ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

USA Indian Students: విద్యార్థులు ఆ పొరపాట్లు చేయొద్దంటున్న నిపుణులు

ABN, First Publish Date - 2023-08-19T11:38:20+05:30

అమెరికా వీసా వస్తే చాలు.. ఎంచక్కా అగ్రదేశంలో వాలిపోవచ్చు.. అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్‌ లభిస్తే చాలు.. చదువుతోపాటు ఉద్యోగమూ చేసుకోవచ్చు.. ఇలాంటి ఆలోచనలతో అమెరికా వెళ్లాలనుకుంటున్న వారు పారాహుషార్‌. ఎందుకంటే చదువు పేరుతో వచ్చి

చదువు కోసం వెళ్లి.. ఉద్యోగమంటే కుదరదు!

సోషల్‌ మీడియా అకౌంట్లలో విద్వేష పోస్టులుంటే వెనక్కే

ఆర్థిక పరిస్థితులపై తప్పుడు పత్రాలిచ్చినా అంతే

ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను తనిఖీ చేస్తున్న అమెరికా అధికారులు

ఏడాదిలో 3 వేలకు పైగా భారతీయ విద్యార్థులు రిటర్న్‌

జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అమెరికా వీసా వస్తే చాలు.. ఎంచక్కా అగ్రదేశంలో వాలిపోవచ్చు.. అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్‌ లభిస్తే చాలు.. చదువుతోపాటు ఉద్యోగమూ చేసుకోవచ్చు.. ఇలాంటి ఆలోచనలతో అమెరికా వెళ్లాలనుకుంటున్న వారు పారాహుషార్‌. ఎందుకంటే చదువు పేరుతో వచ్చి, ఉద్యోగం చేసుకోవాలనుకునేవారిని అమెరికా ప్రభుత్వం గుర్తించి వెనక్కి పంపుతోంది. ఇదొక్కటే కాదు.. సోషల్‌ మీడియాలో ఇతర మతాలకు సంబంధించిన విద్వేష పోస్టులు కనిపించినా, కుటుంబం ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉందని అనుమానం వచ్చినా.. విమానాశ్రయం నుంచే భారత్‌కు తిరిగి పంపుతున్నారు. తాజాగా ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపిన విషయం తెలిసిందే. గత ఏడాదికాలంలో ఈ విధంగా దాదాపు మూడువేల మందికి పైగా భారతీయ విద్యార్థులను వెనక్కి పంపగా.. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందినవారు 400 మంది దాకా ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ కారణాలను అన్వేషించగా.. పలు విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. విద్యారులు చదువులపైనే దృష్టి పెట్టాలని భావిస్తుంది. అయితే చదువు పేరుతో అమెరికాలోకి ప్రవేశించి ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. అమెరికాకు వచ్చి వర్సిటీల్లో అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులు జాబ్‌పై దృష్టి పెడుతున్నారు. నెలవారీ ఖర్చులకు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తే పెద్దగా సమస్య ఉండదు. కానీ, చదువును పార్ట్‌టైంగా భావించి, ఫుల్‌టైం ఉద్యోగం చేసే విద్యార్థులు కూడా ఉంటున్నారు. దీంతో అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు విమానాశ్రయంలోనే తనిఖీలు ముమ్మరం చేశారు. విద్యార్థుల మొబైల్‌ ఫోన్లు తీసుకొని సోషల్‌ మీడియా చాట్‌లు, పోస్టింగులు చూస్తున్నారు.

అభ్యంతరకరమైనది ఏమైనా ఉంటే అక్కడి నుంచే వెనక్కి పంపిస్తున్నారు. నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలు తీసుకున్నానని, అమెరికా వెళ్లి ఉద్యోగం చూసుకుంటానని ఓ విద్యార్థి తన స్నేహితుడితో చేసిన చాటింగ్‌ ఆధారంగా ఇటీవలఓ తెలుగు విద్యార్థిని వెనక్కి పంపించినట్లు తెలిసింది. అమెరికాలో వర్సిటీ ఫీజులు, నెలవారీ ఖర్చులను భరించే స్థోమత తమకు ఉన్నదని విద్యార్థులు ముందుగానే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బ్యాంకు స్టేట్‌మెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక స్థోమత లేకపోయినా.. కొందరు నకిలీ డాక్యుమెంట్లను సమర్పిస్తున్నారు. మరోవైపు, వీసాతోపాటు వర్సిటీలో అడ్మిషన్‌ కల్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు, కన్సల్టెంట్లు సైతం విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు. విద్యార్థులు కేవలం ఏజెంట్లనే నమ్ముకోకుండా.. అన్ని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తేడా వస్తే 6 నెలల జైలు శిక్ష

వీసా వస్తే చాలు.. ఇక అడ్డే ఉండదు.. అని అనుకోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వీసా, వర్సిటీలో అడ్మిషన్‌ ఉన్నప్పటికీ.. విమానాశ్రయంలో అడ్డుకునే అధికారం అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులకు ఉంటుంది. వీసాలను అమెరికా విదేశాంగశాఖ జారీ చేస్తుంది. కానీ, విమానాశ్రయంలో దిగాక అక్కడి నుంచి పూర్తి బాధ్యత హోంల్యాండ్‌ సెక్యూరిటీ చేతిలో ఉంటుంది. ఎయిర్‌పోర్టులో అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వనిపక్షంలో వెనక్కిపంపే అధికారం వారికి ఉంటుంది. అమెరికా నిబంధనలకు వ్యతిరేకంగా, మోసం చేసి వచ్చారని భావిస్తే గరిష్ఠంగా 6 నెలల జైలు శిక్ష కూడా విధించవచ్చు.

సోషల్‌ మీడియాతో వ్యక్తిత్వ పరిశీలన

ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తీసుకునే ముందు వారి ఇన్‌స్టా, ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల అకౌంట్లను పరిశీలిస్తున్నాయి. దీనిద్వారా వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, ఇతర అంశాలను అంచనా వేయవచ్చని భావిస్తున్నాయి. ఇదే విధానం ఇప్పుడు అమెరికాలో విమానాశ్రయాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉన్నతవిద్య కోసం వచ్చే విద్యార్థులు అక్కడ కొన్నేళ్లపాటు ఉంటున్నందున.. వారి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. వారి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ తీసుకొని సోషల్‌ మీడియా అకౌంట్లను, ఈ-మెయిళ్లను చెక్‌ చేస్తున్నారు. ఇతర మతాలను అవమానించేలా విద్వేషపూరిత పోస్టులు పెట్టినా, అలాంటి వాటికి లైక్‌ చేసి వత్తాసు పలికినా.. వెనక్కి పంపిస్తున్నారు. ఇటీవల ఈ కారణం వల్లే ముగ్గురు భారతీయ విద్యార్థులను వెనక్కి పంపినట్లు సమాచారం. ఇలాంటి పోస్టులపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పెట్టిన విద్వేషపు పోస్టులను తమ అకౌంట్ల నుంచి తొలగించినా గుర్తించే సాంకేతికత అమెరికాలో ఎప్పటినుంచో అందుబాటులో ఉందని వారు గుర్తుచేస్తున్నారు. విద్యార్థులు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలని, అధికారులకు సమర్పించే వివరాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించవద్దని, నిజాయితీగా ఉండాలని.. అప్పుడే అమెరికా కల సాకారమవుతుందని సూచిస్తున్నారు.

Updated Date - 2023-08-19T11:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising