ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన ఎలా? రేవంత్‌ సర్కారు మల్లగుల్లాలు

ABN, First Publish Date - 2023-12-09T11:20:03+05:30

వరుస లీకేజీలతో, పరీక్షల వాయిదాలతో అప్రతిష్ఠ పాలైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను పునర్వ్యవస్థీకరిస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి

  • భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నద్ధం

  • ప్రస్తుత కమిషన్‌తో పరీక్షలకు విముఖం

  • పేపర్‌ లీకేజీలు, పరీక్షల రద్దుతో అప్రతిష్ఠపాలు

  • ప్రజలకిచ్చిన హామీని గుర్తుచేస్తూ రాజీమార్గం

  • చైర్మన్‌, సభ్యులకు నచ్చజెప్పి పంపే అవకాశం

  • ఆ తర్వాతే పోస్టుల భర్తీకి యోచన

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వరుస లీకేజీలతో, పరీక్షల వాయిదాలతో అప్రతిష్ఠ పాలైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను పునర్వ్యవస్థీకరిస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పుడున్న కమిషన్‌ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడానికి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రస్తుత కమిషన్‌ మీద నిరుద్యోగులకు పూర్తిగా నమ్మకం పోయింది. దాంతో టీఎ్‌సపీఎస్పీని ప్రక్షాళించిన తర్వాతే ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ఛైర్మన్‌, సభ్యుల్ని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కమిషన్‌ రాజ్యాంగబద్ధ సంస్థ. సుప్రీంకోర్టు సలహా మేరకు రాష్ట్రపతి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం అది. అందునా, అసమర్థత కారణంగా వారిని తొలగించడానికి లేదు. దాంతో మధ్యేమార్గంగా వారితోనే స్వచ్ఛందంగా రాజీనామా చేయించే విధంగా సంప్రదింపులు జరపాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రక్షాళన చేసిన తర్వాతే కమిషన్‌ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన హామీని గుర్తు చేయడం ద్వారా వారి రాజీనామాకు ఒప్పించే ఆలోచనలో ఉన్నారు.

మరో మూడున్నరేళ్ల పదవీకాలం

టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జనార్దన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్‌, కారెం రవీందర్‌రెడ్డి, ఆర్‌.సత్యనారాయణలు కొనసాగుతున్నారు. 2021 మే నెలలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీరిని నియమించింది. వీరి పదవీకాలం మరో మూడున్నరేళ్లు ఉంది. వీరి నియామకం సమయంలోనే పలు విమర్శలు వచ్చాయి. నియమితులైన వారిలో రాజకీయ నాయకులు, ఉద్యోగాల నుంచి రిటైర్‌ అయిన వారు ఉండడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ ఎత్తున వివిధ శాఖల్లో 80 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినపుడు ఓ 25 వేల పోస్టుల భర్తీని టీఎ్‌సపీఎస్సీకి అప్పగించింది. ఇందులో భాగంగానే గ్రూపు- 1,2,3,4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. మరికొన్ని ఇతర పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను కూడా విడుదల చేశారు. గ్రూపు-1 పోస్టుల భర్తీలో భాగంగా మొదటిసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను పేపర్‌ లీక్‌ కావడంతో రద్దు చేశారు. పేపర్‌ లీకేజీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కేసులో వంద మందికి పైగా అరెస్ట్‌ అయ్యారు. ఈ లీకేజి వ్యవహారం ఒక్క గ్రూపు-1 పరీక్షకే పరిమితం కాకుండా ఇతర పోస్టుల్లోనూ జరిగింది. ఫలితంగా మరిన్ని పోస్టుల పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. రద్దయిన గ్రూపు-1 పోస్టుల ప్రిలిమనరీ పరీక్షను రెండోసారి నిర్వహించారు. అయితే, ఈ పరీక్షను కూడా హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలా గ్రూపు-1 పోస్టుల భర్తీ విషయం సందిగ్దంగా మారింది. అలాగే, గ్రూపు-2 పోస్టులకు నిర్వహించాల్సిన పరీక్షలు కూడా గతంలో రద్దు అయ్యాయి. వాటిని తిరిగి జనవరిలో నిర్వహిస్తామని ఇంతకు ముందు కమిషన్‌ ప్రకటించింది. మారిన పరిస్థితుల్లో ఈ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయా? లేదా అనే విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. గ్రూపు-4 పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలను నిర్వహించారు. ఫలితాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. గ్రూపు-3 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఇలా గ్రూపు పోస్టులే కాకుండా ఇతర పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోప్రభుత్వం మారిపోయింది. ప్రస్తుత పాలక మండలిపై గతంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శలు చేసింది. తాము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించింది. పైగా ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల నియామకాలకు సంబంఽధించిన షెడ్యూల్‌ను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీని చక్కదిద్దే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

నిపుణులను నియమించాలని యోచన

ఉద్యోగ నియామకాలపై ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం ప్రస్తుత కమిషన్‌ ద్వారా సాధ్యం కాదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న వారి స్థానంలో ఆయా రంగాల్లోని నిపుణులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఛైర్మన్‌, ఇతర సభ్యులను పదవీకాలం పూర్తి కాకుండా మధ్యలో తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న వారు స్వచ్చందంగా వారే వైదొలగే విధంగా చూడాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది. రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారు రాజీనామాకు అంగీకరిస్తే ఛైర్మన్‌, సభ్యుల స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉంది. కమిషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది విషయంలోనూ భారీ మార్పులు తప్పవని అంటున్నారు. గతంలో పేపర్‌ లీకేజీకి కారణం అందులో పనిచేసే సిబ్బందే అన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-12-09T11:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising