Epilepsy: మూర్ఛను సమర్థవంతంగా లొంగదీయొచ్చు..! ఎలాగంటే..!
ABN, First Publish Date - 2023-05-30T11:36:47+05:30
మూర్ఛ వ్యాధి అనగానే కంగారు పడిపోతాం! ఈ వ్యాధి పట్ల నెలకొని ఉన్న అపోహలు, అవగాహనా లోపాలే ఈ వ్యాధి పట్ల అనవసరపు భయాలకు ప్రధాన కారణం. నిజానికి ఈ వ్యాధి...
మూర్ఛ వ్యాధి (Epilepsy) అనగానే కంగారు పడిపోతాం! ఈ వ్యాధి పట్ల నెలకొని ఉన్న అపోహలు, అవగాహనా లోపాలే ఈ వ్యాధి పట్ల అనవసరపు భయాలకు ప్రధాన కారణం. నిజానికి ఈ వ్యాధి... మధుమేహం, అధిక రక్తపోటుల్లా శరీరంలోని మరే ఇతర అవయవానికీ హాని తలపెట్టకపోగా, మందులకు సమర్థవంతంగా లొంగుతుంది అంటున్నారు వైద్యులు!
నాన్‌వెజ్, గుడ్లు, బెండకాయ, వంకాయలు తినడం వల్ల ఫిట్స్ రావు. ఇవన్నీ అపోహలు మాత్రమే! ఫిట్స్‌కూ ఆహారానికీ ఎటువంటి సంబంధం లేదు. అయితే పిల్లల్లో వచ్చే ఒక రకం ఎపిలెప్సీకి మందులకు బదులుగా కీటోజెనిక్ డైట్ సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గ్లూట్1 రిసెప్టార్ లోపం వల్ల తలెత్తే ఎపిలెస్సీకి కూడా మందుల కంటే కీటోజెనిక్ డైట్ బాగా పని చేస్తుంది.
మెదడులో అసాధార ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఫిట్స్‌కు ప్రధాన కారణం. ఇది జన్యుపరం కావచ్చు, మెదడులో మచ్చలు ఏర్పడడం వల్ల కావచ్చు, ప్రమాదాల్లో మెదడుకు దెబ్బ తగలడం వల్ల కావచ్చు. అయితే అకారణంగా... ఎటువంటి జ్వరం, చక్కెర తగ్గడం, లేదా ఎలక్ట్రొలైట్ డిస్టర్బెన్స్, ఇన్‌ఫెక్షన్ లాంటి కారణాలేవీ లేకుండా మెదడు అదే పనిగా ఫిట్స్‌ను ఉత్పత్తి చేస్తుంటే, ఆ పరిస్థితిని ఎపిలెప్సీగా పరిగణించాల్సి ఉంటుంది.
జన్యుపరమైన సమస్యలతో...
పుట్టుకతో: సాధారణ మెదడు వల్ల, అసాధారణ మెదడు వల్ల.. ఇలా రెండు రకాలుగా పుట్టుకతోనే ఫిట్స్‌ను పిల్లలు వెంటబెట్టుకు రావచ్చు. జన్యుసంబంధ ఫిట్స్ వచ్చే వాళ్లలో సైతం మెదడు సాధారణంగానే ఉంటుంది.
ఫోకల్ కార్టికల్ డిస్‌ప్లేసియా: మెదడులో ఒక చోట ఉత్పత్తి అయిన న్యూరాన్లు ఇంకో చోటకు వలస వెళ్తూ ఉంటాయి. ఆ వలసలో సమస్య ఏర్పడి, మార్గమధ్యంలో ఆగిపోయినా, వాటి గమ్య స్థానం మారిపోయినా ఫోకల్ కార్టికల్ డిస్‌ప్లేసియా తలెత్తుతుంది. ఎపిలిప్సీకి ఇదే అత్యంత సాధారణమైన కారణం.
స్వీయ కారణాలతో...
న్యూరోసిస్టి సర్కోసిస్: కలుషిత ఆహారం ద్వారా టేప్ వార్మ్స్ (పంది విసర్జకాల్లో ఉండే సూక్ష్మజీవి) మెదడులోకి చేరుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తి, ఫిట్స్‌కు దారి తీయవచ్చు.
క్షయ: క్షయకు సంబంధించిన ట్యుబర్క్యులో గ్రాన్యులోమాస్ మెదడులోకి చేరినప్పుడు కూడా ఫిట్స్ తలెత్తవచ్చు. అయితే మెదడు టిబిలో మెనింగ్జయిటిస్ ఎన్‌సెఫలైటిస్, ట్యుబర్క్యులోమా అనే రెండు రకాలుంటాయి. ట్యుబర్క్యులోమాలో మెదడులో చిన్న గడ్డ ఏర్పడుతుంది. దీని వల్ల ఫిట్స్ తలెత్తుతాయి.
రోడ్డు ప్రమాదాలు: ప్రమాదాల్లో తలకు దెబ్బ తగలడం వల్ల, మెదడులో మచ్చలు ఏర్పడి ఎపిలెప్సీకి దారి తీస్తూ ఉంటాయి.
చికిత్సలు ఇలా...
జన్యుపరమైన ఎపిలెప్సీకి ప్రభావితమైన జన్యువు ఆధారంగా, సరైన, ప్రభావవంతమైన మందులను వైద్యులు ఎంచుకుంటారు. న్యూరో సిస్టి సర్కోసిస్, ట్యుబర్క్యులోమా, స్కార్ ఎపిలెప్సీ, ఫోకల్ కార్టికల్ డిస్‌ప్లేసియా మొదలైన మిగతా ఎపిలెప్సీలన్నీ ఫోకల్ ఎపిలెప్సీ కోవలోకి వస్తాయి. ఈ కోవకు చెందిన ఎపిలెప్సీ మందులు జెనెటిక్ ఎపిలెప్సీకి భిన్నంగా ఉంటాయి. అదే పనిగా వరుసగా ఫిట్స్‌కు గురయ్యే వారికి ఇంజెక్షన్లు అవసరమవుతాయి. మిగతా ఫిట్స్‌కు నోటి మాత్రలు సరిపోతాయి. అయితే ఎపిలెప్సీకి శాశ్వత చికిత్స లేదు కాబట్టి, మందులను క్రమం తప్పకుండా జీవితాంతం వాడుకోవలసి ఉంటుంది. మందు తీసుకున్న రోజు మూర్ఛ రాకుండా ఉంటుంది.
ముందుగానే పసిగట్టాలంటే...
ఫిట్స్ అనగానే అకస్మాత్తుగా నేల మీద పడిపోయి, కాళ్లూ, చేతులూ కొట్టుకోవడం, నాలుక కొరుక్కోవడం లాంటి లక్షణాలే మన కళ్ల ముందు మెదులుతాయి. కానీ ఇంకొక రకం ఫిట్స్ కూడా ఉంటాయి. మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్తుగా ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు అచేతనంగా మారిపోతూ ఉంటారు. ఆ సమయంలో మనం మాట్లాడే మాటలు కూడా వాళ్లను అర్థం చేసుకోలేరు. తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత, మళ్లీ మాటలను రిపీట్ చేయమని మనల్ని అడుగుతూ ఉంటారు. ఇలాంటి ఆబ్సెంట్ మైండెడ్‌నెస్‌ను కూడా ఫిట్స్‌గానే పరిగణించాలి. ఇలాంటి ఆబ్సెంట్ మైండెడ్ స్థితిలో కొందరు పెదవులతో చప్పుడు చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని చికిత్సతో నియంత్రించకపోతే ముందు ముందు ఇవే ఫిట్స్‌గా రూపాంతరం చెందుతాయి. అలాగే మెదడులోని నాలుగు లోబ్స్‌లో ఏర్పడే సమస్యల మీదే లక్షణాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఆక్సిపిటల్ లోబ్‌లో సమస్య ఏర్పడితే, కళ్ల ముందు రంగురంగుల బంతులు లేదా ఏదో ఒక సన్నివేశం కనిపిస్తూ ఉంటుంది. దాంతో విగ్రహంలా కదలకుండా బిగుసుకుపోతారు. మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీ మరింత పెరిగితే, అసలైన ఫిట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఫ్రాంటల్ లోబ్‌లో సమస్య ఏర్పడితే, గతంలో జరిగిన సంఘటనలోకి జారుకున్న అనుభవానికి లోనై చివరకు ఫిట్స్‌కు గురవుతారు. పెరైటల్ లోబ్‌లో సమస్య ఏర్పడితే, శరీరంలో ఒక వైపు మొత్తం తిమ్మిరిగా మారిపోతుంది. కొందర్లో అంతటితో ఆగిపోవచ్చు. ఇంకొందర్లో తిమ్మిర్ల తర్వాత నిశ్శబ్దంగా మారిపోతారు, తర్వాత కింద పడిపోయి కాళ్లూ, చేతులూ కొట్టుకుంటాయి.
చిన్న మూర్ఛలే ప్రమాదకరం
నిశ్శబ్దంగా మారిపోవడం లాంటి చిన్న ఫిట్స్, కిందపడి కాళ్లూ చేతులూ కొట్టుకునే పెద్ద ఫిట్స్ కంటే ప్రమాదకరం. వంట చేస్తున్నప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు చిన్న ఫిట్స్‌కు గురైతే పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. పెద్ద ఫిట్స్ ఉన్న వాళ్లు అప్పటికే మందులు వాడుతూ ఉంటారు కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం తక్కువ. కాబట్టి చిన్న దశలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రతించి మందులు మొదలుపెట్టాలి.
శాశ్వత చికిత్స ఎప్పుడంటే....
ఒక మాత్ర వేసుకున్నప్పటికీ మూర్ఛకు గురవుతుంటే వైద్యులు రెండవ మాత్రను సూచిస్తారు. ఆ రెండూ తీసుకుంటున్నప్పటికీ మూర్ఛలు ఆగపోతే ఆ పరిస్థితిని రిఫ్రాక్టరీ ఎపిలెప్సీగా భావించాలి. ఈ పరిస్థితిలో మూర్ఛలను నియంత్రించడంలో మందులు విఫలమవుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులకు సర్జికల్ ప్రత్యామ్నాయాలను వైద్యులు ఎంచుకుంటారు. అయితే సర్జరీ చేయించుకున్నంత మాత్రాన మందులను పూర్తిగా ఆపేయవచ్చు అనుకోడానికి వీల్లేదు. మందును ఆపేయడం సర్జరీ లక్ష్యం కాదు. మూర్ఛలను నియంత్రించడమే సర్జరీ ప్రధాన లక్ష్యం. అయితే మూర్ఛలను నియంత్రించే అన్ని రకాల సర్జరీల తదనంతరం మందులు ఆపే వీలు లేకపోయినప్పటికీ టెంపొరల్ లోబ్ ఎపిలెప్సీకి సర్జరీ తర్వాత రెండు నుంచి మూడేళ్ల పాటు మందులను ఆపేయవచ్చు. మిగతా ఎపిలెప్సీలకు సర్జరీ తదనంతరం తీసుకునే మందుల సంఖ్యను తగ్గించవచ్చు. అరుదుగా కొన్ని సందర్భాల్లో కొందరికి మందుల అవసరం ఉండకపోవచ్చు.
తాళాలతో ప్రయోజనం శూన్యం
ఫిట్స్ వచ్చిన వ్యక్తి చేతిలో తాళాలు ఉంచడమనే అలవాటు ఒక సంప్రదాయంగా మారిపోయింది. కానీ నిజానికి ఇలా చేసినా, చేయకపోయినా ఫిట్స్ రెండు నిమిషాల్లో తగ్గిపోతాయి. నిజానికి ఆ సమయంలో వెల్లకిలా పడిపోతారు కాబట్టి లాలాజలం, దంతాల మధ్య నలిగిన నాలుక నుంచి వెలువడే రక్తస్రావం ఊపిరితిత్తుల్లోకి చేరుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫిట్స్ వచ్చిన వ్యక్తికి కుడి లేదా ఎడమ వైపుకు తిప్పాలి. అలాగే కదిలే అవయవాలను బలవంతంగా పట్టుకుని కదలికలను నియంత్రించే ప్రయత్నం చేయకూడదు. అయితే కదిలే కాళ్లూ, చేతులూ పక్కనున్న వేటికీ తగిలి, గాయపడకుండా చూడాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫిట్స్ సమస్య ఉండి మందులు వాడుకునే పది మంది వ్యక్తుల్లో ఎనిమిది మందు వ్యక్తులు ఫిట్స్ మీద చక్కని నియంత్రణ సాధించగలుగుతారు. కాబట్టి....
● క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి.
● రోజుకు కనీసం ఆరు గంటలపాటైనా నిద్రపోవాలి.
● మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలి.
● ప్రకాశవంతమైన వెలుగుకు దూరంగా ఉండాలి.
● విపరీతమైన శబ్దాలకు దూరంగా ఉండాలి.
● కుటుంబ సభ్యులు కూడా ఫిట్స్ ఉన్న వ్యక్తి క్రమం తప్పక మందులు వాడేలా చూసుకోవాలి.
ఫిట్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేయవచ్చా?
ఇందుకు అంతర్జాతీయ చట్టాలున్నాయి. మందులు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆరు నెలల పాటు ఫిట్స్ రాకపోతే, వైద్యులు వాహనాలను నడపడానికి అనుమతిస్తారు. అలాగే ఆ తర్వాత కూడా మందులు క్రమం తప్పకుండా వాడుతూనే ఉండేలా వైద్యులు నిర్థారించుకోవాలి.
ఎపిలెప్సీ చిన్న సమస్యే!
అవగాహన లోపం వల్ల, మిగతా జబ్బుల కంటే ఎపిలెప్సీనే ఒక పెద్ద జబ్బుగా సమాజం భావిస్తూ ఉంటుంది. మనం మధుమేహం, అధిక రక్తపోటు లాంటి వాటిని ఎపిలెప్సీ కంటే చిన్న రుగ్మతలుగా పరిగణిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఆ రెండు రుగ్మతలతో పోల్చుకుంటే, ఎపిలెప్పీ అనేది ఎంతో చిన్న రుగ్మత. ఇది సింగిల్ సిస్టమ్ డిసీజ్. అంటే, ఈ రుగ్మతతో ఈ అవయవం ప్రభావితం కాదు. కానీ అధిక రక్తపోటు, మధుమేహాలతో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలతో ఇతర అవయవాలన్నీ ప్రభావితం అవుతాయి. కానీ ఎపిలెప్సీలో మందులు తీసుకుంటే, సురక్షితంగా, ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. పైగా ఈ సమస్యకు వాడుకునే మందుల దుష్ప్రభావాలు కూడా ఎంతో తక్కువ. అలాగే గర్భిణుల్లో మూర్ఛకు వాడుకోగలిగే సురక్షితమైన మందులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
-డాక్టర్ పి. సురేష్ బాబు
సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్,
ఫిట్స్ క్లినిక్, ఖమ్మం.
Updated Date - 2023-05-30T11:36:47+05:30 IST