టేట్ - వన్ లాంగ్వేజ్’ గ్రంథాల్లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యాన్ని కలిగి ఉంటాయి
రాష్ట్రం వైశాల్యం పరంగా విశాలంగా, జనాభా పరంగా అధికంగా ఉన్నప్పుడు అది ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా ఉంటుంది.
చిన్న రాష్ట్రాల్లో మాత్రమే బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిథ్యం లభిస్తుంది.
సమైక్య విధానంలో సమతౌల్యత ఎక్కువ రాష్ట్రాలు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.
ఎస్‌ఆర్‌సి ప్రతిపాదించిన హైదరాబాద్ రాష్ట్ర కొనసాగింపు, విదర్భ రాష్ట్ర ఏర్పాటును అంబేడ్కర్ స్వాగతించారు.
ఆర్థిక స్వావలంబన లేకుండా, పూర్తి హంగులతో రాజధాని లేకుండా, పరిపాలన అనుభవం లేకుండా రాష్ట్రాలను ఏర్పాటు చేయకూడదు.
రాష్ట్రాల ఏర్పాటులో అమెరికాను ఆదర్శంగా తీసుకోవాలని అంబేడ్కర్ భావించారు.
మిశ్రమ రాష్ట్రాలను అంబేడ్కర్ వ్యతిరేకించారు.
భారత దేశానికి రెండు రాజధానుల అవసరాన్ని అంబేడ్కర్ గుర్తించారు. దీనికి ఉదాహరణగా.. అశోకుని కాలంలో పాటలీపుత్రం, సువర్ణగిరి, మొగల్స్ కాలంలోని ఢిల్లీ, శ్రీనగర్ బ్రిటిష్ కాలంలోని కలకత్తా, సిమ్లా; ఢిల్లీ, సిమ్లాలను పేర్కొన్నాడు.
హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయాలని సూచించాడు. దీనికి కారణాలు..
ఎ. ఇది దక్షిణ భారతదేశానికి ప్రవేశ ద్వారం
బి. ఉన్నతమైన సంస్కృతిని కలిగి ఉంది
సి. శత్రు దేశాల నుంచి రక్షణకు అనుకూలమైంది
డి. ఇది చారిత్రాత్మక నగరం
రాష్ట్రాలపై అంబేడ్కర్ అభిప్రాయం అరిస్టాటిల్ బలపర్చిన ‘మధ్యేవాద’ సిద్ధాంతానికి అనుకూలంగా ఉంది.
అంబేద్కర్ అభిప్రాయాలపై మరాఠి, గుజరాతీయుల సంఘర్షణ ప్రభావం ఉంది. బొంబాయి నగరంపై గుజరాతీయులు హక్కును అడగడాన్ని అంబేడ్కర్ సామ్రాజ్యవాదంతో పోల్చాడు.
తెలంగాణ ఏర్పాటు- అంబేడ్కర్ ఆలోచనలకు ప్రతిరూపం
తెలంగాణ ఆర్థిక స్వావలంబనను కలిగిన రాష్ట్రం
పరిపాలన అనుభవాన్ని కలిగిన రాష్ట్రం
బలమైన రాజధానిని కలిగిన రాష్ట్రం
ఒకే రాష్ట్రం - ఒకే భాషను కలిగిన రాష్ట్రం
భవిష్యత్తులో అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉన్న రాష్ట్రం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్-3ను ప్రవేశపెట్టడం ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మార్గాన్ని సులభం చేశాడు.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ డైరెక్టర్,
5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్
Updated Date - 2023-01-02T11:49:46+05:30 IST