Post covid: కొవిడ్ టైంలో అది వాడారా? అయితే జాగ్రత్త అంటున్న..!
ABN, First Publish Date - 2023-06-20T11:35:57+05:30
ప్రతి మందుకీ ఎంతో కొంత దుష్ప్రభావం ఉంటుంది. అలాగే స్టిరాయిడ్స్‌కు కూడా! కొవిడ్ సమయంలో వాడుకున్న స్టిరాయిడ్స్ ప్రభావాలు రెండేళ్ల తర్వాత
ప్రతి మందుకీ ఎంతో కొంత దుష్ప్రభావం ఉంటుంది. అలాగే స్టిరాయిడ్స్‌కు కూడా! కొవిడ్ సమయంలో వాడుకున్న స్టిరాయిడ్స్ ప్రభావాలు రెండేళ్ల తర్వాత ‘ఆస్టియొ నెక్రోసిస్’ రూపంలో తుంటి ఎముకలను ఛిద్రం చేస్తున్నాయి అంటున్నారు వైద్యులు.
తుంటి ఎముక తలకు రక్తస్రావం తగ్గితే, ఆ ప్రదేశం బలహీనపడి, దారుఢ్యాన్ని కోల్పోతుంది. అలాగే దాంతో పాటు సాకెట్‌కూ బాల్‌కూ మధ్య ఉండే మృదులాస్థి కొలాప్స్ అయ్యే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. ప్రధానంగా శరీర బరువు నేరుగా పడే ఎముక భాగం దెబ్బతింటే అక్కడి మృదులాస్థి కూడా దెబ్బతిని విపరీతమైన నొప్పి వేధిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తొడ ఎముక చివరి బాల్ నిరాకారంగా మారి, కొంత కాలానికి ఆర్థ్రయిటిస్ తలెత్తుతుంది. ఇలా జరగడానికి ఎన్నో కారణాలున్నాయి. మూత్రపిండాల సమస్యలు, కాలేయ సంబంధ సమస్యలు, ప్రమాదాల్లో తొడ ఎముక విరగడం, కొవిడ్ సమయంలో అధికంగా స్టిరాయిడ్ల వాడకం వల్ల ఎముకకు రక్త సరఫరా డ్యామేజీకి గురై ఈ సమస్య తలెత్తుతుంది. కొంతమందిలో ఎటువంటి కారణం లేకపోయినా, ఈ సమస్య తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే స్టిరాయిడ్ల వాడకంతో తుంటి ఎముకలో సమస్య తలెత్తడం గురించి మాట్లాడుకుంటే, రెండేళ్ల క్రితం కొవిడ్ సమయంలో వాడిన స్టిరాయిడ్లకూ ఇప్పటి తుంటి సమస్యకూ సంబంధం ఏంటనే అనుమానం రావచ్చు. కానీ స్టిరాయిడ్ల ప్రభావం ఆలస్యంగా రెండేళ్లకు బయల్పడుతుంది. కాబట్టే కొవిడ్ కాలం గడిచి రెండేళ్లయిన తర్వాత, తాజాగా ఆస్టియొ నెక్రోసిస్’ సమస్యతో వైద్యులను సంప్రతిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యకు వయసుతో సంబంధం లేదు. యువత సైతం ఈ సమస్యతో బాధపడుతోంది.
మూడు దశల్లో...
మొదటి రెండు దశల్లో తొడ ఎముక తల సక్రమంగానే ఉంటుంది. రక్తసరఫరా డ్యామేజీ, ఎడీమా, నొప్పి ఉంటాయి. మూడవ దశలో నడకతో ఎముక బలహీనపడడం వల్ల మృదులాస్థి కొలాప్స్ అయిపోయి, తీవ్రమైన నొప్పితో హఠాత్తుగా నడవలేని పరిస్థితి తలెత్తుతుంది. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే తీవ్రమైన ఆర్థ్రయిటిస్‌కు దారి తీసి, తుంటి మార్పిడి అవసరమవుతుంది.
చికిత్స ఇలా...
ప్రారంభ దశల్లో (ప్రి కొలాప్స్ స్టేజెస్) తుంటి ఎముక మీద బరువు పడకుండా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడుకుంటే సరిపోతుంది. అలాగే పెయిన్ మ్యానేజ్‌మెంట్ పద్ధతులను కూడా అనుసరించవలసి ఉంటుంది. ఈ చికిత్సతో చనిపోయిన ఎముక తిరిగి ఆరోగ్యకరంగా మారుతుంది. కాబట్టి ఈ దశలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే రక్తసరఫరా డ్యామేజీలో తుంటి ఎముక తల 50% మేరకు ఇన్వాల్వ్ అయి ఉన్నా, శరీర బరువు పడని తుంటి ఎముక ఇన్వాల్వ్ అయి ఉన్నా వీళ్లకు మందులతోనే సమస్యను సరిదిద్దే వీలుంటుంది. ఇలా కాకుండా తుంటి ఎముక తల 50 శాతానికి మించి ఇన్వాల్వ్ అయి ఉండడం, శరీర బరువు పడే తుంటి ఎముక ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల, హెడ్ కొలాప్స్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అలాంటి అత్యవసర పరిస్థితిలో కొందరికి తుంటి మార్పిడి సర్జరీ అవసరం పడుతుంది. కొంతమందికి బోన్ మ్యారో ఎడీమా మూలొంగా హెడ్ మెరుగ్గానే ఉండి, నొప్పి ఉంటుంది. వీళ్లకు కోర్ డీకంప్రెషన్ అనే ప్రెషర్ రిలీవింగ్ ఆపరేషన్ చేసి, ఉపశమనాన్ని కలిగించవచ్చు. ఈ సర్జరీకి అదనంగా బోన్ గ్రాఫ్టింగ్, స్టెమ్ సెల్స్‌లతో కూడా కొత్త ఎముక రూపొందేలా చేయవచ్చు. తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది. ఈ చికిత్సతో 60ు మందికి ఫలితం ఉంటుంది. 40% మందిలో సమస్య మరింత పెరిగి తుంటి మార్పిడి శస్త్రచికిత్స వరకూ దారి తీస్తుంది. ఎవరికి సమస్య తీవ్రమవుతుందో, ఎవరికి అదుపులో ఉంటుందో ఊహించడం వైద్యులకూ కష్టమే!
చివరి దశలోనే తుంటి మార్పిడి
చివరి దశలో నడవలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయవలసి వస్తుంది. అయితే తుంటి మార్పిడి అనగానే అది పెద్ద సర్జరీ కాబట్టి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందనీ, సర్జరీలో రిస్క్‌లు ఉంటాయనీ ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. కానీ పెరిగిన సాంకేతిక, సర్జరీ మెలకువల వల్ల తుంటి మార్పిడి సర్జరీలు మరింత మెరుగయ్యాయి. కాబట్టి నిరభ్యంతరంగా సర్జరీలు చేయించుకోవచ్చు. పైగా సెరామిక్‌తో తయారైన కృత్రిమ తుంటి ఎముకలు వచ్చాయి కాబట్టి దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల పాటు తుంటి చెక్కుచెదరకుండా ఉంటుంది. అలాగే ఈ సర్జరీ తర్వాత నేల మీద కూర్చుని కూడా పనులు చేసుకోగలుగుతారు.
ఈ లక్షణాల మీద ఓ కన్నేసి...
తుంటి కీలు నొప్పి ఉంటుంది.
కూర్చుని లేస్తున్నప్పుడు తుంటి ఎముక బిగుసుకుపోతూ ఉంటుంది
నడిచేటప్పుడు నొప్పి పెరగడం
ప్రమాదాలతో...
యువకుల్లో ఈ సమస్యకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలు. ప్రమాదాల్లో తొడ ఎముక హెడ్, నెక్ జంక్షన్ విరిగిపోతుంది. కొందర్లో సాకెట్‌లో ఫ్రాక్చర్ ఏర్పడుతుంది. వీటికి చేసిన సర్జరీలు ఫెయిల్ అయినప్పుడు కూడా ఆస్టియొ నెక్రోసిస్ సమస్య తలెత్తే అవకాశాలుంటాయి.
ధూమపానం, మద్యపానం తోడైతే...
కొవిడ్ సమయంలో స్టిరాయిడ్స్ వాడకం మూలంగా ఆస్టియొ నెక్రోసిస్‌కు గురైన వాళ్లకు ధూమపానం, మద్యపానం మొదలైన అలవాట్లు తోడైతే సమస్య మరింత వేగంగా తీవ్రమవుతూ ఉంటుంది.
-డాక్టర్ ఇ. కృష్ణ కిరణ్
డైరెక్టర్, చీఫ్ ప్రైవరీ అండ్ రివిజన్ హిప్ అండ్ నీ రీప్లేస్‌మెంట్,
మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్.
Updated Date - 2023-06-20T11:37:51+05:30 IST