మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి
ABN, First Publish Date - 2023-05-13T18:06:30+05:30
ఒత్తిడి తొలగి, మనసు ప్రశాంతంగా ఉండే మార్గాలను అనుసరిస్తే, ఒత్తిడికి సంబంధించిన రుగ్మతలు దరి చేరకుండా
ఒత్తిడి తొలగి, మనసు ప్రశాంతంగా ఉండే మార్గాలను అనుసరిస్తే, ఒత్తిడికి సంబంధించిన రుగ్మతలు దరి చేరకుండా ఉంటాయి. అందుకోసం...
డీప్ బ్రీతింగ్: దీర్ఘ శ్వాసతో నాడీ వ్యవస్థ నెమ్మదించి, ఒత్తిడి తొలుగుతుంది. దీర్ఘ శ్వాసతో ఆక్సిజన్ శరీరంలోకి, మెదడుకు చేరుకుని, స్వాంతన పొందుతాం!
ధ్యానం: ధ్యానంతో మన ధ్యాస ఇతర అంశాల మీదకు వెళ్లకుండా ఉంటుంది. దాంతో మనసు, శరీరం నెమ్మదిస్తాయి. కార్టిసాల్, అడ్రెనలిన్ అనే స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, మానసిక ప్రశాంతత దక్కుతుంది.
వ్యాయామం: వ్యాయామంతో శరీరం చురుగ్గా మారడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. వ్యాయామంతో ఎండార్ఫిన్లు అనే ఫీల్‌గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అలాగే ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది.
నిద్ర: ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవడం కూడా అవసరమే! నిద్ర లోపిస్తే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఆందోళన, చీకాకు పెరుగుతాయి. నిద్రలేమితో స్పష్టమైన ఆలోచన కొరవడుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది.
సంగీతం: ఒత్తిడిని తొలగించడానికి సంగీతం తోడ్పడుతుంది. ఆందోళన స్థాయిలను తగ్గించి, గుండె వేగాన్ని అదుపులోకి తెచ్చే సామర్థ్యం సంగీతానికి ఉంది. కాబట్టి నచ్చిన సంగీతాన్ని వింటూ ఉండాలి.
డిజిటల్ డిటాక్సిఫికేషన్: స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టివిలకు రోజులో కొంత సమయం పాటు దూరంగా ఉండాలి.
నచ్చిన పనులు: రోజులో కొంత సమయాన్ని మన కోసం, మనకు నచ్చిన పనులు చేయడం కోసం కేటాయించాలి. మొక్కలు నాటడం, అభిరుచులకు పదును పెట్టడం లాంటివి చేయాలి.
దురలవాట్లు: ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం మద్యపానం, ధూమపానం లాంటివి అలవాటు చేసుకోకూడదు. అవి తాత్కాలిక ఉపశమనాన్ని అందించినా, దీర్ఘకాలంలో వ్యసనాలుగా మారి జీవితాన్ని దుర్భరం చేస్తాయి.
Updated Date - 2023-05-13T18:06:30+05:30 IST