Health fasting: ఉపవాసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
ABN, First Publish Date - 2023-07-18T11:51:56+05:30
ఉపవాసంలో భాగంగా పరిమిత ఆహారం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, జబ్బులు తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌లు తగ్గుతాయని పరిశోధకులు గ్రహించారు.
ఉపవాసంలో భాగంగా పరిమిత ఆహారం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, జబ్బులు తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌లు తగ్గుతాయని పరిశోధకులు గ్రహించారు. శరీరంలో చోటుచేసుకునే ఈ మార్పుల ఫలితంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. అయితే ఉపవాసం శరీరం మీద చూపించే ప్రభావం, ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటే, ఓపిక నశించకుండానే, ఉపవాసంతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలను సంపూర్తిగా పొందవచ్చు. అవేంటంటే....
ఉపవాసం నీరసం కాదు
చాలామంది ఒక్క పూట ఆహారం తీసుకోకపోతే నీరసించిపోతారు. నిజానికి సమయానికి ఆహారం తీసుకోకపోయినా శక్తి సన్నగిల్లిపోదు. తిన్న ఏ ఆహారమైనా వెంటనే మనకు శక్తినివ్వదు. అది అరిగి గ్లూకోజ్‌గా మారటానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ గ్లూకోజ్ శక్తి రూపంలో కాలేయం, కండరాలు, శరీరంలోని ఇతర భాగాల్లో నిల్వ ఉంటుంది. ఉపవాస సమయంలో ఇలా నిల్వ ఉన్న శక్తినే శరీరం ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఒక పూట ఆహారం మానేసినంత మాత్రాన శక్తి తగ్గిపోతుందోమోననే భయం అవసరం లేదు. పైగా ఆహారం తీసుకోకపోవటం వల్ల శరీరానికి కొంత ప్రయోజనం కూడా కలుగుతుంది. ఆహార లోపంతో తలెత్తే పరిస్థితిని తట్టుకుని నిలబడగలిగే చర్యల్లో భాగంగా మెదడు చురుగ్గా పని చేయటం మొదలుపెడుతుంది. ఫలితంగా వ్యాధుల ముప్పు తగ్గించే పరిణామాలు ఒంట్లో చోటు చేసుకుంటాయి.
ఉపవాసంలో ఆరోగ్యం
ఉపవాస సమయంలో ఛాతీలో మంట, మలబద్ధకం, తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ లక్షణాలు సహజం. వీటిని నివారించాలంటే...
రోజు మొత్తంలో కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి.
పెప్టిక్ అల్సర్లు, డయాబెటిస్ ఉన్నవాళ్లు పళ్లు, కూరగాయ ముక్కలు తినాలి.
గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, గుండె జబ్బులున్నవాళ్లు ఉపవాసం చేయకపోవటమే మంచిది.
శారీరక బలహీనత కలిగినవారు, మధుమేహులు, ఆహారానికి సంబంధించిన సమస్యలున్నవారు (ఈటింగ్ డిజార్డర్) ఉపవాసానికి ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
ఉపవాస సమయంలో ఎక్కువ నూనె, నెయ్యిలతో చేసిన పదార్థాలు, తీపి వంటలకు దూరంగా ఉండాలి.
ముగింపూ ముఖ్యమే!
ఉపవాసాన్ని ముగించే పద్ధతి ఒకటుంటుంది. ఆకలితో ఉన్నాం కదా! అని ఉపవాస సమయం ముగిసిన వెంటనే చేతికందిన పదార్థాలన్నీ లాగించేయకూడదు. మరీ ముఖ్యంగా పిండి వంటలతో ఉపవాసం ముగించకూడదు. కోలాలు, రెడీమేడ్ పళ్ల రసాలు, స్వీట్లు, సమోసాల జోలికి వెళ్లకూడదు. ఉపవాసం ముగించేటప్పుడు తీసుకునే ఆహారం తేలికగా అరిగేదై ఉండాలి. చిరుధాన్యాల పిండితో చేసిన రొట్టెలు, ఆకుపచ్చని కూరగాయలు, పాలు, పెరుగు, వేయుంచిన లేదా ఉడికించిన గింజలతో ఉపవాసం ముగించటం ఆరోగ్యకరం.
Updated Date - 2023-07-18T11:51:56+05:30 IST