వర్షాకాలంలోనూ వర్క్అవుట్ చేయొచ్చు! ఎలాగంటే..!
ABN, First Publish Date - 2023-07-10T12:18:50+05:30
వర్షాకాలంలో నగర రోడ్లపై జాగింగ్ లేదంటే రన్నింగ్, వాకింగ్ చేసే పరిస్థితి లేదు. అలాగని జిమ్‌కు వెళ్దామా అంటే... వేల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. కొవిడ్ అనంతర కాలంలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఫిట్‌నెస్ కోసం తపిస్తున్న నగరవాసులు వ్యాయామం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుందని భయపడుతున్నారు.
వర్షాకాలంలో నగర రోడ్లపై జాగింగ్ లేదంటే రన్నింగ్, వాకింగ్ చేసే పరిస్థితి లేదు. అలాగని జిమ్‌కు వెళ్దామా అంటే... వేల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. కొవిడ్ అనంతర కాలంలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఫిట్‌నెస్ కోసం తపిస్తున్న నగరవాసులు వ్యాయామం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుందని భయపడుతున్నారు. వర్షాకాలం వచ్చినంత మాత్రాన ఫిట్‌నెస్‌కు విరామం ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇంట్లోనే సులభమైన వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఫిట్‌నెస్ ట్రైనర్ రఘురామ్ చెబుతున్నారు. ఆయన సూచనలేమిటో గమనిద్దాం.
మెట్లు ఎక్కి దిగండి...
సాధారణంగా తెల్లవారుజామున వర్షమొస్తే, ఆ రోజు వాకింగ్ ఆపేయాల్సిందే! ఆ రోజంతా ఏదో కోల్పోయిన బాధలో ఉండిపోతారు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒకరోజు వర్కవుట్ చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు. మానసికంగా పడే ఆందోళన మాత్రం వారిని మరింతగా కుంగదీస్తుంది. అలా కాకూడదనుకుంటే మెట్లు ఎక్కి దిగినా చాలు. అపార్ట్‌మెంట్ జీవితంలో లిఫ్ట్‌లు వాడటం అలవాటైన తరువాత మెట్లు ఎక్కడం చాలామంది మర్చిపోయారు. కానీ, అత్యుత్తమ వ్యాయామాల్లో మెట్లు ఎక్కడం/దిగడం కూడా ఒకటి. అధిక కేలరీలు ఖర్చు కావాలనుకుంటే రెండు, మూడు ఫ్లోర్లు ఎక్కి దిగితే చాలు. మెట్లపై జాగింగ్ చేస్తున్నట్లుగా ఎక్కడం ద్వారా మరిన్ని కేలరీలు ఖర్చు చేయవచ్చు. చాలామందికి తెలీని విషయమేమిటంటే, దాదాపు 80 శాతం బాడీ వర్కవుట్స్‌ను మెట్ల వ్యాయామం అందిస్తుంది. ట్రెడ్‌మిల్‌తో పోలిస్తే ఇది బెటర్ వ్యాయామం. ఎందుకంటే చేతులు, భుజాలు, చెస్ట్, బ్యాక్, లోయర్ బాడీ, లెగ్స్ అన్నీ వాడటం జరుగుతుంది. కీళ్లనొప్పులు, గుండె సమస్యలున్న వారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
వర్క్‌ఫ్రమ్ ఎనీవేర్ కాలంలో మీ కుర్చీనే..
ఇంట్లో లివింగ్ రూమ్‌లో కూర్చున్నా లేదంటే ఆఫీసులో డెస్క్ ముందు కూర్చున్నా, కాదంటే హోటల్ రూమ్‌లో ఉన్నా మీ కుర్చీనే మీ ఫిట్‌నెస్ ఎక్వి్‌్‌పమెంట్‌గా మలచవచ్చు. కుర్చీలో నుంచి లేచి కూర్చోవడం కూడా మంచి వ్యాయామమే. నిజానికి మీ బ్యాక్ మజిల్స్‌పై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ తిరగడం వల్ల కాళ్లకు తగిన వ్యాయామం లభిస్తుంది.
10 మినిట్ వర్కవుట్స్
వర్షాకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఫిట్‌నెస్. 10 నిమిషాలు ఏకధాటిగా వర్కవుట్ చేస్తే చాలు ... ఎలాగంటే... క్రంచెస్, లెగ్ లిఫ్ట్స్, కొన్ని అబ్‌డొమెన్-టోనింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే సరిపోతుంది. కాకపోతే, రోజూ ఒకే తరహా వ్యాయామాలు చేయకూడదు. హిప్స్, లెగ్స్‌కు స్క్వాట్స్, జంపింగ్ జాక్స్, స్టెపప్, కిక్స్ హెల్ప్ చేస్తే, అప్పర్ బాడీకి వాటర్ బాటిల్స్ లిఫ్ట్ చేయడం ద్వారా తగిన వ్యాయామం పొందవచ్చు.
బోరు కొడితే బ్రేక్ ఇవ్వండి...
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఓటీటీలకు అతుక్కుపోవడం అందరికీ అలవాటైంది. ఒకసారి టీవీ ముందు కూర్చుంటే సినిమా అయ్యే వరకూ లేవని వారెందరో! కానీ ఎంత గొప్ప సినిమా అయినా బోరు కొట్టించే సన్నివేశాలుంటాయి. అవే మీ ఎక్సర్‌సైజ్‌లకు తగిన సమయంగా భావించండి. మహా అయితే ఆ సన్నివేశం ఒకటిన్నర- రెండు నిమిషాలు ఉంటుంది. ఆ సమయంలో 30 జంపింగ్ జాక్స్ లేదంటే 20 క్రంచెస్ లేదా స్క్వాట్స్ చేయండి. ఏకధాటిగా 20 నిమిషాలు నడవడం కుదరనప్పుడు ఉన్న సమయాన్నే ఇలా సద్వినియోగం చేసుకుంటే కొంతలో కొంత వ్యాయామం లభిస్తుంది.
ఇవిగాక...
యోగా చేయవచ్చు. యాప్స్‌లో యోగా నేర్పుతున్నారు. సూర్యనమస్కారాలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఆసనాలు వేసేటప్పుడు జాగ్రత్త పాటించాలి. కష్టమనుకుంటే ఏరోబిక్స్ ప్రయత్నించవచ్చు. అదీ కాదనుకుంటే శాస్త్రీయ నృత్యమైనా, వెస్ట్రన్ డ్యాన్స్ అయినా చేయొచ్చు. కనీసం అరగంట పాటు ఏకధాటిగా డ్యాన్స్ చేయడం వల్ల అవసరమైన వ్యాయామం లభిస్తుంది.
-హైదరాబాద్ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి)
Updated Date - 2023-07-10T12:18:50+05:30 IST