Headache: పదే పదే తలనొప్పి వస్తోందా? అయితే వెంటనే..!
ABN, First Publish Date - 2023-09-12T10:19:45+05:30
చిన్నా చితకా తలనొప్పులు వచ్చిపోతూ ఉంటాయి. కానీ ఒక తలనొప్పి ఒకసారి వచ్చిందంటే, రోజుల తరబడి వేధిస్తుంది. అలా పదే పదే జీవితంలో కొన్ని రోజులను స్వాహా చేసేస్తూ ఉంటుంది. అదే మైగ్రెయిన్ తలనొప్పి. ఈ పార్శ్వ నొప్పిని వదిలించుకోవాలంటే, తగిన చికిత్సను అనుసరించాలి అంటున్నారు వైద్యులు.
చిన్నా చితకా తలనొప్పులు వచ్చిపోతూ ఉంటాయి. కానీ ఒక తలనొప్పి ఒకసారి వచ్చిందంటే, రోజుల తరబడి వేధిస్తుంది. అలా పదే పదే జీవితంలో కొన్ని రోజులను స్వాహా చేసేస్తూ ఉంటుంది. అదే మైగ్రెయిన్ తలనొప్పి. ఈ పార్శ్వ నొప్పిని వదిలించుకోవాలంటే, తగిన చికిత్సను అనుసరించాలి అంటున్నారు వైద్యులు.
ఇదేమీ అరుదైన తలనొప్పి కాదు. వందలో ఇరవై నుంచి ముప్పై మంది మహిళలు పార్శ్వ నొప్పికి గురవుతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఉండడానికి కారణం హర్మోన్ల అసమతౌల్యం అని చెప్పుకోవచ్చు. ఈ తలనొప్పి లక్షణాలు కూడా భిన్నంగానే ఉంటాయి. నాలుగు దశల మైగ్రెయిన్‌లో లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే కొన్ని సూచనల ద్వారా మున్ముందు రాబోయే మైగ్రెయిన్ తలనొప్పిని పసిగట్టవచ్చు. ప్రత్యేకించి మైగ్రెయిన్ లక్షణాల గురించి చెప్పుకోవాలంటే, సుత్తితో మోదినట్టు తలకు ఒక పక్కన భరించలేని నొప్పి, వాంతి అవుతున్న భావన, వాంతి అయిపోయి నొప్పి తగ్గిపోవడం, వెలుతురు చూడలేకపోవడం, శబ్దాలను భరించలేకపోవడం లాంటి ప్రధాన లక్షణాలుంటాయి. వీటితో పాటు చీకాకు, పనులు చేసుకోలేకపోవడం లాంటివీ ఉంటాయి. మైగ్రెయిన్ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది క్రానిక్‌గా మారి నెలలో 15 సార్లు అటాక్ గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మైగ్రెయిన్ ఉన్న వాళ్లు అదే పనిగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ పోతే, నొప్పి తగ్గకపోగా పెరిగిపోతూ మెడికేషన్ ఓవర్‌యూజ్ హెడ్‌ఏక్ వస్తుంది. అలాగే ఆరా దశ దీర్ఘ కాలంపాటు కొనసాగితే, మెదడులో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ కూడా రావచ్చు. అరుదుగా కొందరిలో మైగ్రెయిన్ మూర్ఛలను ప్రేరేపిస్తాయి.. ఫిట్స్ వచ్చే అవకాశాలున్న వాళ్లు ఈ సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రతించి, సరైన చికిత్స తీసుకోవాలి.
నాలుగు దశల్లో...
మైగ్రెయిన్‌లో ప్రొడ్రోమ్, ఆరా, అటాక్, పోస్ట్ డ్రోమ్ అనే నాలుగు దశలుంటాయి. మొదటి దశ గంట నుంచి రోజంతా కొనసాగవచ్చు. ఈ దశలో చీకాకు, క్రేవింగ్స్ (కొన్ని పదార్థాలను తినాలనిపించడం), అలసట, నిద్ర లేకపోవడం, తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, వెలుగు, శబ్దాలను భరించలేకపోవడం లాంటి లక్షణాలుంటాయి. వీటిని బట్టి ఈ నొప్పి సమస్య ఉన్న వాళ్లు ముందుగానే మైగ్రెయిన్ రాబోతున్నట్టు గ్రహించేస్తారు. రెండో దశ ఆరా అందర్లో రాదు. కళ్లలో ఫ్లాష్ లైట్ వేసినట్టు, కళ్లకు రంగులు కనిపించడం, నలుపు తెలుపు ఆకృతులు కనిపించడం లేదా దేన్ని చూసినా, దాన్లో నల్లని మచ్చ కనిపించడం లాంటి ఆరా దశ 5 నిమిషాల నుంచి గంట పాటు ఉంటుంది. తర్వాత ఆరా తగ్గిపోయి, తలనొప్పి మొదలవుతుంది. ఇది విజువల్ ఆరా. రెండో రకమైన సెన్సరీ ఆరాలో ఒక వైపు శరీరం తిమ్మిరి పట్టడం, చెవిలో శబ్దాలు వినిపించడం, వాసనలో మార్పులు ఉంటుంది. దీని తర్వాత దశ అటాక్. ఈ దశలో భరించలేని తలనొప్పి మొదలైపోతుంది. ఈ నొప్పి సాధారణంగా నాలుగు గంటల నుంచి 72 గంటల వరకూ కొనసాగవచ్చు. ఈ దశలో సుత్తితో మోదినట్టు తలకు ఒక పక్కన నొప్పి వేధిస్తుంది. వెలుగు, శబ్దాలను భరించలేకపోవడం, వాంతి వస్తున్నట్టు అనిపించడం, వాంతి అయిపోవడం, పనులు చేసుకోలేకపోవడం, తలనొప్పి బాధించే ప్రదేశం సున్నితంగా మారడం లాంటివి ఉంటాయి. చివరి దశ పోస్ట్ డ్రోమ్. దీన్ని మైగ్రెయిన్ హ్యాంగోవర్ అని కూడా అంటారు. ఈ దశ ఒకట్రెండు రోజులు ఉండవచ్చు. ఏకాగ్రతలో ఇబ్బందులు, డిప్రెషన్, అలసట లాంటివి ఉంటాయి.
ఎన్ని ఎపిసోడ్స్?
మైగ్రెయిన్ సమస్య ఉన్నవాళ్లు ఎవరికి వారు ఆ నొప్పి నెలలో ఎన్నిసార్లు వస్తోందో గమనించుకోవాలి. కొంతమందికి ఒకటి నుంచి మూడు సార్లు రావచ్చు. ఇంకొందరికి 5 నుంచి 7 సార్లు రావచ్చు. అరుదుగా కొందరికి 8 నుంచి పది సార్లు రావచ్చు. నొప్పి వచ్చిన ప్రతిసారీ మైగ్రెయిన్ నాలుగు దశలతో, మూడు రోజుల సమయం వృథా అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఏ పనీ చేసుకోలేకపోతూ ఉంటారు. ఇలా నెలలో 7 సార్లు మైగ్రెయిన్ వస్తే, వాళ్ల 20 రోజుల సమయం ఆ నొప్పితో వృథా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ నొప్పిని ట్రిగ్గర్ చేసే అంశాలను ఎవరికి వారు గ్రహించుకుని, వాటికి దూరంగా ఉంటే, మైగ్రెయిన్ ఎపిసోడ్లు తగ్గిపోయి, నొప్పికి అడ్డుకట్ట పడడంతో పాటు సమయాన్ని నష్టపోకుండా కాపాడుకోవచ్చు.
నియంత్రణ మన చేతుల్లోనే...
మైగ్రెయిన్‌ను ప్రేరేపించే ట్రిగ్గర్స్ కొన్ని ఉంటాయి. వీటిని ఎవరికి వాళ్లు గమనించుకోవాలి. కొంమందికి స్వీట్స్ తిన్నప్పుడు, ఇంకొందరికి ఎండలో తిరిగినప్పుడు, మరి కొందరికి ప్రయాణించినప్పుడు, అలాగే నిద్ర తగ్గినా, సమయానికి భోజనం చేయకపోయనా, డీహైడ్రేషన్‌కు లోనైనా, ఘాటు వాసనలు పీల్చినా, ఒత్తిడికి లోనైనా మైగ్రెయిన్ ట్రిగ్గర్ అవుతుంది. వీటిని ఎవరికి వారు గమనించుకుని, జాగ్రత్తగా మసలుకుంటే చాలా వరకూ మైగ్రెయిన్ తలనొప్పి నుంచి తప్పించుకోవచ్చు.
చికిత్స ఇలా...
అక్యూట్, ప్రివెంటివ్.. ఇలా రెండు రకాల చికిత్సలుంటాయి. నెల మొత్తంలో ఒకట్రెండు మైగ్రెయిన్ అటాక్స్ వచ్చే వాళ్లకు ఈ చికిత్స సూటవుతుంది. అక్యూట్ చికిత్సలో అటాక్ వచ్చినప్పుడు, నొప్పి తగ్గడానికి మందులు వేసుకోవలసి ఉంటుంది. ప్రివెంటివ్ చికిత్సలో రాబోయే అటాక్‌ను అక్కడికక్కడే ఆపేసి, పురోగతి చెందకుండా అడ్డుకట్ట వేసే మందులుంటాయి. లక్షణాలు మొదలైన వెంటనే మైగ్రెయిన్ పోటు రాక ముందే మందులు వేసేసుకుంటే, సమస్య అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా ‘నొప్పి వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే!’ అని మైగ్రెయిన్ మొదలైన తర్వాత ఈ మందులు వేసుకుంటే ఫలితం ఉండదు. కాబట్టి ప్రివెంటివ్ చికిత్సలో నొప్పి మొదలయ్యే ముందే వైద్యులు సూచించిన పెయిన్ క్లిలర్స్, లేదా పెయిన్ మాడిఫయర్స్ వేసేసుకోవాలి. నెల మొత్తంలో 4 అంతకు మించి ఎక్కువ ఎపిసోడ్స్‌తో బాధపడేవాళ్లు ప్రతి రోజూ టాబ్లెట్ వేసుకోవలసిన అవసరం ఉంటుంది. ఇలా కనీసం మూడు నుంచి 6 నెలల పాటు ఈ చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఎక్కువ ఎపిసోడ్స్‌తో బాధపడేవాళ్లకు ఆ ఎపిసోడ్స్ సంఖ్యను సాధ్యమైనంత తగ్గించడమే ఈ ప్రివెంటివ్ చికిత్స ఉద్దేశం. ఈ చికిత్సతో తలనొప్పి లేని రోజులు పెరుగుతాయి. జీవన నాణ్యత, ఉత్పాదకత మెరుగవుతుంది. తర్వాత 6 నెలల నుంచి ఏడాది పాటు తలనొప్పి రాకుండా ఉంటుంది.
ఇలా అడ్డుకట్ట...
మైగ్రెయిన్ జీవనశైలి సమస్య. దానికి తగ్గట్టు జీవనశైలిని మార్చుకుంటే సగం సమస్య తొలగిపోతుంది. అలాగే మైగ్రెయిన్ తలనొప్పి అని నిర్థారణ అయితే, ఆ నొప్పిని ట్రిగ్గర్ చేసే పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి. అందుకోసం...
సమయానికి తినాలి
సరిపడా నీళ్లు తాగాలి
ఎండలోకి వెళ్తే కూలింగ్ గ్లాసెస్, క్యాప్, గొడుగు వాడడం
ఒత్తిడికి దూరంగా ఉండాలి
ఘాటు వాసనలకు దూరంగా ఉండాలి
స్వీట్స్ మానుకోవడం
కంటి నిండా నిద్ర పోవాలి
పాజిటివ్ హార్మోన్స్ విడుదలయ్యేలా చేసే యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయాలి
డిప్రెషన్, ఆందోళనలను తగ్గించుకోవాలి
రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వారంలో ఐదు రోజులు వాకింగ్ చేయాలి.
శాశ్వత చికిత్స లేదు
సాధారణంగా ఒకటి నుంచి రెండు గంటల పాటు వేధించే తలనొప్పిని మైగ్రెయిన్ తలనొప్పిగా పరిగణించకూడదు. 4 నుంచి 72 గంటల పాటు వేధించినప్పుడే ఈ నొప్పిని మైగ్రెయిన్‌గా పరిగణించాలి. ఈ సమస్యకు నియంత్రిత చికిత్స మాత్రమే అందుబాటులో ఉంది. శాశ్వత చికిత్స లేదు. కాబట్టి ఈ సమస్యను శాశ్వతంగా సరిదిద్దుతాయని చెప్పుకునే వైద్య చికిత్సలను నమ్మకూడదు. అయితే 50 నుంచి 55 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత ఈ సమస్య క్రమేపీ తగ్గుముఖం పడుతుంది.
డాక్టర్ ఆనంద్ కరణం,
కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్,
మెడికేన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
మియాపూర్, హైదరాబాద్.
Updated Date - 2023-09-12T10:19:45+05:30 IST