ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hormone Health: అంతా హార్మోన్ల మయం

ABN, First Publish Date - 2023-06-13T12:06:21+05:30

హార్మోన్లలో ఒడిదొడుకులు తీవ్ర అస్వస్థతలకు గురి చేయవు. అకస్మాత్తుగా ఆస్పత్రి పాలు చేయవు. కాబట్టి వాటి లక్షణాలను మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ హార్మోన్‌ అసమతౌల్యాలు గుండెకు

Hormone Health
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హార్మోన్లలో ఒడిదొడుకులు తీవ్ర అస్వస్థతలకు గురి చేయవు. అకస్మాత్తుగా ఆస్పత్రి పాలు చేయవు. కాబట్టి వాటి లక్షణాలను మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ హార్మోన్‌ అసమతౌల్యాలు గుండెకు సైతం హాని తలపెట్టగలవు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వైద్యులు.

ఆకలి తగ్గితే అజీర్తి చేసింది అనుకుంటాం. నిస్సత్తువ ఆవరిస్తే, పైబడే వయసుతో ఇదంతా సహజమేలే అని నిట్టూర్చి ఊరుకుంటాం. ఆఖరుకు పిల్లలు వయసుకు తగిన ఎత్తు పెరగకపోయినా, రక్తసంబంధీకుల పోలిక వచ్చిందని సరిపెట్టుకుంటాం! కానీ నిజానికి వీటన్నింటి వెనకా హార్మోన్ల హస్తం ఉంటుంది. గ్రంథులు సమర్థంగా పని చేయకపోవడం, జన్యుపరంగా సంక్రమించిన హార్మోన్‌ సమస్యలు, అస్తవ్యస్థ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం లోపించడం, ఒత్తిడి లాంటి ఎన్నో కారణాలు హార్మోన్లలో ఒడిదొడుకులకు దారి తీస్తాయి.

మధుమేహం రాకుండా...

జన్యుపరంగా సంక్రమించే సమస్య ఇది. కాబట్టి తల్లితండ్రుల నుంచి పిల్లలకు ఈ సమస్య కచ్చితంగా రాదు అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఎప్పుడు ఈ సమస్య బారిన పడతాం అనేది, మనం అనుసరించే జీవనశైలి మీదే ఆధారపడి ఉంటుంది. కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే, ఈ సమస్య కాస్త ఆలస్యంగా 50 నుంచి 60 ఏళ్ల వయసులో తలెత్తే అవకాశాలుంటాయి. ఒకవేళ కుటుంబ చరిత్రలో మధుమేహం లేకపోతే మధుమేహానికి గురయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. కానీ కుటుంబ చరిత్రలో మధుమేహం లేనంత మాత్రాన ఆ సమస్య బారిన పడే అవకాశాలు పూర్తిగా ఉండవని చెప్పడానికి వీల్లేదు. కుటుంబ చరిత్రలో షుగర్‌ ఉండీ, జీవనశైలి కూడా అస్తవ్యస్థంగా ఉండీ, ఆహారం మీద నియంత్రణ లేకపోవడం, విపరీతమైన ఒత్తిడికి లోనవడం, వ్యాయామం చేయకపోవడం, నిద్రవేళలు గతి తప్పడం లాంటివి కూడా తోడైతే, 35 నుంచి 40 ఏళ్లకే ఈ రుగ్మత బారిన పడతాం. నిజానికి 20 నుంచి 30 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఆరోగ్యకరమైన జీవనవిధానం, ఆహారపుటలవాట్ల వల్ల 50 ఏళ్లు పైబడిన వాళ్లకే మధుమేహం వస్తూ ఉండేది. అలాగే కొవిడ్‌ సమయంలో స్టిరాయిడ్ల వాడకం వల్ల, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ (కీళ్ల వాతం) కోసం జీవితాంతం స్టిరాయిడ్స్‌ వాడవలసి రావడం వల్ల కొందరు మధుమేహం బారిన పడుతూ ఉంటారు.

నియంత్రణ ఇలా....

  • సమయానికి ఆహారం తీసుకోవాలి.

  • సమతులాహారం తీసుకోవాలి.

  • రోజూ కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి.

  • ఒత్తిడి తగ్గించుకోవాలి.

  • ఈ అలవాట్ల వల్ల వంశపారంపర్యంగా సంక్రమించే వీలున్న మధుమేహాన్ని వాయిదా వేయవచ్చు.

థైరాయిడ్‌ అదుపులో....

థైరాయిడ్‌ సమస్య బారిన పడిన వాళ్లలో 80ు మందికి హైపో థైరాయిడ్‌, 20ు మందికి హైపర్‌ థైరాయిడ్‌ ఉంటూ ఉంటుంది. అలాగే ఈ సమస్య 80ు మహిళల్లో 20ు పురుషుల్లో ఉంటూ ఉంటుంది. నిజానికి థైరాయిడ్‌ సమస్యలు మునుపటి కంటే ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. కానీ 20 నుంచి 30 ఏళ్ల క్రితం అయోడైజ్‌డ్‌ సాల్ట్‌ లేని రోజుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండేది. అప్పట్లో వ్యాధినిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉండేవి కావు కాబట్టి ఈ సమస్య విస్తృతంగా ఉండేది. నిజానికి పూర్వంతో పోలిస్తే ఇప్పుడు థైరాయిడ్‌ కేసులు తగ్గినప్పటికీ, వ్యాధినిర్థారణ పరీక్షల్లో ఈ సమస్య బయల్పడుతూ ఉండడంతో ఎక్కువ మందిలో థైరాయిడ్‌ ఉన్న భావన కలుగుతోంది. ఇది కూడా 90ు జన్యుపరంగా సంక్రమించే సమస్యే! జీవనశైలిని క్రమబద్ధం చేయడం ద్వారా జన్యుపరమైన మధుమేహాన్ని వాయిదా వేయడం, తొలి దశలో ఉన్న మధుమేహాన్ని మందుల్లేకుండా నియంత్రించగలిగే అవకాశం ఉంటుంది. కానీ థైరాయిడ్‌ సమస్యను ఇలా నియంత్రించే పరిస్థితి ఉండదు. ఈ సమస్య ఉందని తెలిసినప్పటి నుంచీ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, జీవితాంతం మందులతో అదుపులో ఉంచుకోక తప్పదు. థైరాయిడ్‌కూ ఒత్తిడికీ కొంత సంబంధం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. థైరాయిడ్‌ వచ్చిన తర్వాత మందులు వాడుకుంటూ అదుపులో పెట్టుకోవాలి.

థైరాయిడ్‌తో గుండె సమస్యలు

బరువు పెరగడం, చిన్న పనికే అలసిపోవడం థైరాయిడ్‌ ప్రధాన లక్షణాలు. కానీ ఎక్కువ మంది ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేసి, సమస్య ముదిరిపోయే పరిస్థితిని కొనితెచ్చుకుంటూ ఉంటారు. థైరాయిడ్‌ హార్మోన్‌ ఒడిదొడుకుల వల్ల శరీరం మొత్తం మీద ప్రభావం పడుతుంది. ప్రధానంగా అలసట, బరువు పెరగడం, అజీర్తి, నెలసరి గాడి తప్పడం, మలబద్ధకం లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. అయితే హైపో థైరాయిడ్‌ సమస్య తీవ్రమైనప్పుడు, ఆ ప్రభావం గుండె మీద కూడా పడుతుంది. గుండె వేగం నెమ్మదించడం, గుండె పైని పొర చుట్టూ నీరు చేరడం లాంటి సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యను ‘మిక్సిడిమాకోమా’ అంటారు. కాబట్టి థైరాయిడ్‌ లక్షణాలను అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రతించి, నిర్థారణ చేసుకోవాలి.

హైపోథైరాయిడ్‌లో శరీర వ్యవస్థ మొత్తం నెమ్మదిస్తే, హైపర్‌ థైరాయిడ్‌లో ఇందుకు విరుద్ధంగా శరీర వ్యవస్థ వేగం పుంజుకుంటుంది. హైపర్‌ థైరాయిడ్‌ వల్ల శరీరంలో హైపర్‌ మెటబాలిజం పరిస్థితి ఏర్పడి బరువు తగ్గడం, గుండె వేగం పెరగడం, ఆందోళన లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి హైపో, హైపర్‌ ఈ రెండు థైరాయిడ్లూ మన శరీరానికీ, గుండెకూ హానికరం కాబట్టి లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి.

మెనోపాజ్‌ ముప్పు నుంచి విముక్తి

మహిళల్లోని ఈస్ట్రోజన్‌ ప్రొటెక్టివ్‌ హార్మోన్‌ లాంటిది. 45 నుంచి 50 ఏళ్ల వయసు వరకూ ఈ హార్మోన్‌ మహిళల ఎముకలకూ, గుండెకూ రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అయితే ఒకసారి మెనోపాజ్‌ దశకు చేరుకున్న తర్వాత ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పడిపోతుంది. దాంతో మోకాళ్లు అరిగిపోవడం, అలసట, ఒంటి నుంచి వేడి ఆవిర్లు వెలువడడం, ఒళ్లు నొప్పులు లాంటి ‘పెరి మెనోపాజల్‌’ లక్షణాలు మెనోపాజ్‌కు రెండేళ్లకు ముందు నుంచీ, మెనోపాజ్‌ వచ్చిన తర్వాత రెండేళ్ల వరకూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు మహిళలు గైనకాలజిస్టు లేదా ఎండోక్రైనాలజిస్టును సంప్రతించి చికిత్స తీసుకోవాలి. లక్షణాల తీవ్రతను బట్టి క్యాల్షియం సప్లిమెంట్లు, హార్మోన్‌ మందులు వాడుకోవలసి ఉంటుంది.

పిల్లలు ఎత్తు పెరగడం లేదా?

గ్రోత్‌ హార్మోన్‌ ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది. 17 నుంచి 18 ఏళ్ల వరకూ కూడా పిల్లలు పెరుగుతూనే ఉంటారు. ఆ తర్వాత శరీరంలోని ఎముకలన్నీ ఫ్యూజ్‌ అయిపోతాయి. కాబట్టి పెరుగుదల అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి 10 నుంచి 12 వయసు పిల్లలను పీడియాట్రీషియన్‌ దగ్గరకు తీసుకువెళ్తూ ఎత్తును పరీక్షిస్తూ ఉండాలి. వైద్యులు మాత్రమే పిల్లల వయసు, ఎత్తు, బరువులూ సమంగా మ్యాచ్‌ అవుతున్నదీ, లేనిదీ చెప్పగలుగుతారు. వయసుకు తగ్గ ఎత్తు లేనప్పుడు, అందుకు తగ్గట్టు గ్రోత్‌ హార్మోన్‌ ఉత్పత్తి జరుగుతుందో లేదో రక్త పరీక్షలతో, బ్రెయిన్‌ స్కాన్‌తో వైద్యులు తెలుసుకుంటారు. సమస్య ఉందని తేలినప్పుడు గ్రోత్‌ హార్మోన్‌ ఇంజక్షన్లను వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవలసి ఉంటుంది. బ్రెయిన్‌ స్కాన్‌తో పెరుగుదలకు తోడ్పడే పిట్యుటరీ గ్రంథిలో సమస్య ఉందా, లేక గ్రోత్‌ హార్మోన్‌లో సమస్య ఉందా అనే విషయం స్పష్టమైపోతుంది. కొంతమంది పిల్లలకు పిట్యుటరీ గ్రంథిలో వాపు, ఎడినోమాలు (అసహజ పెరుగుదలలు) ఉంటాయి. ఇలాంటి సమస్యలను సర్జరీలతో సరిచేయవచ్చు. గ్రంథిలో ఎలాంటి సమస్యా లేకుండా గ్రోత్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గినట్టు తేలితే, ఇంజెక్షన్లతో సమస్యను సరిదిద్దవచ్చు. అయితే పిల్లలు వయసుకు తగినంత ఎత్తు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవడం కోసం తల్లితండ్రులు 10 నుంచి 12 ఏళ్ల వయసుకు చేరుకునే వరకూ పిల్లలను ప్రతి ఆరునెలలకోసారి పీడియాట్రిషియన్‌ చేత పరీక్షలు చేయిస్తూ ఉండాలి.

చక్కెర తింటే మధుమేహం వస్తుందా?

నిజానికి చిన్నప్పటి నుంచీ తీపి పదార్థాలు ఎక్కువగా తినే వాళ్లకు మధుమేహం వస్తుందనేది అపోహ మాత్రమే! నిజానికి చక్కెర తినడం వల్ల మధుమేహుల్లో చక్కెర నియంత్రణలో ఉండదు. కుటుంబ చరిత్రలో మధుమేహం లేకపోయినా, చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు 30 నుంచి 40 శాతం మేరకే ఉంటాయి. ఇందుకు కారణం చక్కెర ద్వారా అధిక క్యాలరీలు శరీరంలోకి చేరుతూ శరీరం బరువు పెరిగి ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’కు గురి కావడమే! దీని వల్ల మధుమేహం సమస్య మొదలవుతుంది.

హార్మోన్లను ఇలా గాడిలో పెట్టాలి

హార్మోన్‌ సమస్యలు సంక్రమించడానికి కారణాలు 50ు జన్యుపరమైనవైతే 50ు జీవనశైలి సంబంధమైనవై ఉంటాయి. అయితే హార్మోన్లలో అవకతవకలు తలెత్తడానికి ఒత్తిడి ప్రధాన కారణం కాబట్టి ధ్యానం, యోగాలతో ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే శారీరకంగా చురుగ్గా ఉండాలి. వారంరో కనీసం ఐదు రోజుల పాటు రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి. ఇందుకోసం వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌, ఇష్టమైన ఆటలు ఆడడం లాంటి వాటిలో దేన్పైనా ఎంచుకోవచ్చు. తాజా కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకుంటూ ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి.

-డాక్టర్‌ సందీప్‌ ఘంటా,

సీనియర్‌ కన్సల్టెంట్‌ - ఇంటర్నల్‌ మెడిసిన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌,

స్టార్‌ హాస్పిటల్స్‌, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్‌.

Updated Date - 2023-06-13T12:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising