Breast cancer: అవగాహనతోనే అంతం! అదెలా అంటే..!
ABN, First Publish Date - 2023-10-10T11:14:36+05:30
శారీరకంగా, మానసికంగా మహిళలను కుంగదీసే రాకాసి... రొమ్ము కేన్సర్. అయితే అవగాహన, అప్రమత్తతలతో ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడం సులభమే!
శారీరకంగా, మానసికంగా మహిళలను కుంగదీసే రాకాసి... రొమ్ము కేన్సర్. అయితే అవగాహన, అప్రమత్తతలతో ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడం సులభమే!
రొమ్ము కేన్సర్ కూడా అన్ని వ్యాధుల్లాంటిదే! వ్యాధి వచ్చే అవకాశాలను తెలుసుకుని, ప్రారంభంలోనే గుర్తించే మెలకువలు అలవరుచుకుంటే ఈ వ్యాధికి అంతగా భయపడవలసిన అవసరం ఉండదు. మన అమ్మమ్మల కాలంతో పోల్చుకుంటే ఇటీవల రొమ్ము కేన్సర్ ఎక్కువగా ప్రబలుతున్న మాట వాస్తవమే! అయితే పాశ్యాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశ మహిళలకు రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. విదేశాల్లో ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు రొమ్ము కేన్సర్ బారిన పడుతుంటే, మన దేశంలో ప్రతి 40 మందిలో ఒకరికి వ్యాధి నిర్ధారణ అవుతోంది. రొమ్ము కేన్సర్ ప్రాబల్యం పెరగడానికి అన్నిటికంటే ప్రధానమైన కారణం... క్రమం తప్పిన ఆహార, జీవనశైలులు. వంశంలో ఎవరికి ఉన్నా, వారి సంతానం అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల కూడా రొమ్ము కేన్సర్ పెరుగుతోంది.
స్వీయ పరీక్షతో అడ్డుకట్ట
ఈ వ్యాధి నుంచి రక్షణ పొందాలంటే అవగాహన, అప్రమత్తత కలిగి ఉండాలి. ‘నాకొస్తుందేమో?’ అని భయపడుతూ ఉండడం కంటే ‘నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?’ అని ఎవరికి వారు ఆలోచించుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాబట్టి ప్రతి మహిళా టీనేజీ వయసు నుంచే ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ జీవితంలో భాగం చేసుకోవాలి. కనీసం నెలలో ఒక్కసారైనా స్నానం చేస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు చేతితో రొమ్ములను పరీక్షించుకోవాలి. ఇందుకోసం ఒక నిమిషం కేటాయించుకోవాలి. ఈ పరీక్షకు అనుకూలమైన సమయం నెలసరి ముగిసిన మూడు రోజుల తర్వాత సమయం. నెలసరికి కొన్ని రోజుల ముందు నుంచి రొమ్ములు గట్టిపడతాయి కాబట్టి ఆ సమయంలో పరీక్షించుకుంటే గడ్డలు ఉన్నాయేమో అనే అనుమానం రావొచ్చు. కాబట్టి నెలసరి ఆగిన తర్వాత స్వీయ పరీక్ష చేసుకోవాలి. అలాగే రొమ్ము కేన్సర్‌కు దోహదపడే అంశాలు మన జీవనశైలిలో ఎన్నో ఉంటా యు. కాబట్టి ఈ కేన్సర్ సోకకుండా ఉండడం కోసం....
బరువును అదుపులో ఉంచుకోవాలి
శారీరకంగా చురుగ్గా ఉండాలి
మద్యపానానికి దూరంగా ఉండాలి
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుంటున్న మహిళలు, కుటుంబ నియంత్రణ మాత్రలు వాడుతున్న మహిళలు వాటి వాడకంలో ఉండే ముప్పుల గురించి వైద్యులను అడిగా తెలుసుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలి.
పిల్లలకు చనుపాలు ఇవ్వాలి
కుటుంబ చరిత్రలో రొమ్ము కేన్సర్ ఉన్నా, కేన్సర్ ముప్పు తెచ్చిపెట్టే బిఆర్‌సిఎ1, బిఆర్‌సిఎ2 జన్యువులను వంశపారంపర్యంగా పొందినా వైద్యులను సంప్రతించి ముప్పు తగ్గించే మార్గాలను తెలుసుకోవాలి.
స్టేజింగ్ కీలకం
కేన్సర్ ఒక ప్రదేశానికే పరిమితమైందా లేదంటే చుట్టుపక్కలకు పాకిందా అనే దాన్ని బట్టి పరీక్షల ద్వారా కేన్సర్ స్టేజింగ్‌ను వైద్యులు కనిపెడతారు. కేన్సర్ స్టేజింగ్ ద్వారా శరీరంలో ఎంత మేరకు కేన్సర్ ఉంది? అదెంత తీవ్రంగా ఉంది? దాన్ని తగ్గించడం కోసం ఎలాంటి చికిత్సను ఎంచుకోవాలనే అంశాలు వైద్యులకు తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో లక్షణాలు బయల్పడిన తర్వాత రొమ్ము కేన్సర్ బయల్పడవచ్చు. కొంతమందిలో ఎలాంటి లక్షణాలూ బయల్పడకపోవచ్చు. కాబట్టి మామోగ్రామ్, బ్రెస్ట్ అలా్ట్రసౌండ్, బ్రెస్ట్ ఎమ్మారై, కేన్సర్ సబ్‌టైప్ తెలుసుకోవడం కోసం బయాప్సీ పరీక్షలను వైద్యులు సూచిస్తారు.
రొమ్ము తొలగించవలసిందేనా?
చికిత్సలో భాగంగా రొమ్ములోని కేన్సర్ గడ్డ మేరకు తొలగించినా, రొమ్ము మొత్తాన్ని తొలగించినా ఒకే రకమైన ఫలితం పొందవచ్చని క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపణ అయింది. కాబట్టి కేన్సర్‌కు గురయినంత మాత్రాన రొమ్ము మొత్తాన్నీ తొలగించవలసిన అవసరం లేదు. గడ్డ పరిమాణం, గడ్డల సంఖ్య, తత్వం, తీవ్రత, లింఫ్ గ్రంథులకు ఏ మేరకు పాకింది అనే అంశాల ఆధారంగా రొమ్ము ఉంచాలా, తీసేయాలా అనేది నిర్ణయించాలి. ప్రధాన లింఫ్ గ్రంధికి సోకిందో లేదో తెలుసుకోవడం కోసం సర్జరీ సమయంలోనే లింఫ్ గ్రంఽథిలోని కొంత భాగాన్ని ‘సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ’ పరీక్ష చేసి, దానికి పాకిందీ, లేనిదీ తెలుసుకోవచ్చు. ఆ ఫలితాన్ని బట్టి ఆ ఒక్క లింఫ్ గ్రంథిని మాత్రమే తొలగించి, కీమోథెరపీతో చికిత్స చేయవచ్చు. ఇలా కాకుండా కేన్సర్ ముదిరిపోయి, రొమ్ములో రెండు మూడు చోట్ట గడ్డలు ఉన్నా, ఒకే పెద్ద గడ్డ ఉన్నా, గడ్డ కారణంగా రొమ్ము పుండు పడి, పాడైపోయినా రొమ్మును పూర్తిగా తొలగించక తప్పదు. ఇలా తొలగించినా అప్పటికప్పుడు లేదా కేన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత రొమ్మును పునర్నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో ఆధునిక చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
చికిత్స ఇలా...
కొన్ని కేన్సర్ గడ్డలు చిన్నవిగా ఉన్నా, ఉధృతమైన వేగంతో పెరగుతాయి. కొన్ని గడ్డలు పెద్దవిగా ఉన్నా నెమ్మదిగా పెరుగుతాయి. కాబట్టి గడ్డ తీరుతెన్నులు, స్వభావం ఆఽధారంగా చికిత్సా విధానం రూపొందుతుంది. కేన్సర్ చికిత్సలో సర్జరీ, రేడియేషన్, ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీకి చెందిన రేడియాలజిస్టులు, పాథాలజిస్టులు కలగలసి రోగికి తగిన విభిన్నమైన చికిత్సా విధానాలను రూపొందించడం జరుగుతుంది. అలాగే చికిత్సలో రోగి వయసు, వ్యాధి దశ, రోగి పూర్తి ఆరోగ్యం, మెనోపాజ్ మొదలైన అంశాలన్నిటినీ పరిగణలోకి
తీసుకుంటారు.
పొంచి ఉండే ముప్పు
రొమ్ము కేన్సర్ ముప్పును పెంచే కారణాలు ఇవే!
బ్రెస్ట్ బయాప్సీలో లాబ్యులర్ కార్సినోమా లేదా ఎటిపికల్ హైపర్‌ప్లేసియా ఉందని తేలిన వాళ్లకు భవిష్యత్తులో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఒక రొమ్ము కేన్సర్‌కు గురైతే, దాన్ని నయం
చేసుకున్నా, రెండో రొమ్ముకు కేన్సర్ సోకే అవకాశాలుంటాయి.
తల్లి, చెల్లి, కూతుర్లు మరీ ముఖ్యంగా చిన్న
వయసులోనే రొమ్ము కేన్సర్‌కు గురైతే, వాళ్ల
పిల్లలకు కూడా రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిఆర్‌సిఎ1, బిఆర్‌సిఎ2 జన్యు పరివర్తనాల మూలంగా రొమ్ము కేన్సర్ సోకవచ్చు.
బాల్యంలో, లేదా టీనేజీలో రేడియేషన్‌కు ఎక్కువగా గురైనా బ్రెస్ట్ కేన్సర్ సోకే అవకాశాలు పెరుగుతాయి.
30 ఏళ్ల తర్వాత తొలి బిడ్డకు జన్మనిచ్చిన
మహిళలకు కూడా ఈ ముప్పు ఎక్కువే!
ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు!
రొమ్ము లేదా బాహుమూలల్లో గడ్డలు...
రొమ్ములో కొంత మేరకు చర్మం మందంగా మారడం లేదా వాపు కనిపించడం
రొమ్ము ఆకారంలో స్పష్టమైన మార్పు, సొట్టలు పడడం
చనుమొనల దగ్గర కందిపోవడం...
చనుమొన లోపలికి ముడుచుకుపోవడం, నొప్పి
చనుమొన నుంచి స్రావాలు, రక్తం కారడం
-డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ
డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్
మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్,
రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్, కార్ఖానా, సికింద్రాబాద్
Updated Date - 2023-10-10T11:14:36+05:30 IST