Eye Careful: వేసవిలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని తెలుసా!
ABN, First Publish Date - 2023-06-06T12:21:14+05:30
వేసవిలో నీటి కొరత వల్ల కొన్ని రకాల వైరస్‌లు విస్తృతమవుతాయి. వీటిలో ప్రధానంగా
వేసవిలో నీటి కొరత వల్ల కొన్ని రకాల వైరస్‌లు విస్తృతమవుతాయి. వీటిలో ప్రధానంగా కళ్లే లక్ష్యంగా దాడి చేసే వైరస్‌లూ ఉంటాయి. అవేంటంటే...
కళ్ల కలక: వైరల్ కంజెక్టివైటిస్ అనే కంటి ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేసే వైరస్ వేసవిలో చురుగ్గా విస్తరిస్తూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతూ, దురద పెడుతూ, గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తూ కళ్లను ఇబ్బంది పెట్టే ఈ ఇన్‌ఫెక్షన్ తేలికగా ఇతరులకు సోకుతుంది. కళ్లకలక సోకకుండా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరీ ముఖ్యంగా ఈ వైరస్ స్పర్శ ద్వారా సోకుతుంది. కాబట్టి చేతులు తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కళ్లనూ తాజా నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. అలాగే వాడే రుమాళ్లు, తువ్వాళ్లు ఇతరులతో పంచుకోకూడదు. ఇతరులు వాడిన వాటిని వాడకూడదు. వైద్యులు సూచించిన యాంటీబయాటిక్ కంటి చుక్కలు వాడాలి. కళ్లకలకను నిర్లక్ష్యం చేస్తే కార్నియా దెబ్బతిని నెలలపాటు సమస్య వేధిస్తుంది.
వైరల్ కెరటైటిస్: కళ్లకలకను సాధారణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మూడు రోజులు వేధించి వదిలేస్తుందిలే అనే నమ్మకంతో వ్యవహరిస్తాం. కానీ కళ్లకలకకు కారణమైన వైర్‌సలో కూడా రకాలుంటాయి. కొన్ని వైర్‌సలు కళ్లకలకతో దీర్ఘకాలంపాటు వేధిస్తాయి. ఇలా జరిగితే వైరస్ వల్ల కార్నియా దెబ్బతిని వైరల్ కెరటైటిస్ అనే సమస్యకు గురవుతాం. కాబట్టి కళ్లకలక సోకిన వెంటనే కంటి వైద్యులను కలిసి పరీక్ష చేయించుకుని, యాంటీ వైరల్ చికిత్స మొదలు పెట్టాలి.
స్టై: కనురెప్ప అంచుల్లో ఎర్రటి పుండు ఏర్పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మామిడిపళ్లు తినడం వల్ల వేడి చేసి ఇలా పుండ్లు వచ్చాయని అనుకుంటారు. కానీ ఇది అపోహ. అపరిశుభ్ర చేతులతో కళ్లు తాకడం వల్ల కలిగే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఇది. కొందరికి చుండ్రు సమస్య ఉంటుంది. వేసవిలో ఈ సమస్య మరింత ముదిరి, కారే చెమట ద్వారా కళ్లలోకి చేరి ఇన్‌ఫెక్షన్ మొదలవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే చుండ్రును వదిలించుకుని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. శరీర శుభ్రత పాటించాలి.
డ్రై ఐస్: వేసవిలో ఎయిర్ కండిషనర్ల వాడకం ఎక్కువ. దాంతో కళ్లు పొడిబారిపోతూ ఉంటాయి. దాంతో కళ్ల మంటలు మొదలవుతాయి. ఈ సమస్యను లూబ్రికేటింగ్ డ్రాప్స్‌తో సరిదిద్దవచ్చు.
ఈత కొలనులో...
వేసవిలో సాధారణంగా ఈత కొలనులో ఈత కోసం వెళుతూ ఉంటాం. ఈత కొలనులో ఉండే నీటిలో క్లోరిన్ కలిసి ఉంటుంది. దీంతోపాటు ఎన్నో రకాల వైర్‌సలు, బ్యాక్టీరియాలు కూడా ఉండే వీలుంటుంది. ఇవేవీ కళ్లలోకి చేరకుండా ఉండాలంటే తప్పనిసరిగా స్విమ్మింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి.
కంటికి ఉపశమనం
వేసవి వేడిమికి కళ్లు మండుతూ ఉంటే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అవేంటంటే....
చల్లని నీళ్లలో ముంచి దూది మూసిన కనురెప్పల మీద ఉంచుకోవచ్చు.
చల్లనీళ్లతో కళ్లను కడుక్కున్నా ఉపశమనం కలుగుతుంది.
చక్రాల్లా తరిగిన కీరా కనురెప్పల మీద పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియాల సోకే వీలు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వాడిన టీబ్యాగ్స్ మూసిన కళ్ల మీద ఉంచుకోవచ్చు.
ఫ్రిజ్‌లో చల్లబరిచి కళ్ల మీద ఉంచుకునే ఐ ప్యాక్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటినీ వాడుకోవచ్చు.
కూలింగ్ గ్లాసెస్ అవసరమే!
ఎండ, వేడి, అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్...వీటన్నిటి నుంచి కళ్లకు రక్షణ కల్పించాలంటే చలువు కళ్లద్దాలు ధరించాలి. సాధారణంగా మార్కెట్లో ఎన్నో రకాల కూలింగ్ గ్లాసెస్ దొరుకుతూ ఉంటాయి. వాటిలో చవకవీ, ఖరీదైనవీ ఉంటాయి. వీటిలో ఏది కొనాలి? అనే విషయంలో అయోమయానికి గురవుతూ ఉంటాం. అయితే చలువ కళ్లద్దాలు వేటితోనైనా కళ్లకు రక్షణ దొరుకుతుంది. అయితే వాటికి అతినీలలోహిత కిరణాలను ఆపే ‘యువి ప్రొటెక్షన్’ ఉందా? అనేది తెలుసుకోవాలి. చవక చలువ కళ్లద్దాలతో పోలిస్తూ ఖరీదైన ప్రముఖ కంపెనీ ఉత్పత్తులు ఈ ఫిల్మ్ విషయంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తాయి. కాబట్టి కళ్లకు పూర్తి రక్షణ కోరుకుంటే, మన్నికైనా, నాణ్యమైన కూలింగ్ గ్లాసె్‌సనే ఎంచుకోవాలి. తక్కువ ఖర్చులో చలువ కళ్లజోడు కొనే సమయంలో వాటి అద్దాల నాణ్యత పరిశీలించాలి. ఛత్వారం ఉన్న వాళ్లు ఎండ సోకితే నల్లబడే ‘ఫొటోక్రోమ్’ జోడు ఎంచుకోవాలి.
Updated Date - 2023-06-06T12:21:14+05:30 IST