Kidney Care: ఆదమరిస్తే కోలుకోలేనంతగా దెబ్బతీస్తాయి!
ABN, First Publish Date - 2023-03-28T12:45:33+05:30
నిశ్శబ్దంగా శరీరంలోని మలినాలను బయటకు నెట్టేస్తూ ఉండే మూత్రపిండాలకు మధుమేహం, అధిక రక్తపోటు బద్ధ శత్రువులు. కొన్ని అలవాట్లు, పొరపాట్లు కూడా
నిశ్శబ్దంగా శరీరంలోని మలినాలను బయటకు నెట్టేస్తూ ఉండే మూత్రపిండాలకు మధుమేహం, అధిక రక్తపోటు బద్ధ శత్రువులు. కొన్ని అలవాట్లు, పొరపాట్లు కూడా మూత్రపిండాల సామర్థ్యాన్ని కుంటుపరిచి, తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతీస్తాయి. కాబట్టి కిడ్నీలు క్షేమంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం!
లక్షణాలను బట్టి వ్యాధిని కనిపెట్టవచ్చు. కానీ కిడ్నీ వ్యాధులు (Kidney Care) ఇందుకు పూర్తి భిన్నం. మూత్రపిండాల వ్యాధుల లక్షణాలు చాలా ఆలస్యంగా బయల్పడతాయి. కాబట్టి కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించాలంటే, తప్పనిసరిగా స్క్రినింగ్ పరీక్షలు (Screening tests) చేయించుకోవాలి. మరీ ముఖ్యంగా హై రిస్క్ కోవకు చెందినవాళ్లు ఏడాదికోసారి తప్పనిసరిగా మూత్రపిండాల పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వాళ్లెవరంటే....
మధుమేహులు
అధిక రక్తపోటు కలిగినవాళ్లు
తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేవాళ్లు
తరచూ మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనేవాళ్లు
పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ లాంటి దీర్ధకాలిక మందులు వాడుతున్నవాళ్లు
తీవ్ర వ్యాధులతో దీర్ఘకాలం మందులు వాడుతున్నవాళ్లు
స్థూలకాయలు
కుటుంబంలో మూత్రపిండాల సమస్యలున్నవాళ్లు
సింపుల్ స్క్రీనింగ్
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, మూత్రంలో ప్రొటీన్ టెస్ట్... ఈ రెండు పరీక్షలతో కనిపెట్టవచ్చు. ఈ పరీక్షల్లో సమస్య ఉన్నట్టు కనిపిస్తే, చికిత్సతో సమస్యను సరిదిద్దడంతో పాటు భవిష్యత్తులో మూత్రపిండాలు మరింత పాడవకుండా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది.
ఈ లక్షణాల మీద కన్నేయాలి
సాధారణంగా మూత్రపిండాల సమస్యల్లో లక్షణాలు ఆలస్యంగా బయల్పడతాయి. అయితే వాటితో కలిగే శారీరక అసౌకర్యం తక్కువ కాబట్టి వాటిని కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అయితే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటంటే..
మూత్రంలో ప్రొటీన్ పోతున్న వాళ్లు మూత్రవిసర్జన చేసినప్పుడు నురగగా కనిపించడం
మూత్రం పరిమాణం తగ్గడం
రాత్రుళ్లు నాలుగైదు సార్లు మూత్రవిసర్జన చేయవలసి రావడం
రక్తపోటు పెరగడం
కాళ్ల వాపులు రావడం
ఆకలి లేకపోవడం
వాంతి వస్తున్నట్టు అనిపించడం
ప్రారంభంలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు లేని ఆయాసం, నడిచినప్పుడు రావడం
వ్యాధి ముదిరినప్పుడు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా ఆయాసం ఉంటుంది.
హై రిస్క్ రోగుల్లో ఇటువంటి లక్షణాలేవీ లేకపోయినప్పటికీ, ఏడాదికోసారి మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఈ లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
సాధారణ మప్పులు ఇవే!
మధుమేహంతో కళ్లకు చేటు జరిగినట్టే మూత్రపిండాలకూ చేటు జరుగుతుంది. అలాగే అధిక రక్తపోటుతో మూత్రపిండాలు పాడైపోతూ ఉంటాయి. పదే పదే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతూ ఉన్నప్పుడు కూడా మూత్రపిండాలు పాడవుతాయి. పదే పదే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేవాళ్లలో కూడా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. అలాగే ‘క్రానిక్ గ్లామర్యులో నెఫ్రైటిస్’ అనే సమస్య కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. వీళ్లలో మూత్రంలో ప్రొటీన్ నష్టం జరుగుతుంది. రక్తపోటు పెరుగుతుంది. ఈ లక్షణాలను గమనించుకుని, కిడ్నీ పరీక్షలతో వ్యాధిని గుర్తించడం ఆలస్యం చేస్తే, అంతిమంగా కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి డయాలసిస్ పరిస్థితి వస్తుంది. అలాగే ‘క్రానిక్ ఇంటెస్టీషియల్ నెఫ్రైటిస్’ అనే సమస్య కూడా మన దేశంలో ఎక్కువ. ఈ సమస్య ఉన్నవాళ్లు రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రవిసర్జన కోసం లేవవలసి వస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్న వాళ్లలో వ్యాధి తీవ్రత క్రమేపీ పెరుగుతూ పదేళ్లకు డయాలసిస్ స్థితికి చేరుకుంటారు. అయితే మూత్రపిండాలు ఎలాంటి వ్యాధికి గురైనా లక్షణాలన్నీ ఒకేలా ఉంటాయి.
నియంత్రణ ఇలా
మూత్రపిండాల వ్యాధుల నియంత్రణ చాలా సులభం. మధుమేహం ఉన్నవాళ్లు మధుమేహాన్నీ, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు రక్తపోటునూ మందులతో నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు ఆహారంలో ఉప్పు, నూనెల వాడకాన్ని తగ్గించాలి. మాంసాహారులు రెడ్ మీట్ మానేయాలి. కొంతమంది ప్రతి చిన్న సమస్యకూ ఎడాపెడా మందులు కొని వాడేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా నొప్పి తగ్గించే మందులు కిడ్నీలకు చేటు చేస్తాయి. కాబట్టి ఎంతో అవసరమైతే తప్ప, వైద్యులు సూచించిన మోతాదు మేరకు మాత్రమే మందులను వాడుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఏడాదీ మూత్రపిండాల పరీక్షలు చేయించుకుంటూ ఉంటే మూత్రపిండాల వ్యాధులు రాకుండా ఉంటాయి. వచ్చిన వ్యాధులు ముదరకుండా నియంత్రణలో ఉంటాయి. మూత్రంలో ప్రొటీన్ పోతున్నవాళ్లకు ప్రస్తుతం ఎంతో సమర్థమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. మూత్రపిండాలకు సంబంధించిన ఏ వ్యాధినైనా ప్రారంభంలోనే గుర్తిస్తే, ఆ వ్యాధులను మొదటి దశలోనే అరికట్టగలిగే వీలుంటుంది. లేదంటే వేగంగా దశలు దాటుకుంటూ ఐదవ దశ అయిన డయాలసిస్‌కు చేరుకునే పరిస్థితి వస్తుంది. ఈ దశలో మందులేవీ ఉపయోగపడవు.
డయాలసిస్ క్రమం తప్పకూడదు
రక్త పరీక్షతో మూత్రపిండాల పనితీరును తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో ‘గ్లామెర్యులార్ ఫిలే్ట్రషన్ రేట్’ పరిమాణాన్ని బట్టి కిడ్నీల పనితీరును అంచనా వేయవచ్చు. జిఎ్‌ఫఆర్ 90మిల్లీలీటర్లు మూత్రపిండాల వ్యాధి మొదటి దశను సూచిస్తుంది. రెండో దశలో 60 మిల్లీలీటర్లు, ఐదవ దశలో 10 మిల్లీలీటర్లకు పడిపోతుంది. ఈ దశలో డయాలసిస్ అవసరమవుతుంది. ఈ దశలో డయాలసిస్ చేయించుకోకపోతే, శరీరంలో విసర్జితాలు (యురీమిక్ టాక్సిన్స్) పేరుకుపోయి, గుండెనూ, రక్తనాళాలనూ డ్యామేజీ చేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ ఉండాలి. ఇలా క్రమంతప్పక డయాలసిస్ చేయించుకుంటూ పాతికేళ్లకు పైగా జీవిస్తున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. మూత్రం పరిమాణాన్ని బట్టి వైద్యులు సూచించిన మేరకు వారానికి రెండు లేదా మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటే, ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవు.
ఎవరు ఏ డయాలసిస్?
హీమో డయాలసిస్‌లో శరీరం నుంచి రక్తం మిషన్‌కు చేరుకుని, మలినాలు తొలగిపోయి, మంచి రక్తం తిరిగి శరీరంలోకి చేరుకుంటుంది. పెరిటోనియల్ డయాలసి్‌సలో ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని శరీరంలోకి పంపించి, తిరిగి సంగ్రహించడం జరుగుతుంది. ఆ ద్రవం శరీరంలోని విసర్జకాలను తనతో పాటు బయటకు తీసుకువస్తుంది. అయితే హీమో డయాలసిస్‌ల మరో నాలుగు రకాలు, పెరిటోనియల్ డయాలసి్‌సలో మరో రెండు, మూడు రకాలు కూడా ఉంటాయి. అయితే రోగి వయసు, ఆస్పత్రికి వాళ్లు నివసించే ప్రాంతానికి మధ్య దూరం, వృత్తి తగ్గట్టు వైద్యులు వాళ్లకు అవసరమైన డయాలసిస్‌ను సూచిస్తారు. ఇవే కాకుండా ఇంట్లో ఎవరికి వారు చేసుకోగలిగే హోమ్ డయాలసిస్‌లు కూడా ఉంటాయి. వాటిలో హోమ్ హీమో డయాలసిస్, హోమ్ పెరిటోనియల్ డయాలసిస్... ఇలా రెండూ ఉంటాయి. ఇవే కాకుండా నాక్టర్నల్ డయాలసిస్ కూడా ఉంటుంది. దైనందిన జీవితం దెబ్బతినకుండా, రాత్రిపూట చేసుకునే డయాలసిస్ ఇది.
ఎన్ని నీళ్లు - ఎంత ఉప్పు?
డయాలసిస్‌కు చేరుకున్న వారిలో మూత్ర పరిమాణం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా డయాలసిస్‌లో ఉన్నవాళ్లకు మూత్రమనేది రాకపోవచ్చు. కాబట్టి ప్రతి డయాలసిస్ రోగికీ నీళ్లు తాగే విషయంలో వేర్వేరు పరిమితులుంటాయి. మూత్ర విసర్జన పరిమాణం, ఒక డయాలసిస్‌కూ మరొక డయాలసిస్‌కు మధ్య బరువు వ్యత్యాసాల మీద కూడా నీళ్లు తాగవలసిన పరిమాణం, తినవలసిన ఉప్పు పరిమాణం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేసవిలో దాహార్తి వేధించకుండా ఉండడం కోసం ఆహారంలో ఉప్పును బాగా తగ్గించాలి. ఉప్పుతో దాహం పెరుగుతుంది. అలాగే నోట్లో కరగకుండా ఉండే బబుల్‌గమ్ లేదా యాలకుల తొక్క లాంటివి ఉంచుకుంటే, లాలాజలం ఊరి దాహం తగ్గుతుంది.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే...
రోజుకు 3 గ్రాముల ఉప్పు సరిపోతుంది. కానీ మనం 12 గ్రాముల ఉప్పు తింటున్నాం. కాబట్టి ఉప్పు పరిమాణం తగ్గించాలి.
ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజు మొత్తంలో 3 లీటర్లు ద్రవాలు (నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు) తాగాలి. ప్రతి మూడు గంటలకు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
రోజుకు గంట పాటు వ్యాయామం చేయాలి.
అధిక రక్తపోటు, మధుమేహాలను అదుపులో ఉంచుకోవాలి.
అవసరం లేకుండా మందులు వాడకూడదు.
శాకాహారం కిడ్నీలకు మేలు చేస్తుంది. మాంసాహారాన్ని వారానికి రెండు నుంచి మూడు సార్లకు పరిమితం చేయాలి.
కిడ్నీ సమస్య మొదలైన తర్వాత రెడ్ మీట్ మానేయాలి.
-డాక్టర్ రాజశేఖర చక్రవర్తి
సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్,
యశోద హాస్పిటల్స్,
హైటెక్ సిటీ, హైదరాబాద్.
Updated Date - 2023-03-28T12:45:33+05:30 IST