Fitness: వీపు వెనక కొవ్వును కరిగించాలంటే..!
ABN, First Publish Date - 2023-04-18T12:36:03+05:30
వీపు వెనక పేరుకునే కొవ్వును కరిగించడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. భుజాల వెనక, నడుముకు ఎగువన పేరుకునే ఈ కొవ్వు వల్ల
వీపు వెనక పేరుకునే కొవ్వును కరిగించడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. భుజాల వెనక, నడుముకు ఎగువన పేరుకునే ఈ కొవ్వు వల్ల శరీరం పైభాగం లావుగా, ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇబ్బంది తొలగాలంటే ఈ వ్యాయామాలు చేయాలి.
స్క్వాట్ జంప్స్: ఈ వ్యాయామంతో చేతులతో పాటు, కాళ్లూ, మొత్తం శరీరానికి వ్యాయామం దక్కుతుంది. ఎలా చేయాలంటే....
నిటారుగా నిలబడి మోకాళ్లను వంచి, కిందకు కుంగాలి.
ఈ భంగిమలో గోడ కుర్చీ వేసినట్టుగా శరీరాన్ని వంచాలి.
ఈ భంగిమ నుంచి ఒక్కసారిగా నిటారుగా నిలబడుతూ గాల్లోకి పైకి ఎగరాలి.
ఎగిరేటప్పుడు శరీరం నిటారుగా ఉండాలి, చేతులు శరీరానికి సమాంతరంగా ఉండాలి.
ఎగిరి నేలను తాకేటప్పుడు తిరిగి మోకాళ్లను వంచి, గోడ కుర్చీ భంగిమలోకి రావాలి.
ఇలా 20 సార్లు చొప్పున 3 సెట్లు చేయాలి.
రివర్స్ లంజ్: ఈ వ్యాయామంతో కాళ్లు, తొడలతో పాటు వెన్ను దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఎలా చేయాలంటే....
నిటారుగా నిలబడి, నడుము మీద చేతులు ఉంచుకోవాలి.
ఎడమ మోకాలు వంచి, కుడి కాలును రెండు అడుగుల ముందుకు వేయాలి.
ఇలా చేస్తున్నప్పుడు ఎడమ మోకాలు నేలను తాకాలి.
తిరిగి కుడి కాలును వెనకకు తీసుకువచ్చి, ఎడమ కాలును ముందుకు వేయాలి.
ఇలా చేస్తున్నప్పుడు కుడి మోకాలు నేలను తాకాలి. ఇలా కాళ్లు రెండూ మార్చి మార్చి రివర్స్ లంజ్ చేయాలి.
15 రెప్స్ 3 సెట్లు చేయాలి.
రేర్ డెల్డాయిడ్ రొటేషన్స్: రెండున్నర కిలోల బరువులతో చేసే వ్యాయామమిది. ఎలా చేయాలంటే...
నిటారుగా నిలబడి చేతుల్లోకి బరువులు తీసుకోవాలి. రెండు చేతులను పక్కలకు చాపి, తిరిగి ఛాతీ దగ్గరకు తీసుకొచ్చి డంబెల్స్‌ను ఆనించాలి.
తిరిగి చేతులు రెండూ పక్కలకు చాపాలి.
చేతులు చాపేటప్పుడు ఊపిరి పీలుస్తూ, ఛాతీ దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఊపిరి వదలాలి.
ఇలా 15 రెప్స్ 3 సెట్లు చేయాలి.
Updated Date - 2023-04-18T12:36:03+05:30 IST