Gastroenterology: కడుపులో ఈ సమస్యలు తలెత్తినప్పుడు లైట్ తీసుకోవద్దు! వెంటనే ఈ పని చేయండి!
ABN, First Publish Date - 2023-07-04T11:38:48+05:30
కడుపులో మంట, పొట్ట ఉబ్బరం, నొప్పి, విరోచనాలు, వాంతులు... వీటిని మనం పెద్దగా పట్టించుకోం. ఇలాంటి చిన్న సమస్యలకు డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టడం అవసరమా? అనుకుంటాం. చేతికందిన టాబ్లెట్లు మింగేసి అప్పటికి ఊరుకుంటాం! కానీ ముంచుకొచ్చే ఆరోగ్య ముప్పుకు అవే సూచనలు కావచ్చు అంటున్నారు వైద్యులు.
కడుపులో మంట, పొట్ట ఉబ్బరం, నొప్పి, విరోచనాలు, వాంతులు... వీటిని మనం పెద్దగా పట్టించుకోం. ఇలాంటి చిన్న సమస్యలకు డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టడం అవసరమా? అనుకుంటాం. చేతికందిన టాబ్లెట్లు మింగేసి అప్పటికి ఊరుకుంటాం! కానీ ముంచుకొచ్చే ఆరోగ్య ముప్పుకు అవే సూచనలు కావచ్చు అంటున్నారు వైద్యులు.
ఆరోగ్యం విషయంలో చాలా మంది గోటితో పోయే సమస్యలను గొడ్డలి వరకూ తెచ్చుకుంటూ ఉంటారు. తట్టుకోలేనంత పరిస్థితికి చేరుకుంటే తప్ప, వైద్యులను కలవడానికి ఇష్టపడరు. పైగా పొట్ట, పేగులకు సంబంధించిన కొన్ని లక్షణాలను అజీర్తిగానో, చిన్నపాటి ఇన్‌ఫెక్షన్‌గా నిర్థారించేసుకుంటూ ఉంటారు. కానీ ఎసిడిటీ, వాంతులు, విరోచనాలు లాంటివి జీర్ణవ్యవస్థలో సమస్యలకు సంకేతాల్లాంటివి. ఇవి అదే పనిగా వేధిస్తుంటే, అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రతించాలి.
పొట్టలో పుండ్లు (గ్యాస్ట్రిక్ అల్సర్)
సమయానికి తినకపోవడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినడం, పెయిన్ కిల్లర్స్‌ను అదే పనిగా వాడడం... ఈ పనులన్నీ మనందరం చేసేవే! అయితే ఈ అలవాట్లు శృతి మించితే, పొట్టలో యాసిడ్ అవసరానికి మించి ఉత్పత్తై, జీర్ణకోశానికి పుండు పడుతుంది. నిజానికి ఈ యాసిడ్ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంతో జీర్ణకోశానికి హాని జరగకుండా ఒక మ్యూకోసల్ పొర ఏర్పాటు కూడా ఉంటుంది. అయినా మన అస్థవ్యస్త అలవాట్ల మూలంగా ఆ పొర కాలిపోయి, గ్యాస్ట్రిక్ అల్సర్ ఏర్పడుతుంది. అలాగే హెలికోబ్యాక్టర్ పైలోరై అనే బ్యాక్టీరియా పొట్టలోకి చేరిపోయి, అవసరానికి మించి యాసిడ్ ఉత్పత్తికి దోహదపడడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. దాంతో పొట్ట ఉబ్బరం, పొట్టలో మంట, ఛాతీలో మంట, కొద్దిపాటి ఆహారానికే పొట్ట నిండిపోయినట్టు అనిపించడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. అల్సర్ల నుంచి రక్తస్రావం జరగడం మూలంగా కొందరికి రక్తపు వాంతులు, నల్లని విరోచనాలు కూడా కావచ్చు. ఒకవేళ అల్సర్ లక్షణాలను అలాగే నిర్లక్ష్యం చేస్తే కొన్ని రకాల అల్సర్లు కేన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరిగినప్పుడు బరువు తగ్గిపోవడం, అన్నం తింటున్నప్పుడు అడ్డుపడడం, వాంతులు లాంటి లక్షణాలు మొదలవుతాయి. అల్సర్లు ఉన్న వాళ్లకు కేన్సర్ ముప్పు ఉంటుంది కాబట్టి, అల్సర్ లక్షణాలు రెండు నుంచి మూడు వారాల పాటు వేధించినా, బరువు తగ్గినా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.
రక్తపరీక్ష, ఎండోస్కోపీలతో గ్యాస్ట్రైటిస్, పేగు పూత, గడ్డలు, కేన్సర్, అల్సర్ల లాంటి వాటిని కనిపెట్టవచ్చు. అల్సర్ అయితే యాసిడ్ ఉత్పత్తిని తగ్గించే మందులు వాడుకుంటూ, సమయానికి తినడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను కొనసాగిస్తే అల్సర్లు అదుపులోకి వస్తాయి. అల్సర్లు ముదిరినప్పుడు బయాప్సీతో కేన్సర్‌ను నిర్థారించినప్పుడు, దశను బట్టి సరైన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు.
పేగుల్లో పూతలు (కొల్లైటిస్)
పెద్ద, చిన్న రెండు పేగుల్లో కూడా పూత రావచ్చు. ప్రాసె్‌సడ్ ఫుడ్ తినే అలవాటు పెరగడం వల్ల ఇటీవలి కాలంలో పేగు పూత కేసులు కూడా పెరుగుతున్నాయి. నీళ్ల విరోచనాలు, మలంలో రక్తం, పొట్ట నొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలతో ఈ సమస్య మొదలవుతుంది. సమస్య తీవ్రమైతే పేగులో అడ్డంకి ఏర్పడి వాంతులు అవుతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రాసె్‌సడ్ ఫుడ్ తగ్గించి సేంద్రీయ ఆహారం తినాలి. పసుపు, వెల్లుల్లి వాడకం ద్వారా పేగు పూతను నియంత్రించుకోవచ్చు. ప్రాసె్‌సడ్ ఫుడ్ తినే అలవాటు పెరగడం, పసుపు, వెల్లుల్లి వాడకం తగ్గడం వల్ల పేగు పూత పెరుగుతోంది. మధుమేహంలాగే ఈ సమస్యకు కూడా జీవితాంతం వేధిస్తుంది. కాబట్టి పేగు పూత రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత నియంత్రించుకోవాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పేగులో రంథ్రం ఏర్పడి, విషపూరితమై ప్రాణాంతకంగా మారవచ్చు. అలాగే పేగు పూతను చికిత్సతో సరిదిద్దుకోకపోతే, 20 నుంచి 30 ఏళ్లకు అది కేన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ చిన్న పేగులో రంథ్రం ఏర్పడితే ఆ పేగు, వేర్వేరు అవయవాలతో కలిసిపోతుంది. చిన్న పేగు, మూత్రాశయం, మూత్రపిండాలకు జాయిన్ అవడం వల్ల, మూత్రంలో మలం రావడం, మహిళల్లో గర్భాశయానికి కనెక్ట్ అయిపోవడం వల్ల యోని నుంచి మలం రావడం లాంటివి జరుగుతాయి. అలాగే మలద్వారం చుట్టూ ఫిస్టులాలు కూడా ఏర్పడతాయి. పేగు పూత సమస్య టీనేజీ నుంచి 30 ఏళ్లలోపు వాళ్లలో ఎక్కువ.
రక్తపరీక్ష, మల పరీక్ష, కొలనోస్కోపీల ద్వారా పేగు పూత ఉన్న ప్రదేశం, తీవ్రతల ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్థారిస్తారు. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, సర్జరీలను ఎంచుకుంటారు. పేగులో రంధ్రం ఏర్పడే వరకూ ఆగకుండా లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను కలవడం అవసరం.
పెద్ద పేగుల్లో కేన్సర్
పెద్ద పేగుల్లో ఉండే బుడిపెల్లాంటి పాలిప్స్ అనే నిర్మాణాలు 20 ఏళ్ల కాలానికి కేన్సర్‌గా మారే అవకాశాలుంటాయి. కాబట్టి వాటిని పాలిప్ దశలోనే తొలగించుకుంటే, కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి 45 ఏళ్లు దాటిన వాళ్లు కొలనోస్కోపీ ద్వారా పాలి్‌ప్సను గుర్తించి, తొలగించుకోవడం అవసరం. మన దేశంలో పెద్ద పేగు కేన్సర్ పెరగడానికి ప్రధాన కారణం పాశ్చాత్య ఆహారం. విరోచనం వదులుగా అవుతూ ఉండడం, లేదా మలవిసర్జన క్రమం తప్పడం, అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకోవడం (చేంజ్ ఇన్ బోవెల్ హ్యాబిట్), మలంలో రక్తం, మలద్వారం దగ్గర అసౌకర్యం, మోషన్ వచ్చినట్టు ఉండి, వెళ్లినప్పుడు రాకపోవడం లాంటి లక్షణాలు నెల రోజులకు మించి కొనసాగినా, అకారణంగా బరువు తగ్గినా, రక్తహీనత తలెత్తినా వైద్యులను కలవాలి.
కేన్సర్ అని తేలితే దాని దశ, ప్రదేశం, తీవ్రత, వ్యాప్తిలను బట్టి వైద్యులు చికిత్సను ఎంచుకుంటారు. కేన్సర్ పేగుకే పరిమితమైతే, ఎండోస్కోపీ ద్వారానే కత్తిరించి, తొలగించవచ్చు. కొన్నిసార్లు సర్జరీ అవసరం అవుతుంది. పేగు నుంచి కేన్సర్ కాలేయానికి పాకితే, మొదట కీమో, రేడియో థెరపీలతో కేన్సర్‌ను కుంచించుకుపోయేలా చేసి, తర్వాత సర్జరీ చేయవలసి ఉంటుంది.
క్లోమంలో కలహం
ఆహార అరుగుదలకు అవసరమైన ఎంజైమ్స్‌ను అందించడమే క్లోమం పని. రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్‌ను కూడా క్లోమమే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎప్పుడైతే క్లోమం సమస్యకు గురవుతుందో అప్పుడు ఎంజైమ్‌లు, హార్మోన్లు విడుదల కావు. దాంతో మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మద్యం, ధూమపానం క్లోమానికి ప్రధాన శత్రువులు. అవసరానికి మించి కొవ్వుతో కూడిన ఆహారం తినడం కూడా ప్రమాదకరమే! అలాగే పిత్తాశయంలోని రాళ్లు జారి బైల్ పైపులో పడినా క్లోమ సమస్య తలెత్తవచ్చు. ఈ సమస్య హఠాత్తుగా తలెత్తవచ్చు. లేదా క్రమేపీ తీవ్రం కావచ్చు. ఇలాంటి క్రానిక్ పాంక్రియటైటి్‌సలో నీళ్ల విరోచనాలు, జిగట మలం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు చికిత్సలో భాగంగా పాంక్రియాటిక్ ఎంజైమ్‌లను అదనంగా తీసుకుంటూ, చక్కెరను అదుపులో ఉంచుకోవాలి. అలాగే మద్యపానం, ధూమపానం మానేయాలి. ఆహారం తిన్నప్పుడు, దాన్ని అరిగించడం కోసం క్లోమం నుంచి ఎంజైమ్స్ విడుదలై, యాక్టివ్‌గా మారతాయి. అయితే క్లోమంలో సమస్య పెరిగి, ఎంజైమ్స్ పైపు నుంచి తన్నుకొచ్చినప్పుడు, క్లోమం కాలిపోతుంది. దాన్నుంచి విడుదలయ్యే విషాలన్నీ రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరి వాటిని దెబ్బతీస్తాయి.కాబట్టి మద్యపానం, ధూమపానాలు మానేయాలి. పొట్ట పైభాగంలో నొప్పి రావడం, ఆ నొప్పి వెన్నుకు పాకడం, వాంతులవడం లాంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.
యాంటాసిడ్లు వాడితే?
యాంటాసిడ్ల వాడకంతో సమస్యను తగ్గిస్తున్నాం తప్ప దాన్ని తొలగించడం లేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ మందులు దీర్ఘకాలం వాడితే వాటి దుష్ప్రభావాలకు లోను కావలసి ఉంటుంది. ఒమిప్రజోల్ అనే యాంటాసిడ్ వాడకం వల్ల దీర్ఘకాలంలో ఎముకలు అరిగిపోవడం, ఆస్టియొపొరోసిస్ (ఎముకలు గుల్లబారడం), మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తడం, చిన్న వయసులోనే మతిమరుపు లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మరీ ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వాళ్లలో ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం, కొద్ది ఆహారానికే పొట్ట నిండిపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు రెండు నుంచి మూడు వారాల పాటు కొనసాగితే యాంటాసిడ్లు వాడుకుంటూ ఉండిపోకుండా, వైద్యులను కలవాలి.
పొట్ట పదిలంగా ఉండాలంటే...
ఆరోగ్యకరమైన ఆహారం తినాలి
ఆహార వేళలు పాటించాలి
ప్రాసెస్ చేసిన, కొవ్వుతో కూడిన పదార్థాలను పరిమితంగా తినాలి
సేంద్రీయ ఆహారం ఎంచుకోవాలి
మద్యపానం, ధూమపానం మానేయాలి
బయట తినడం మానేసి, ఇంటి భోజనానికి పరిమితం కావాలి.
-డాక్టర్ నవీన్ పోలవరపు
సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్,
అడ్వాన్స్‌డ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ అండ్ ఎండోసోనాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్.
Updated Date - 2023-07-04T11:38:48+05:30 IST