ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fever: బెంబేలెత్తిస్తున్న కొత్త రకం జ్వరం.. అజాగ్రత్తగా ఉంటే..!

ABN, First Publish Date - 2023-10-17T11:34:34+05:30

అన్ని జ్వరాలూ ఒకటి కావు. వైర్‌సలు కొత్త రూపంలో విజృంభిస్తున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆలస్యం చేయకుండా వైద్యులను కలవడం అవసరం. జలుబుతో మొదలై దగ్గుగా మారి జ్వరం కూడా

అన్ని జ్వరాలూ ఒకటి కావు. వైర్‌సలు కొత్త రూపంలో విజృంభిస్తున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆలస్యం చేయకుండా వైద్యులను కలవడం అవసరం. జలుబుతో మొదలై దగ్గుగా మారి జ్వరం కూడా వేధిస్తోందంటే అది కచ్చితంగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కావచ్చు. ఈ లక్షణాలను డెంగ్యూ, మలేరియా, ఫ్లూ... వీటిలో ఏదో ఒక దానికి ఆపాదించుకోవడం పొరపాటు. తాజాగా కొత్త వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విజృంభిస్తున్నాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలిసి సరైన చికిత్స తీసకోవాలి. అజిత్రోమైసిన్‌ కొనేసి, వాడేసి, జ్వరం తగ్గలేదంటూ వైద్యులను కలిసే వాళ్లూ ఉన్నారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ పని చేయవనే విషయం కూడా తెలియని మనం సొంత వైద్యాన్ని నమ్ముకోవడం ఎంత వరకూ సమంజసం?

లక్షణాలు భిన్నం

జ్వరంలో కనిపించే లక్షణాలు సోకిన ఇన్‌ఫెక్షన్‌ను బట్టి భిన్నంగా ఉంటూ ఉంటాయి. అయితే కొందర్లో జ్వరం రకాన్ని సూటిగా నిర్థారించలేని పరిస్థితీ ఉంటుంది. కొంతమందిలో జ్వరంతో పాటు దద్దుర్లు, ఇంకొందర్లో జ్వరంతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి, మరికొందర్లో జ్వరంతో పాటు పలుచని విరోచనాలు, వాంతులు ఉంటాయి. కొందర్లో తలనొప్పి, కామెర్లు కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలను బట్టి కొంత వరకూ జ్వరం రకాన్ని గ్రహించే వీలున్నా, పూర్తి నిర్థారణ కోసం వైద్యులు కొన్ని పరీక్షలను సూచిస్తారు.

ఇన్‌ఫ్లూయెంజా: 100 - అంతకంటే తక్కువ డిగ్రీల టెంపరేచర్‌ (లో గ్రేడ్‌) జ్వరంతో పాటు ముక్కు కారడం, గొంతునొప్పి, దగ్గు

డెంగూ: 100 - 103 డిగ్రీల టెంపరేచర్‌ (హై గ్రేడ్‌) జ్వరంతో పాటు తలనొప్పి, వాంతి వస్తున్నట్టు అనిపించడం, డీహైడ్రేషన్‌, ఒళ్లునొప్పులు

మలేరియా: జ్వరాన్ని మించి చలి ఎక్కువ ఉండడం, జ్వరం తగ్గుతూ, పెరుగుతూ ఉండడం కనిపిస్తుంది.

డెంగ్యూతో డంగైపోకుండా...

తీవ్ర లక్షణాలు లేని జ్వరాలకు సింప్టమాటిక్‌ చికిత్స సరిపోతుంది. శరీరంలో ద్రవ పరిమాణం తగ్గకుండా చూసుకోవడంతో పాటు, విశ్రాంతి తీసుకుంటే జ్వరం అదుపులోకి వస్తుంది. రెండు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గనప్పుడు మాత్రమే పరీక్షా ఫలితాలను బట్టి మలేరియా, డెంగ్యూలకు సంబంధించిన చికిత్స మొదలుపెట్టవలసి ఉంటుంది. డెంగ్యూలో సైతం ప్రారంభంలో హైడ్రేషన్‌తోనే జ్వరాన్ని అదుపు చేయగలిగే చికిత్సనే వైద్యులు సూచిస్తారు. జ్వరం తగ్గకపోగా దద్దుర్లు, రక్తస్రావం కనిపిస్తే, రక్తపరీక్షతో ప్లేట్‌లెట్ల మీద ఓ కన్నేసి ఉంచి, అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌ అందించవలసి ఉంటుంది. డెంగ్యూలో విపరీతమైన జ్వరంతోపాటు కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. కొందరిలో రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య త్వరితంగా పడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు విరేచనం, మూత్రంలో రక్తం కనిపిస్తుంది. ముక్కు నుంచి, లేదా దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతుంది. కొందర్లో పొట్టలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇది అంతర్గత రక్తస్రావానికి సూచన. తలనొప్పితోపాటు శరీరంలో ఒక వైపు పక్షవాతం లక్షణాలు కనిపిస్తే మెదడులో రక్తస్రావానికి సూచనగా భావించాలి. అత్యవసర వైద్య సహాయం అవసరమైన అత్యంత తీవ్రమైన పరిస్థితి ఇది. డెంగ్యూను కలుగజేసే దోమలు పగటివేళ కుడతాయి. కాబట్టి ఈ కాలంలో ఇంటి వాకిలి, కిటికీలకు దోమలు చొరబడకుండా మెష్‌లు బిగించుకోవాలి.

మలేరియా మత్తులో...

విపరీతమైన జ్వరంతోపాటు మత్తు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, చూపులో తేడా ఉండడం, పలకరిస్తే స్పందించకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకరోజు శరీర ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా పెరిగిపోయి, మరుసటి రోజు తగ్గిపోవడం... మళ్లీ పెరిగిపోవడం.... ఇలా జ్వరంలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటే దాన్ని మలేరియా జ్వరంగా భావించాలి. మలేరియా ఫాల్సిఫారం లేదా వైవాక్స్‌ అనే రెండు రకాల జ్వరాలుంటాయి. వీటిలో ఫాల్సిఫారం తాలూకు మలేరియా మెదడుకు కూడా పాకి ‘సెరెబ్రల్‌ మలేరియా’నూ కలిగిస్తుంది.

పరిసరాల పరిశుభ్రతే కీలకం

వర్షాకాలంలో దోమలు, ఈగలు, ఎలుకలు, పురుగులు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా దోమలు పెరిగే వీలు లేకుండా నీరు నిల్వ ఉండిపోయే వీలున్న ప్రదేశాలను వెతకాలి. కొబ్బరి చిప్పలు, టైర్లు లాంటి వాన నీళ్లు నిల్వ ఉండిపోయే వస్తువులను పరిసరాల్లో లేకుండా చేసుకోవాలి. అలాగే తేమ, పాచి పేరుకోకుండా చూసుకోవాలి. అలాగే దోమలు కుట్టే వీలు లేకుండా దోమ తెరలు వాడడం, ఒళ్లు మొత్తాన్నీ కప్పి ఉంచే దుస్తులు ధరించడం చేయాలి. ఆహారపదార్థాల మీద తప్పనిసరిగా మూతలు ఉంచాలి. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి.

ఇలాంటి ఆహారం మేలు

తాజా పదార్థాలే ఈ కాలంలో తీసుకోవాలి. చల్లారిపోయిన పదార్థాలు, గడ్డకట్టిన పదార్థాలు తీసుకోవద్దు. ఈ కాలం ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. హోటల్‌ భోజనాలు, బండ్ల మీద దొరికే చిరుతిళ్లు మానేయాలి. ఎక్కువగా నీరు కలిగి ఉండే పళ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పళ్లు, కూరగాయల ద్వారా కూడా ఈ కాలంలో వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరే అవకాశాలు ఎక్కువ కాబట్టి, పళ్లు, కూరగాయలను ఎక్కువ నీళ్లతో శుభ్రం చేసిన తర్వాతే వాడుకోవాలి. అలాగే జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ ద్రవపదార్థాలతో పాటు తేలికగా అరిగే సూప్స్‌, జావ, పళ్లరసాలు తీసుకోవాలి. నిమ్మజాతి పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ క్యాలరీలు, చక్కెరలు ఉన్న పదార్థాలు తగ్గించాలి.

సొంత వైద్యం కొంత మానుకుని...

జ్వరం వచ్చిన వెంటనే కొందరు మందుల షాపుకు వెళ్లి, జ్వరాన్ని తగ్గించే మందులతో పాటు యాంటీబయాటిక్స్‌ కొని, వాడేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సొంత వైద్యం వల్ల వైద్యులు సూచించే రక్తపరీక్షల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వ్యాధినిర్థారణ క్లిష్టమె, వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ను ఊహించి యాంటీబయాటిక్స్‌ సూచించే పరిస్థితి వస్తుంది. ఫలితంగా చికిత్స ఆలస్యమవడంతో పాటు, ఫలితం చూపించని పరిస్థితీ ఉండే వీలుంటుంది. కాబట్టి సొంత వైద్యం మానుకోవడమే మేలు. అలాగని జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలనే నియమం కూడా లేదు. పారాసిటమాల్‌ మాత్రలు ఒకటి, రెండు రోజులు వాడుకుంటూ, శరీరంలో నీరు తగ్గకుండా చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే జ్వరం కచ్చితంగా అదుపులోకి వస్తుంది. అలా కాకుండా జ్వరం తీవ్రమవుతూ, ఇతరత్రా లక్షణాలు కూడా మొదలైనప్పుడు మాత్రమే వైద్య చికిత్సను ఆశ్రయించాలి. అలాగే జ్వరం కనిపించినప్పుడు తమని తాము ఐసొలైట్‌ చేసుకుని లక్షణాల తీవ్రతను బట్టి వైద్యులను కలవాలి.

చికిత్స జ్వరాన్ని బట్టి

డెంగ్యూ జ్వరానికి సపోర్టివ్‌ ట్రీట్మెంట్‌ అవసరం. ఈ జ్వర చికిత్సలో యాంటీ వైరల్‌ మందులు వాడవలసిన అవసరం ఉండదు. నీరసం ఉంటే సెలైన్‌ ఇస్తూ, జ్వరం తగ్గడానికి పారాసిటమాల్‌ ఇస్తూ వైద్యులు పరిస్థితిని అదుపులో తీసుకొస్తారు. నీరసం తగ్గించడానికి మల్టీవిటమిన్‌ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వవలసి రావచ్చు. ఈ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలంటే పోషకాహారంతోపాటు ఎక్కువగా నీళ్లు, పళ్లరసాలు తీసుకోవాలి. తగినంత ద్రవాహారం తీసుకోకపోతే చికిత్స తదనంతరం శరీరంలో మిగిలి ఉండే వైరస్‌ క్రమేపీ ప్లేట్‌లెట్లను నాశనం చేస్తుంది. ఫలితంగా తిరిగి నీరసం పెరుగుతుంది.

మలేరియా జ్వరం ఉన్నా మాత్రలు మింగే స్థితిలో ఉంటే నోటి మాత్రలతోనే మలేరియా జ్వరాన్ని అదుపు చేయవచ్చు. అలాకాకుండా ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యే పరిస్థితి ఉంటే ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. మలేరియా వైవాక్స్‌ వైరస్‌ భిన్నంగా ప్రవర్తిస్తుంది. చికిత్సతో వ్యాధి తగ్గినా, వైవాక్స్‌ వైరస్‌ కాలేయంలో ఉండిపోయి, కొంతకాలం తర్వాత వ్యాధి తిరగబెడుతుంది. కాబట్టి మలేరియా వైవాక్స్‌కు అదనపు మందులు అవసరమవుతాయి.

టైఫాయిడ్‌లో లక్షణాలను అదుపుచేసే సింప్టమాటిక్‌ ట్రీట్మెంట్‌తోపాటు, జ్వరం తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్‌ మందులు కూడా అవసరమవుతాయి.

జ్వరం మాత్రలు వాడవచ్చా?

ఒక రోజులో మన శరీర ఉష్ణోగ్రతలో ఒక డిగ్రీ వ్యత్యాసం వస్తూ ఉంటుంది. ఉదయం 98.5 డిగ్రీలు ఉంటే సాయంత్రం 99.5 డిగ్రీలు ఉంటుంది. ప్రతి ఒక్కర్లో ఇది సహజం. కాబట్టి బాడీ టెంపరేచర్‌ 99.5 డిగ్రీలకు మించితేనే జ్వరంగా భావించాలి. జ్వరం తీవ్రత 101 డిగ్రీలు దాటితేనే జ్వరం మాత్రలు వాడాలి. ఒకవేళ అంతకంటే తక్కువ టెంపరేచర్‌ ఉండి, ఒళ్లు నొప్పులు కూడా ఉంటే, పారాసెటమాల్‌తోపాటు ఒళ్లు నొప్పులు తగ్గించే మాత్ర వేసుకోవచ్చు. అయితే 101 డిగ్రీల కంటే తక్కువ జ్వరం మాత్రమే ఉంటే, మందులు వాడవలసిన అవసరం లేదు. ఒకవేళ జ్వరం 101 డిగ్రీలకు చేరుకుంటే పారాసెటమాల్‌ మాత్రలు వాడవచ్చు. అయితే రోజు మొత్తంలో వాడదగిన పారాసెటమాల్‌ పరిమాణం 4 గ్రాములు. అయితే మద్యం అలవాటు, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు, డ్రగ్స్‌ కారణంగా కాలేయం పాడయినవాళ్లు రోజుకి కేవలం 2 గ్రాముల పారాసెటమాల్‌ మోతాదుకే పరిమితమవ్వాలి. అంటే రోజుకు మూడుసార్లు పారాసెటమాల్‌ 600 మిల్లీగ్రాముల మాత్రలు వాడవచ్చు. అయితే రెండు రోజులకు మించి మందులకు అదుపు కాకుండా జ్వరం, ఇతరత్రా లక్షణాలు వేధిస్తే, ఆలస్యం చేయకుండా డాక్టరు కలవాలి.

ఇది కొత్త వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌

మొదటి రోజు నుంచే గొంతు నొప్పి, దగ్గు, రెండో రోజు నుంచి తెమడ కనిపించడం, జలుబు, ఒళ్లునొప్పులు లాంటి ఫ్లూ లక్షణాలతో కూడిన కొత్త వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఇటీవలి కాలంలో ప్రబలంగా ఉంది. కొంతమందిలో డెంగ్యూలో మాదిరిగా ప్లేట్‌లెట్లు కూడా పడిపోతూ ఉంటాయి. కొంతమందిలో జ్వరంతో పాటు కామెర్లు, జ్వరంతో పాటు న్యుమోనియా కూడా ఉండవచ్చు. అయితే ఈ ఇన్‌ఫెక్షన్‌ను వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్సతో సరిదిద్దుకోవచ్చు. అయితే డెంగ్యూ, మలేరియా కాకుండా ఇది కొత్త రకం వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అని ఎవరికి వారు కనిపెట్టాలంటే కొన్ని లక్షణాలను గమనించుకోవాలి. అవేంటంటే...

  • రెండు రోజులు జలుబు ఉండి, తెమడ పడుతున్నా

  • సాధారణ మందులతో దగ్గు, జలుబు తగ్గకపోయినా

  • దగ్గు క్రమేపీ పెరుగుతున్నా

  • మందులతో జ్వరం తగ్గకపోయినా

  • పిల్లలు, గర్భిణులు, పెద్దలు లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. కొత్త రకం వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అని పరీక్షలతో నిర్థారించుకుని, వైరల్‌తో పాటు సెకండరీ బ్యాక్టీరియాల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందో, లేదో వైద్యులు తెలుసుకుంటారు. వైరల్‌ అయితే యాంటీ వైరల్‌ మందులతో సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ అని తేలితే, యాంటీబయాటిక్స్‌ కూడా మొదలు పెట్టవలసి ఉంటుంది. అయితే కొమార్బిడ్‌ కోవకు చెందిన వాళ్లకు లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వకుండా నేరుగా యాంటీవైరల్‌ డ్రగ్స్‌తోనే చికిత్స చేయవలసి ఉంటుంది.

-డాక్టర్‌ ఎన్‌.ఆర్‌. అనిల్‌

సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌,

ఎస్‌.ఎల్‌.జి హాస్పిటల్‌,

బాచుపల్లి, హైదరాబాద్‌.

Updated Date - 2023-10-17T11:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising